• facebook
  • whatsapp
  • telegram

అడుగడుగునా ఉపాధి అవకాశాలు

యూజీ, పీజీ ప్ర‌వేశాల‌కు ఎఫ్‌డీడీఐ ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

సౌకర్యంతోపాటు హుందాతనాన్ని అందించి.. అడుగడుగునా అండగా ఉండేవి పాదరక్షలు. ప్రతి ఒక్కరి అవసరాలు తీరేలా, ఎన్నో ఆకృతుల్లో వీటిని రూపొందిస్తున్నారు. వీటి వెనుక ఎందరో నిపుణుల సృజనాత్మకత దాగి ఉంది. ఆసక్తి ఉన్నవారి కోసం కొన్ని కోర్సులు, వాటిని అందించడానికి ప్రత్యేక సంస్థలు వెలిశాయి. వాటిలో కేంద్రం అధీనంలోని ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ) ముఖ్యమైనది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా కేంద్రాలున్నాయి. వాటిలో యూజీ, పీజీ ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.  

పాదరక్షల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. తోలు వస్త్రాల ఎగుమతుల్లో ద్వితీయ స్థానం మనదే. తోలు ఉత్పత్తుల ఎగుమతుల్లో అయిదో స్థానంలో ఉన్నాం. దేశ జీడీపీలో ఫుట్‌వేర్‌ పరిశ్రమ 2 శాతం వాటాతో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. పాద రక్షలు, తోలు ఉపకరణాలు, జీవన శైలి ఉత్పత్తులకు సంబంధించి ఉన్నత విద్య అందిస్తోన్న ప్రపంచ స్థాయి సంస్థలు/ విశ్వవిద్యాలయాల్లో ఎఫ్‌డీడీఐ మూడో స్థానంలో ఉంది. జాతీయ ప్రాధాన్య సంస్థగా ఇది గుర్తింపు పొందింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ) 1986లో ఏర్పాటు చేశారు. ఫుట్‌వేర్, ఫ్యాషన్, రిటైల్, లెదర్‌ యాక్సెసరీలు, లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులకు సంబంధించి అర్హులకు శిక్షణ ఇచ్చి, నాణ్యమైన మానవ వనరులను పరిశ్రమలకు అందించి, వాటిద్వారా మన్నికైన వస్తువులు రూపొందించి ప్రపంచ మార్కెట్‌లో భారత్‌ వాటా పెరిగేలా చూడడం దీని లక్ష్యం. 

ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 12 కేంద్రాలు (హైదరాబాద్, నోయిడా, రోహ్‌తక్, కోల్‌కతా, ఫుర్సత్‌గంజ్, చెన్నై, జోధ్‌పూర్, చిండ్వారా, పట్నా, చండీగఢ్, గుణ, అంక్లేశ్వర్‌) ఉన్నాయి. వీటిలో పాదరక్షలు, లెదర్‌ ఉత్పత్తుల తయారీ, వాటి విక్రయాలకు సంబంధించి బ్యాచిలర్, మాస్టర్‌ డిగ్రీలను అందిస్తున్నారు. యూజీ, పీజీల్లో కలుపుకుని అన్ని సంస్థల్లోనూ 2370 సీట్లు ఉన్నాయి. వీటితోపాటు మరో 230 ఎన్‌ఆర్‌ఐ, ఇండస్ట్రీ స్పాన్సర్డ్‌ సీట్లు లభిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే ఆల్‌ ఇండియా స్కిల్‌ టెస్ట్‌ (ఏఐఎస్‌టీ) రాయాలి. యూజీ, పీజీ కోర్సులకు ప్రత్యేకంగా పరీక్షలు ఉంటాయి. వీటిని ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి మ్యాట్‌ స్కోరుతోనూ దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష తీరు

యూజీ కోర్సులకు 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. 4 సెక్షన్ల నుంచి మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. మొదటి సెక్షన్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 25 ప్రశ్నలు అడుగుతారు. రెండో సెక్షన్‌లో కాంప్రహెన్షన్‌ నుంచి 10, గ్రామర్‌ యూసేజ్‌...తదితరాల నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. మూడో సెక్షన్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో 35 ప్రశ్నలు వస్తాయి. నాలుగో సెక్షన్‌లో బిజినెస్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 25, డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. మొదటి మూడు సెక్షన్లలో ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. చివరి సెక్షన్‌లో ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు.   

పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో 4 సెక్షన్ల నుంచి 175 ప్రశ్నలు వస్తాయి. వీటికి 200 మార్కులు కేటాయించారు. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 25 ప్రశ్నలు 50 మార్కులకు, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ ఎనలిటికల్‌ ఎబిలిటీ 50 మార్కులకు 50 ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరంట్‌ అఫైర్స్‌ 50 ప్రశ్నలు 50 మార్కులు, మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు, ఎనలిటికల్‌ ఎబిలిటీ 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి.

వీటిని నేర్చుకుంటారు 

కోర్సులో భాగంగా వివిధ పదార్థాలు, ఉత్పత్తులు ఉపయోగించి పాదరక్షలు, తోలు ఉత్పత్తులు, జీవనశైలి ఉపకరణాలు ఎలా తయారు చేయాలో నేర్పిస్తారు. యంత్రాల సాయంతో వాటిని డిజైన్‌ చేయిస్తారు. వినియోగదారుల అవసరాలపై అవగాహన కల్పించి, అందుకు అనుగుణంగా ఉత్పత్తులు సృష్టించడంపై దృష్టి సారిస్తారు. వీటితోపాటు రిటైల్‌ మేనేజ్‌మెంట్, కన్జూమర్‌ బిహేవియర్, రిటైల్‌ కమ్యూనికేషన్, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ ఆపరేషన్, మార్కెటింగ్, బ్రాండ్‌ మేనేజ్‌మెంట్, సేల్స్‌ మేనేజ్‌మెంట్, బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌...తదితర అంశాల్లో    అవగాహన కల్పిస్తారు.  

ఉద్యోగాలిక్కడ..

ఇక్కడ డిజైన్‌ కోర్సులు పూర్తిచేసినవారికి ఎక్కువగా పాదరక్షలు, దుస్తులు, లెదర్‌ ఉత్పత్తులు తయారు చేసే సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. బీబీఏ, ఎంబీఏ కోర్సు చదివినవారికి ఏరియా మేనేజర్, ఫ్లోర్‌ మేనేజర్, స్టోర్‌ మేనేజర్, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ మొదలైన హోదాలతో పాదరక్షలు, తోలు ఉపకరణాలు విక్రయించే సంస్థలు, రిటైల్‌ చెయిన్లలో ఉద్యోగాలు ఉంటాయి. వీరికి ఎక్కువ అవకాశాలు కార్పొరేట్‌ రిటైల్‌ దుకాణాల్లో లభిస్తాయి. 

ఫుట్‌వేర్‌ డిజైన్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి పాదరక్షల తయారీ విభాగంలోని ఉద్యోగాలతోపాటు పాదరక్షలు విక్రయించే కొలువులూ దక్కుతాయి. అడిడాస్, యాక్షన్, బాటా, ప్యూమా, ఫ్యూచర్‌ గ్రూప్, గ్లోబస్, ఖాదిమ్స్, లైఫ్‌స్టైల్, ల్యాండ్‌మార్క్, మ్యాక్స్, రీబక్, లిబర్టీ, రిలయన్స్‌ రిటైల్, వెస్ట్‌సైడ్, ఉడ్‌ల్యాండ్, వీకేసీ, షాపర్స్‌ స్టాప్, ప్యాంటలూన్స్, ..మొదలైన సంస్థలు క్యాంపస్‌ నియామకాల ద్వారా ఎఫ్‌డీడీఐ విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సులు చదివినవారు కాస్ట్యూమ్‌ డిజైనర్, ఫ్యాషన్‌ కన్సల్టెంట్, పర్సనల్‌ స్టైలిస్ట్, ఫ్యాషన్‌ మర్చండైజర్, ఫ్రీలాన్స్‌ డిజైనర్‌..తదితర హోదాలతో రాణించవచ్చు. కార్పొరేట్‌ దుస్తుల తయారీ కంపెనీల్లో అవకాశాలు లభిస్తాయి.

సీట్లు.. అర్హతలు 

యూజీ 

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌: ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌-984, లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ డిజైన్‌-198, ఫ్యాషన్‌ డిజైన్‌-726 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులను నాలుగేళ్ల వ్యవధితో అందిస్తున్నారు.

బీబీఏ: రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చెండైజ్‌-264 సీట్లు ఉన్నాయి. కోర్సు వ్యవధి మూడేళ్లు.  

అర్హత: బ్యాచిలర్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్‌ ఉత్తీర్ణులు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

పీజీ 

మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌: ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ 164 సీట్లు ఉన్నాయి. రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నారు.   

అర్హత: ఫుట్‌వేర్‌ / లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ డిజైన్‌ / డిజైన్‌ / ఇంజినీరింగ్‌ / ప్రొడక్షన్‌/ టెక్నాలజీల్లో బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంబీఏ: రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చెండైజ్‌ లో 264 సీట్లు ఉన్నాయి. కోర్సు వ్యవధి రెండేళ్లు.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 15

పరీక్ష తేదీ: జులై 4

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.

వెబ్‌సైట్‌: https://fddiindia.com/

Posted Date: 24-02-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌