• facebook
  • whatsapp
  • telegram

ఇంట‌ర్‌తో ఐఐటీలో బీఎస్సీ

అన్ని గ్రూపుల‌కు అవ‌కాశం

ఆన్‌లైన్‌ బీఎస్‌సీ ప్రొగ్రామింగ్‌ అండ్‌ డేటా సైన్స్‌ కోర్సులో ప్రవేశానికి ఐఐటీ మద్రాస్‌ ప్రకటన విడుదలచేసింది. ఇందులో చేరాలనుకున్నవారు ముందుగా క్వాలిఫయర్‌ ఎగ్జామ్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇంటర్‌ అన్ని గ్రూపుల వారికీ అవకాశం ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు మద్రాస్‌ ఐఐటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకోవచ్చు. ఆపై మేటి అవకాశాల దిశగా అడుగులేయవచ్చు! 

భవిష్యత్తులో సాంకేతికతదే అగ్రస్థానం. అందులోనూ ప్రోగ్రామింగ్, డేటా సైన్స్, మెషీన్‌ లర్నింగ్‌లు ముందుంటాయని అంచనా. వీటిపై పట్టున్నవారు మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఆ దిశగా ఆలోచించే ఐఐటీ మద్రాస్‌ కోర్సును రూపొందించింది. 

బీఎస్‌సీలో ప్రోగ్రామింగ్‌ అండ్‌ డేటా సైన్స్‌ను గత ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో అందిస్తోంది. అయితే ఈ కోర్సులో చేరడానికి ముందుగా క్వాలిఫయర్‌ పరీక్షలో నెగ్గడం తప్పనిసరి. అనంతరం ఫౌండేషన్, ఆ తర్వాత డిప్లొమా చివరగా డిగ్రీ- ఇలా అన్ని దశలూ పూర్తిచేసుకున్నవారికి బీఎస్‌సీ పట్టా చేతికందుతుంది.   

క్వాలిఫయర్‌

క్వాలిఫయర్‌ పరీక్షలో అర్హత నిమిత్తం నాలుగు వారాల వ్యవధితో 4 ప్రాథమిక స్థాయి కోర్సులైన ఇంగ్లిష్, మ్యాథ్స్‌ ఫర్‌ డేటా సైన్స్, స్టాటిస్టిక్స్‌ ఫర్‌ డేటా సైన్స్, కంప్యుటేషనల్‌ థింకింగ్‌ విభాగాల్లో కనీస స్కోర్‌ సాధించాలి. వీటికి సంబంధించి ఒక్కో సబ్జెక్టులో వారానికి రెండు లేదా మూడు గంటల వీడియో పాఠాలు అందిస్తారు. ప్రతి కోర్సులోనూ అసైన్‌మెంట్లు ఉంటాయి. వీటిని నిర్ణీత వ్యవధిలోగా ఆన్‌లైన్‌లో పూర్తిచేయాల్సి ఉంటుంది. వీటిలో అర్హత సాధించినవారినే క్వాలిఫయర్‌ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. 

అసైన్‌మెంట్లలో జనరల్‌ అభ్యర్థులు 40 శాతం, ఓబీసీలు 35, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 30 శాతం మార్కులు సాధించాలి. వీరికి క్వాలిఫయర్‌ పరీక్షను 4 గంటల వ్యవధితో నిర్వహిస్తారు. ఒక్కో కోర్సుకు గంట వ్యవధి ఉంటుంది. జనరల్‌ అభ్యర్థులైతే ప్రతి కోర్సులోనూ 40, మొత్తం మీద 50 శాతం స్కోరు సాధిస్తే అర్హులైనట్లుగా పరిగణిస్తారు. ఓబీసీలు కోర్సువారీ 35, మొత్తం మీద 45, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు కోర్సువారీ 30, మొత్తం మీద 40 శాతం మార్కులు పొందాలి. 

ఇలా అర్హత సాధించినవారికి ఫౌండేషన్‌ లెవెల్‌ కోర్సులోకి అనుమతిస్తారు. క్వాలిఫయర్‌ ఎగ్జామ్‌లో సాధించిన స్కోరును అనుసరించి మొదటి రెండు టర్మ్‌ల్లో ఎన్ని కోర్సులు నేర్చుకోవచ్చో నిర్ణయిస్తారు. యాభై శాతం సాధించినవారికి 2, 70 వరకు సాధించినవారికి 3, డెబ్భై పైన సాధిస్తే 4 కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. మొదటి రెండు టర్మ్‌ల్లో సాధించిన స్కోర్‌ను అనుసరించి తర్వాతి టర్మ్‌ల్లో ఎన్ని కోర్సులు పూర్తిచేసుకోవచ్చో నిర్ణయిస్తారు. 

అభ్యాసమిలా...

ప్రతివారం రికార్డు చేసిన వీడియో పాఠాలు విడుదలచేస్తారు. ఒక్కో కోర్సులో వారానికి పది గంటల నిడివితో వీటిని అందిస్తారు. ఈ వీడియోల్లోనే వీక్లీ అసైన్‌మెంట్లు ఉంటాయి. వీటిని గడువులోగా పూర్తిచేసుకోవాలి. ఒక్కో కోర్సుకి 3 క్విజ్‌లు ఉంటాయి. వీటిని సాధారణంగా ఆయా కోర్సుల్లో 4,7,10 వారాల్లో నిర్వహిస్తారు. కోర్సు చివరలో టర్మ్‌ పరీక్షలు ఉంటాయి. ప్రతి కోర్సులోనూ వారానికి ఒక అసైన్‌మెంట్‌ ఉంటుంది. వీటిలో కనీస స్కోరు సాధిస్తేనే టర్మ్‌ చివర్లో పరీక్ష రాయడానికి అవకాశమిస్తారు. అలాగే టర్మ్‌ పరీక్షలు రాయడానికి 3 క్విజ్‌ల్లో కనీసం ఒక దానిలో అర్హత సాధించడమూ తప్పనిసరే. కోర్సులో చేరినవారు తమకు కేటాయించిన పట్టణ అభ్యసన కేంద్రంలో క్విజ్, టర్మ్‌ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ కోర్సు మొత్తం ఆంగ్లంలో అందిస్తున్నారు. అందువల్ల ఆ భాషపై ప్రాథమిక అవగాహన తప్పనిసరి. డెస్క్‌టాప్‌ లేదా ల్యాప్‌టాప్, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలి. గూగుల్‌ టూల్స్‌పై అవగాహన ఉంటే మేలు. అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రతి కోర్సులోనూ డిస్కషన్‌ ఫోరం ఉంటుంది. 

31 కోర్సులు...116 క్రెడిట్లు

ఫౌండేషన్‌ నుంచి డిగ్రీ వరకు మొత్తం 31 కోర్సులుంటాయి. వీటిద్వారా 116 క్రెడిట్లు దక్కుతాయి. అభ్యర్థి సామర్థ్యాన్ని అనుసరించి మూడు నుంచి ఆరేళ్లలోపు మొత్తం కోర్సు పూర్తిచేసుకోవచ్చు. మొత్తం ఫీజు (ఫౌండేషన్‌ + డిప్లొమా + డిగ్రీ) రూ.2.42 లక్షలు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజులో యాభై శాతం రాయితీ ఉంటుంది. సంవత్సరంలో 3 టర్మ్‌లు ఉంటాయి. అవి సాధారణంగా జనవరి, మే, సెప్టెంబరుల్లో మొదలవుతాయి. ఒక్కో టర్మ్‌లోనూ కనీసం 2 నుంచి గరిష్ఠంగా 4 కోర్సులు పూర్తిచేసుకోవచ్చు. ఫౌండేషన్‌ పూర్తయితేనే డిప్లొమాలోకి, డిప్లొమా పూర్తిచేసుకుంటేనే డిగ్రీ కోర్సుల్లోకి అవకాశం ఉంటుంది. ప్రతి కోర్సులోనూ 3 క్విజ్‌లు ఒక టర్మ్‌ ఎండ్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు.  

ఫౌండేషన్‌: ఇందులో 8 కోర్సులు ఉంటాయి. వీటి ద్వారా 32 క్రెడిట్లు లభిస్తాయి. వీటిని 8 నెలల నుంచి మూడేళ్లలోగా పూర్తిచేసుకోవచ్చు. విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు ఫౌండేషన్‌ సర్టిఫికెట్‌తో వైదొలగవచ్చు లేదా డిప్లొమాలో కొనసాగొచ్చు. ఫీజు రూ.32,000.  

డిప్లొమా: ఇందులో 12 కోర్సులుంటాయి. వీటితో 44 క్రెడిట్లు అందుతాయి. ఏడాది నుంచి మూడేళ్లలోపు పూర్తి చేసుకోవచ్చు. ఇందులో రెండు విభాగాలు- ప్రోగ్రామింగ్, డేటా సైన్స్‌ ఉంటాయి. ఒక్కో దాంట్లో 6 కోర్సులు. వీటితో 22 చొప్పున క్రెడిట్లు లభిస్తాయి. ఈ రెండింటినీ పూర్తిచేసుకున్నవారు డిప్లొమా ఇన్‌ ప్రోగ్రామింగ్, డిప్లొమా ఇన్‌ డేటా సైన్స్‌ సర్టిఫికెట్లను అందుకుని కోర్సు నుంచి వైదొలగవచ్చు లేదా డిగ్రీలో కొనసాగవచ్చు. ఈ కోర్సు ఫీజు రూ.1,10,000. 

డిగ్రీ: ఇందులో 11 కోర్సులుంటాయి. వీటిని పూర్తిచేసుకుంటే 40 క్రెడిట్లు సొంతమవుతాయి. ఏడాది నుంచి మూడేళ్లు పడుతుంది. వీరికి బీఎస్‌సీ ప్రోగ్రామింగ్, డేటా సైన్స్‌ డిగ్రీని ప్రదానం చేస్తారు. ఫీజు రూ.లక్ష.

ఏం నేర్చుకుంటారంటే...

ఫౌండేషన్‌: మ్యాథ్స్‌ ఫర్‌ డేటా సైన్స్‌ 1, 2. స్టాటిస్టిక్స్‌ ఫర్‌ డేటా సైన్స్‌ 1,2. కంప్యుటేషనల్‌ థింకింగ్, ప్రోగ్రామింగ్‌ పైథాన్, ఇంగ్లిష్‌ 1, 2. 

డిప్లొమా: ఇందులో రెండు సెక్షన్లు ఉంటాయి. అవి ప్రోగ్రామింగ్, డేటా సైన్స్‌. ఒక్కో దాంట్లోనూ 6 కోర్సులున్నాయి. వీటిలో 5 కోర్‌ కోర్సులు ఒకటి స్కిల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌కు సంబంధించింది. ప్రోగ్రామింగ్‌లో: డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్‌ అండ్‌ అల్గారిద]మ్స్‌ యూజింగ్‌ పైథాన్, ప్రోగ్రామింగ్‌ కాన్సెప్ట్స్‌ యూజింగ్‌ జావా, మోడర్న్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ 1, 2, స్కిల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ 1 ఉంటాయి. డేటా సైన్స్‌లో: మెషిన్‌ లర్నింగ్‌ ఫౌండేషన్స్, మెషిన్‌ లర్నింగ్‌ థియరీ, మెషీన్‌ లర్నింగ్‌ ప్రాక్టీస్, బిజినెస్‌ డేటా మేనేజ్‌మెంట్, బిజినెస్‌ ఎనలిటిక్స్, స్కిల్స్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ 2 ఉంటాయి. 

డిగ్రీ: ఈ స్థాయిలో అభ్యర్థులు తమకు నచ్చిన స్పెషలైజేషన్‌ ఎంచుకోవచ్చు. కంప్యూటర్‌ సిస్టమ్స్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌ల్లో ఏదైనా ఒకటి తీసుకోవాలి. తీసుకున్న విభాగానికి చెందిన కోర్‌ కోర్సులతోపాటు ఎలక్టివ్‌లు పూర్తిచేసుకోవాలి. ప్రతి విభాగంలోనూ 2 కోర్‌ కోర్సులు, 5 ఎలెక్టివ్‌లు, 2 ప్రాజెక్టులు ఉంటాయి. వీటితోపాటు స్కిల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ 3, 4 అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. కంప్యూటర్‌ సిస్టమ్స్‌ తీసుకున్నవారికి ఆపరేటింగ్‌ సిస్టమ్స్, కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్‌ కోర్‌లుగా ఉంటాయి. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ తీసుకుంటే సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ కోర్‌లు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌ తీసుకున్నవారికి ఏఐ సెర్చ్‌ మెథడ్స్‌ ఫర్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్, డీప్‌ లర్నింగ్‌ కోర్‌లు. 

ఎవరు అర్హులు? 

పదిలో మ్యాథ్స్, ఇంగ్లిష్‌ చదివివుండాలి. ఇంటర్‌ లేదా సమాన స్థాయి కోర్సు పూర్తిచేసినవారై ఉండాలి. మూడేళ్ల డిప్లొమా చదివినవారూ అర్హులే. రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులు, ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్‌ లేదా సమాన స్థాయి కోర్సులు చదివినవారూ అర్హులే. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫౌండేషన్‌ కోర్సు మొదలయ్యే సమయానికి ఏదో ఒక బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులో చేరాలి. ప్రస్తుతం బ్యాచిలర్‌ డిగ్రీలో చేరినవారు, పూర్తిచేసుకున్నవారు, మధ్యలో వైదొలగినవారు ఇందులో చేరవచ్చు. 

రెగ్యులర్‌ ఎంట్రీ దరఖాస్తు ఫీజు: రూ.3000 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రాయితీ లభిస్తుంది. 

క్వాలిఫయర్‌ 2 దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 14

క్వాలిఫయర్‌ కోర్సు: జూన్‌ 21 నుంచి మొదలవుతుంది.

క్వాలిఫయర్‌ పరీక్ష తేదీ: ఆగస్టు 8

పరీక్ష కేంద్రాలు: 

ఏపీలో - విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, భీమవరం, గుంటూరు, కడప, అనంతపురం, తిరుపతి, కర్నూలు. 

తెలంగాణలో - హైదరాబాద్, వరంగల్‌.

వెబ్‌సైట్‌: https://www.onlinedegree.iitm.ac.in/

Posted Date: 05-04-2021


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌