• facebook
  • whatsapp
  • telegram

ఐటీ కొలువుల‌కు మీరు సిద్ధ‌మేనా!

ఓపెన్ కాంపిటీష‌న్లలో స‌త్తా చాటితే విజ‌యం

ఐటీ కంపెనీలు ఉద్యోగ నియామకాలకు సిద్ధమవుతున్నాయి. ప్రాంగణ నియామకాల ఎంపిక ప్రక్రియను కంపెనీలు ఇదివరకు నైపుణ్యాల ఆధారంగా చేపట్టేవి. కానీ ఇప్పుడు వాటితో పాటు ‘రియల్‌ టైం వర్క్‌ ఎక్స్‌పోజర్‌’ ఎంపికల్లో కీలక పాత్ర వహిస్తోంది. దానికి ఏకైక మార్గమైన   ఇంటర్న్‌షిప్‌ అనుభవం సాధించుకునేలా ఎదగడానికి విద్యార్థులకు తగిన  సన్నద్ధత అవసరం. ఇదివరకటిలా కంపెనీలు కళాశాలలకు వచ్చి ఎంపికలు నిర్వహించడం తగ్గిపోయింది. అంతా  ఓపెన్‌  కాంపిటిషన్లే. అర్హత ఉండి సత్తా ఉన్న ఏ కళాశాల విద్యార్థులైనా ఎంపిక ప్రక్రియల్లో పాల్గొని విజయం సాధించవచ్చు! 

ఉద్యోగ నియామకాలు ఆశించే విద్యార్థులకు రియల్‌ టైం అప్లికేషన్స్‌ను ఉపయోగించడం మాత్రమే కాకుండా వాటి ఫంక్షనాలిటీ మీద అవగాహన ఉండాలి. అప్ల్లికేషన్స్‌ మూడు రకాలుగా ఉంటాయి.

1. ఐటీ అప్లికేషన్స్‌: విద్యార్థులంతా ఎన్నో ఆప్స్‌ను వాడుతుంటారు. ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయడానికి స్విగ్గీ; క్యాబ్‌ను బుక్‌ చేయడానికి ఉబర్‌; సినిమా టికెట్ల కోసం బుక్‌ మై షో లాంటి మొబైల్‌ ఆప్స్‌ను ఉపయోగిస్తారు. ఇవన్నీ ఐటీ అప్లికేషన్స్‌ అనీ, ఇవి మనుషుల శ్రమను తగ్గించడానికి ఉపయోగంలోకి వచ్చాయనీ గ్రహించే అలవాటు చేసుకోవాలి. అంతే కాకుండా వీటిని ఎలా అభివృద్ధి చేశారో వాటి ఫంక్షనాలిటీని తెలుసుకునే ఆసక్తి పెంచుకోవాలి.

2. ఇంటిగ్రేటెడ్‌ అప్లికేషన్స్‌: హార్డ్‌వేర్‌కు కోడ్‌ను ఎంబెడ్‌ చేసిన అప్లికేషన్స్‌. వీటిని చిన్న ఉదాహరణతో చెప్పాలంటే- టీవీలో చానల్స్, ధ్వని లాంటివి మార్చడానికి పూర్వం మెకానికల్‌ నాబ్స్‌ వాడేవాళ్లం. కానీ ఇప్పుడు రిమోట్‌ వాడుతున్నాం. ఆ రిమోట్‌లో ఎంబెడ్‌ అయివున్న కోడ్‌/ప్రోగ్రాం మనకు చానల్స్‌/ ధ్వని లాంటివి చూపిస్తూ హెచ్చు తగ్గులు చేసుకోడానికి ఉపయోగపడుతుంది. అలా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్‌లకు చెందిన ఎన్నో హార్డ్‌వేర్‌ అప్లికేషన్స్‌కు కోడ్‌ను ఇంటిగ్రేట్‌ చేసి, వాటి పనిని సులభతరం చేశారు. ఇంకా డేటా నిర్వహణను సమర్థంగా చేపట్టే అవకాశమూ కలుగుతోంది.

3. హార్డ్‌వేర్‌ అప్లికేషన్స్‌: ఇవి కేవలం ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్‌ లాంటి కోర్‌ ఇంజినీరింగ్‌ శాఖలకు సంబంధించిన హార్డ్‌వేర్‌ అప్లికేషన్స్‌.

రియల్‌ టైం వర్క్‌ ఎక్స్‌పోజర్‌ అంటే?  

రియల్‌ టైం అప్లికేషన్‌ గురించి విద్యార్థికి ఎలాంటి అవగాహన ఉండాలో చూద్దాం. ఇదివరకు హోటల్‌కు వెళ్ళి ఆహారం తినాల్సివచ్చేది. లేకపోతే మనమే వెళ్ళి ఇంటికి తెచ్చుకునేవాళ్లం. కానీ ఒక ఐటీ అప్లికేషన్‌ ద్వారా ఆహారం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి ఇంటికి చేరేట్టు అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందన్న ఓ యువకుడి ఆలోచనే స్విగ్గీఆప్‌గా రూపొందింది. ఈ అప్లికేషన్‌ సహాయంతో హోటళ్ల వారందరూ రిజిస్టర్‌ చేసుకొని తమ ఆహార వివరాలను ఆర్డర్‌ చేసేవారికి చూపించేలా, ఆర్డర్‌ చేసేవారు కావలసిన ఆహారాన్ని ఎంచుకొని వాటికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించేలా తయారైంది. స్విగ్గీ డెలివరీ బాయ్స్‌ హోటల్‌ నుంచి ఆహారం తీసుకొని ఆర్డర్‌ చేసినవారి ఇంటికి చేరుస్తారు. ఇందుకు స్విగ్గీ సర్వీస్‌ రుసుము పొందుతుంది. 

ఇప్పుడు ఆలోచించండి. ఒక హోటల్‌ నిర్వహిస్తే వచ్చే ఆదాయం కన్నా కేవలం టెక్నాలజీ వల్ల లక్షల హోటల్స్‌ నుంచి వచ్చే ఆదాయం ఎన్ని రెట్లు ఎక్కువో! ఇలానే టెక్నాలజీని ఉపయోగించి వందల వేల కోట్ల కంపెనీలుగా తమ ఆలోచనలతో యువత ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తోంది. 

అలాంటి ఆలోచనలు మీకు రావాలంటే మీ నిజ జీవితంలో మానవాళి ఉపయోగించే రియల్‌ టైం అప్లికేషన్స్‌ మీద ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం నుంచే అవగాహన పెంచుకుంటూ ఉండాలి. ఇంటర్నెట్‌ను శోధించడం ద్వారా, తెలిసినవారెవరైనా కంపెనీల్లో పని చేస్తుంటే వారి ద్వారా ఇలాంటి అప్లికేషన్స్‌పై అవగాహన పెంచుకోవచ్చు. తద్వారా కాన్సెప్టులను గుర్తుపెట్టుకొని కేవలం పరీక్షలు పాసవడం కోసం కాకుండా నిత్యజీవనంలో ఎలా ఉపయోగించారనే దృక్పథంతో నైపుణ్యాలను వృద్ధి చేసుకోగలుగుతారు. ఈ క్రమంలో ఇంటర్న్‌షిప్‌ల సన్నద్ధతకు ప్రణాళికను సులువుగా వేసుకోగలరు.

సమస్యా పరిష్కార శక్తి 

ఏ అప్లికేషన్‌ అయినా కావాల్సిన ప్రాథÅ]మిక నైపుణ్యం- సమస్యా పరిష్కార శక్తి. ప్రతి సమస్యనూ తార్కికంగా పరిష్కరించే నైపుణ్యం ముఖ్యం. ఇది ఆప్టిట్యూడ్‌లోని న్యూమరికల్‌ ఎబిలిటీ, లాజికల్‌/అనలిటికల్‌ రీజనింగ్‌ ప్రాబ్లమ్స్‌ను సాధన చేస్తే పెంపొందుతుంది. ఫార్ములాలతో చేసే మ్యాథ్స్‌లా కాకుండా సమస్యను అంతరంగంలో చిత్రించుకొని, మనసులోనే లెక్క చేసుకొని పరిష్కారానికి రాగలిగేలా అభ్యాసం చెయ్యాలి. ఉదాహరణకు కిందటి వారం దుకాణంలో కేజీ చక్కెర యాభై రూపాయిలకు తెస్తే, నాలుగు కేజీలకు రెండు వందలు అయింది. మరి ఈ వారం కేజీ మీద ఇరవై శాతం డిస్కౌంట్‌ ఉంటే ఎంత చక్కెర ఎక్కువ వస్తుంది? ఇది ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ చాప్టర్‌ లోని సమస్య. సమస్యా పరిష్కార శక్తిని పెంచుకోవాలంటే లెక్కను మనసులో చెయ్యగలగాలి. ఎలాగంటే- యాభై రూపాయిలకు ఇరవై శాతం డిస్కౌంట్‌ అంటే పది రూపాయలు తగ్గుతుంది. అంటే కేజీ నలభై! నాలుగు కిలోలకు నలభై రూపాయలు తగ్గుతుంది. అంటే ఒక కేజీ ఎక్కువ వస్తుందని అర్థం. ఇలా సమస్యలను సాధన చేస్తుంటే పరిష్కార శక్తి మెరుగవుతుంది. ఈ నైపుణ్యం కోడింగ్‌లో తర్కం (లాజిక్‌) ప్రయోగించేందుకు ఉపయోగపడుతుంది. కానీ కోడింగ్‌ చెయ్యాలంటే మొదట సింటాక్స్‌ (ప్రోగ్రామింగ్‌ భాష) తెలియాలి. ప్రోగ్రామింగ్‌ను మొదటి సంవత్సరంలో సీ, డేటా స్ట్రక్చర్స్‌తో మొదలుపెట్టాలి.

కోడింగ్‌ స్కిల్స్‌

విద్యార్థులు రెండో సంవత్సరంలో కోడింగ్‌ మొదలుపెట్టటం మేలు. ఇందుకు జావా లేదా పైతాన్‌ లాంగ్వేజ్‌ల్లో ఒకటి నేర్చుకోవాలి. సీఎస్‌సీ బ్రాంచి వారికి కోడింగ్‌ మీద పట్టుంటుంది. కాబట్టి జావా నేర్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూల్లో ఎక్కువగా జావా లాంగ్వేజ్‌పైనే ప్రశ్నలు వేస్తారు. ఇతర బ్రాంచిల వారు పైతాన్‌ నేర్చుకుంటే వారికి అనుకూలం. పైతాన్‌లో కోడింగ్‌ జావా కంటే సులభం. ఇవి రెండే కాక ఆసక్తి ఉన్న ఏ లాంగ్వేజ్‌నైనా నేర్చుకోవచ్చు. 

ఆన్‌లైన్‌ టెస్టులో ఇచ్చే కోడింగ్‌ ప్రశ్నకు 10 నుంచి 15 లాంగ్వేజ్‌ల్లో ఒకదాన్ని ఎంచుకొని ఆ లాంగ్వేజ్‌లో కోడింగ్‌ చెయ్యొచ్చు. డీఎస్‌తో పాటు ఒక లాంగ్వేజ్‌ నేర్చుకొనివుంటే ప్రాబ్లం స్టేట్‌మెంట్స్‌ను కోడ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టే!  మొదట సులభతరమైన ప్రాబ్లం స్టేట్‌మెంట్స్‌తో  కోడింగ్‌ మొదలుపెట్టాలి. తర్వాత మధ్యమంగా ఉన్నవి సాధన చెయ్యాలి. ఈ స్థాయికి చేెరారంటే మీరు టీసీఎస్, ఇన్ఫోసిస్‌ లాంటి కంపెనీల సర్వీస్‌ డివిజన్‌ల ఎంపిక ప్రక్రియకు సంసిద్ధమైనట్లే. విద్యార్థులు ఇతరులపై ఆధారపడకుండా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో లాంటి కంపెనీలు తమ వెబ్‌సైట్లలో శిక్షణతో పాటు సర్టిఫికేషన్‌లు కూడా అందిస్తున్నాయి.

ఐటీ ప్రొడక్ట్‌ కంపెనీల కోసం..

ప్రొడక్ట్‌ కంపెనీలకు ప్రిపరేషన్‌ ఎక్కువ స్థాయిలో అవసరం. ముందుగా అడ్వాన్స్‌డ్‌ డేటా స్ట్రక్చర్స్, అల్గారిదమ్స్‌పై పట్టు సాధించాలి. ముఖ్యంగా ట్రీస్, గ్రాఫ్స్, బాక్‌ ట్రాకింగ్, డైనమిక్‌ ప్రోగ్రామింగ్‌లను ఉపయోగించి కాంప్లెక్స్‌ కోడింగ్‌ ప్రాబ్లమ్స్‌ను  సాధన చెయ్యాలి. కోడింగ్‌ ప్రాక్టీస్‌కు హాకర్‌ రాంక్, హాకర్‌ ఎర్త్, కోడ్‌ చెఫ్, లీడ్‌ కోడ్‌ లాంటి ఆన్‌లైన్‌ కోడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకోవాలి. కొంత సామర్థ్యం వచ్చాక కంపెనీలు నిర్వహించే హాకథాన్‌లలో పాల్గొనాలి.

ప్రాజెక్ట్‌ అనుభవం ముఖ్యం

రెండో సంవత్సరం అంతా నైపుణ్యాలనూ, రియల్‌ టైం ఎక్స్‌పోజర్‌నూ పెంపొందించుకొనివుంటే మూడో సంవత్సరం మొదటి నుంచి ఇంటర్న్‌షిప్పుల వేట మొదలుపెట్టాలి. లింక్‌డిన్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకొని రోజూ ఇంటర్న్‌షిప్పుల పోస్టులను వెతుకుతుండాలి. కంపెనీ స్థాయి, ఇచ్చే స్టైపెండ్‌ల కంటే చేసే ప్రాజెక్ట్‌తో వచ్చే అనుభవం ముఖ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసుకోవాలి. అడోబ్‌ కంపెనీ రెండు, మూడు సంవత్సరాల ఇంజినీరింగ్‌ విద్యార్థులకు నెలకు లక్ష రూపాయల స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్‌ కల్పిస్తోంది. గూగుల్‌/గోల్డ్‌మన్‌ శాక్స్‌ లాంటి పెద్ద కంపెనీలు, ఓపెన్‌ టెక్స్ట్‌/ జెమొసొ లాంటి మధ్య స్థాయి కంపెనీలు, ఇంకా చాలా చిన్న కంపెనీలు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను కల్పిస్తున్నాయి. 

ఇంటర్న్‌షిప్‌ చేస్తే ఉద్యోగం రావడం చాలా సులభం. అందులో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజన్స్, క్లౌడ్, బ్లాక్‌ చైన్‌ లాంటి డిజిటల్‌ టెక్నాలజీలన్లో ఇంటర్న్‌షిప్‌లు చేస్తే అవకాశాలు ఇంకా ఎక్కువ. ఓ ముఖ్య విషయం ఏమంటే.. మైక్రోసాఫ్ట్‌/అమెజాన్‌ లాంటి ప్రొడక్ట్‌ కంపెనీల్లో ముప్ఫై లక్షలకు మించి వేతనాలతో జాబ్‌ కొట్టాలంటే, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ అప్లికేషన్స్‌ మీద ఇంటర్న్‌షిప్‌ అనుభవం కనీసం ఆరు నెలలైనా ఉండాలి.

అందరికీ అవకాశం

మూడో సంవత్సరం ఆఖరిలో కంపెనీలు ప్రాంగణ నియామకాలు చేపడతాయి. విద్యార్థులు సంబంధిత కంపెనీల సెలక్షన్‌ ప్యాటర్న్‌లను వివిధ వెబ్‌సైట్లలో చూసి వాటి ఆధారంగా సిద్ధమవ్వాలి. ఈ రోడ్‌ మ్యాప్‌ను క్రమశిక్షణతో, సాధించగలమనే పూర్తి నమ్మకంతో పాటిÈంచాలి. 

సాఫ్ట్‌ స్కిల్స్‌ 

సాంకేతిక నైపుణ్యాలు మాత్రమే ఉంటే సరిపోదు. వాటిని ఇంటర్వ్యూల్లో వ్యక్తపరచాలన్నా, ఉద్యోగంలో చేరాక తోటి ఉద్యోగులతో సంప్రదింపులు చేయాలన్నా టెక్నికల్‌ కమ్యూనికేషన్, సరైన వైఖరి అవసరం. టెక్నికల్‌ కమ్యూనికేషన్‌లో ముఖ్యమైనది కంటెంట్‌. అంటే సారాంశం.స్పష్టంగా, ధారాళంగా మాట్లాడగలిగితే మంచిదే కాని అదే ముఖ్యం కాదు. భాష విషయంలో చాలామంది విద్యార్థులు వెనకబడిపోతుంటారు. నిజానికి భాష నిదానంగా అదే వస్తుంది. ఇది పెంపొందించుకోవడానికి వర్బల్‌/ఇంగ్లిష్‌కు సంబంధించిన యాంటనిమ్స్, సిననిమ్స్, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ లాంటివి సాధన చెయ్యాలి. సంభాషణను పెంపొందించుకోవడానికి స్నేహితులతో లేక ఇంగ్లిష్‌ మాత్లాడగలిగే వారితో తరచూ మాట్లాడుతూ ఉండాలి.

ఖాళీగా ఉండకుండా..

మొదటగా ఎంపిక నిర్వహించే కంపెనీల్లో ఉద్యోగం వస్తే చాలా మంచిది. పెద్ద కంపెనీకి ప్రయత్నం చెయ్యొచ్చు. రాకపోయినా నిరాశ చెందకూడదు. వందల కంపెనీలు ఇంకా అవకాశాలు కల్పించడానికి ఉన్నాయి. ఈ కొవిడ్‌ పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లడం కష్టం కాబట్టి ఒక జాబ్‌ ఆఫర్‌ తెచ్చుకొని కొంతకాలం ఇక్కడే ఉద్యోగం చేయడం ఉత్తమం. ఇంజినీరింగ్‌ రెండో, మూడో సంవత్సరాలు చదివే విద్యార్థులు నాలుగో సంవత్సరం వచ్చేసరికి రియల్‌ టైం వర్క్‌ ఎక్స్‌పోజర్, నైపుణ్యాలు, ఇంటర్న్‌షిప్‌ అనుభవంతో సిద్ధంగా ఉండాలి. రియల్‌ టైం ఎక్స్‌పోజర్‌పై అవగాహన, సమస్య పరిష్కార శక్తి, టెక్నికల్‌ కమ్యూనికేషన్, ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ను మూడో సంవత్సరం ఒకటో సెమిస్టర్‌ ఆఖరు లోపు పెంపొందించుకోగలిగితే రెండో సెమిస్టర్‌ ఇంటర్న్‌షిప్‌ చేయడానికి వీలుంటుంది. నాలుగో సంవత్సరం వారికీ, బీ టెక్‌ పూర్తిచేసుకున్న వారికీ ఎన్నో కంపెనీల అవకాశాలు ప్రస్తుతం ఉన్నాయి. వీరు కంపెనీలు ఆశించే నైపుణ్యాలను పెంచుకొని ఆయా ఎంపికల్లో పాల్గొనాలి. ఖాళీగా ఉండకుండా ఏదైనా ప్రాజెక్ట్‌ మీద ఉచితంగా అయినా పనిచేస్తే అనుభవం వస్తుంది. దానివల్ల ఉద్యోగం సులువుగా వచ్చే అవకాశం ఉంటుంది!

ఎలా ముందుకు సాగాలి?

ఇంజినీరింగ్‌లో ఏ శాఖకు చెందినవారైనా తమకు ఎలాంటి అప్లికేషన్స్‌ అంటే ఆసక్తి ఉందో గ్రహించాలి. ఇందుకు అప్లికేషన్స్‌ను కేవలం ఉపయోగించడంతో సరిపెట్టకుండా వాటి ఫంక్షనాలిటీని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆసక్తి కలిగించిన కొన్ని అప్లికేషన్స్‌లో పనిచేసేవారిని సంప్రదించి, సమాచారం సేకరించాలి. అవి మీకు ఎలా ఉంటాయో సలహా తీసుకోవాలి. అలా ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చేరేసరికి ఆసక్తి ఉన్న అంశాన్ని ఎంచుకోవాలి. ఆ అప్లికేషన్స్‌ మీద పనిచేసే ఉద్యోగిని మెంటర్‌గా పెట్టుకోవాలి.
 

Posted Date: 18-05-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌