• facebook
  • whatsapp
  • telegram

ఎక్స్ఆర్ టెక్నాల‌జీతో ఎన్నో కొలువులు!

వివిధ రంగాల‌కు భారీగా విస్త‌రిస్తున్న సాంకేతిక‌త‌

వాస్తవ ప్రపంచాన్నీ, వర్చువల్‌ ప్రపంచాన్నీ కలిపే సాంకేతికతలు ఎన్నో కీలక రంగాలకు విస్తరిస్తూ భారీ కొలువులకు వేదికలవుతున్నాయి. వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), మిక్స్‌డ్‌ రియాలిటీ (ఎంఆర్‌) లాంటి ఆధునిక టెక్నాలజీలను ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీ (ఎక్స్‌ఆర్‌) టెక్నాలజీలు అంటారు. ఐడీసీ 2019 ప్రకారం 2023 నాటికి ఈ ఎక్స్‌ఆర్‌ మార్కెట్‌ విలువ సుమారు 16,000 వేల కోట్ల రూపాయిలు అవ్వనుంది. నాస్‌కామ్‌ అంచనా ప్రకారం 2022 నాటికి ఎక్స్‌ఆర్‌ మార్కెట్‌ 650 కోట్ల రూపాయిల పైనే ఉండబోతోంది.

సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి కృత్రిమ పర్యావరణాన్ని నిర్మించవచ్చు. నిజ జీవితంలో పర్యావరణాన్ని ఎలా ఆస్వాదిస్తామో అలాగే కృత్రిమ పర్యావరణాన్నీ ఆస్వాదించడమే వర్చువల్‌ రియాలిటీ. ఈ వీఆర్‌తో వాస్తవ ప్రపంచంతో సంబంధం లేకుండా వేరే ప్రపంచానికి వెళ్ళిపోవచ్చు. ఇలా అనుభూతిని పొందడానికి వీఆర్‌ హెడ్‌ సెట్‌ని ఉపయోగించాలి. దాన్ని పెట్టుకుంటే అందులో ఏదైనా సన్నివేశం చూస్తే అది కళ్ల ముందు జరుగుతోందా అన్నట్టుగా ఆశ్చర్యపోవాల్సివస్తుంది. ఉదాహరణకు అంతరించిపోయిన డైనోసార్లను మనం చూడలేము. అదే ఈ వీఆర్‌తో అసలీ డైనోసార్లు ఎలా ఉండేవీ, ఎలాంటి పర్యావరణంలో నివసించాయీ అనేది వర్చువల్‌గా తయారు చేసి నిజంగా డైనోసార్‌ పక్కనే ఉన్న అనుభూతిని పొందవచ్చు. అంతే కాదు- సముద్రం మధ్యలో, అంతరిక్షంలో గ్రహాల మీద ఉన్న వాస్తవిక ప్రపంచాన్ని ఇలా ఈ వీఆర్‌తో సృష్టించవచ్చు. 

ఈ వర్చువల్‌ రియాలిటీ సినిమా, వీడియోలకే పరిమితం కాకుండా ఎన్నో రంగాలకు విస్తరించింది. క్రికెట్‌లో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. మనం అంతర్జాతీయ స్టేడియంలో కేవలం క్రికెట్‌ చూడగలం. కానీ స్వయంగా స్టేడియంలో వేల మంది అభిమానుల కేరింతల మధ్యలో ఫోర్‌లూ, సిక్స్‌లూ కొట్టగలిగితే ఆ అనుభూతే వేరు కదా? ఈ అనుభూతిని ఇవ్వడానికి ‘ఐబీ క్రికెట్‌’ అనే వర్చువల్‌ రియాలిటీ క్రికెట్‌ను పూర్తిగా మనదేశంలోనే- హైదరాబాద్‌లోనే తయారుచేశారు.. 

ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌) అంటే?  

వాస్తవ ప్రపంచంలో ఉండే ఇల్లు, టీవీ, సోఫా..ఇలా ఏ వస్తువునైనా సాఫ్ట్‌ వేర్‌ సాయంతో తయారుచేస్తే వాటిని వర్చువల్‌ ఆబ్జెక్ట్స్‌ అంటారు. వీటిని నిజ ప్రపంచంతో కలిసి కనిపించేలా చేయడానికి ఆగ్మెంటెడ్‌ రియాలిటీని ఉపయోగిస్తారు. ఈ ఏఆర్‌తో  నిజంగా లేని వస్తువులను కూడా వాస్తవ ప్రపంచంలో కనిపించేలా చెయ్యవచ్చు. ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌ చాట్‌ లాంటి అప్లికేషన్లలో వివిధ రకాల ఫిల్టర్లు ఉపయోగిస్తుంటాం కదా! అందులో ఒక వర్చువల్‌ ఆబ్జెక్ట్‌ మన వాస్తవ ప్రపంచంలో కనిపిస్తుంది. దాని వెనుక ఈ ఆగ్మెంటెడ్‌ రియాలిటీనే ఉపయోగిస్తారు. మీరు ఆన్‌లైన్‌ షాపింగ్‌లో కేవలం ఫోటోలు చూసి కొంటుంటారు. అదే మీరు కొనడానికి ముందే మీకది ఎలా ఉంటుందో తెలిస్తే? ఉదాహరణకు ఓ టీ షర్ట్‌ని వేసుకుంటే ఎలా ఉంటుందో ముందే తెలిస్తే  ఎంతో బాగుంటుంది కదూ! అది ఈ ఆగ్మెంటెడ్‌ రియాలిటీతో సాధ్యం అవుతుంది. 

ఏమిటి తేడా?  

వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ- రెండూ వేర్వేరు విషయాలు. రెండు వేర్వేరు విధాల్లో ఉంటాయి. వీఆర్‌ హెడ్‌ సెట్‌ సాయంతో ఏదైనా కొత్త వర్చువల్‌ ప్రపంచానికి వెళ్ళిపోయి వాస్తవ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండటం వీఆర్‌. అదే ఒక కృత్రిమ ఆబ్జెక్ట్‌  అంటే- ఫోన్, పెన్, టీవీ...ఇలా ఏదైనా ఒక లేని ఆబ్జెక్ట్‌ను వాస్తవ ప్రపంచంలో కనిపించేలా చేయడం ఏఆర్‌. 

ప్రతి కీలక రంగంలోనూ.. 

శిక్షణ రంగంలో ఈ టెక్నాలజీలు అద్భుతమైన మార్పులు తీసుకురానున్నాయి. కారు డ్రైవింగ్‌ నేర్చుకోవాలనుకుంటే రోడ్డు మీదకు వెళ్లకుండా వీఆర్‌తో వాస్తవ ప్రపంచంలో ఎలా నేర్చుకుంటారో అలా నేర్చుకోవచ్చు. కార్లకు మాత్రమే పరిమితం కాకుండా పైలట్‌ శిక్షణకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. క్రికెట్, ఫుట్‌బాల్‌ ..ఇలా ఏ క్రీడలోనైనా ప్రారంభ దశ నుంచి ప్రొఫెషనల్‌గా అవ్వడానికి కూడా ఇందులో శిక్షణ ఉంటుంది. ఇంతే కాకుండా మిలిటరీలో, వైద్య రంగంలో, సాఫ్ట్‌ స్కిల్స్‌లోనూ శిక్షణ ఇవ్వడానికి దీన్ని ఉపయోగిస్తారు.  ఈ ఏఆర్‌/ వీఆర్‌ టెక్నాలజీలో గేమ్‌ డిజైనర్, గేమ్‌ డెవలపర్, కాన్‌సెప్ట్‌ ఆర్టిస్ట్‌ (2డీ), 3డీ ఆర్టిస్ట్, 3డీ యానిమేటర్, సౌండ్‌ ఇంజినీర్‌లతో పాటు చాలా ఉద్యోగాలు ఉంటాయి.  

నేర్చుకోవడం ఎలా ?  

లక్షల్లో వేతనాలు వచ్చే ఈ వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీల్లో విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా తమ నైపుణ్యాన్ని పెంచుకోవడం చాలా అవసరం. యుడెమి, కోర్సెరా లాంటి వేదికల ద్వారా వీటిని నేర్చుకోవచ్చు. ఐబీ హబ్స్, నెక్స్ట్‌వేవ్‌ కంపెనీ వారు సీసీబీపీ ప్రోగ్రామ్స్‌ ద్వారా వీఆర్, ఏఆర్‌ లాంటి మరెన్నో 4.0 టెక్నాలజీల్లో ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఉద్యోగార్హతలతో సిద్ధం చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు  www.ccbp.in వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.   

మిక్స్‌డ్‌ రియాలిటీ (ఎంఆర్‌) సంగతి?  

వాస్తవ, వర్చువల్‌ ప్రపంచాల కలయికే మిక్స్‌డ్‌ రియాలిటీ! ఇందులో మీరు వాస్తవ ప్రపంచంలో ఉంటారు. కానీ వర్చువల్‌ ఆబ్జెక్ట్స్‌ను చూడవచ్చు. వాటితో ఇంటరాక్ట్‌ కూడా అవ్వవచ్చు. వినడానికి కొంచెం ఆగ్మెంటెడ్‌ రియాలిటీలా అనిపిస్తుంది కదా! దీన్ని ఆగ్మెంటెడ్‌ రియాలిటీకి కొద్దిగా అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ అనీ అంటారు. 

ఏఆర్, వీఆర్‌ టెక్నాలజీల్లో అవకాశాలు 

వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, మిక్స్‌డ్‌ రియాలిటీలను కలిపి ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీ (ఎక్స్‌ఆర్‌) టెక్నాలజీ అంటారు. చాలామంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు రాబోయే 5 సంవత్సరాల్లో ఏఆర్‌/ వీఆర్‌ టెక్నాలజీలు పూర్తి ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు. అంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఇందులో ఉద్యోగావకాశాలు పెరుగుతూనే ఉంటాయి. ఏఆర్‌/ వీఆర్‌ ఉద్యోగావకాశాల పెరుగుదల ఇతర ఇంజినీర్ల కంటే 9 నుంచి 10 రెట్లు ఎక్కువ ఉంది.  అమెరికాలో ఏఆర్‌/ వీఆర్‌ ఇంజినీర్ల సగటు మూల వేతనం అక్షరాలా కోటి రూపాయలు! 2022 మార్కెట్‌ అంచనా ప్రకారం ఈ టెక్నాలజీలు 34 శాతం వీడియో గేమ్స్‌ రంగంలో, 15 శాతం వైద్య రంగంలో, 14 శాతం ఇంజినీరింగ్‌ రంగంలో ఉండబోతున్నాయి. 

ఒకప్పుడు ఇంటర్నెట్, స్మార్ట్‌ ఫోన్స్, కంప్యూటర్‌ అనేవి ఒక కల. కానీ ఇప్పుడు అవి మనందరి జీవితంలో భాగమైపోయాయి. అలాగే వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) కూడా ఒక కలగా ఉంది. అది కూడా ఇప్పుడు ఇంటర్నెట్, స్మార్ట్‌ ఫోన్‌ లాగానే  భవిష్యత్తులో మన జీవితంలో భాగం అవ్వనుంది. 

- మార్క్‌ జుకెర్బర్గ్, ఫేస్‌బుక్‌ సీఈఓ 

ఎక్స్‌ఆర్‌ టెక్నాలజీలు చాలా గొప్పవి. మీరు నిజంగా వేరే ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది.  

- ఎలాన్‌ మస్క్, స్పేస్‌ ఎక్స్‌ సీఈఓ 

భవిష్యత్తులో అన్ని దేశాలూ ప్రతిరోజూ ఏఆర్‌ అనుభవాలను కలిగి ఉంటాయి. రోజూ మనం భోజనం ఎలా చేస్తామో అలాగే ఈ ఏఆర్‌ కూడా జీవితంలో ఒక భాగం అయిపోతుంది. 

- టిమ్‌ కుక్, ఆపిల్‌ సీఈఓ   
 

Posted Date: 01-04-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌