• facebook
  • whatsapp
  • telegram

పరిధులు దాటు.. పక్కా గెలుపు! 

తొలి ఏడాది నుంచే తగిన వ్యూహం

 

సమున్నత కెరియర్‌ సొంతం చేసుకోవాలనే లక్ష్యంతోనే విద్యార్థులు ఉంటారు. ఆచరణలోకి వచ్చేసరికి కొంతమందే విజయవంతమవుతున్నారు. మిగిలినవారు- స్పష్టమైన లక్ష్యం లేకపోవడం, ముందస్తు ప్రణాళిక లోపించడం వల్ల విఫలమవుతున్నారు. అందువల్ల ప్రతి విద్యార్థీ తొలుత తమ దారెటో తెలుసుకోవాలి. గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడే మంచి కెరియర్‌ కోసం కార్యాచరణ ప్రారంభించాలి.  ఇలాచేస్తే కోర్సు పూర్తయిన వెంటనే వెళ్లాలనుకున్న గమ్యానికి అవలీలగా చేరుకోవచ్చు.   

కార్పొరేట్‌ కొలువులు.. ఖండాంతర చదువులు... సివిల్స్‌.. గ్రూప్స్‌.. టీచింగ్‌.. టెస్టింగ్‌.. ఉన్నత విద్య.. ఉద్యోగం...ఆశయం ఏదైనా, ఎంత పెద్దదైనా కావచ్చు. అయితే అండర్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రథమ సంవత్సరంలో ఉన్నప్పుడే భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహనకు రావాలి. ఆఖరు సంవత్సరంలోనో, కోర్సు పూర్తయిన తర్వాతో నిర్ణయించుకోవచ్చులే అనుకుంటే వెనకబడిపోవడం తప్పదు.  స్పష్టమైన లక్ష్యాలు లేనివారు సహచరులు, సమ వయసు వారితో కాకుండా జూనియర్లతో పోటీ పడాల్సి వస్తుంది. దీంతో విలువైన సమయం, డబ్బు రెండూ వృథా అవుతాయి. ఒకవేళ కెరియర్‌ విషయంలో స్పష్టతకు రాలేకపోతున్నా, తమకేది నప్పుతుందో తెలియకున్నా నిపుణులను ఆశ్రయించి, సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. లేకపోతే తమ గురించి బాగా తెలిసినవారిని మార్గదర్శి (మెంటర్‌)గా భావించి వారి సూచనలు పాటించవచ్చు.

కెరియర్‌గా దేన్ని ఎంచుకున్నప్పటికీ ఆసక్తికీ, అభిరుచికీ ప్రాధాన్యమివ్వాలి. ప్రావీణ్యం ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. గిరాకీ ఎక్కువగా ఉందని ఏ మాత్రం ఇష్టం లేని విభాగాన్ని ఎంచుకుంటే అందులో రాణించడం కష్టం. కనీసం నలభై ఏళ్లు ప్రయాణం చేయడానికి సిద్ధపడి కెరియర్‌ లేదా వృత్తిని ఎంచుకోవాలి. అందులో రాణించగలమనే నమ్మకం ఉంటేనే విజయం సాధించడం సులువవుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తే ఏదో ఒక రోజు లక్ష్యం చేతికందుతుంది. ముందుగానే ఒక నిర్ణయానికి రావడం వల్ల అందుకు అవసరమైన వనరులు సమకూర్చుకోవడం, సన్నద్ధత వీలవుతాయి. దీంతో సమయం ఆదాతోపాటు ఖర్చులూ తగ్గుతాయి.

కరిక్యులానికే పరిమితమా?

ఆధునిక ఉద్యోగ అవసరాలు తీర్చడానికి కళాశాలలు అందించే డిగ్రీలు సరిపోవడం లేదు. పాఠ్యపుస్తకాలు కొంత వరకే ఉపయోగపడతాయి. అందువల్ల ఆ పరిధి దాటి ఎవరికి వారు కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారించాలి. విద్యార్థులంతా యాక్టివ్‌ లర్నింగ్‌ స్కిల్‌ సెట్‌ అలవరచుకోవాలి. ఎంచుకున్న కెరియర్‌కు చదువుతోన్న కోర్సుతో సంబంధం లేనప్పుడు అందులో రాణించడానికి అదనంగా సమయం వెచ్చించాలి. ఉదాహరణకు సాధారణ డిగ్రీ లేదా ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థి ఎంబీఏను లక్ష్యం చేసుకున్నప్పుడు ఆప్టిట్యూడ్‌ అంశాలు విడిగా నేర్చుకోవాలి. ఎందుకంటే అవి అకడమిక్‌ పుస్తకాల్లో పూర్తిస్థాయిలో లభించవు. ప్రథమ సంవత్సరంలో ఉన్నప్పుడే ఈ సన్నద్ధత మొదలైతే గ్రాడ్యుయేషన్‌ పూర్తికాగానే విద్యా సంవత్సరం వృథా కాకుండా పేరున్న సంస్థలో ఎంబీఏ కోర్సులో చేరిపోవచ్చు.  సివిల్స్‌ లేదా గ్రూప్స్‌ లాంటి ఆశయాలు ఉన్నప్పుడు చదువుతోన్న డిగ్రీలోని అంశాలు పాక్షికంగానే ఉపయోగపడవచ్చు. ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడిసిన్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతోన్నవారికైతే అకడమిక్‌ అంశాలు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు ఏమాత్రమూ అనుకూలం కాకపోవచ్చు. ఇలాంటివారు పోటీ పరీక్షలకు అవసరమైన ప్రాథమికాంశాలపై డిగ్రీలో ఉన్నప్పుడే దృష్టి సారించాలి. పత్రికా పఠనం, వ్యాసరచన, చర్చల్లో విరివిగా పాల్గొనడం,     విస్తృతŸంగా చదవడం, రాయడం..మొదలైనవి అలవాటు చేసుకోవాలి. చదువుతున్న కోర్సుల్లోనే ఉన్నత విద్య అభ్యసించాలని కోరుకునేవారు తమ సబ్జెక్టులను మరింత లోతుగా అధ్యయనం చేయాలి. రిఫరెన్స్‌ పుస్తకాలు బాగా ఆపోశన పట్టాలి. అందువల్ల లక్ష్యం ఏదైనప్పటికీ అందుకు అవసరమయ్యే వనరులు గుర్తించి, డిగ్రీతో సమాంతరంగా ఆ అంశాల్లో రాణించడానికి కృషి చేయాలి. అలాగే చదువుతోన్న కోర్సుపై అశ్రద్ధ  చూపరాదు. 

డిగ్రీలో ఉన్నప్పుడే దృష్టి పెట్టాల్సిన అంశాలేమిటో ఇప్పుడు చూద్దాం.. 

ప్రాజెక్టులు

ఏ కోర్సు విద్యార్థులైనప్పటికీ ప్రాజెక్టులు రూపొందించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల ఎంచుకున్న అంశాల్లో అవగాహన పెరుగుతుంది. వాటిపై స్పష్టత, పరిణతి ఏర్పడతాయి. భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్టులు చేయాలన్నా, నివేదికలు రూపొందించాలన్నా విధివిధానాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సిన అవసరం తప్పుతుంది. గతానుభవం ఆత్మవిశ్వాసంతో ముందడుగేయడానికి దోహదపడుతుంది. ప్రొఫెషనల్‌ కోర్సులు, కార్పొరేట్‌ కొలువులకు ప్రాజెక్టు అనుభవం కీలకం. మనపై సదభిప్రాయం కలగడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి.

ఎక్స్చేంజ్‌ ప్రోగ్రామ్‌లు

నిర్ణీత వ్యవధితో ఒక కళాశాల విద్యార్థులు మరో కళాశాలలో చదువుకోవడం ఎక్స్చేంజి ప్రోగ్రామ్‌ల ద్వారా సాధ్యం. ఈ సౌలభ్యం అన్ని కళాశాలల్లోనూ అందుబాటులో ఉండకపోవచ్చు. మీ కళాశాలలో ఒకవేళ ఇలాంటి అవకాశం ఉంటే ఉపయోగించుకోవాలి. కొత్త విషయాలు, కొత్త ప్రాంతాలు, కొత్త వ్యక్తులు, కొత్త అనుభవాలు ఎక్స్చేంజి ప్రోగ్రామ్‌ల ద్వారా పరిచయమవుతాయి. వీటన్నింటితో పరిణతి పెరిగి, పరిధి విస్తరిస్తుంది. వీలైనప్పుడల్లా కొత్త ప్రాంతాలను సందర్శించడమూ మంచిదే.

ఇంటర్న్‌షిప్‌లు

కొన్ని వారాలు లేదా నెలల వ్యవధి ఉన్న ఇంటర్న్‌షిప్‌ను నచ్చిన సంస్థలో చేయడం మంచిది. ముఖ్యంగా కోర్సులు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు ఆశించేవారు ఇంటర్న్‌షిప్‌ల ద్వారా అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు. కళాశాల ద్వారా ఈ అవకాశం దక్కనివారు ఇంటర్న్‌షిప్‌ అందించే సంస్థల సహకారంతో ముందడుగేయవచ్చు. ప్రతి వేసవిలోనూ ఇంటర్న్‌షిప్‌ చేయడానికి ప్రయత్నించాలి. కొన్నిసార్లు ఇంటర్న్‌ అందించే సంస్థల్లోనే ఉద్యోగం రావడానికీ అవకాశం ఉంటుంది. 

సాంకేతికత

ఇప్పుడు ప్రతి రంగంలోనూ సాంకేతికత అనివార్యమైంది. అందువల్ల చదువుతోన్న కోర్సులతో సంబంధం లేకుండా సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి. సాధారణ డిగ్రీలు చదువుతున్నవారు కంప్యూటర్లకు సంబంధించి ప్రాథమిక అంశాలు నేర్పే డీసీఏ లేదా పీజీడీసీఏ కోర్సుల్లో చేరవచ్చు. ఆసక్తి ఉన్నవారు కంప్యూటర్‌ లాంగ్వేజ్‌లు, కొత్త సాంకేతికాంశాలను అధ్యయనం చేయవచ్చు. వీటిని ఉచితంగా నేర్చుకోవడానికి ఆన్‌లైన్‌లో ఎన్నో వేదికలున్నాయి.

వ్యక్తిత్వం

కేవలం చదువులే కాదు. వ్యక్తిత్వంపైనా దృష్టి పెట్టాలి. అంతర్లీనంగా ఉన్న రకరకాల బిడియాలను పోగొట్టుకోవాలి. లోపాలను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే సంశయించేవారికి, సిగ్గుపడేవారికి అవకాశాలు దూరమవుతాయి. నలుగురిలో మాట్లాడడం ఇబ్బందిగా ఉన్నవారు బృంద చర్చల్లో పాల్గొనడం, చిన్న పాటి ఉపన్యాసాలు ఇవ్వడం, వక్తృత్వ పోటీల్లో అభిప్రాయాలు వ్యక్తీకరించడం..లాంటి పనుల ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. కళాశాలలో జరిగే కార్యక్రమాల బాధ్యత తీసుకుంటే నిర్వహణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చు. స్థానికంగా చదువుతోన్న కళాశాలలు, మీరు నివాసం ఉన్న ప్రాంతంలోని క్లబ్బుల్లో సభ్యులుగా చేరితే ధీమా పెరుగుతుంది. సందేహాలున్నపుడు అధ్యాపకులను అడగడానికి మొహమాటపడితే అవి ఎప్పటికీ నివృత్తి కావు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి, ఆలోచనలు పంచుకోవడానికీ ఉపాధ్యాయులు బాగా ఉపయోగపడతారు. మేటి ఆచార్యుల శిష్యరికం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వారి నుంచి ప్రేరణ పొందవచ్చు. 

వాలంటీర్లుగా..

కొన్ని సంస్థలు సమాజానికి ఉపయోగపడే పనుల నిమిత్తం వాలంటీర్ల కోసం ఎదురుచూస్తుంటాయి. కుదిరినప్పుడు వాటిలో చేరడమూ మంచిదే. ఇవి వారం, నెల, మూడు నెలల వ్యవధితో ఉంటాయి. ఈ సేవలు సంతృప్తితోపాటు, ఆ విభాగంపై అవగాహననూ పెంచుతాయి. చేసిన పనికి భవిష్యత్తులో గుర్తింపు రావడానికీ అవకాశం ఉంది. సోషల్‌ వర్క్‌ని కెరియర్‌గా మలచుకోవాలనుకునేవారే కాకుండా ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన విభాగం, అంశంలో వాలంటీర్‌గా చేయటం కోసం ప్రయత్నించాలి. సామాజిక పరిస్థితులు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. 

సర్టిఫికేషన్లు

అన్ని కోర్సుల్లోనూ సర్టిఫికేషన్లు కీలకంగా మారాయి. అందువల్ల మీరు కోరుకున్న అంశంలో సర్టిఫికేషన్‌ కోసం డిగ్రీలో ఉన్నప్పుడే ప్రయత్నించడం మంచిది. మీరేమీ మాట్లాడకుండానే సర్టిఫికేషన్ల ద్వారా మీ నైపుణ్యాలు తెలుసుకోవడం సాధ్యమవుతుంది. కార్పొరేట్‌ ఉద్యోగాల్లో వీటికి ప్రాధాన్యం పెరిగింది. రెజ్యూమెకి అదనపు ఆకర్షణ సర్టిఫికేషన్లే. విద్యార్హతలు, నేపథ్యంతో సంబంధం లేకుండా నచ్చిన కోర్సులను పూర్తిచేసుకునే సౌలభ్యం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. వివిధ సంస్థలు విద్యార్థులు నేర్చుకున్న అంశంలో పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్లు అందిస్తున్నాయి.  

కమ్యూనికేషన్‌

లక్ష్యం ఏదైనప్పటికీ, ఏ రంగంలో భవిష్యత్తు కోరుకున్నప్పటికీ భావ వ్యక్తీకరణ (కమ్యూనికేషన్‌) నైపుణ్యాలు తప్పనిసరి. స్పష్టంగా మాట్లాడటం, ఇతరులు చెప్పింది శ్రద్ధగా వినడం ఇందులో భాగం. ఇందుకోసం ప్రథమ సంవత్సరం నుంచే ప్రధానంగా ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి. ఈ నైపుణ్యాలను నేర్పే యాప్‌లు ఎన్నో అందుబాటులో ఉన్నాయిప్పుడు.  

అభిరుచులు 

ప్రతి మనిషికీ ఏదో ఒక అభిరుచి (హాబీ) ఉంటుంది. కొన్నిసార్లు వ్యాపకమే తీరిక లేని వృత్తిగా మారవచ్చు కూడా. అందువల్ల ప్రతి ఒక్కరూ జీవిత లక్ష్యాలతో సంబంధం లేకుండా ఏదో ఒక వ్యాపకాన్ని పెంచుకోవాలి. ఒత్తిడి నుంచి విముక్తికీ, మానసికోల్లాసానికీ వ్యాపకానికి మించింది మరొకటి ఉండదు. చిత్రలేఖనం, సంగీతం, రచన, సమాజసేవ.. ఏదైనా కావచ్చు. స్వీయానుభవాలు, నిత్యపరిశీలనలను బ్లాగ్‌లో రాసుకుంటూ రాత నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు, ఇతరులను ప్రభావితం చేయవచ్చు. దేనిపైనా ఆసక్తి లేనివారు విదేశీ భాషను సరదాగా నేర్చుకోవచ్చు. ఏదో ఒక రోజు అదే కొత్త అవకాశాలకు దారి చూపుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో మిమ్మల్ని ముందు వరుసలో ఉండేలా చేస్తుంది. పరిధి విస్తరించుకోవడానికి హాబీలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒత్తిడి తగ్గించుకోవడం, ఎలాంటి ఒత్తిడీ లేకుండా నేర్చుకోవడం ఈ రెండూ... హాబీలతో సాధ్యం.
 

Posted Date: 04-09-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌