• facebook
  • whatsapp
  • telegram

విస్తృత అవకాశాలందించే ఎఫ్‌ఆర్‌ఎం సర్టిఫికేషన్‌

ఆర్థికం గురించి లోతుగా, ఆసక్తితో తెలుసుకోవాలనే విద్యార్థులకు ఉపయుక్తమైన కోర్సు ఎఫ్‌ఆర్‌ఎం (ఫైనాన్షియల్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌). ఈ సర్టిఫికేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణులైతే ప్రామాణిక ఫైనాన్స్‌ విద్యను అభ్యసించినట్లే! ఉద్యోగ విపణిలో అవకాశాలు పొందేలా చేస్తుందీ సర్టిఫికేషన్‌. అంతర్జాతీయ సంస్థ- గ్లోబల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రిస్క్‌ ప్రొఫెషనల్స్‌ (జీఏఆర్‌పీ) ఈ కోర్సును నిర్వహిస్తోంది. దీన్ని సెల్ఫ్‌స్టడీ రూపంలో నిర్వహిస్తారు. విద్యార్థి మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ, నాణ్యమైన ఫైనాన్స్‌ లెక్చరర్లు అందుబాటులో లేకపోయినా ఈ కోర్సు ద్వారా అధునాతన ఫైనాన్స్‌ విద్యను పొందవచ్చు. తెలివైన, కష్టించే తత్వమున్న విద్యార్థులకు ఈ కోర్సు మంచి అవకాశంగా చెప్పవచ్చు. పాఠ్యప్రణాళికలో ప్రతి సంవత్సరం విస్తృత మార్పులూ, చేర్పులూ చేస్తుండడం వల్ల ఎఫ్‌ఆర్‌ఎంలో పరీక్షించే విషయాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి.

ఎప్పటికప్పుడు మారుతూ, ప్రపంచీకరణ చెందుతున్న మార్కెట్లలో రిస్క్‌ మేనేజర్ల పాత్ర ఎంతో కీలకం. ఆర్థిక లావాదేవీలు, మార్కెట్లు, పొదుపు వ్యవహారాల సంక్లిష్టత పెరుగుతున్న నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌ఎం కోర్సు ప్రాధాన్యం సంతరించుకుంది. రిస్క్‌ మేనేజ్‌మెంట్‌... ఫైనాన్స్‌ రంగంలో ఒక ప్రముఖ అంశం. ప్రపంచ ఆర్థిక సంక్షోభం (జీఎఫ్‌సీ) తర్వాత రిస్క్‌ మేనేజర్లకు గిరాకీ ఏర్పడింది. బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలు, పొదుపు సంస్థలు కన్సల్టెన్సీలు ఎఫ్‌ఆర్‌ఎంలకు విస్తృత ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.

అర్హతలు: ఎఫ్‌ఆర్‌ఎం పరీక్షను రాయడానికి కనీస విద్యార్హతలనేమీ నిర్దేశించలేదు. కానీ ఎఫ్‌ఆర్‌ఎం సర్టిఫికేషన్‌ పొందడానికి పార్ట్‌-1, పార్ట్‌-2 పాసై, కనీసం 2 సంవత్సరాల సంబంధిత అనుభవం ఉండాలి.

జీఏఆర్‌పీ గురించి...

ఈ సంస్థ 1996లో స్థాపితమై లాభాపేక్షలేని సంస్థగా, రిస్క్‌ మేనేజర్లకు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అసోసియేషన్‌ (వెబ్‌సైట్‌: www.garp.org ) జీఏఆర్‌పీ కమ్యూనిటీలో 1,50,000మంది రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ పట్ల నిబద్ధత కలిగిన వృత్తినిపుణులు ఉన్నారు. జీఏఆర్‌పీ సభ్యులు ప్రాంతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు, ఇన్సూరెన్స్‌ సంస్థలు, రిజర్వ్‌ బ్యాంకులు, సెక్యూరిటీస్‌ నియంత్రణ సంస్థలు, హెడ్జ్‌ ఫండ్స్‌, విశ్వవిద్యాలయాలు, పెద్ద పారిశ్రామిక సంస్థలు, అంతర్జాతీయ సంస్థల్లో సేవలందిస్తున్నారు. ఎఫ్‌ఆర్‌ఎం పరీక్షలను ఫైనాన్స్‌ రంగంలో కఠినమైనవిగా పరిగణిస్తారు. అందుకే ఈ సర్టిఫికేషన్‌ను రిస్క్‌మేనేజ్‌మెంట్‌ రంగంలో ప్రామాణికమైనదిగా గుర్తిస్తారు.

ఎలా చదవాలి?

పార్ట్‌-1లో 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు (ఎంసీక్యూ)లు, పార్ట్‌-2లో 80 బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. పార్ట్‌-1 ఉదయం, పార్ట్‌-2 సాయంత్రం సెషన్లుగా నిర్వహిస్తారు.

ఎఫ్‌ఆర్‌ఎం రెండు పార్టుల్లో గుణాత్మక ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి

పరీక్షను నిష్ణాతులైన ఫైనాన్స్‌, రిస్క్‌ నిపుణులు, విద్యావేత్తలు ఒక కమిటీగా ఏర్పడి నిర్వహిస్తారు. బ్యాంకింగ్‌, కన్సల్టింగ్‌, హెడ్జ్‌ ఫండ్స్‌, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు, టెక్నాలజీ- ఫైనాన్సేతర సంస్థలు తరచుగా సర్వే చేసి ఫైనాన్షియల్‌ రిస్క్‌ మేనేజర్‌కు కావాల్సిన పరిజ్ఞానం, సామర్థ్యాలు, నైపుణ్యాలను గుర్తించి వాటిని పాఠ్య ప్రణాళికలో పొందుపరుస్తారు.

ఎవరికి ఉపయోగకరం?

వృత్తి నిపుణులు: రిస్క్‌, మనీ, పొదుపు నిర్వహించే నిపుణులు ఈ కోర్సులో చేరి వారి ప్రస్తుత నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. కెరియర్‌లో కొత్తగా ప్రవేశించేవారు పాఠ్యప్రణాళికలోని విస్తృత అంశాల ద్వారా లబ్ధి పొందవచ్చు. అనుభవజ్ఞులైనవారు ఎఫ్‌ఆర్‌ఎం సర్టిఫికేషన్‌ ద్వారా అధునాతన పోకడల మీద పట్టు సాధించవచ్చు.

కెరియర్‌ మార్చుకునేవారు: అంతకుముందు రిస్క్‌ హోదాలలో లేనివారు ఈ సర్టిఫికేషన్‌ ద్వారా ఆచరణాత్మక విజ్ఞానాన్ని ఆర్థికసేవల రంగంలో పొందవచ్చు. ఈ రకమైన ఆర్థికసేవల రంగం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది.

విద్యార్థులు: ఫైనాన్స్‌ రంగంలో ఆసక్తి కలిగిన విద్యార్థులు వారు చదువుకునే సమయంలోగానీ, చదువు పూర్తిచేసిన వెంటనే కానీ దీన్ని ఒక అదనపు సర్టిఫికేషన్‌గా తీసుకోవచ్చు. ఈ సర్టిఫికేషన్‌ వల్ల భవిష్యత్తులో వారి శక్తిసామర్థ్యాలమీద సంస్థలకు భరోసా ఏర్పడుతుంది. రిస్క్‌, మనీ, మదుపు రంగంలో విద్యార్థుల నిబద్ధతను ఈ సర్టిఫికేషన్‌ నిరూపిస్తుంది.

ఎందుకీ సర్టిఫికేషన్‌?

నియామక సంస్థల దృష్టిలో ప్రత్యేకతను చాటడానికి: ఈ ప్రోగ్రామ్‌ విశిష్టతను నియామక సంస్థలు అంతర్జాతీయంగా గుర్తిస్తాయి. కాబట్టి ప్రత్యేక విజ్ఞానాన్ని, నైపుణ్యాలతో మార్పు చెందే ఫైనాన్షియల్‌ సేవారంగంలో విజయం సాధించడానికి దోహదపడుతుంది.

అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన సర్టిఫికేషన్‌ ఇది. అంతర్జాతీయంగా మొదటి 25 బ్యాంకులు, అన్ని 20 గ్లోబల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు, పెద్ద 4 అకౌంటింగ్‌ సంస్థలు, మొదటి 15లోని 14 గ్లోబల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు, మొదటి పదిలో ఎనిమిది గ్లోబల్‌ హెడ్జ్‌ ఫండ్స్‌ ఎఫ్‌ఆర్‌ఎంలకు అవకాశాలు ఇస్తున్నాయి.

జ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి: నిత్యం మార్పు చెందే మార్కెట్లలో ఫైనాన్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ భావనలమీద పట్టు సాధించడం ఎంతో ముఖ్యం. దీనివల్ల సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. ఎఫ్‌ఆర్‌ఎం పాఠ్య ప్రణాళికలను ప్రతి సంవత్సరం నవీకరణ చేస్తుండడం వల్ల ప్రస్తుత మార్కెట్‌ విషయాలు దానిలో ప్రతిబింబిస్తాయి.

మరింత సమాచారం కొసం...  https://www.garp.org/#!/home

Posted Date: 12-04-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌