• facebook
  • whatsapp
  • telegram

నేర్చుకుంటే.. అవకాశాల జోరు!

జేఎస్ డెవ‌ల‌ప‌ర్ల‌కు పెరుగుతున్న గిరాకీ

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లూ, లైబ్రరీలూ వస్తూనే ఉంటాయి. అలాగే  ఈ మధ్య కాలంలో వెబ్‌ డెవలప్‌మెంట్‌లో ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌కు  సంబంధించి రియాక్ట్‌ జేఎస్‌ అనే లైబ్రరీ డిమాండ్‌  వేగంగా  పెరుగుతోంది. అలాగే ఈ రియాక్ట్‌ జేఎస్‌ డెవలపర్లకు  గిరాకీతో పాటు  అవకాశాలూ పెరుగుతున్నాయి!  

సాంకేతిక పరంగా ‘లైబ్రరీ’ అంటే... ఇందులో కొన్ని పునర్వినియోగం చేసుకునేలా కోడ్స్‌ ఉంటాయి. ఏదైనా డెవలప్‌ చేయాలనుకున్నపుడు మొత్తం మొదటి నుంచి కోడ్‌ రాయాల్సిన అవసరం లేకుండా ఈ లైబ్రరీల్లో ఉండే కోడ్స్‌ను ఉపయోగిస్తారు. ఇలా చాలా త్వరగా పని పూర్తవుతుంది. 

రియాక్ట్‌ జేఎస్‌ గురించి వివరాలు తెలుసుకునేముందు ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌ అంటే ఏమిటో క్లుప్తంగా చూద్దాం. మనం ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయాలంటే వెంటనే అమెజాన్‌ లేదా ఫ్లిప్‌కార్ట్‌ లాంటి వెబ్‌ సైట్‌లలోకి వెళతాం. అక్కడ రకరకాల రంగుల్లో మనం కొనాలనుకునే వస్తువులన్నీ ఒక పద్ధతిలో చక్కగా అమర్చివుంటాయి. ఒక వస్తువు పై క్లిక్‌ చేయగానే ఆ వస్తువు వివరాలతో కొత్త వెబ్‌ పేజీ తెరుచుకుంటుంది. అలాగే మనకు కావాల్సిన వస్తువుల పరిమాణం మారుస్తుంటే వెబ్‌సైట్‌ మొత్తం మారకుండా కేవలం ఆ వస్తువు పరిమాణం మాత్రమే మారుతుంది. ఇలా కనిపిస్తూ మనం ఇంటరాక్ట్‌ అవ్వడానికి వీలు కల్పించేదాన్నే ‘ఫ్రంట్‌ ఎండ్‌’ అంటాం. ఇలా ఏదైనా వెబ్‌  సైట్‌ని మనం వాడడానికి సులభతరంగా ఉండేలా అందంగా, ఆకట్టుకునేలా తీర్చిదిద్దేవారిని ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్లు అంటారు. చూడటానికీ, యూజర్లు ఉపయోగించడానికీ అనుగుణంగా ఎలా ఉండాలన్నదానిపైనే వీరు పనిచేస్తారు. ఈ ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్లకు రియాక్ట్‌ జేఎస్‌ అనే లైబ్రరీ చాలా కీలకంగా మారుతోంది. 

ఏమిటిది?

రియాక్ట్‌ జేఎస్‌ అనేది ఒక ఓపెన్‌ సోర్స్‌ జావా స్క్రిప్ట్‌ లైబ్రరీ. ఓపెన్‌ సోర్స్‌ లైబ్రరీ అంటే ‘అందరికీ అందుబాటులో ఉండేదీ; ఎవరైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు’ అని అర్ధం. 2013లో ఫేస్‌బుక్‌ కంపెనీ వారు దీన్ని డెవలప్‌ చేశారు. అంతే కాకుండా చాలా మంది డెవలపర్లు ఈ లైబ్రరీ పురోగతికి సహకరిస్తుంటారు.    

పెరుగుతున్న డిమాండ్‌

పే స్కేల్‌ అనే సంస్థ తెలిపిన ప్రకారం- భారత్‌లో రియాక్ట్‌ జేఎస్‌లో నైపుణ్యం ఉన్నవారికి సగటు వార్షిక వేతనం సుమారు 7,20,000 రూపాయిలు. అలాగే అమెరికాలో రియాక్ట్‌ జేఎస్‌ డెవలపర్ల సగటు వార్షిక వేతనం సుమారు 67 లక్షల రూపాయలు. అంతే కాదు- స్టాక్‌ ఓవర్‌ఫ్లో సర్వే ప్రకారం అత్యధిక డిమాండ్‌ కలిగి, డెవలపర్లు ఎక్కువగా ఇష్టపడే లైబ్రరీల్లో రియాక్ట్‌ జేఎస్‌ మొదటి స్థానంలో ఉంది.  

ఏయే ఉపయోగాలు?   

ఈ లైబ్రరీని ఉపయోగించి అత్యాధునిక వెబ్‌సైట్లను తయారుచేస్తారు. దీనితో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ మొబైల్‌ అప్లికేషన్లు కూడా తయారు చేయవచ్చు. రియాక్ట్‌ జేఎస్‌తో ఒక్కసారి రాసిన కోడ్‌ని ఆండ్రాయిడ్‌ ఆప్స్‌లోనూ, ఐఓఎస్‌ ఆప్స్‌లోనూ, వెబ్‌సైట్లలోనూ వాడవచ్చు. ఈ రియాక్ట్‌ జేఎస్‌ లైబ్రరీతో ఒక సెకండ్‌లోపే శరవేగంగా లోడ్‌ అయ్యే వెబ్‌సైట్‌ను కూడా తయారు చేయవచ్చు. ఉదాహరణకి వాట్సాప్, నెట్‌ఫ్లిక్స్, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి పెద్ద వెబ్‌సైట్లను కూడా ఈ రియాక్ట్‌ జేఎస్‌ ఉపయోగించే నిర్మించారు.   

నేర్చుకోవడానికి ముందు...  

రియాక్ట్‌ జేఎస్‌లో నైపుణ్యం పొందాలంటే ముందు హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్, సీఎస్‌ఎస్‌ టెక్నాలజీల్లో అనుభవం ఉండటం ముఖ్యం. గిట్, వెర్షన్‌ కంట్రోల్‌- రెండిట్లో నైపుణ్యం ఉండటమూ చాలా అవసరం.  

రియాక్ట్‌ జేఎస్‌లో నైపుణ్యం ఉన్నవారికి కంపెనీలు లక్షల్లో వేతనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాయి. నాలుగైదు నెలల్లోనే నైపుణ్యాలు సాధించి సంవత్సరానికి 4.5 లక్షల నుంచి 9 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం తెచ్చుకోవచ్చు. భారీ డిమాండ్‌ ఉన్న ఈ రియాక్ట్‌ జేఎస్‌ లైబ్రరీ నేర్చుకుంటే చక్కటి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. యుడెమి, కోర్స్‌ఎరా లాంటి వాటిలో కూడా రియాక్ట్‌ జేఎస్‌ని నేర్చుకోవచ్చు. నెక్స్‌ట్‌ వేవ్‌ వారి సీసీబీపీ టెక్‌ 4.0 ఇంటెన్సివ్‌ ప్రోగ్రాం (వెబ్‌సైట్‌: ccbp.in/intensive)లో రియాక్ట్‌ జేఎస్‌ లైబ్రరీతో పాటు MERN స్టాక్‌ లోని మాంగో DB, ఎక్స్‌ప్రెస్‌ JS, నోడ్‌ JS లాంటి వాటిల్లోనూ నైపుణ్యం పొందవచ్చు.  

ప్రత్యేకతలు ఏమిటి?  

1. రియాక్ట్‌ జేఎస్‌ లైబ్రరీలో మనం చాలా తక్కువ లైన్‌లతో కోడ్‌ రాసి క్లిష్టమైన వెబ్‌సైట్, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌లను కూడా సులభంగా బిల్డ్‌ చెయ్యవచ్చు. దీనివల్ల కంపెనీలు కూడా చాలా వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేయగలుగుతాయి. అందుకే పెద్ద కంపెనీలు కూడా రియాక్ట్‌ జేఎస్‌ లైబ్రరీని ఉపయోగించడానికి మొగ్గు చూపుతున్నాయి.   

2. ఈ రియాక్ట్‌ జేఎస్‌కి ప్రపంచవ్యాప్తంగా పెద్ద కమ్యూనిటీ ఉంది. అంటే ఈ ఫ్రేమ్‌వర్క్‌ ఉపయోగిస్తున్నవారి సంఖ్య చాలా ఎక్కువ. అంతే కాకుండా రియాక్ట్‌ జేఎస్‌లో నిపుణులు స్టాక్‌ ఓవర్‌ఫ్లో లాంటి సైట్లలో సందేహాలను పరిష్కరిస్తున్నారు. ఒకవేళ మనకు ఏదైనా సాంకేతిక సమస్యలు వచ్చినా, ఏదైనా అర్థం కాకపోయినా కమ్యూనిటీలో చాలా త్వరగా సహాయం దొరుకుతుంది. గిట్‌ హబ్‌లో ఈ రియాక్ట్‌ జేఎస్‌కు లక్షా అరవై వేలకు పైగా స్టార్స్‌ ఉన్నాయి. అంటే అంతమంది డెవలపర్లకు ఇది చాలా ఇష్టమైన ఫ్రేమ్‌ వర్క్‌ అని అర్ధం.  

3. ఇన్‌స్టాగ్రామ్, ఉబర్, ఫేస్‌బుక్, నెట్‌ఫ్లిక్స్, ఏర్‌ బీఎన్బీ, వాట్సాప్‌ లాంటి ఎన్నో ప్రముఖ కంపెనీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వేలకు పైగా కంపెనీలు దీనిని వాడుతున్నాయి.   

4. యూజర్స్‌కి నచ్చే ఆప్‌ తయారు చేయాలన్నా, అది ప్రాచుర్యం పొందాలన్నా దాని యూజర్‌ ఇంటర్‌ఫేÄస్‌ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అటువంటి మంచి యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ను ఈ రియాక్ట్‌ జేఎస్‌ లైబ్రరీతో చాలా సులువుగా, వేగంగా తయారు చేయవచ్చు.    

5. ఒక డెవలపర్‌ ఏదైనా ఒక అప్లికేషన్‌ని తయారు చేసేటప్పుడు కొన్ని టూల్స్‌ అవసరమవుతాయి. ఇలా అప్లికేషన్‌ రూపొందించటానికి అవసరమయ్యే డెవలపర్‌ టూల్‌ సెట్‌ కూడా రియాక్ట్‌ జేఎస్‌లో అందుబాటులో ఉంది. ఈ డెవలపర్‌ టూల్‌ సెట్‌ ఏదైనా ఒక అప్లికేషన్‌నీ, వెబ్‌సైట్‌నూ తయారుచేయడానికి డెవలపర్లకు ఉపయోగపడుతూ వారి పనిని సులభం చేస్తుంది. ఇప్పటికే ఈ డెవలపర్‌ టూల్స్‌ని రెండు లక్షలకు పైగా యూజర్లు వాడుతున్నారు.  

6. ఇతర ఫ్రంట్‌ ఎండ్‌ లైబ్రరీలతో పోలిస్తే రియాక్ట్‌ జేఎస్‌ని నేర్చుకోవడం సులభం. అలాగే చాలా తక్కువ సమయంలో దీన్ని నేర్చుకోవచ్చు.   


 

Posted Date: 17-05-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌