• facebook
  • whatsapp
  • telegram

కెరియర్‌కు అంతర్జాతీయ ముద్ర 

విదేశాల్లో ఇంటర్న్‌షిప్‌ 

 

 

కరోనా కారణంగా చాలామంది విదేశీ విద్యాభ్యాస ఆకాంక్షలకు అడ్డుకట్ట పడింది. విద్యార్థులతోపాటు ఉద్యోగార్థులకూ నిరాశ తప్పలేదు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నా పోటీ బాగా పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో పుంజుకుని, కోర్సుల కలలను నిజం చేసుకునే అవకాశాన్ని అబ్రాడ్‌ ఇంటర్న్‌షిప్‌లు అందిస్తున్నాయి. ఇవి ప్రస్తుతం వర్చువల్‌గా అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి   నైపుణ్యాలపై ఆసక్తి ఉన్నవారికే కాదు.. దేశీయంగా మెరుగ్గా స్థిరపడాలనుకునే  వారికీ ఉపాధిపరంగా ఇవి మేలు చేస్తాయి!

 

నైపుణ్యాల పరిధిని పెంచుకోవడంలో ఇంటర్న్‌షిప్‌లది ప్రధాన పాత్ర. తాజా సమయంలో ప్రతి పరిశ్రమలోనూ అనిశ్చితి ఏర్పడింది. జాబ్‌ మార్కెట్‌లో విపరీతమైన పోటీ ఏర్పడింది. దేశీయంగానే కాదు విదేశాలపరంగానూ ఇదే పరిస్థితి నెలకొంది. దేశీయ జాబ్‌ మార్కెట్‌ అయినా, విదేశీ కల అయినా ఇతరుల కంటే ముందుంటేనే పోటీలో నిలవడం సాధ్యమవుతుంది. ఆ అదనపు బలాన్ని చేకూర్చడంలో విదేశీ ఇంటర్న్‌షిప్‌లు సాయపడుతున్నాయి.

 

కేవలం డిగ్రీ పట్టాతో జాబ్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టేవారికంటే కొంత పని పరిజ్ఞానంతో వచ్చేవారికి  ఎక్కువ ఆదరణ ఉంటుంది. ఈపరంగా ఇంటర్న్‌షిప్‌లు సాయమందిస్తాయి. దేశీయంగా ఉత్తమ విద్యాసంస్థల్లో చదివి, మంచి పరిజ్ఞానమున్నవారూ ఉద్యోగావకాశాలను త్వరగానే చేజిక్కించుకోగలరు. కానీ జాబ్‌ మార్కెట్‌ పరిధి విస్తరిస్తోంది. దానికి తగిన నైపుణ్యాలను చేజిక్కించుకోవడమూ ప్రధానమే. ఈ స్థితిలో గ్లోబల్‌ పని సంస్కృతి, సుదూరతీరాల పరిస్థితులు, పనితీరును తెలుసుకోవడంలోనూ ఈ విదేశీ ఇంటర్న్‌షిప్‌లు తోడ్పడతాయి. 

 

ఎన్ని రకాలున్నాయ్‌?

సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌లు: సాధారణంగా వీటిని విద్యార్థులు వేసవి సెలవులను సమర్థంగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో అందిస్తారు. వీటి కాలవ్యవధి కొన్ని వారాల నుంచి రెండు నెలల వరకూ ఉంటుంది.

నాన్‌ ప్రాఫిట్‌ ఇంటర్న్‌షిప్‌లు: చారిటీలు, స్కూళ్లు, ప్రభుత్వ ఏజెన్సీలు, ఆసుపత్రుల వారు అందించేవి. వీటికి సంబంధించి ఎలాంటి స్టైపెండ్‌నూ చెల్లించరు. కానీ రెజ్యూమెలో వీటికీ విలువ ఎక్కువే.

జాబ్‌ షాడోయింగ్‌: వీటినే ఎక్స్‌టర్న్‌షిప్‌లుగా పిలుస్తారు. వీటి వ్యవధి కొన్ని రోజుల నుంచి వారాల వరకూ ఉంటుంది. కెరియర్‌ ఎంపిక దశలో తాము ఎంచుకున్నది ఎంతవరకూ సరైనదో తెలుసుకునే అవకాశమే ఇది. ఇందులో భాగంగా తమకు నచ్చిన విభాగంలో మెంటర్‌తో కలిసి పనిచేస్తూ, వారు పనిచేసే విధానాన్ని పరిశీలిస్తారు. 

పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌లు: ప్రైవేటు సంస్థలన్నీ వీటిని అందిస్తాయి. దీనిలో పని అనుభవంతోపాటు కొంత మొత్తాన్నీ సంపాదించుకోవాలనుకునే వారు వీటిని ఎంచుకోవచ్చు. చాలావరకూ సంస్థలు వీటిలో మంచి ప్రతిభ చూపినవారికి ఫుల్‌ టైం అవకాశమూ కల్పిస్తున్నాయి. ఎక్కువమంది వీటికే ప్రాధాన్యమిస్తారు.

అన్‌పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌లు: సాధారణంగా ఇంటర్న్‌షిప్‌కు సంబంధించి అందించే మార్గదర్శకత్వం, పని అనుభవం అన్నీ దీనిలో ఉంటాయి. కాకపోతే వీటిలో స్టైపెండ్‌ చెల్లించరు. విలువలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండవు. పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ అవకాశం దక్కనివారు వీటికి ప్రాధాన్యమివ్వవచ్చు. వీటిలోనూ పని అనుభవానికి ప్రాధాన్యం ఎక్కువే.

 

ప్రయోజనాలేంటి?

తాజాగా ఒక సర్వే ప్రకారం.. 84% విద్యార్థులు తమకు ఇంటర్న్‌షిప్‌లు ఉద్యోగ నైపుణ్యాలను నేర్చుకోవడానికి సాయపడ్డాయని చెప్పారు. 89% మంది త్వరగా ఉద్యోగ జీవితంలో చేరడానికి దోహదపడ్డాయన్నారు. పైగా ఇవన్నీ వర్చువల్‌ విధానంలో అందుబాటులో ఉన్నాయి. ఇంట్లోనే ఉండే చేసే అవకాశం. ఈ విధానానికి మరింత ప్రాముఖ్యం పెరగనున్న సందర్భంగా వీటికి ముందస్తుగా సిద్ధమై ఉండటమూ కలిసొచ్చే అంశమే. ఇంకా..

 

రెజ్యూమెకు వెయిటేజీ: ఇతర దేశానికి సంబంధించి పని అనుభవం.. ఇతరులతో పోలిస్తే మీరెంత భిన్నమో చూపిస్తుంది. అబ్రాడ్‌ ఇంటర్న్‌షిప్‌ అనుభవం రెజ్యూమెకు విలువను తెచ్చిపెడుతుంది. నిజానికి వీటిని అందిపుచ్చుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువ. కాబట్టి, ఇది ఆత్మవిశ్వాసం, చొరవ, సత్సంబంధాలు నెరపగల నైపుణ్యం వంటివి అభ్యర్థిలో ఉన్న విషయాన్ని రుజువు చేస్తుంది. సంస్థలు తమ అభ్యర్థిలో ఉండాలని కోరుకునే నైపుణ్యాలే ఇవి.

 

అంతర్జాతీయ సత్సంబంధాలు: సాధారణంగానే ఉద్యోగ జీవితంలో నెట్‌వర్కింగ్‌కు ప్రాధాన్యమెక్కువ. అందుకే దీన్ని విద్యార్థి స్థాయి నుంచే అభివృద్ధి చేసుకోవాలని సూచిస్తుంటారు. భవిష్యత్‌కు అవసరమైన సూచనలు, అవసరమైన సాయం అందుకునే వీలుండటమే ఇందుకు కారణం. అలాంటిది అంతర్జాతీయ పరిచయాలు ఇంకాస్త ముందుకు సాగడానికి సాయపడతాయి. ఈ ఇంటర్న్‌షిప్‌ల ద్వారా ఆ అవకాశం కలుగుతుంది. కాబట్టి, దీనిపరంగా కష్టపడి పనిచేసి, గుర్తింపు సాధిస్తే వారి నుంచి లెటర్‌ ఆఫ్‌ రెకమెండేషన్‌నూ పొందొచ్చు. ఇవి భవిష్యత్‌లో ఉన్నత చదువులు, ఉద్యోగాల పరంగా సాయపడతాయి.

 

సంస్కృతిని అర్థం చేసుకునే వీలు: ప్రపంచమే ఓ కుగ్రామం.. ఈ మాటను చాలాసార్లు వినే ఉంటాం. ఒక దేశ వస్తువులు, సేవలు మరో దేశానికి సులువుగా అందుబాటులోకి వస్తున్నాయి. వ్యాపారాలు విస్తరిస్తున్నాయి. అయితే వస్తుసేవలు విజయం సాధించడం మాత్రం అక్కడి ప్రజల ఆదరణపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి, వారి సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన తప్పనిసరి. అందుకు ఈ అవకాశం తోడ్పడుతుంది. ఇంటర్న్‌షిప్‌ అంటే..ఇతర దేశాల విద్యార్థులూ దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. విభిన్నమైన వారితో పరిచయం ఏర్పడుతుంది.

 

విలువైన ఫీడ్‌బ్యాక్‌: కంఫర్ట్‌ జోన్‌.. స్వదేశంలో చేసే ఇంటర్న్‌షిప్‌ల్లో దొరికే ఓ వెసులుబాటు. వీటి విషయంలో అది కొరవడుతుంది. ఇక్కడ భిన్నమైన వారితో పనిచేయాల్సి వస్తుంది. మనవారు అనుకున్నవారితో పోలిస్తే మాట్లాడే తీరు, ఆశించే అంశాలు, చూసే విధానాల్లో స్పష్టమైన మార్పు ఉంటుంది. అంతకు ముందెన్నడూ గమనించని సమస్యలు ఎదురవొచ్చు. కొత్త అంశాలను ప్రయత్నించాల్సి రావొచ్చు. ఈ సమయంలో తోటివారు, పై అధికారుల నుంచి ఎప్పటికప్పుడు చేసిన పనికి సంబంధించి ఫీడ్‌బ్యాక్‌ దొరుకుతుంది. దీంతో విద్యార్థికి తనకు కావాల్సిన అంశాలపై ఓ అవగాహన వస్తుంది. మెరుగుపరచుకోవాల్సిన నైపుణ్యాల గురించీ అవగాహన వస్తుంది. 

 

విదేశీ ఇంటర్న్‌షిప్‌లలో వీటికి ప్రాధాన్యం

ఏ అంశాల్లో: కంటెంట్‌ రైటింగ్, సోషల్‌ మీడియా, డిజిటల్‌ మార్కెటింగ్, వెబ్‌ డెవలప్‌మెంట్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, గ్రాఫిక్‌ డిజైన్‌
ఏ రంగాల్లో: మేనేజ్‌మెంట్, మీడియా, వాలంటీరింగ్, ఇంజినీరింగ్, డిజైన్‌
స్టైపెండ్‌ కనిష్ఠం- గరిష్ఠం: రూ.5,800- రూ.74,000
ఏ దేశాలు: యు.ఎస్‌.ఎ., యు.కె., సింగపూర్, యూఏఈ, ఆస్ట్రేలియా 

 

అందుకునే మార్గమేంటి?

ప్రముఖ సంస్థలైన జేపీ మోర్గాన్, గోల్డ్‌మాన్‌ శాక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యూఎస్‌సీ వంటివి ఏటా ఇంటర్న్‌షిప్‌లను అందిస్తున్నాయి. ఇవికాకుండా కొన్ని వెబ్‌సైట్‌లూ వీటికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి. వీటిలో కొన్ని నామమాత్రపు ఫీజును వసూలు చేస్తుండగా మరికొన్ని ఉచితంగానే సేవలను అందిస్తున్నాయి.
www.aiesec.in
www.GoAbroad.com
www.wemakescholars.com/
www.GoOverseas.com
www.Letsintern.com
www.Twenty19.com
www.Internshala.com
www.city-internships.com/
www.globalexperiences.com/internships/
www.Internsinasia.com
www.Internships.com
www.GlobalPlacement.com
www.InternHQ.com

 

దరఖాస్తు చేసుకోవడమెలా?

విదేశీ ఇంటర్న్‌షిప్‌లకు కొంత సమయం, ఓపిక అవసరమవుతాయి. కాబట్టి, మీరు చూసే అంశాలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో పరిశీలించుకోవాలి. వాటిపై అవగాహన ఉంటే దరఖాస్తు సులువే. అయితే దరఖాస్తు చేసుకోగానే అవకాశం వచ్చేస్తుందన్న భ్రమలో ఉండొద్దు. మొదటి అభిప్రాయం సానుకూలంగా పడేలా చూసుకోవాలి. కాబట్టి, దానికి కొంత ముందస్తు సన్నద్ధత అవసరమవుతుంది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్‌ సీవీ/ రెజ్యూమె, మంచి కవర్‌ లెటర్‌ను సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. ఈ దశ దాటితే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనిలోనూ సఫలమైతే ఇంటర్న్‌షిప్‌ అవకాశం దక్కుతుంది. ఇందుకుగానూ..

మంచి రెజ్యూమెను సిద్ధం చేసుకోవాలి. దానిలో ఫార్మాటింగ్, వ్యాకరణ, అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి. మరీ సుదీర్ఘంగా ఉండకుండా చూసుకోవాలి. సలహాల కోసం ప్రొఫెసర్ల సాయం తీసుకోవచ్చు. విద్య, ఆసక్తి ఉన్న అంశాలు, ఉంటే అనుభవానికీ ప్రాధాన్యమివ్వాలి.

కవర్‌ లెటర్‌ను తప్పక సిద్ధం చేసుకోవాలి. అది రెజ్యూమెకు నకలుగా ఉండకూడదు.

దరఖాస్తులో సంస్థలు సమర్పించాల్సిన పత్రాల వివరాలను తెలుపుతాయి. వాటిని సిద్ధం చేసుకోవాలి.

ఇంటర్న్‌షిప్‌కు అవసరమైన రెఫరెన్స్‌/ లెటర్‌ ఆఫ్‌ రెకమెండేషన్‌ను సిద్ధం చేసుకోవాలి.

నిజానికి ప్రస్తుత పరిస్థితిలో చాలావరకూ సంస్థలు సమయంతో సంబంధం లేకుండా వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను కలిగిస్తున్నాయి. అనుకూలమైన సమయం ఆధారంగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యా సంవత్సరం కొనసాగిస్తున్నవారు.. ఇంటర్న్‌షిప్‌లను వెదకడం ముందస్తుగా ప్రారంభించడం మేలు. ఉదాహరణకు- ఫలానా సమయంలో కొన్ని వారాలపాటు సెలవులు లభిస్తాయని ముందుగానే తెలుస్తుంది. కాబట్టి సెలవులు వచ్చాక చూద్దామన్న ధోరణి ఎప్పుడూ మంచిది కాదు. నిర్దిష్ట  సమయంలో ఖాళీ దొరుకుతుందనుకున్నపుడు ముందు నుంచే ప్రయత్నించడం మేలు.

Posted Date: 16-03-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌