• facebook
  • whatsapp
  • telegram

ఫోరెన్సిక్‌ కొలువుకి క్లూ!

 

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు... అది ప్రతిపక్షాల కుట్ర! ఆ మాటలు నావి కాదు.. గిట్టని వాళ్లు పుట్టించారు! ప్రమాదవశాత్తు ఫ్యాక్టరీ కాలి బూడిదైందా... అంతా అబద్ధం. పరిహారం కోసం పథకమే!ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యా.. కాదు కాదు అది ముమ్మాటికీ హత్యే! ఇలాంటి మిస్టరీలను ఛేదించే ఉద్యోగంలో మీరు చేరాలంటే ఏం చదవాలో చూడండి!

 

రోజూ పత్రికలు, టీవీల్లో వార్తలెన్నో మనం చూస్తున్నాం. ఎన్నో ట్విస్టులు.. మరెన్నో సందేహాలు... వీటన్నింటికీ సమాధానమే ఫోరెన్సిక్‌ సైన్స్‌.. ప్రపంచవ్యాప్తంగా నేరాలు, ఆర్థిక మోసాలు ఎక్కువయ్యాయి. మనదేశంలోనూ వీటి సంఖ్య తక్కువేమీ కాదు. అయితే చాలా సందర్భాల్లో పోలీసు విచారణలో లైంగికదాడి, హత్యకు కారకులు దొరకడం లేదు. ఎన్నో కేసులు మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. అసలు నేరగాళ్లను గుర్తించడానికి ప్రత్యేక నైపుణ్యాలున్న వ్యక్తులపై ఆధారపడడం తప్పనిసరవుతోంది. ఆధారాలు అన్వేషించి, అసలు దోషుల గుట్టు విప్పడానికి ఆవిర్భవించిందే ఫోరెన్సిక్‌ సైన్స్‌. ఫోరెన్సిక్‌ సైన్స్‌ అంటే కేవలం హంతకులను గుర్తించే శాస్త్రమే కాదు. మోసగాళ్లను పట్టించే దివ్యాస్త్రం కూడా. అగ్ని ప్రమాదాలు, ఫోర్జరీ సంతకాలు, మార్ఫింగ్‌, సైబర్‌ నేరాలు... ఇలా ప్రతీదీ ఫోరెన్సిక్‌తో ముడిపడి ఉన్నదే. ఆధునిక సమాజంలో నేరాలు గుర్తించడానికి ఫోరెన్సిక్‌ సైన్స్‌ సమర్థ అస్త్రంగా అవతరించింది. దీంతో ఈ రంగంలో కెరియర్‌ అవకాశాలు విస్తరిస్తున్నాయి. ఇందుకోసం డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో పలు కోర్సులు ఆవిర్భవించాయి. కేవలం ఈ తరహా కోర్సులు అందించడానికే ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం సైతం ఏర్పడింది. ఆ వివరాలు తెలుసుకుందాం..

 

ఎవరు అర్హులు

ఫోరెన్సిక్‌ సైన్స్‌పై ఆసక్తి ఉన్నవాళ్లు డిగ్రీ నుంచే ఈ కోర్సును చదువుకోవచ్చు. సైన్స్‌ గ్రూప్‌తో ఇంటర్‌ చదివిన విద్యార్థులు బీఎస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. అయితే బీఎస్సీ స్థాయిలో ఈ కోర్సును అందించే సంస్థలు పరిమితంగానే ఉన్నాయి. అందువల్ల పీజీ కోర్సుల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్నారు. సైన్స్‌ సబ్జెక్టుల్లో డిగ్రీ పూర్తిచేసినవారు ఎమ్మెస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులో చేరడానికి అర్హులు. పీజీ అనంతరం పీహెచ్‌డీ కోర్సులు సైతం ఉన్నాయి. అలాగే పలు సంస్థలు సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి.

 

ఏం చేస్తారు...

ఏదైనా సంఘటన జరిగినప్పుడు అందుబాటులో ఉన్న ఆధారాలు సేకరించడం, లభ్యమైన సమాచారాన్ని విశ్లేషించి అసలు దోషి ఎవరో నిర్ధారించడం ఫోరెన్సిక్‌ నిపుణుల ప్రథమ కర్తవ్యం. కొన్నిసార్లు ఎలాంటి ఆధారాలూ లభించవు. తర్కాన్ని ఉపయోగించి, పలు కోణాల్లో ఆలోచించి దోషిని గుర్తించడం పెద్ద సవాల్‌గా మారుతుంది. దొంగతనం, అత్యాచార సంఘటనల్లో పలు సందర్భాల్లో ఆధారాలు కాకుండా బాధాకర విషయాలే మిగులుతాయి. ఇలాంటప్పుడే ఫోరెన్సిక్‌ నిపుణుల సమర్థత బయటపడుతుంది. ఆ కేసును బాగా విచారించి, క్షుణ్ణంగా ఆలోచిస్తే ఏదో ఒక చిన్న క్లూ తప్పకుండా లభిస్తుంది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు దాని నుంచి వివరాలు సేకరించడం సాధ్యమవుతుంది. లభ్యమైన ఆధారాలను ప్రయోగశాలలో పలు పరికరాలు ఉపయోగించి అసలు దోషులను గుర్తించవచ్చు. ఫోరెన్సిక్‌ సైన్స్‌లో అంతర్గతంగా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, మెడిసిన్‌, సైకాలజీ, స్టాటిస్టిక్స్‌...ఇలా పలు సబ్జెక్టులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆ కేసునుబట్టి వివిధ విభాగాలకు చెందిన నిపుణులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా ఫోరెన్సిక్‌ సైన్స్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే మనదేశం సన్నద్ధమవుతోంది. కేవలం ఈ రంగంలో అధ్యయనం కోసమే ‘గుజరాత్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ' ఏర్పాటైంది. మన దేశంలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులకు ఈ విశ్వవిద్యాలయాన్ని ముఖ్యమైన సంస్థగా చెప్పుకోవచ్చు. ఆడియో టేపుల్లో గొంతును విశ్లేషించడానికి ఫోరెన్సిక్‌ స్పీచ్‌ సైన్స్‌ ఉపయోగపడుతుంది. స్పెక్టోగ్రామ్స్‌పై వాయిస్‌ శాంపిల్స్‌ ఉపయోగించి సులువుగానే ఆ గొంతు ఎవరిదో నిర్ధారిస్తారు. ఈ విభాగంలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌-మైసూరు సంస్థ ఫోరెన్సిక్‌ స్పీచ్‌ సైన్సెస్‌, ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌ కోర్సులు అందిస్తోంది. ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌ ద్వారా ఆర్థిక నేరగాళ్లను తెలుసుకోవడం, ఆర్థిక నేరాలను గుర్తించడం సాధ్యమవుతుంది.

 

కావాల్సిన స్కిల్స్‌

పాఠ్యాంశాల ద్వారా ఈ విభాగానికి సంబంధించిన సాంకేతిక నైపుణ్యాలను తెలుసుకోవచ్చు. అయితే వాస్తవ పరిస్థితిని నిశితంగా గమనించినప్పుడే ఏవైనా ఆధారాలు లభిస్తాయి. ఉన్న సమాచారాన్ని భిన్న కోణాల్లో విశ్లేషించడం, తర్కం, ఆప్టిట్యూడ్‌లతో మరింతగా రాణించవచ్చు. అకడమిక్‌ పరిజ్ఞానంతోపాటు సైన్స్‌కు చెందిన విభాగాల్లో అవగాహన ఉన్నవాళ్లు మరింత సమర్థంగా రాణించడం సులువవుతుంది. సునిశిత పరిశీలన, విశ్లేషణ సామర్థ్యం ఈ రెండూ ఎంతో ముఖ్యం. కొన్నిసార్లు ఇతర విభాగాలకు చెందిన నిపుణులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి మంచి కమ్యూనికేటర్‌గా, బృంద సభ్యులుగా మెలగడం తప్పనిసరి. ముఖ్యంగా సైకాలజిస్టులు, స్టాటిస్టిక్‌ నిపుణులతో కలిసి పనిచేయాల్సి రావచ్చు. అప్పుడప్పుడు అవుట్‌డోర్‌ పని కూడా తప్పదు.

 

సైన్స్‌, మ్యాథ్స్‌ ఆసక్తి ఉందా!

సైన్స్‌ అంటే ఆసక్తి, గణితంలో ప్రావీణ్యం, సమాచారాన్ని విశ్లేషించగలగడం, లోతుగా ఆలోచించడం, వాస్తవానికి దగ్గరగా ఊహించడం, తర్కం, సునిశిత పరిశీలన ఉన్నవాళ్లు ఈ కోర్సులో రాణించడానికి అవకాశాలు ఉన్నాయి.

 

హోదాలు

అభ్యర్థి చదువుకున్న కోర్సును బట్టి ఫోరెన్సిక్‌ పాథాలజిస్ట్‌, క్రైమ్‌ ల్యాబొరేటరీ అనలిస్ట్‌, ఫోరెన్సిక్‌ ఇంజినీర్‌, ఫోరెన్సిక్‌ ఆర్కిటెక్ట్స్‌, ఫోరెన్సిక్‌ వెటర్నరీ సర్జన్‌, వైల్డ్‌ లైఫ్‌ ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌, ఫోరెన్సిక్‌ సైకియాట్రిస్ట్‌, ఫోరెన్సిక్‌ టాక్సికాలజిస్ట్‌, ఫోరెన్సిక్‌ అడోంటాలజిస్ట్‌, ఫోరెన్సిక్‌ సెరోలజిస్ట్‌... తదితర హోదాల్లో ఫోరెన్సిక్‌ నిపుణులు బాధ్యతలు నిర్వర్తిస్తారు.

 

అవకాశాలిక్కడ...

ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీలు, ఆసుపత్రులు, ల్యాబొరేటరీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని కార్పొరేట్‌ సంస్థలు ఫోరెన్సిక్‌ నిపుణులను డాక్యుమెంట్‌ రైటర్లుగా నియమించుకుంటున్నాయి. యాంటీ టెర్రరిస్ట్‌ ఆపరేషన్‌, మాస్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌, కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ తదితర విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), పోలీస్‌ శాఖల్లో ఫోరెన్సిక్‌ ఉద్యోగాలు ఉంటాయి. ఫ్రీలాన్సర్‌గా రాణించడానికి రాష్ట్రానికి చెందిన ఫోరెన్సిక్‌ విభాగం నుంచి సర్టిఫికేషన్‌ తీసుకోవాలి. ఫోరెన్సిక్‌ టాక్సికాలజీ, ఫోరెన్సిక్‌ బయాలజీ, క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేషన్‌ విభాగాల్లో ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు.

 

స్పెషలైజేషన్లు

పీజీలో ఫోరెన్సిక్‌ సైన్స్‌లో స్పెషలైజేషన్లు సైతం ఉన్నాయి. ఎమ్మెస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌తోపాటు ఎమ్మెస్సీ- డిజిటల్‌ ఫోరెన్సిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, ఎమ్మెస్సీ - హోం ల్యాండ్‌ సెక్యూరిటీ అండ్‌ యాంటీ టెర్రరిజం, ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ ఫైనాన్స్‌, ఎంటెక్‌ - సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్సిడెంట్‌ రెస్పాన్స్‌, పీజీ డిప్లొమాలో - ఫోరెన్సిక్‌ టాక్సికాలజీ, ఫోరెన్సిక్‌ డాక్యుమెంట్‌ ఎగ్జామినేషన్‌, ఫింగర్‌ ప్రింట్‌ సైన్స్‌, క్రిమినాలజీ, ఫోరెన్సిక్‌ మేనేజ్‌మెంట్‌, ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌, ఫోరెన్సిక్‌ అడోంటాలజీ, ఫోరెన్సిక్‌ నర్సింగ్‌... తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని గుజరాత్‌ ఫోరెన్సిక్‌ యూనివర్సిటీతో పాటు పలు సంస్థల్లో బోధిస్తున్నారు. సైన్స్‌, ఫార్మసీ, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ఈ కోర్సుల్లో చేరవచ్చు.

 

కోర్సులు అందిస్తోన్న కొన్ని సంస్థలు

గుజరాత్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రిమినాలజీ

యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ

పంజాబ్‌ యూనివర్సిటీ

యూనివర్సిటీ ఆఫ్‌ లఖ్‌నవూ

ఉస్మానియా యూనివర్సిటీ

బుందేల్‌ఖండ్‌ యూనివర్సిటీ

అమిటీ యూనివర్సిటీ
 

Posted Date: 17-03-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌