• facebook
  • whatsapp
  • telegram

మెలకువలతో మెరిపిద్దాం!  

క్యాట్‌- 2021కు తుది సన్నద్ధత  

ఐఐఎంలు, ఇతర ప్రముఖ మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే క్యాట్‌ (కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌)కు ఇంకా నాలుగు వారాల వ్యవధి కూడా లేదు. సన్నద్ధతకు తుది మెరుగులు దిద్దుకోవాల్సిన సమయమిది. ఈ సందర్భంగా అభ్యర్థులు దృష్టిపెట్టాల్సిన ముఖ్యాంశాలను తెలుసుకుందాం! 

ప్రతి సంవత్సరం నవంబర్‌ నాలుగో ఆదివారం నాడు క్యాట్‌  నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆధారంగానే 20 ఐఐఎంల్లో, ఇతర ప్రముఖ బీ స్కూల్స్‌లో ప్రవేశాలు జరుగుతాయి. ఈ సంవత్సరం నవంబర్‌ 28న ఐఐఎం అహ్మదాబాద్‌ నిర్వహించబోతున్న క్యాట్‌-2021కు దాదాపు 2.30 లక్షల మంది గ్రాడ్యుయేట్ల్లూ, డిగ్రీ ఆఖరి సంవత్సరం విద్యార్థులూ నమోదు చేసుకున్నారు.  

ప్రముఖ బీస్కూల్స్‌లో సీట్లు పది వేల కంటే తక్కువ ఉండడం వల్ల పోటీ తీవ్రంగా ఉంటుంది. చాలామంది విద్యార్థులు క్యాట్‌కు ఒక సంవత్సరం ముందు నుంచే సన్నద్ధత మొదలు పెట్టి కొనసాగిస్తుంటారు. అయితే పరీక్ష ముందు చివరి దశలో తడబడుతూవుంటారు. ఆందోళనతో పొరపాట్లు చేస్తూ ఒత్తిడికి గురి అవుతుంటారు. ఇలాంటి తప్పిదాలు చెయ్యకుండా, ఒత్తిడికి గురి కాకుండా ఉంటేనే ఆశించిన ర్యాంకు సాధించటానికి అవకాశం ఉంటుంది.

ఏ విభాగం ఎలా? 

గణిత విభాగం (క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ)

మొదటి వారం రోజుల్లో ఏదైనా సంస్థ రిఫరెన్స్‌ మెటీరియల్‌ నుంచి అయినా, ఇప్పటివరకు రాసుకున్న నో ట్స్‌లో నుంచి అయినా అన్నిటినీ పునశ్చరణ చేసుకోవాలి. ఇవి అయిపోయాక గత అయిదు సంవత్సరాల క్యాట్‌ ప్రశ్నపత్రాలను పరిష్కరించాలి. వీటి ఆధారంగా మరొకసారి అన్ని విషయాలూ తిరగేసి వాటిపై పట్టు సాధించాలి. ఇలా చేసినప్పుడు కొన్ని పాఠ్యాంశాలు కష్టంగా అనిపించవచ్చు. ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ క్లిష్ట పాఠ్యాంశాల నుంచి సరళమైన ప్రశ్నలు ఎదుర్కొనేవిధంగా  ప్రయత్నించాలి. ఇవి చేసిన తరువాత కూడా సమయం మిగిలితే మరికొన్ని సెక్షనల్‌ పరీక్షలు తీసుకుని వాటిని విశ్లేషిస్తూ ముందుకు పోవచ్చు.

భాషా సామర్ధ్య విభాగం (వెర్బల్‌ ఎబిలిటీ) 

ఈ విభాగంలో చాలా ప్రశ్నలు రీడింగ్‌ కాంప్రహెన్షన్‌వే అయినందున దానిపై ఎక్కువగా ధ్యాస పెట్టాలి. వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లలో ప్రతిరోజూ ఒక సెక్షనల్‌ రాసి వాటిలో ఉత్తీర్ణతను పరిశీలించుకోవాలి. తరచుగా చేసే తప్పిదాలను గుర్తించాలి. దీంతోపాటు ప్రతిరోజూ విశ్వసనీయమైన మూలాల నుంచి  ప్రామాణిక వ్యాసాలు చదవాలి. మెదడును పదునుగా ఉంచుకోవాలి. 

తర్కం, సమాచార అన్వయం (లాజికల్‌ రీజనింగ్‌- డేటా ఇంటర్‌ప్రెటేషన్‌) 

ఈ విభాగంలో కూడా నిత్యం ఒక పరీక్ష రాసి, సమాధానాలు పరిశీలించుకోవాలి. తరచుగా చేసే పొరపాట్లను గుర్తించాలి. వీలైతే తోటి అభ్యర్థులతో వీటిపై చర్చ చేయవచ్చు. దీనివల్ల ఒకరి నుంచి ఇంకొకరు త్వరగా ప్రశ్నలను పరిష్కరించే వ్యూహాలను నేర్చుకోవచ్చు. సరికొత్త సులభమైన పద్ధతులను కనుగొనవచ్చు  వీటన్నిటితో పాటు రోజు విడిచి రోజు ఏకాగ్రతతో రెండు గంటల పాటు మాక్‌ పరీక్ష రాస్తే అసలు పరీక్షకు పూర్తి సన్నద్ధతతో, ఆత్మవిశ్వాసంతో వెళ్ళవచ్చు.  

ఇవి గమనించండి  

దాదాపు అందరు విద్యార్థులకూ  క్యాట్‌ పరీక్షా పత్రం సుదీర్ఘంగానూ, ప్రశ్నలు కఠినంగానూ అనిపిస్తాయి. అందుకే ప్రశ్నపత్రాన్ని మొత్తంగా ఎదుర్కొనే వ్యూహం మంచి మార్కులు రావడానికి అత్యంత కీలకం. ఇచ్చిన ప్రతి ప్రశ్ననూ పరిష్కరించాలని విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోకూడదు. పూర్తి ప్రశ్నపత్రంలో సులువైన ప్రశ్నలను ఎన్నుకొని వాటిని తప్పులు లేకుండా పరిష్కరించగలిగే అభ్యర్థి నైపుణ్యాన్ని క్యాట్‌ అన్వేషిస్తుంది.  

ప్రతి విద్యార్థీ పరీక్ష గదికి వెళ్లే ముందే ఒక్కో విభాగాన్ని ఎదుర్కొనే విధానాలపై నమూనా పరీక్షల ద్వారా స్పష్టత పెంచుకోవాలి. పరీక్ష గదిలో కొత్త గారడీలు/చిట్కాలను ప్రయత్నించడం ప్రమాదకరం.  

గణితం( క్వాంట్‌) రెండు రౌండ్లలో ప్రయత్నం చెయ్యవచ్చు. మొదటి రౌండులో ప్రతి పది నిమిషాల్లో ఎనిమిది ప్రశ్నలను ప్రయత్నించాలి. అలా చేస్తే 30 నిమిషాల్లో అన్ని ప్రశ్నలనూ కనీసం ఒకసారి ప్రయత్నించవచ్చు. అలాగే సులువైన ప్రశ్నలను ఏవీ కూడా వదిలేయకుండా ఉంటారు. చివరి పది నిమిషాల్లో మొదటి రౌండులో వదిలేసిన ప్రశ్నలనూ, పునః పరిశీలన చెయ్యాల్సిన ప్రశ్నలనూ చూసుకోవచ్చు. 

లాజికల్‌ రీజనింగ్‌ విభాగంలో ప్రతి సంవత్సరం కనీసం రెండు సెట్లు అయినా సులువైనవి (8-10 నిమిషాల్లో చెయ్యగలిగేవి) ఉంటాయి. కాబట్టి ప్రతి సెట్‌కీ మొదట కనీసం అయిదు నిమిషాలు కేటాయించాలి. ఈ ఐదు నిమిషాల తరువాత మరో 3-4 నిమిషాల్లో పరిష్కరించగలుగుతారు. అంటే ఇంకొంచం సమయం కేటాయించి అది పూర్తిచేయాలి. లేదంటే అది కఠినమైన సెట్టుగా వదిలేసి మిగతా సులువైన సెట్ల కోసం ఇలాగే వెతకాలి.    

భాషా సామర్థ్య విభాగంలో మొదటి 25-30 నిమిషాల్లో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ వ్యాసాలను పూర్తిచేసే ప్రయత్నం చెయ్యాలి. వీటిలో ఏవైనా వ్యాసాలు అత్యంత కఠినంగా అనిపిస్తే వాటిని చివరికి ప్రయత్నించాలి. సాధారణంగా ఒక వ్యాసాన్ని పూర్తిగా వదిలేయడం కంటే అన్ని వ్యాసాల్లోని కఠినమైన ప్రశ్నలను వదిలేయడం మంచి పధ్ధతి. చివరి 10-15 నిమిషాల్లో మిగతా ప్రశ్నలను ప్రయత్నించాలి. దీనివల్ల పూర్తి 40 నిమిషాలు సరిగ్గా వినియోగించుకొనే అవకాశం ఉంటుంది.

క్యాట్‌.. పూర్తిగా తార్కికమైన పరీక్ష. దీనిలో విషయ పరిజ్ఞానం అంత ముఖ్యం కాదని గుర్తించాలి. ఇచ్చిన ప్రతి ప్రశ్ననూ పరిష్కరించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోకూడదు. సులువైన ప్రశ్నలను ఎన్నుకొని వాటిని తప్పులు లేకుండా పరిష్కరించగలిగే నైపుణ్యం ముఖ్యం క్యాట్‌ అభ్యర్థులు తరచూ చేసే తప్పిదాలూ, వాటిని సవరించుకునే తీరు చూద్దాం.

గుడ్డిగా మాక్‌ పరీక్షలు రాయడం 

మాక్‌ పరీక్షలు రాసి, బేరీజు వేసుకోవడం వల్ల అభ్యర్థులకు సత్ఫలితాలే లభిస్తాయి. అయితే వీటిని గుడ్డిగా రాస్తే ప్రయోజనం కలగకపోగా, సరైన మార్కులు రాక నిరాశ చెందే అవకాశం ఎక్కువ. మొదట సెక్షనల్‌ పరీక్షల ద్వారా ఒక్కొక్క విభాగంపై పట్టు సాధించాకే పూర్తి మాక్‌ పరీక్షలు రాయాలి. ఒక పూర్తి పరీక్ష రాసి, పునః పరిశీలన ద్వారా అందులోని తప్పిదాలను గుర్తించాలి. ఆ తప్పులను మళ్లీ చేయకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు నేర్చుకోవాలి. ఈ విశ్లేషణ పూర్తయిన తరువాతే ఇంకొక మాక్‌ పరీక్ష యత్నం చేయాలి. ఈ తక్కువ సమయంలో గత ఐదు సంవత్సరాల క్యాట్‌ ప్రశ్నల పత్రాలను మాక్‌గా వాడుకున్నా సరిపోతుంది. 

సోషల్‌ మీడియాలో అతిగా సలహాలూ సూచనల కోసం వెతకడం 

సోషల్‌ మీడియాలో కొన్ని మంచి సలహాలు, సూచనలు లభిస్తున్నప్పటికీ, వాటిపై ఎక్కువ ఆధారపడితే గందరగోళంలో పడి, సమయం వృథా అయ్యే అవకాశం అధికం. విద్యార్థులు సదుద్దేశంతో ఇంటర్నెట్‌ యాప్స్‌ తెరిచినా, వాటిలో ఉన్న ఇతర అనవసర విషయాలను చూస్తూ.. విలువైన సమయం కోల్పోతుంటారు. లభించే సూచనల్లో ఏవి పాటించాలో తెలియక తికమక పడుతుంటారు. అందుకే నమ్మదగ్గ నిపుణులను కానీ ఏదో ఒక ప్రామాణిక సంస్థ కానీ ఇచ్చే సలహాలను పాటించడం మేలు.

కొన్ని విభాగాలను నిర్లక్ష్యం చేయడం  

క్యాట్‌ పరీక్షలో మూడు విభాగాలుంటాయి. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రెటేషన్, వెర్బల్‌ ఎబిలిటీ. ఈ మూడింటికి సమానమైన మార్కులుంటాయి. పైగా ఉత్తమమైన మేనేజ్‌మెంట్‌ కళాశాలలో సీటు సంపాదించాలంటే మూడు విభాగాల్లోనూ మంచి మార్కులు రావడం అవసరం. అందుకని ఈ విభాగాలన్నిటికీ సమయం వెచ్చించాలి. విద్యార్థులకు ఒక విభాగం తేలిగ్గా ఉండడం, మరో విభాగం కఠినంగా ఉండడం సహజమే. బలహీనంగా ఉన్న విభాగాన్ని భయంతో వదిలేయకుండా, దానిలో కూడా కనీస ఉత్తీర్ణత సంపాదించేవిధంగా సమయం కేటాయించుకోవాలి. చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి.

అతిగా ఫలితాల గురించి ఆలోచించడం  

ఫలితాల గురించి అనవసరంగా ఆలోచిస్తూ సమయం వృధా చేయడం చాలామంది అభ్యర్థులు చేసే తప్పిదం. ఎన్ని మార్కులకు ఎటువంటి కళాశాలలో సీటు వస్తుంది, పరీక్ష తరువాత చెయ్యాల్సిన ఇంటర్వ్యూ తయారీ, ఏ కళాశాలలో ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి లాంటి విషయాలు ఇప్పుడు పరిశోధించడం అనవసరం. విద్యార్థులు అర్ధం చేసుకోవలసింది ఏమిటంటే ఇప్పుడు మిగిలిన కొద్ది రోజులూ చాలా విలువైనవి. చేయవలసినవాటిపై దృష్టి పెడుతూ అనవసరమైన ఆలోచనల నుంచి దూరంగా ఉంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు.

మాక్‌ పరీక్షల్లో మార్కులు రాలేదని ఆశలు వదులు కోవడం  

ఒకటో రెండో మాక్‌ పరీక్షలో సరైన మార్కులు రాకపోవడం వల్ల నిరుత్సాహపడి, మనస్తాపానికి గురై అన్ని ప్రయత్నాలూ ఆపేయడం కూడా విద్యార్థులు చేస్తున్న పెద్ద పొరపాటు. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే- క్యాట్, ఇతర బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలల పరీక్షలు పూర్తిగా తార్కికమైన పరీక్షలు. విషయ పరిజ్ఞానం అంతగా ముఖ్యం కాదు. పరీక్ష నమూనా తెలిసిన ఏ విద్యార్థి అయినా ఆత్మవిశ్వాసంతో పరీక్ష గదిలోకి వెళ్లి రెండు గంటల సమయాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే విజయాన్ని సాధించవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు.
 

Posted Date: 02-11-2021


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌