• facebook
  • whatsapp
  • telegram

పేరుకు పేరు.. కెరియర్‌ జోరు!

జావా స్క్రిప్ట్‌ నిపుణులకు గిరాకీ

వెబ్‌ డెవలపర్‌గా ఉన్నప్పుడు అప్లికేషన్‌ని బిల్డ్‌ చేయాలంటే చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. ఫ్రంట్‌ ఎండ్‌లో ఒక లాంగ్వేజ్, బ్యాక్‌ ఎండ్‌లో ఒక లాంగ్వేజ్, మొబైల్‌ అప్లికేషన్స్‌కి ఒక లాంగ్వేజ్, గేమ్‌ డెవలప్మెంట్‌కి ఒక లాంగ్వేజ్‌.. ఇలా ప్రతిసారీ కొత్త లాంగ్వేజ్‌ నేర్చుకుంటూ ఉండాలంటే అదెంతో గందరగోళం! అలాకాకుండా ఫ్రంట్‌- బ్యాక్‌ ఎండ్‌లలో ఎందులోనైనా

పనిచేసేలా లాంగ్వేజ్‌ ఉంటే డెవలపర్ల పని సులువైపోతుంది కదా? సరిగ్గా అలాంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌.. ఈ జావా స్క్రిప్ట్‌!    

జావా స్క్రిప్ట్‌ని చిన్న స్టార్ట్‌ అప్‌ నుంచి పెద్ద బహుళ జాతి సంస్థ వరకూ సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో వివిధ రకాల అప్లికేషన్లు బిల్డ్‌ చేయడానికి ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో ఉన్న ఇతర ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లకు జావా స్క్రిప్ట్‌ చాలా గట్టి పోటీ ఇస్తోంది. దీనికి పరిశ్రమలో ప్రస్తుతం చాలా డిమాండ్‌ ఉంది. 2020లో స్టాక్‌ ఓవర్‌ఫ్లో సర్వే ప్రకారం అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రోగ్రామింగ్, స్క్రిప్టింగ్, మార్కప్‌ లాంగ్వేజీల కేటగిరీలో జావా స్క్రిప్ట్‌ వరుసగా ఎనిమిదో సంవత్సరం మొదటి స్థానంలో నిలిచింది.   

2018లో హకెర్‌ ర్యాంకు నివేదిక ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా 48% మంది కంపెనీలకు జావా స్క్రిప్ట్‌ నైపుణ్యాలున్న డెవలపర్లు అవసరం. కానీ 42% విద్యార్థులకు మాత్రమే జావా స్క్రిప్ట్‌లో నైపుణ్యం ఉంది. ఈ నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగావకాశాలు చాలా ఎక్కువగా లభిస్తున్నాయి.      

పే స్కేల్‌ సంస్థ అధ్యయనం ప్రకారం- భారత్‌లో జావా స్క్రిప్ట్‌ డెవలపర్ల సగటు వార్షిక వేతనం రూ. 6 లక్షలు. అమెరికాలో జావా స్క్రిప్ట్‌ డెవలపర్ల వార్షిక వేతనం రూ. 60 లక్షలు.  

ఏమిటిది?

జావా స్క్రిప్ట్‌ అనేది ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌లో ఒక కంప్యూటర్‌  ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌. వెబ్‌సైట్లను ఇంటరాక్టివ్‌గా తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. మనం ఐఆర్‌సీటీసీ, రెడ్‌బస్, బుక్‌ మై షో లాంటి వెబ్‌సైట్లలో కావాల్సిన సీట్లు సెలెక్ట్‌ చేస్తూ ఇంటరాక్ట్‌ అవుతుంటాం కదా! జావా స్క్రిప్ట్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ని వాడే వీటిని తయారుచేస్తారు.   

వెబ్‌ పేజీలో జావా స్క్రిప్ట్‌తో చేయగలిగే పనులకు దాదాపు పరిమితులు లేవు. ఉదాహరణకు ఒక ఇమేజ్‌ని జూమ్‌ ఇన్, జూమ్‌ అవుట్‌ చేయడం, ఒక టైమర్‌ని డిస్‌ప్లే చేయడం, ఆడియో లేదా వీడియోను ప్లే చేయడం, యానిమేషన్‌ డిస్‌ప్లే చేయడం, ఒక బటన్‌ రంగు మార్చడం లాంటివీ, మరెన్నో పనులూ చేయవచ్చు. సాధారణంగా ఈ వెబ్‌సైట్లను గూగుల్‌ క్రోమ్, సఫారీ, మొజిల్లా ఫైర్‌ ఫాక్స్‌ లాంటి బ్రౌజర్‌లను వాడి ఓపెన్‌ చేస్తారు. అంటే జావా స్క్రిప్ట్‌ అనేది బ్రౌజర్‌లో పనిచేస్తుంది. దీన్ని బ్రౌజర్‌ ఎన్విరాన్‌మెంట్‌ అంటారు. చాలా బ్రౌజర్‌లు జావా స్క్రిప్ట్‌ను ఉపయోగిస్తూ ఉన్నందున జావా స్క్రిప్ట్‌ హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌లతో పాటు అవసరమైన వెబ్‌ టెక్నాలజీగా మారింది.

వివిధ డొమైన్‌లలో..   

ఫ్రంట్‌ ఎండ్‌లో ఉండే రియాక్ట్‌ జేఎస్, యాంగ్యులర్‌ జేఎస్‌లో కూడా జావా స్క్రిప్ట్‌ లైబ్రరీస్‌ని ఉపయోగిస్తారు. 

జావా స్క్రిప్ట్‌ కేవలం ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌కే పరిమితం కాదు. బ్యాక్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌లో చాలా ముఖ్యమైన నోడ్‌ జేఎస్‌లోనూ జావా స్క్రిప్ట్‌ వాడుతున్నారు, ఈ నోడ్‌ జేఎస్‌ వాడి బ్యాక్‌ ఎండ్‌ని కూడా డెవలప్‌ చేయవచ్చు. కాబట్టి వెబ్‌ డెవలప్‌మెంట్‌లోకి వెళ్లాలంటే జావా స్క్రిప్ట్‌ని తప్పనిసరిగా నేర్చుకోవాలి. అంతే కాకుండా మొబైల్‌ ఆప్, వెబ్‌ ఆప్, గేమ్‌ల డెవలప్‌మెంట్‌.. ఇలా చాలా డొమైన్‌లలో జావా స్క్రిప్ట్‌ను ఉపయోగిస్తున్నారు.

నేర్చుకోవడం సులభం  

ఇతర ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లతో పోలిస్తే జావా స్క్రిప్ట్‌ నేర్చుకోవడం చాలా సులభం. దీనిలో సింటాక్స్‌ (కంప్యూటర్‌కి ఇచ్చే సూచనలు) ఆంగ్ల భాషను పోలి సులువుగా ఉంటుంది.    

ఇది హైయర్‌ లెవెల్‌ లాంగ్వేజ్‌. అంటే మనం కోడ్‌లోని చాలా సంక్లిష్టతలతో వ్యవహరించాల్సిన అవసరం లేదు. మెషిన్‌ వాటిని చూసుకుంటుంది. కాబట్టి  కొత్తగా కోడింగ్‌ మొదలుపెట్టేవారు దీన్ని త్వరగా అర్ధం చేసుకోగలరు. కోడింగ్‌లో సాధారణంగా ప్రారంభకులు ప్రోగ్రాం రన్‌ చేయాలంటే ఒక కోడ్‌ ఎడిటర్‌ లేదా ఏదైనా డెవలప్‌మెంట్‌ ఎన్విరాన్మెంట్‌ని సెటప్‌ చేయడమనేది కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. కానీ జావా స్క్రిప్ట్‌ నేరుగా బ్రౌజర్‌లో పనిచేస్తుంది. అందువల్ల విద్యార్థులకు ముందు కోడింగ్‌ అనుభవం లేకపోయినా సులభంగా- తక్కువ సమయంలోనే దీన్ని నేర్చుకోవచ్చు.   

జావా స్క్రిప్ట్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లో నైపుణ్యం ఉన్నవారికి కంపెనీలు లక్షల్లో వేతనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అంత డిమాండ్‌ ఉన్న ఈ స్క్రిప్ట్‌ని నేర్చుకుంటే చక్కటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. సంవత్సరానికి రూ.4.5 లక్షల నుంచి 9 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం తెచ్చుకోవచ్చు. యుడెమి, డబ్ల్యూ 3 స్కూల్స్‌ లాంటి వాటిలో నేర్చుకోవచ్చు. ఇంకా ఎన్నో సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. నెక్స్‌ట్‌ వేవ్‌ వారు సీసీబీపీ టెక్‌ 4.0 ఇంటెన్సివ్‌ ప్రోగ్రాంలో సీసీబీపీ ప్రోగ్రామ్స్‌ ద్వారా జావా స్క్రిప్ట్‌ లాంగ్వేజ్‌లో 4.5 నెలల వ్యవధిలో ప్రాథమిక స్థాయి నుంచి శిక్షణ ఇస్తున్నారు. https://www.ccbp.in/intensive వెబ్‌సైట్‌లో వివరాలు చూడవచ్చు (ఈ-మెయిల్‌: support@nxtwave.techz) 

అతిపెద్ద డెవలపర్‌ కమ్యూనిటీ   

ఒక ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ ఎంచుకునేముందు ఆ లాంగ్వేజ్‌ వాడే డెవలపర్ల సంఖ్య (డెవలపర్ల కమ్యూనిటీ) చాలా ముఖ్యం. ఒకవేళ మనకు ఏదైనా టెక్నికల్‌ సమస్యలు వచ్చినా, ఏదైనా అర్థం కాకపోయినా కమ్యూనిటీలో చాలా త్వరగా సహాయం దొరుకుతుంది. ఎక్కువమంది డెవలపర్లు ఉంటే వారు ఎక్కువ టూల్స్‌ తయారుచేస్తూ డెవలప్‌మెంట్‌ ప్రక్రియను సులభతరం చేస్తారు. అందుకే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌కి ఎంత పెద్ద కమ్యూనిటీ ఉంటే మనకంత త్వరగా సపోర్ట్‌ దొరుకుతుంది.   

ప్రపంచవ్యాప్తంగా జావా స్క్రిప్ట్‌ ఉపయోగిస్తున్నవారి సంఖ్య చాలా పెద్దది. అంతే కాకుండా జావా స్క్రిప్ట్‌కి అతి పెద్ద స్టాక్‌ ఓవర్‌ఫ్లో కమ్యూనిటీ ఉంది. స్టాక్‌ ఓవర్‌ఫ్లో అనేది ప్రోగ్రామింగ్‌కి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం దొరికే వెబ్‌సైట్‌. ప్రోగ్రామింగ్‌లో కొద్దిగా అవగాహన ఉన్న వారందరికీ, బిగినర్స్‌కీ ఇది సుపరిచితమే. అలాగే గిట్‌ హబ్‌ అనే ప్లాట్‌ఫామ్‌లో రెండు లక్షలకు పైగా రిపోసిటరీస్‌ (సాఫ్ట్‌ వేర్స్, ప్యాకేజీ), 500కు పైగా స్టార్స్‌తో జావా స్క్రిప్ట్‌ ‘మోస్ట్‌ టాగ్‌డ్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌’గా కూడా ఉంది.


 

Posted Date: 01-06-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌