• facebook
  • whatsapp
  • telegram

భాషలపై పట్టు.. భవితకు మెట్టు!

ఇంటర్‌ప్రిటర్లుగా రాణించేందుకు చక్కటి అవకాశం

వివిధ భాషల్లో పరిజ్ఞానంతో పాటు పట్టు పెంచుకుంటే ఉద్యోగాన్వేషణ సులువవుతుంది. కెరియర్‌లోనూ ముందుకు దూసుకువెళ్లవచ్చు. ఒక భాష నుంచి మరో భాషలోకి చక్కగా అనువదించటం ఓ ప్రత్యేక నైపుణ్యం. చదువుకుంటూనే శిక్షణ, అభ్యాసాల ద్వారా దీన్ని సాధించవచ్చు. అనువాదం రాతపూర్వకంగా ఉండొచ్చు. సభావేదికపై అప్పటికప్పుడు చేసే ప్రసంగ రూపంలోనూ ఉండొచ్చు! భాషా పరిజ్ఞానం, విషయంపై పట్టు ఉన్నవారు ఇంటర్‌ప్రిటర్‌గా రాణించే అవకాశం ఉంటుంది! 

జాతీయ నాయకులో అంతర్జాతీయ ప్రముఖులో మన ప్రాంతానికి వస్తుంటారు. అలాంటప్పుడు వారి పక్కనే ఉండి ప్రసంగాన్ని తెలుగులోకి యథాతథంగా అనువదించి చెప్పేవారినీ చూస్తుంటాం కదా... ఇదే పనిని వృత్తిగానూ ఎంచుకోవచ్చు. విదేశీ భాషలను మాట్లాడుతున్న వారి పక్కనే ఉండి... ఆయా భాషలను ప్రాంతీయ భాషలోకి తర్జుమా చేసి చెప్పేవారిని ‘ఇంటర్‌ప్రిటర్స్‌’ అంటారు. ‘ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఇంటర్‌ప్రిటరు’్ల న్యాయ, వైద్య, సాంకేతిక, సంక్షేమం... లాంటి అంశాల్లో నిపుణులై ఉంటారు. వక్త ఒకటి రెండు వాక్యాలు మాట్లాడి ఆగినప్పుడు.. అనువాదకుడు అందుకుని ప్రాంతీయ భాషలో ఆ వాక్యాలను అనువదించి చెపుతాడు.

ప్రసంగం మొత్తం పూర్తయిన తర్వాత వక్త చెప్పిన విషయాన్ని స్థానిక ప్రేక్షకులకు అర్థమయ్యేలా వివరించటం కూడా ఉంది. అయితే ఇలా ప్రసంగం మొత్తం ముగిశాక దాన్ని తర్జ్జుమా చేయడమనేది కాస్త కష్టంగానే ఉంటుంది. కోర్టు వ్యవహారాలు, అంతర్జాతీయ సమావేశాల్లో ప్రసంగం మొత్తం పూర్తయిన తర్వాత వివరించాల్సి ఉంటుంది. మూల- లక్ష్య భాషలతో పాటు సంబంధిత అంశాల మీద మంచి పట్టు ఉంటేనే ఈ పనిని సమర్థంగా చేయడం సాధ్యమవుతుంది.

ఇంటర్‌ప్రిటర్లకు అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. విభిన్న దేశాల సంస్కృతీ సంప్రదాయాల పట్ల అవగాహన అవసరం. పాశ్చాత్య భాషల్లో చోటు చేసుకుంటోన్న అభివృద్ధిని అర్థం చేసుకోగలగాలి. పరిశోధనా దృష్టి, నలుగురిలో సమర్థంగా మాట్లాడగలిగే చాకచక్యం ఉండాలి.

ఏయే అర్హతలుండాలి?

ఇంటర్‌ లేదా దీనికి సమానమైన పరీక్ష పాసైన వారు మూడేళ్ల బీఏ కోర్సులో చేరొచ్చు. లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లాంగ్వేజ్‌ కోర్సులో చేరొచ్చు. కొన్ని యూనివర్సిటీలు గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్ల కోసం డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఆసక్తి ఉన్న విదేశీ భాషను రాయబార కార్యాలయాలు నిర్వహించే సంస్థల్లో చేరి కూడా నేర్చుకోవచ్చు. ఇవన్నీ బేసిక్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌  పార్ట్‌టైమ్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఒకపక్క చదువు కొనసాగిస్తూనే ఖాళీ సమయంలో వీటిని నేర్చుకోవచ్చు.

ఇంటర్‌ప్రిటర్‌ వృత్తిని ఎంచుకోదలచినవారు విదేశీ, ప్రాంతీయ భాషలు రెండింటిలోనూ తగిన పట్టు, భావ వ్యక్తీకరణ సామర్థ్యాలను పెంచుకోవాలి. చొరవ, పరిశోధనా నైపుణ్యాలు ఉండాలి. గోప్యతను పాటించడం, సానుకూల దృక్పథంతో పనిచేసే నేర్పు ఉండాలి. మంచి జ్ఞాపకశక్తి, నీతి నియమాలకు కట్టుబడే మనస్తత్వం అవసరం.

సైన్‌ లాంగ్వేజ్‌ ఇంటర్‌ప్రిటర్స్‌

వీళ్లు చేసే పని కూడా సుమారుగా ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఇంటర్‌ప్రిటర్స్‌ చేసే పనిలాగే ఉంటుంది. వక్త చెప్పిన విషయాన్ని వీరు సైగలతో వివరిస్తారు. చేతులు, వేళ్లు, ముఖ కవళికల ద్వారా తెలియజేస్తారు. అదేవిధంగా బధిరులు సైగల ద్వారా చెప్పిన విషయాన్ని ఎదుటివారికి తెలియజేస్తారు.

ఈ విద్యా సంస్థల్లో కోర్సులు.. 

భారతీయ భాషలతో పాటు ఫ్రెంచి, రష్యన్, ఇటాలియన్, జపనీస్, జర్మన్, స్పానిష్‌ లాంటి భాషలను నేర్చుకోదలిచినవారికి ఎన్నో సంస్థలు వివిధ కోర్సులను అందిస్తున్నాయి. అలాంటి కొన్ని విద్యాసంస్థల జాబితాను ఇక్కడ ఇస్తున్నాం. 

అన్నామలై యూనివర్సిటీ, (https://annamalaiuniversity.ac.in/)

అలయన్స్‌ ఫ్రాంకజ్‌ సెంటర్స్‌ ఫర్‌ ఫ్రెంచ్‌,  (afindia.org/learn-french)

బెంగుళూర్‌ యూనివర్సిటీ, బెంగళూరు, (bangaloreuniversity.ac.on)

బనారస్‌ హిందూ యూనివర్సిటీ, వారణాసి, (bhu.ac.in)

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌  లాంగ్వేజెస్, మైసూర్, (ciil.org)

ది ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌  యూనివర్సిటీ, హైదరాబాద్‌ (efluniversity.ac.in)

కొచ్చిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌  టెక్నాలజీ, కొచ్చి (cusat.ac.in)

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ది రష్యన్‌ లాంగ్వేజ్‌ ఆఫ్‌ ది రష్యన్‌ సెంటర్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ కల్చర్, న్యూదిల్లీ (ind.rs.gov.ru/en)

దక్షిణ్‌ భారత్‌ హిందీ ప్రచార్‌ సభ, చెన్నై (dbhpscentral.org)

ఇండో ఇటాలియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ఫర్‌ ఇటాలియన్‌(indiaitaly.com)

ఇండో-జపనీస్‌ అసోసియేషన్‌- ముంబయి ఫర్‌ జపనీస్‌ (indojap.in)

కేంద్రీయ హిందీ సంస్థాన్, ఆగ్రా  (http://khsindia.org/india/en/)

మ్యాక్స్‌ముల్లర్‌ భవన్‌ ఫర్‌ జర్మన్‌  (www.goethe.de/ins/in/en/m/index,html)

స్కూల్‌ ఆఫ్‌ లాంగ్వేజ్, లిటరేచర్‌ అండ్‌  కల్చరల్‌ స్టడీస్, జవహర్‌లాల్‌ నెహ్రూ  యూనివర్సిటీ, దిల్లీ  (jnu.ac.in/main)

ఇన్‌స్టిట్యూట్‌ హిస్‌పానియా-స్పానిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ ఫర్‌ స్పానిష్‌ (www.institutohispania.com/)

జేఎన్‌ అకాడెమీ ఆఫ్‌ లాంగ్వేజెస్, న్యూదిల్లీ (www.bvbdelhi.org/jawahar-academy/jawahar-lang.html)

వీటితో పాటు విభిన్న యాప్‌లూ, వెబ్‌సైట్ల ద్వారా కూడా భాషలను సులువుగా  నేర్చుకోవచ్చు.

Posted Date: 29-07-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌