• facebook
  • whatsapp
  • telegram

డిజిటల్‌ మార్కెటింగ్‌ నిపుణులకు డిమాండ్‌!

అందుబాటులో రకరకాల కోర్సులు

ఇంటర్‌నెట్‌ వినియోగం రోజువారీ అవసరంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్‌ మార్కెటింగ్‌ నిపుణులకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోంది. అంతేకాదు..  నిలకడగా ఎక్కువ అవకాశాలు, ఆదాయం అందిస్తూ వేగంగా ఎదుగుతున్న రంగంగా  డిజిటల్‌ మార్కెటింగ్‌ నిలిచింది. ఈ రంగంలో కెరియర్‌ను రూపుదిద్దుకోవాలని భావించే విద్యార్థులకు వివిధ స్పెషలైజేషన్లతో సర్టిఫికెట్, డిప్లొమా, అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాములు అందుబాటులో ఉన్నాయి! 

కాలంతో పాటు వినియోగదారుల ఆసక్తులు, అభిరుచులు, వారు వినియోగిస్తున్న మాధ్యమాలు కూడా వేగంగా మారుతున్నాయి. దీంతో వివిధ కంపెనీలు తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సరికొత్త వ్యూహాలు అనుసరిస్తున్నాయి. సంప్రదాయ మార్కెటింగ్‌ విధానాలతో పాటు... ఇప్పుడు సోషల్‌ మీడియా అకౌంట్లు, ఈమెయిల్‌ ఖాతాలు, వెబ్‌సైట్లు, బ్లాగుల ద్వారా వినియోగదారులను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంటర్నెట్‌ వినియోగం విస్తృతమయ్యేకొద్దీ డిజిటల్‌ మార్కెటింగ్‌ ప్రభావం, పరిధీ పెరుగుతున్నాయి. 

కంప్యూటర్, ట్యాబ్, మొబైల్‌ ఫోన్‌.. ఇలా ఇంటర్‌నెట్‌తో అనుసంధానమయ్యే పరికరాలన్నీ డిజిటల్‌ మార్కెటింగ్‌ ఉపకరణాలయ్యాయి. వీటి సాయంతో.. సెర్చ్‌ ఇంజన్‌ ఆప్టిమైజేషన్, ఈ-మెయిలర్స్, పెయిడ్‌ మీడియా లాంటి పద్ధతుల ద్వారా డిజిటల్‌ మార్కెటింగ్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. 

ఇంటర్‌నెట్‌తో అనుసంధానమైనవాటితోనే కాక.. టెలి కమ్యూనికేషన్, శాటిలైట్, కేబుల్‌ టీవీ లాంటి ఆఫ్‌లైన్‌ విధానాల ద్వారా కూడా డిజిటల్‌ మార్కెటింగ్‌ చేస్తారు. ఉదాహరణకు మొబైల్‌ ఫోన్స్‌కు టెలి కమ్యూనికేషన్స్‌ ద్వారా ఎస్సెమ్మెస్‌లు పంపితే అది ఎస్సెమ్మెస్‌ మార్కెటింగ్‌ అవుతుంది. ఇదే కోవలో శాటిలైట్‌ ద్వారా టెలివిజన్‌లో మార్కెటింగ్‌ చేయొచ్చు. నాన్‌ఇంటర్‌నెట్‌ చానళ్ల వినియోగం డిజిటల్‌ మార్కెటింగ్‌ను ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ నుంచి వేరు చేస్తుంది.

సంప్రదాయ మార్కెటింగ్‌ తరహాలోనే.. డిజిటల్‌ మార్కెటింగ్‌ ప్రయోజనం కూడా ఒక ఉత్పత్తి/సేవ/ఆలోచనను ప్రజలకు చేరువ చేయడం లేదా బ్రాండింగ్, అడ్వర్‌టైజింగ్‌ సేల్స్‌ లాంటి నిర్ణీత మార్కెటింగ్‌ లక్ష్యాలను సాధించడమే. వ్యాపార సంస్థలు తమ మార్కెటింగ్‌ కార్యకలాపాలను నిర్వహించుకునే తీరులో డిజిటల్‌ మార్కెటింగ్‌ విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ప్రజలకు చేరువ కావడంలో, ఖర్చు విషయంలో, పెట్టిన పెట్టుబడికి తగిన ఆదాయం (రిటర్న్‌ ఆన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌-ROI) రాబట్టడంలోనే కాదు; పారదర్శకత, ఫలితాల్లోనూ ఇది బహుళ ప్రయోజనాలను అందిస్తోంది.

సంప్రదాయ వ్యూహాలకు భిన్నంగా...

డిజిటల్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు సంప్రదాయ ప్రచార వ్యూహాలకు భిన్నంగా.. డిజిటల్‌ మాధ్యమాల్ని వినియోగించుకుంటారు. మార్కెటింగ్‌ రంగంలో తమకున్న విశేష పరిజ్ఞానాన్నీ, భావ వ్యక్తీకరణ నైపుణ్యాల్నీ మేళవించి తాము పనిచేస్తున్న సంస్థలు, క్లయింట్ల కోసం డిజిటల్‌ మార్కెటింగ్‌ ప్రచారాలూ, వ్యూహాలను అమలుచేస్తారు. సంప్రదాయ మార్కెటింగ్‌ బృందాలు, మార్కెటింగ్‌ కమ్యూనికేషన్‌ ఏజెన్సీలతో నిర్వహించే ప్రచారాన్ని వీరు డిజిటల్‌ మార్కెటింగ్‌ సాధనాలతో కొత్త పుంతలు తొక్కిస్తారు. వీరు డిజిటల్‌ మేనేజర్‌ సారథ్యంలోని గ్రాఫిక్‌ డిజైనర్లు, వెబ్‌ డెవలపర్లు, కంటెంట్‌ రైటర్లు లాంటి నిపుణులతో కూడిన బృందంతో కలిసి పనిచేస్తారు. 

బహుముఖమైన లక్ష్యాల సాధనకు విభిన్న రకాల డిజిటల్‌ మార్కెటింగ్‌ విధానాలూ, సాధనాలను ఉపయోగిస్తారు. వెబ్‌సైట్‌లు, సోషల్‌ మీడియా అకౌంట్లు లాంటి  ఆన్‌లైన్‌ అసెట్స్‌ని అప్‌డేట్‌ చేయడం, వెబ్‌సైట్‌ ట్రాఫిక్‌ని ఆకర్షించడం చేస్తారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, యూట్యూబ్, లింక్డ్‌ఇన్, పింట్‌రెస్ట్, టంబ్లర్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లోని గ్రూపుల్ని ప్రభావితం చేస్తారు. పెయిడ్‌ అడ్వర్‌ట్టైజింగ్‌ క్యాంపెయిన్‌లు (టెక్స్‌ట్‌ యాడ్స్, డిస్‌ప్లే యాడ్స్, వీడియో యాడ్స్‌ మొదలైనవి) నిర్వహిస్తారు. డిజిటల్‌ మార్కెటింగ్‌పై సంస్థ పెడుతున్న పెట్టుబడికి తగిన ఫలితం లభిస్తోందా అనేది తెలుసుకునేందుకు డేటా ట్రాకింగ్, విశ్లేషించడం, ఆన్‌లైన్‌లో సంస్థకున్న ప్రతిష్ఠను పెంపొందించడం లాంటివి డిజిటల్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ల ప్రధాన బాధ్యతల్లో కొన్ని.

ఏయే కోర్సులు? 

హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) డిజిటల్‌ మార్కెటింగ్‌ అండ్‌ ఎనలిటిక్స్‌లో 12 వారాల వ్యవధితో ఆన్‌లైన్‌ కోర్సును అందిస్తోంది. గ్రాడ్యుయేట్లు/ డిప్లొమా హోల్డర్లు అక్టోబరు 20లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. యుడెమి, కోర్స్‌ఎరా, అప్‌గ్రాడ్, లెర్న్‌ డిజిటల్‌ విత్‌ గూగుల్‌ లాంటి ఎన్నో సంస్థలు ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. 

నైపుణ్యాలు పెంచుకోవడం ఎలా? 

మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్, వెబ్‌/డిజిటల్‌ టెక్నాలజీలు, గ్రాఫిక్‌ డిజైన్‌ లాంటి రంగాల్లో పనిచేసిన నేపథ్యం ఉన్నవారి కోసమే సహజంగా ఏ సంస్థలైనా చూస్తాయి. డిజిటల్‌ మార్కెటింగ్‌ రంగంలో కెరియర్‌ ప్రారంభించాలనుకునేవారికి ఈ రంగంలో సర్టిఫికేషన్‌ కోర్సు చేసి ఉండటం లేదా, సంబంధిత రంగంలో డిప్లొమా/డిగ్రీ కలిగి ఉండటం ముఖ్యమైన విద్యార్హత. మంచి పేరున్న ఏదైనా డిజిటల్‌ మీడియా కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ చేసినవారికి ఉద్యోగ నియామకాల్లో కంపెనీలు పెద్దపీట వేస్తాయి.

ఇవీ వివిధ హోదాలు 

సాధారణంగా డిజిటల్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు పెద్ద డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, వెబ్‌ డిజైన్‌ స్టూడియోలు, అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీలు, కార్పొరేట్‌ సంస్థలు లాంటి వాటిలో పూర్తికాలపు ఉద్యోగులుగా పనిచేస్తుంటారు. కొందరు ఫ్రీలాన్సర్లుగానూ పనిచేస్తారు. డిజిటల్‌ మార్కెటింగ్‌ నిపుణులకు ప్రస్తుతం వివిధ సంస్థల్లో మంచి అవకాశాలున్నాయి. 

డిజిటల్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ 

సీనియర్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ 

డిజిటల్‌ మార్కెటింగ్‌ టీం లీడర్‌/అసిస్టెంట్‌ మేనేజర్‌ 

డిజిటల్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ 

డిజిటల్‌ మార్కెటింగ్‌ స్ట్రాటజిస్ట్‌ 

‣ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌

జీతభత్యాలు 

ఫ్రెషర్స్‌కు నెలకు రూ.20,000 - రూ.30,000 

సీనియర్లకు (ఐదేళ్లకంటే ఎక్కువ అనుభవం ఉన్నవారికి) నెలకు రూ.75,000 - రూ.1,00,000, ఆపైన కూడా

ఉద్యోగం సంపాదించాలంటే..

ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో కీలకమైంది రెజ్యూమె. అది ఎంత సమగ్రంగా ఉంటే అంతగా ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. నియామక సంస్థలకు అభ్యర్థి గురించి చక్కగా వివరించగలిగింది రెజ్యూమేనే! అది చాలా స్పష్టంగా, క్లుప్తంగా, దోషరహితంగా, ఉద్యోగానికి పోటీపడేందుకు మీకున్న అర్హతలేంటో తెలియజెప్పేదిగా ఉండాలి. ఆ ఉద్యోగానికి మిమ్మల్ని ఎంపికచేసుకోవడం ఉత్తమ నిర్ణయం ఎలా అవుతుందో వివరిస్తూ రెజ్యూమెకు ఒక కవరింగ్‌ లెటర్‌ని జతచేయాలి.

ఎలాంటి అర్హతలుండాలి? 

 మార్కెటింగ్, సాంకేతిక రంగాల్లో గట్టి పట్టు. తమను తాము నిరూపించుకోవాలన్న తపన.

 డిజిటల్‌ మార్కెటింగ్‌ రంగంపై, వివిధ డిజిటల్‌ మార్కెటింగ్‌ సాధనాలపై విస్తృత అవగాహన.

 పరిశోధన, సమాచార విశ్లేషణ సామర్థ్యం, వ్యూహ నైపుణ్యాలు

 కీ పెర్ఫార్మింగ్‌ ఇండికేటర్స్‌ (KPI), రిటర్న్‌ ఆన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (ROI) కొలమానాలకు సంబంధించిన వెబ్‌ అనలిటిక్‌ టూల్స్‌పై పనిచేయగల అనుభవం.

 సహజ సిద్ధమైన, పెయిడ్‌ క్యాంపెయిన్‌ సాధనాల పరిజ్ఞానం.

 ఆఫ్‌పేజ్, ఆన్‌పేజ్‌ ఎస్‌ఈఓ టెక్నిక్‌లతో పరిచయం

 సృజనాత్మక ఆలోచనా ధోరణి.

 మంచి కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్, ఆర్గనైజేషనల్‌    నైపుణ్యాలు.

 నేర్చుకోవాలన్న తపన. కొత్త విషయాల్ని తెలుసుకోవాలన్న ఆసక్తి. మార్పులను త్వరగా అందిపుచ్చుకోగల నైపుణ్యం.

 గ్రాఫిక్‌ డిజైన్, వెబ్‌ డిజైన్, వీడియో ఎడిటింగ్, వెబ్‌ డెవలప్‌మెంట్‌ రంగాలపై ప్రాథమిక అవగాహన.

 ఆంగ్ల భాషా పరిజ్ఞానం.. ముఖ్యంగా చదవడం, రాయడం.

డిజిటల్‌ మార్కెటింగ్‌ స్పెషలైజేషన్లు

 సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ (SEO)

 సెర్చ్‌  ఇంజిన్‌ మార్కెటింగ్‌ (SEM)

 సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ (SMM)

 సోషల్‌ మీడియా ఆప్టిమైజేషన్‌ (SMO)

 ఈ-మెయిల్‌+ ఎస్‌ఎంఎస్‌ మార్కెటింగ్‌

 ఎఫిలియేట్‌ మార్కెటింగ్‌

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పీఓ కొలువుకు ఎస్‌బీఐ పిలుపు

‣ డెవాప్స్‌ నిపుణుల‌కు డిమాండ్‌!

‣ కోస్టుగార్డు కొలువుల్లోకి ఆహ్వానం!

‣ 20,000 కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు

‣ అవుతారా.. టాబ్లూ డెవ‌ల‌ప‌ర్‌!

‣ ఇంజినీర్ల‌కు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాలు

‣ ఆంగ్ల‌భాష ప్రావీణ్య ప‌రీక్ష ఏది ప్ర‌యోజ‌న‌క‌రం!

‣ ప్రాక్టీస్‌ + రివిజన్‌ విజయసూత్రం!

Posted Date: 11-10-2022


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌