• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీ చాలు.. ఎన్నో కొలువులు!

వివిధ నియామ‌క ప‌రీక్ష‌ల వివ‌రాలు

డిగ్రీ అనగానే గుర్తుకు వచ్చేవి బీఏ, బీకాం, బీఎస్‌సీలే. మన దేశంలో ఎక్కువ మంది యూజీ స్థాయిలో చదువుతోన్న కోర్సులివే. వీటిని పూర్తి చేసుకున్నవారికి అత్యున్నత ఉద్యోగాలెన్నో ఉన్నాయి. వాటికోసం జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో నియామక సంస్థలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆ వివరాలు తెలుసుకుని డిగ్రీలో ఉన్నప్పుడే సన్నద్ధతను ఆరంభిస్తే తక్కువ వ్యవధిలోనే కలల కొలువును సాకారం చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు! 

యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, డిఫెన్స్, సీబీఐ, ఇంటలిజెన్స్‌ బ్యూరో, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సంస్థలు, రైల్వేలు, పోలీస్‌ శాఖలు నిర్వహిస్తోన్న పరీక్షల్లో నెగ్గితే అద్భుత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

డిగ్రీ తర్వాత ఉన్న ఉద్యోగాలను 3 కేటగిరీలుగా చెప్పుకోవచ్చు. అభ్యర్థులు వీటిలో తమకు నచ్చిన విభాగాన్ని ఎంచుకుని సన్నద్ధమైతే ఆశించిన ఉద్యోగం  అందుకోవటం తేలిక!   

పెద్ద ఉద్యోగాలకు ప్రామాణిక చదువులతో పనిలేదు. పీజీ, పీహెచ్‌డీల అవసరం అంతకన్నా లేదు. ఐఏఎస్, ఐపీఎస్‌.. సబ్‌ ఇన్‌స్పెక్టర్, స్టేషన్‌ మాస్టర్‌.. మేనేజర్, ఆఫీసర్‌... ఇలా ఎన్నో మేటి ఉద్యోగాలకు సాధారణ డిగ్రీతో పోటీ పడవచ్చు. యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, డిఫెన్స్, సీబీఐ, ఇంటలిజెన్స్‌ బ్యూరో, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సంస్థలు, రైల్వేలు, పోలీస్‌ శాఖ... ఇలా ఎన్నో సంస్థలు నిర్వహిస్తోన్న పరీక్షల్లో నెగ్గితే అద్భుత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. వీటిలో ఆరు నెలలకు, ఏడాదికి ఒకసారి వెలువడే ప్రకటనలూ ఉన్నాయి.  

యూపీఎస్‌సీతో..

దేశంలో అత్యున్నత హోదాలు అందించే ఉద్యోగాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) నిర్వహించే పరీక్షలతో భర్తీ చేస్తారు. ఈ సంస్థ సాధారణ గ్రాడ్యుయేషన్‌ అర్హతతో నిర్వహించే పరీక్షల్లో సివిల్‌ సర్వీసెస్, సీడీఎస్‌ఈ, సీఏపీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్లు ముఖ్యమైనవి. 

సీడీఎస్‌ఈ

రక్షణ రంగంలో కొలువులు ఆశించే డిగ్రీ విద్యార్థులు దృష్టి సారించాల్సిన పరీక్షల్లో కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) ముఖ్యమైంది. ఈ పరీక్షను యూపీఎస్‌సీ ఏటా రెండు సార్లు నిర్వహిస్తోంది. ఒక్కో విడతలో 400కు పైగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ విభాగంలో ఆర్మీలో లెఫ్టినెంట్‌ పోస్టులకు అన్ని డిగ్రీల వారూ పోటీపడవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్టులు, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. వీటిలో చేరినవారు చిన్నవయసులోనే పెద్ద హోదాలు సొంతం చేసుకోవచ్చు. 

సివిల్‌ సర్వీసెస్‌

దేశంలో అత్యున్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించేవారు రాయాల్సిన పరీక్ష ఇదే. ఎంపికైనవారు కేంద్రంలోని గ్రూప్‌ ఎ, గ్రూప్‌ బి సర్వీసుల్లో సేవలు అందించవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడతారు. ఏటా ప్రకటన వెలువడుతుంది. ఖాళీలు సుమారు 900, ఆపైన ఉంటాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్‌...ఇలా వివిధ ఉన్నతోద్యోగాలకు ఈ పరీక్ష దారి చూపుతుంది. పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ముందు నుంచి ప్రణాళికతో చదివినవారు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. 

అసిస్టెంట్‌ కమాండెంట్లు

యూపీఎస్‌సీ ఏటా అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహిస్తోంది. ఈ పోస్టులకు ఎంపికైనవారు సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీటికి మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టు, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎస్‌ఎస్‌సీ ఆధ్వర్యంలో...

సీజీఎల్‌: ప్రతి సంవత్సరం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ (సీజీఎల్‌) పరీక్షలు నిర్వహిస్తోంది. కేంద్రంలోని వివిధ శాఖల్లో ఇన్‌స్పెక్టర్లు, సీబీఐలో సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్లు, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్లు, ఆడిటర్, జూనియర్‌ అకౌంటెంట్‌...మొదలైన పోస్టులను భర్తీచేస్తారు. ఇవన్నీ గ్రూప్‌ బి, సి ఉద్యోగాలే. వీటిలో చాలావరకు ఏదైనా డిగ్రీ అర్హతతో ఉన్నవే. దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం మూడు లేదా నాలుగు దశల్లో నిర్వహించే పరీక్షలతో నియామకాలు చేపడతారు. 

సబ్‌ ఇన్‌స్పెక్టర్లు: దిల్లీ పోలీస్, సీఏపీఎఫ్‌ (బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్‌)ల్లో సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, సీఐఎస్‌ఎఫ్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ దాదాపు ఏటా ప్రకటన విడుదల చేస్తోంది. ముందుగా పరీక్ష నిర్వహిస్తారు. అర్హత సాధించినవారికి ఫిజికల్‌ టెస్టులు ఉంటాయి. ఇందులో విజయవంతమైనవారికి ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌లో మరో పరీక్ష ఉంటుంది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి పోస్టులకు ఎంపికచేస్తారు.  

బ్యాంకులు, బీమా సంస్థలు

బ్యాంకుల్లో క్లర్క్, ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) / మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ.. ఈ రెండు ఉద్యోగాలకూ గ్రాడ్యుయేట్లు అర్హులు. ఐబీపీఎస్‌ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు ఏడాదికి ఒకసారి నిర్వహిస్తున్నారు. వీటిలో సాధించిన స్కోరుతో ప్రభుత్వ అనుబంధ బ్యాంకుల్లో ఉద్యోగాలు పొందవచ్చు. క్లర్క్‌ పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల్లో చూపిన ప్రతిభతో ఎంపికచేస్తారు. పీవోలకు గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ అదనంగా ఉంటాయి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోనూ క్లర్క్, పీవో ఉద్యోగాలకు విడిగా ఏటా ఐబీపీఎస్‌ నియామకాలు చేపడుతోంది. 

అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు (జనరలిస్ట్‌ పోస్టులు), డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు (డీవో), ఆఫీస్‌ అసిస్టెంట్లు పోస్టుల భర్తీకి ఎల్‌ఐసీ,  ఎన్‌ఐసీ, న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు ఏడాది లేదా రెండేళ్లకు ఒకసారి విడిగా ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇవీ బ్యాంకు పరీక్షల మాదిరిగానే ఉంటాయి. 

ఆర్‌బీఐ రెండేళ్లకు ఒకసారి అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేస్తుంది. ప్రిలిమ్స్, మెయిన్స్‌ల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు.

రైల్వేలో...

దేశంలో ఎక్కువమంది రైల్వే ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. డిగ్రీ అర్హతతో స్టేషన్‌ మాస్టర్, గూడ్స్‌ గార్డు, కమర్షియల్‌ అప్రెంటీస్, ట్రాఫిక్‌ అప్రెంటీస్, ఎంక్వైరీ కం రిజర్వేషన్‌ క్లర్క్, జూనియర్‌ అకౌంట్స్‌ అసిస్టెంట్‌ కం టైపిస్ట్, సీనియర్‌ క్లర్క్‌ కం టైపిస్ట్, ట్రాఫిక్‌ అసిస్టెంట్, సీనియర్‌ టైం కీపర్‌ ఉద్యోగాలను భారతీయ రైల్వే భర్తీ చేస్తోంది. రెండు దశల్లో నిర్వహించే పరీక్షలతో నియామకాలుంటాయి. రెండు లేదా మూడేళ్లకు ఒకసారి ప్రకటనలు వెలువడడానికి అవకాశం ఉంది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌)లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకూ డిగ్రీ అర్హతతో పోటీ పడవచ్చు.

ఐబీలో..

ఇంటలిజెన్స్‌ బ్యూరోలో అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఆఫీసర్‌ (ఏసీఐఓ) పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. పరీక్షలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. 

ఏర్‌ ఫోర్స్‌: ఏఎఫ్‌ క్యాట్‌తో గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌ విభాగాల్లోని అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్‌ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. ఏడాదికి రెండు సార్లు ఈ ప్రకటన వెలువడుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రాష్ట్ర స్థాయిలో..

గ్రాడ్యుయేట్లకు గ్రూప్‌-1, గ్రూప్‌ 2, గ్రూప్‌ 3, గ్రూప్‌ 4 ఉద్యోగాలను రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల (ఏపీపీఎస్‌సీ/ టీఎస్‌పీఎస్‌సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆయా కమిషన్లవారీ పరీక్ష విధానంలో మార్పులు ఉంటాయి. అయితే ముందుగా ప్రిలిమ్స్‌ తర్వాత మెయిన్స్‌ అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపికచేస్తారు. సబ్‌ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్, ఎంపీడీవో...తదితర పోస్టులన్నీ గ్రూప్స్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు.  

పోలీస్‌ శాఖ: డిగ్రీ చదివినవారికి పోలీస్‌ శాఖలో ఎస్సై, డిప్యూటీ జైలర్‌ తదితర పోస్టులుంటాయి. ముందుగా ఆబ్జెక్టివ్‌ పరీక్ష నిర్వహించి అందులో అర్హత సాధించిన అభ్యర్థులను ఫిజికల్‌ టెస్టులకు ఎంపిక చేస్తారు. వీటిని అధిగమించినవారికి డిస్క్రిప్టివ్‌ తరహా పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రాలవారీ నియామక విధానంలో కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు. కనీసం రెండేళ్లకు ఒకసారి ప్రకటనలు వెలువడడానికి అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాల పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతాయి.  

పంచాయతీ సెక్రటరీ: రెండు మూడేళ్లకు ఒకసారి పంచాయతీ సెక్రటరీ పోస్టులను డిగ్రీ అర్హతతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భర్తీ చేస్తున్నారు. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ ఉమ్మడిగా ఉంటుంది. ఆయా రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నోటిఫికేషన్లు విడుదలచేసినప్పుడు పరీక్ష విధానంపై పూర్తి స్పష్టత లభిస్తుంది.

మార్గాలు మూడు

డిగ్రీ తర్వాత ఉన్న ఉద్యోగాలను 3 కేటగిరీలుగా విభజించుకోవచ్చు. అభ్యర్థులు వీటిలో నచ్చిన విభాగాన్ని ఎంచుకుని సన్నద్ధం కావచ్చు. పరీక్ష విధానం ఆయా గ్రూపులవారీ దగ్గరగా ఉంటుంది. విధుల్లోనూ పోలికలు ఉంటాయి. 

1. బ్యాంకులు, ఆర్‌బీఐ, జాతీయ బీమా సంస్థలు, రైల్వే, ఎస్‌ఎస్‌సీ (సీజీఎల్‌), ఇంటలిజెన్స్‌ బ్యూరో: ఈ పరీక్షల సిలబస్‌ చాలావరకు దగ్గరగా ఉంటుంది. వీటిలో ఆప్టిట్యూడ్‌కు అధిక ప్రాధాన్యమిస్తారు. అరిథ్‌మెటిక్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాలను బాగా చదువుకోవాలి. 

2. ఒకే తరహా పరీక్షలైన సివిల్స్, గ్రూప్స్‌: వీటికోసం అన్ని సబ్జెక్టులపైనా ఎంతో కొంత అవగాహన ఉండాలి. లోకజ్ఞానం, సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. విస్తృతంగా చదివి, ఆకళింపు చేసుకునే నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలి. రాతపైనా పట్టుండాలి. 

3. సీడీఎస్‌ఈ, అసిస్టెంట్‌ కమాండెంట్స్, ఎస్‌ఐ (స్టేట్, ఎస్‌ఎస్‌సీ, రైల్వే): ఇవన్నీ యూనిఫాం పోస్టులు. వీటిలో విజయానికి ఆప్టిట్యూడ్‌ పరిజ్ఞానంతోపాటు దేహదార్ఢ్యాన్ని పెంచుకోవాలి. శారీరక ప్రమాణాలు తప్పనిసరి. అంటే చదువుతోపాటు వ్యాయామం నిత్య జీవితంలో భాగం కావాలి.
 

Posted Date: 20-12-2021


 

ఉద్యోగ ప‌రీక్ష‌లు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌