‣ ప్లాస్టిక్ డిప్లొమాలతో విస్తృత అవకాశాలు
తక్కువ ధరకు తయారవడం, తేలికగా ఉండటం, మన్నికతోపాటు సౌకర్యవంతం.. తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌కు ఆదరణ పెరుగుతోంది. దీన్ని మరింత మెరుగ్గా రూపొందించి, వినియోగంలోకి తేవడానికి నిపుణుల సేవలే కీలకం. ఇందుకోసం ప్రత్యేకంగా సంస్థలూ వెలిశాయి. వాటిలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) ముఖ్యమైంది. ఇది హైదరాబాద్, విజయవాడ సహా దేశవ్యాప్తంగా కోర్సులు అందిస్తోంది. వాటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.
ఎందులోనైనా సులువుగా ఇమిడిపోయి, కోరుకున్న రూపాన్ని సంతరించుకోవడం ప్లాస్టిక్ ప్రత్యేకత. అన్ని విధాలుగానూ ప్రయోజనకరంగా ఉండటంతో పరిశ్రమలు పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వినియోగిస్తున్నాయి. అలాగే ఉత్పత్తీ చేస్తున్నాయి. ఇందుకోసం ఈ విభాగంలో నైపుణ్యమున్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ప్లాస్టిక్, అనుబంధ విభాగాల్లో సమర్థులైన మానవ వనరులను పరిశ్రమలకు అందించే లక్ష్యంతో కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చెన్నైలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) ఏర్పాటైంది. గతంలో దీన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్)గా వ్యవహరించేవారు.
ఈ సంస్థకు అనుబంధంగా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో డిప్లొమా, పోస్టు డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలో ప్రవేశం లభిస్తుంది. వీటిని పూర్తిచేసుకున్నవారు ప్రాంగణ నియామకాల్లో మేటి సంస్థల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. ఓఎన్జీసీ, ఓల్టాస్, మిల్టన్, సెలో, ఎల్అండ్టీ, మారుతీ సుజుకీ, రిలయన్స్, ఐఎఫ్బీ, బీపీఎల్, హెచ్‌సీఎల్, ఏషియన్ పెయింట్స్, బటర్‌ఫ్లై, టాటా...తదితర సంస్థలు వీరిని ఎంపిక చేసుకుంటున్నాయి. ఆటోమోటివ్, ప్యాకేజింగ్, కన్జూమర్ గూడ్స్, మెషీన్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆర్ అండ్ డీ.. తదితర విభాగాలకు చెందిన సంస్థలకు ప్లాస్టిక్‌పై పట్టున్నవారి సేవలు కీలకం. అందువల్ల ఈ కోర్సులు చదివినవారి ఉపాధికి ఢోకా లేదు. కొంత అనుభవంతో మెరుగైన వేతనాలు పొందవచ్చు. అలాగే సొంతంగానూ చిన్న పరిశ్రమను నెలకొల్పవచ్చు.
డిప్లొమా, పోస్టు డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులను దేశవ్యాప్తంగా 28 సిపెట్ కేంద్రాల్లో అందిస్తున్నారు. ఈ సంస్థకు హైదరాబాద్, విజయవాడల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. వీటితోపాటు.. అహ్మదాబాద్, అమృత్సర్, ఔరంగాబాద్, బడ్డీ, బాలాసోర్, భోపాల్, భువనేశ్వర్, చంద్రపూర్, చెన్నై, దేహ్రాదూన్, వారణాసి, గువాహటి, హాజీపూర్, హల్దియా, ఇంఫాల్, జయపూర్, కోచి, లఖ్‌నవూ, మధురై, ముర్థల్, మైసూరు, రాయ్‌పూర్, రాంచీ, కోర్బ, అగర్తల, గ్వాలియర్ కేంద్రాల్లో కోర్సులు చదువుకోవచ్చు.

డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ)
వ్యవధి: మూడేళ్లు (6 సెమిస్టర్లు)
అర్హత: పదో తరగతి/ సమాన స్థాయి ఉత్తీర్ణత. ప్రస్తుతం పరీక్షలకు సిద్ధమవుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్షలో: జనరల్ నాలెడ్జ్ 50, సైన్స్ 40, ఇంగ్లిష్ 10 ప్రశ్నలు వస్తాయి.
డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (డీపీటీ)
వ్యవధి: మూడేళ్లు (6 సెమిస్టర్లు)
అర్హత: పదో తరగతి/ సమాన స్థాయి ఉత్తీర్ణత. ప్రస్తుతం పరీక్షలకు సిద్ధమవుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్షలో: జనరల్ నాలెడ్జ్ 50, సైన్స్ 40, ఇంగ్లిష్ 10 ప్రశ్నలు వస్తాయి.
పోస్టు డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ విత్ క్యాడ్/క్యామ్ (పీడీ-పీఎండీ)
వ్యవధి: 18 నెలలు (3 సెమిస్టర్లు)
అర్హత: మెకానికల్/ ప్లాస్టిక్ టెక్నాలజీ/ టూల్/ ప్రొడక్షన్/ ఆటోమొబైల్/ మెకట్రానిక్స్/ టూల్ డై అండ్ మేకింగ్/ సిపెట్ నుంచి డీపీఎంటీ/ డీపీటీ వీటిలో ఎందులోనైనా మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ అర్హులే.
పరీక్షలో: జనరల్ నాలెడ్జ్ 40, సైన్స్ 20, ఇంగ్లిష్ 20, సంబంధిత డిప్లొమా నుంచి 20 ప్రశ్నలు వస్తాయి.
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ (పీజీడీ-పీపీటీ)
వ్యవధి: రెండేళ్లు (4 సెమిస్టర్లు)
అర్హత: ఏదైనా సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ అర్హులే.
పరీక్షలో: జనరల్ నాలెడ్జ్ 40, సైన్స్ 20, ఇంగ్లిష్ 20, బీఎస్సీ స్థాయి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్ 20 ప్రశ్నలు వస్తాయి.
పై కోర్సులన్నీ హైదరాబాద్ క్యాంపస్‌లో అందిస్తున్నారు. పీడీ-పీఎండీ తప్ప మిగిలినవి విజయవాడ క్యాంపస్‌లో ఉన్నాయి. గరిష్ఠ వయసు నిబంధన లేదు.
ఆన్లైన్ పరీక్ష
ప్రవేశ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారు. దీని వ్యవధి 60 నిమిషాలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి. మొత్తం వంద ప్రశ్నలు వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు. మాదిరి ప్రశ్నపత్రాలు సిపెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. జనరల్ నాలెడ్జ్ విభాగంలో స్పోర్ట్స్, హిస్టరీ, పాలిటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎంటర్టైన్మెంట్, కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు వస్తాయి. మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో సైన్స్, ఇంగ్లిష్ ప్రశ్నలు పదో తరగతి సిలబస్ స్థాయిలోనే ఉంటాయి. అందువల్ల పాఠ్యపుస్తకాలు బాగా చదువుకున్నవారు ఎక్కువ మార్కులు పొందవచ్చు. సిపెట్ వెబ్సైట్లో మాదిరి ప్రశ్నలు పరిశీలించి, ప్రశ్నాంశాలపై అవగాహన పెంచుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తులు: మే 28 వరకు స్వీకరిస్తారు.
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.250. ఓబీసీ, జనరల్ అభ్యర్థులకు రూ.500.
పరీక్ష తేదీ: జూన్ 11
వెబ్సైట్: https://www.cipet.gov.in/
మరింత సమాచారం... మీ కోసం!
‣ సీఎంఐ కోర్సులతో పెద్ద ప్యాకేజీలు!
‣ అగ్నివీరులకు ఆర్మీ ఆహ్వానం!
‣ మహిళలకు యూనిఫామ్ సర్వీసెస్ కోర్సులు!
‣ ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఏంచేయాలి?