• facebook
  • whatsapp
  • telegram

కార్పొరేట్‌ కామర్స్‌ కెరియర్‌

జీఎస్‌టీ అమలు, నోట్ల రద్దు, నగదు రహిత విధానాలు మనదేశంలో కామర్స్‌ నిపుణులకు ఉపాధి అవకాశాలను పెంచాయి. ఈ నేపథ్యంలో బీపీఓలు, ఇన్సూరెన్స్, బిజినెస్‌ కన్సల్టెన్సీ లాంటి ఆధునిక అవకాశాలను అందించే సి.ఎ, సి.ఎం.ఎ, సి.ఎస్‌. కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. ఇంటర్‌ తర్వాత ఈ కామర్స్‌ కోర్సులను తక్కువ ఖర్చుతోనే పూర్తిచేసుకోవచ్చు. కార్పొరేట్‌ రంగంలో చక్కని కెరియర్‌ను సొంతం చేసుకోవచ్చు! 

చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ) చదవాలంటే ఒకప్పుడు డిగ్రీ తరువాత అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇంటర్‌ పూర్తయిన తరువాత ఈ కోర్సు చదవడం ప్రారంభించవచ్చు. సీఏ చదవాలంటే ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూప్‌ వారైనా అర్హులే. చాలామంది విద్యార్థులు ఇంటర్‌లో ఎంఈసీ/ సీఈసీ గ్రూపుతో పాటే సీఏను ఏక కాలంలో చదవటానికే సుముఖత చూపిస్తున్నారు. ఇలా ఇంటర్‌తో పాటే సీఏ ఫౌండేషన్‌ సమాంతరంగా చదవటం వల్ల సీఏ ప్రాథమిక అంశాలపై (ఫండమెంటల్స్‌) మంచి పట్టు సాధించవచ్చు.  

కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ (సీఎంఏ) చదవాలంటే ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూప్‌ వారైనా అర్హులే. పదో తరగతి పూర్తిచేసినవారు ఇంటర్‌లో ఎంఈసీ/సీఈసీ గ్రూపు చదువుతూ సీఎంఏ ఫౌండేషన్‌ కోర్సుకు నమోదు చేయించుకొని ఈ కోర్సును ఇంటర్‌తో పాటు చదవవచ్చు.   ఇంటర్‌లో ఏ గ్రూపు చదివినవారైనా కంపెనీ సెక్రటరీ (సీఎస్‌) కోర్సులో చేరొచ్చు. ఇంటర్‌ పూర్తవ్వగానే సీఎస్‌ఈఈటీ రాయవచ్చు. డిగ్రీ పూర్తిచేసినవారు సీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రాం చదవాలంటే తప్పనిసరిగా ఈ సీఎస్‌ఈఈటీ పరీక్ష రాయాల్సివుంటుంది.

చార్టర్డ్‌ అకౌంటెన్సీ

సీఏ పూర్తవడానికి తొమ్మిది, పదేళ్లు పడుతుందని చాలామంది విద్యార్థులు భయపడుతుంటారు. కానీ ఇటీవలి కాలంలో ఫలితాలు చూస్తే 21- 22 సంవత్సరాలకే చాలామంది సీఏ పూర్తిచేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ తర్వాత సీఏ ఫౌండేషన్‌ చేసి సీఏ కోర్సులోకి ప్రవేశించడం ద్వారా సీఏ త్వరగా పూర్తిచేయవచ్చు. గత నాలుగైదేళ్లలో అమ్మాయిలు ఎక్కువగా పాసవుతున్నారు. వృత్తిరీత్యా లభించే గౌరవం, సామాజిక హోదా, ఆదాయ వనరులు బాగా ఉండటం వల్ల సీఏ కోర్సు ఆకర్షణీయంగా మారింది. 

పన్ను గణన, అకౌంటింగ్, డేటా విశ్లేషణ విభాగాల్లో సీఏలకు లక్షకు పైగా కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని అంచనా. జీఎస్‌టీ వల్ల పరిశ్రమ లావాదేవీలు పెరిగి సీఏలకు డిమాండ్‌ పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పెద్దనోట్ల రద్దుతో ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్‌ చేస్తున్న వారి సంఖ్య దాదాపు 3 రెట్లు పెరిగింది. దీనివల్ల సీఏలకు అవకాశాలు రెట్టింపు అయ్యాయి. మనదేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. కంపెనీలకు మేనేజింగ్‌ డైరెక్టర్లుగా, ఫైనాన్స్‌ కంట్రోలర్, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్, మార్కెటింగ్‌ మేనేజర్, ఫైనాన్స్, అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్స్, ప్లాంట్‌ అకౌంటెంట్స్, సిస్టమ్‌ ఇంప్లిమెంటార్స్, టెక్నో ఫంక్షనిష్టులుగా అవకాశాలు పొందవచ్చు. ఇంకా ట్రస్టీ, అడ్మినిస్ట్రేటర్, వ్యాల్యూయర్, మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్, ట్యాక్స్‌ కన్సల్టెంట్‌లుగా ఉద్యోగాలు లభిస్తాయి. 

కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ 

ఉద్యోగ అవకాశాల పరంగా సీఏ తరువాత కార్పొరేట్‌ ప్రపంచంలో ఎక్కువగా వినిపించే పేరు సీఎంఏ. ఈ కోర్సును ఇంతకుముందు ఐసీడబ్ల్యూఏ అని పిలిచేవారు. ఇంటర్‌ పూర్తి చేసినవారు, డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదివిన విద్యార్థులు ఈ కోర్సుని చదవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.  

సీఎంఏలు మేనేజ్‌మెంట్‌ కోర్సులనందించే సంస్థల్లో లెక్చరర్లుగా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెÆసర్లుగా చేరవచ్చు. ప్రభుత్వ రంగ, ప్రభుత్వేతర సంస్థల్లో చీఫ్‌ ఇంటర్నల్‌ ఆడిటర్, కాస్ట్‌ కంట్రోలర్, చీఫ్‌ అకౌంటెంట్, ఫైనాన్షియల్‌ కంట్రోలర్‌ లాంటి కీలకమైన పదవులను నిర్వర్తించవచ్చు. ఇటీవల నిర్వహించిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో హెచ్‌సీఎల్, ఐసీఐసీఐ, ఐడీబీఐ, సిప్లా, ఐటీసీ, జెన్‌ప్యాక్ట్‌ లాంటి సంస్థల్లో ఎందరో సీఎంఏలు ఆకర్షణీయ వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు సంపాదించారు.

కంపెనీ సెక్రటరీ

కంపెనీ రికార్డులను తయారు చేయడం, ట్యాక్స్‌ రిటర్న్స్‌ నిర్వహించటం, కంపెనీ చైర్మన్, డైరెక్టర్లకు ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వటం సీఎస్‌లు చేస్తుంటారు. సంస్థల అంతర్గత వ్యవహారాల్లో పారదర్శకత, చట్టబద్ధ్దత చాలా అవసరం. ఇటువంటి కీలకమైన బాధ్యతలను నిర్వహించి, ఓర్పు నేర్పులతో వ్యాపారవేత్తలకు సమయానుగుణంగా సలహాలు, సూచనలు ఇచ్చేవారే కంపెనీ సెక్రటరీలు.

సీఏ, సీఎంఏల మాదిరే అన్నిరకాల వ్యాపార సంస్థలకూ, ఇతర సంస్థలకూ సీఎస్‌లు కూడా అవసరమే. సంస్థలో రోజువారీ న్యాయ, పన్ను, పెట్టుబడి లాంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తుంటారు. చాలా సంస్థలు స్వతంత్ర సీఎస్‌లను నియమించుకుంటాయి. కొన్ని సంస్థలు సేవలనందించే సీఎస్‌ సంస్థలపై ఆధారపడతాయి. పెయిడప్‌ షేర్‌ క్యాపిట్‌ రూ. 10 కోట్లు మించిన పబ్లిక్, ప్రైవేట్‌ లిస్టెడ్‌ కంపెనీలు తప్పనిసరిగా ఒక సీఎస్‌ను తమ కంపెనీలో నియమించుకోవాలి. కంపెనీ సెక్రటరీలకు రకరకాల హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌కి సలహాలు ఇవ్వడం, కంపెనీ రిజిస్ట్రార్‌గా, కంపెనీకి న్యాయ సలహాలను అందివ్వడం, కంపెనీ విధానాల రూపకర్తగా, కంపెనీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కంపెనీ యాజమాన్యం, వాటాదారులూ, రుణదాతలకు అనుసంధానకర్తగా అనేక హోదాల్లో ఉద్యోగం చేయవచ్చు. కంపెనీ సెక్రటరీలు    చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్లుగా, బ్యాంక్‌ మేనేజర్లుగా, ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్ల్లుగా ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ మంచి    హోదాల్లో ఉద్యోగాలు పొందవచ్చు.


 

Posted Date: 27-10-2021


 

ఇంటర్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌