• facebook
  • whatsapp
  • telegram

అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్

భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక లాంటిది. దేశ జీడీపీలో ఈ రంగం వాటా 17.5 శాతం. ఎక్కువ మందికి జీవనోపాధి కల్పించడమే కాకుండా దేశ ప్రజల ఆహార అవసరాలను తీరుస్తోన్న రంగమిది. అనేక ప్రధాన పరిశ్రమలకు వ్యవసాయ రంగం ముడి సరుకులను సరఫరా చేస్తోంది. వేగంగా మారుతోన్న వ్యాపార ధోరణులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచీకరణ, మారుతోన్న ప్రభుత్వ పాత్ర ఈ రంగానికి సవాళ్లుగా పరిణమిస్తున్నాయి. నేటి వ్యవసాయం కేవలం ఆహార ఉత్పత్తికే పరిమితం కాకుండా వాణిజ్యపరమైన ప్రాముఖ్యాన్ని పొందింది. హరిత విప్లవం ముందు వరకూ మనం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకున్నాం. నేడు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం. కానీ చైనా లాంటి ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర పంట దిగుబడి తక్కువగానే ఉంటోంది. భారతదేశంలో కేవలం 14 శాతం ఆహారోత్పత్తులను మాత్రమే ప్రాసెసింగ్ చేస్తున్నారు. ప్యాకేజింగ్, రవాణా సమయంలో 35 శాతం ఆహారం వృథా అవుతోంది. ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ చేసిన ఆహార ఉత్పత్తుల మార్కెట్ నానాటికీ పెరుగుతోంది. దీంతో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అధిక సంఖ్యలో ప్రారంభమవుతున్నాయి. ఈ పరిణామాలతో సుశిక్షితులైన మానవ వనరుల అవసరం ఏర్పడింది. వాణిజ్య అవకాశాలు పెరుగుతుండటంతో అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ ఆకర్షణీయమైన కెరీర్‌గా రూపుదిద్దుకుంటోంది. అగ్రికల్చర్ విద్యార్థులు అగ్రి బిజినెస్ మేనేజర్స్‌గా మారే క్రమంలో సంస్థల అవసరాలను తీర్చడమే కాకుండా, మారుతున్న వ్యవసాయ విధానాలను తెలుసుకుంటూ రైతులకు వెన్నుదన్నుగా నిలవాలి.

అగ్రి బిజినెస్ అంటే...
రైతులతో లావాదేవీలు నిర్వహించే ప్రతీ సంస్థ అగ్రి బిజినెస్ పరిధిలోకి వస్తుంది. ఈ లావాదేవీలు ఉత్పత్తుల రూపంలో, సేవల రూపేణా ఉండొచ్చు. వ్యవసాయానికి అవసరమైన సలహాలు, విత్తనాలు, క్రిమిసంహారక పరికరాలు, వ్యవసాయ పనిముట్లను అందజేయడం లాంటివి కూడా ఈ విభాగం పరిధిలోకి వస్తాయి. వ్యవసాయానికి అప్పులివ్వడం, పంట బీమా కల్పించడం, నిల్వచేయడం, రవాణా, ప్యాకింగ్, ప్రాసెసింగ్, పంపిణీ తదిరతరాలన్నీ అగ్రి బిజినెస్ పరిధిలోకి వస్తాయి. స్థూలంగా చెప్పాలంటే పంట ఉత్పత్తికి అవసరమైన పెట్టుబడి మొదలుకొని దాన్ని మార్కెటింగ్ చేసే దాకా ఉండే దశలన్నింటి సమాహారమే అగ్రి బిజినెస్. పంట ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, పంపిణీలకు పరస్పర సంబంధం ఉంటుంది. భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అగ్రి బిజినెస్‌ను నాలుగు ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు. అవి వ్యవసాయ పెట్టుబడులు, ఉత్పత్తులు, ప్రాసెసింగ్, మార్కెటింగ్- పంపిణీ. ఈ రంగాల విజయం ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటుంది. 'ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం, దానికి మేనేజ్‌మెంట్ విలువలను ఆపాదించడమే అగ్రి బిజినెస్'.

అగ్రి బిజినెస్ ఆవశ్యకత:
వ్యవసాయ రంగం వాణిజ్య రూపు సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో పంట కోత తర్వాత సరైన పద్ధతులు పాటించడం, ప్రాసెసింగ్, రవాణా సదుపాయాలను పెంపొందించడం, ప్యాకేజింగ్ చేయడం లాంటి కార్యకలాపాల ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఆహార ఉత్పత్తులను చేరవేస్తున్నారు. సరైన పద్ధతులు పాటించకపోవడం, వరదలు, కరవుకాటకాలు, పంట రోగాల బారిన పడటం, పంట కోతకు ముందు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన లేకపోవడం లాంటి కారణాలతో మన దేశంలో పంట దశలో ఏటా 20 నుంచి 30 శాతం దాకా పంట నష్టపోతున్నాం. పళ్లు, కూరగాయలు 30 శాతం దాకా వృథా అవుతున్నాయి. సరళీకృత ఆర్థిక విధానాలు, అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ఏర్పడటం లాంటి పరిణామాలు వ్యవసాయ ప్రాధాన్యాన్ని పెంచాయి. నూతన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మన దేశంలో ఆక్వా, పౌల్ట్రీ, పళ్ల శుద్ధి, కూరగాయల సాగు తదితర రంగాలు ప్రయోజనాలను పొందుతున్నాయి. వ్యవసాయ రంగానికి పెట్టుబడులు సమకూర్చడం, ఉత్పత్తులు, రవాణా, ప్రాసెసింగ్ మొదలైన రంగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రధాన ఉద్దేశం. ప్రపంచీకరణ వల్ల కలుగుతోన్న ప్రయోజనాలను పొందడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి, భారత్‌లాంటి వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ ఎంతో అవసరం. ప్రభుత్వ, ప్రయివేటు, సహకార సంస్థలు శిక్షణ పొందిన అగ్రి బిజినెస్ మేనేజర్ల కోసం ఎదురుచూస్తున్నాయి. వీటికి కావాల్సిన మానవ వనరులను అందించే బాధ్యతను కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు భుజాలకెత్తుకున్నాయి. ఇవి అగ్రికల్చర్ విద్యార్థులకు మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను నేర్పుతున్నాయి. అగ్రి బిజినెస్‌కున్న డిమాండ్ దృష్ట్యా దాదాపు అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ కోర్సులను అందిస్తున్నాయి.

అర్హతలు:
అగ్రికల్చర్, సంబంధిత రంగాలైన డైరీ, ఫుడ్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫారెస్ట్రీ తదితర విభాగాల్లో చదివినవారు అగ్రి బిజినెస్‌మేనేజ్‌మెంట్ చేయవచ్చు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి అగ్రికల్చర్‌లో డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యమిస్తారు.

ఉద్యోగ అవకాశాలు:
అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తోన్న అన్ని సంస్థలూ మంచి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ కోర్సు పూర్తి చేసినవారు వేర్‌హౌసింగ్, రిటైల్, విత్తన సంస్థల్లో, ఎరువుల, క్రిమి సంహారక కంపెనీలు, బ్యాంకులు, బీమా తదితర రంగాల్లో ఉద్యోగాలను పొందవచ్చు. మంచి నైపుణ్యమున్న వారికి ఎదిగేందుకు ఈ రంగంలో విస్తృత అవకాశాలున్నాయి. వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లో మేనేజ్‌మెంట్ నిపుణులుగా, ఆర్థిక సంస్థల్లో విధానపరమైన నిర్ణయాలు తీసుకునేవారిగా, బోధనా రంగంలోనూ, పరిశోధనల్లో వీరు రాణించవచ్చు. ఇవే కాకుండా అగ్రికల్చర్ కన్సల్టెన్సీ, జర్నలిజం, అగ్రి బ్యాంకింగ్, హైటెక్ ఫార్మింగ్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ లాంటి రంగాల్లోనూ కెరీర్‌ను ప్రారంభించవచ్చు. చదివిన కోర్సు ఒకటే అయినా ఎంపిక చేసుకున్న రంగాన్ని బట్టి ఉద్యోగ స్వభావం మారుతుంది.

వేతనాలు: సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ నేపథ్యంలో అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ చేసిన వారు మంచి జీతాలతో కెరీర్‌ను ఆరంభిస్తున్నారు. అభ్యర్థి అర్హతలు, అనుభవం, నైపుణ్యం, చదివిన సంస్థ తదితర అంశాలను బట్టి వచ్చే జీతం ఆధారపడి ఉంటుంది. రానున్న కాలంలో ఈ రంగం ఆకర్షణీయమైన వేతనాలతో కూడిన ఉద్యోగాలను అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు!

Posted Date: 02-12-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌