• facebook
  • whatsapp
  • telegram

ఐఐటీల్లో ఎంబీఏ చేద్దామా?

క్యాట్ స్కోరు ఆధారంగా ప్రవేశాలు 

కాన్పూర్ దరఖాస్తుదారులకు గ్రూప్ డిస్క‌షన్, ఇంట‌ర్వ్యూ లేవు

మ‌న దేశంలో ఉన్న‌త‌మైన ఉత్తమ విద్య‌కు వేదిక‌లు ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ)లు. చాలా మంది విద్యార్థులు వీటిలో చేరేందుకు ఎంతో ఆసక్తిగా ఉంటారు. విదేశీ విద్యార్థులూ వాటిలో చ‌దివేందుకు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ సంస్థల్లో సీటు దక్కించుకోగలిగితే మంచి జీవితం అందుతుంది. ఉన్న‌తంగా స్థిర‌ప‌డవ‌చ్చు. దేశ, విదేశాల నుంచి బహుళ జాతి కంపెనీలు నేరుగా ఐఐటీలకు వచ్చి నియామకాలు చేపడుతున్నాయి. పెద్ద మొత్తంలో ప్యాకేజీలను అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు ఉన్నాయి. ప్ర‌స్తుతం అందులో ఎనిమిది ఐఐటీలు 2021-2022 విద్యా సంవ‌త్స‌రానికి మాస్ట‌ర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎంబీఏ) ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతున్నాయి.

ఎంబీఏ ప్రోగ్రాం అనేది స‌ముద్రం లాంటింది. ఇందులో కోర్, ఫినాన్స్‌, హ్యూమ‌న్ రిసోర్సెస్‌, ఆప‌రేష‌న్స్‌, ఐటీ/ అన‌లైటిక్స్‌/ స్ట్రాటెజీ, ఇండ‌స్ట్రియ‌ల్ & మేనేజ్‌మెంట్ ఇంజినీరింగ్(ఐఎంఈ), మార్కెటింగ్, బిజినెస్ అని చాలా విభాగాలు ఉన్నాయి. అన్ని ఐఐటీల్లో దాదాపు ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు ఆసక్తి మేరకు

ఇష్టమైన విభాగాన్ని ఎంపిక చేసుకొని పూర్తి చేసుకోవచ్చు. కోర్సు పూర్తి చేసిన త‌ర్వాత క‌న్స‌ల్టింగ్‌, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌, టెక్నాల‌జీ, హెల్త్‌కేర్‌, క‌న్జ్యూమ‌ర్ ప్యాకెజింగ్ గూడ్స్ రంగాల్లో రాణించ‌వ‌చ్చు. సొంత సంస్థను స్థాపించే నైపుణ్యాల‌ను నేర్చుకోవ‌చ్చు. నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను పుణికిపుచ్చుకోవ‌చ్చు. విదేశాల్లోనూ ఎంబీఏ ప్రోగ్రాంకు చాలా డిమాండ్ ఉంది. ఈ కోర్సులపై అవగాహన పెంచుకుంటే క్యాట్ స్కోరు లేని వాళ్లు తర్వాతి విద్యా సంవత్సరంలో అయినా చేరడానికి వీలుగా ఇప్పటి నుంచే ప్రిపేర్ కావచ్చు. 

ప్రవేశం ఎలా?

బాంబే, దిల్లీ, ధ‌న్‌బాద్‌, జోధ్‌పూర్‌, కాన్పూర్‌, ఖ‌రగ్‌పూర్‌, మ‌ద్రాస్‌, రూర్కీ న‌గ‌రాల్లోని ఐఐటీలు ఎంబీఏ ప్రోగ్రాం ప్ర‌వేశాల‌కు వేర్వేరుగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేశాయి. అభ్యర్థులు తమ ఆసక్తిని, సౌకర్యాన్ని అనుసరించి విడివిడిగా దరఖాస్తులు పంపించుకోవాలి. అర్హులైన వారి క్యాట్ ప‌ర్సంటైల్ స్కోర్‌, అక‌డ‌మిక్ మార్కులు, ప‌ని ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంత‌రం వారికి గ్రూప్ డిస్క‌షన్, ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి ప్ర‌తిభావంతుల‌ను ఎంపిక చేస్తారు. వీటిలో ఈడ‌బ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, దివ్యాంగులకు రిజ‌ర్వేష‌న్లు ఉంటాయి. కొవిడ్ 19 వైర‌స్ కార‌ణంగా కాన్పూర్‌లోని ఐఐటీ విద్యా సంస్థ ఈ ఏడాది గ్రూప్ డిస్క‌షన్, ఇంట‌ర్వ్యూ ప్ర‌క్రియలను నిర్వ‌హించ‌డం లేదు. ఇది విద్యార్థుల‌కు మంచి అవ‌కాశం. ఇక్క‌డ ‌ఇండ‌స్ట్రియ‌ల్ & మేనేజ్‌మెంట్ ఇంజినీరింగ్ (ఐఎంఈ) విభాగంలో ఎంబీఏ ప్రోగ్రాంకు ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. ఈ కోర్సు కాల‌వ్య‌వ‌ధి 21 నెల‌లు. నాలుగు సెమిస్ట‌ర్లు ఉంటాయి. 

అర్హ‌త‌లు

ఒక్కో ఐఐటీలో కోర్సుల ఆధారంగా అర్హ‌త‌లు వేర్వేరుగా ఉన్నాయి. వెబ్‌సైట్‌ల‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా అభ్యర్థులు దాదాపు అన్ని ఐఐటీల్లో క్యాట్-2020 ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించి ఉండాలి. జ‌న‌ర‌ల్‌, ఈడ‌బ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు క్యాట్‌లో 85 శాతం, ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీలో 65 శాతానికి పైగా మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ వారికి వ‌రుస‌గా 75 శాతం, 55 శాతం మార్కుల‌కు మించి రావాలి. బీటెక్‌, బీఈ, బీఆర్క్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఏ ఎకాన‌మిక్స్ పూర్తి చేసిన వారు అర్హులు. వీరికి అండ‌ర్ గ్రాడ్యుయేష‌న్‌లో మ్యాథ‌మేటిక్స్ స‌బ్జెక్టు త‌ప్ప‌నిస‌రి ఉండాలి. డిగ్రీ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఒక్కో ఐఐటీలో ఈ అర్హ‌త‌లు భిన్నంగా ఉన్నాయి. 

ద‌ర‌ఖాస్తు విధానం

అభ్యర్థులు సంబంధిత ఐఐటీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్‌లిస్ట్‌ చేసిన విద్యార్థుల వివరాలను తర్వాత వెల్లడిస్తారు. వారికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అందులో సాధించిన మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ద‌ర‌ఖాస్తు రుసుంగా జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్య‌ర్థులు రూ.1600, ఈడ‌బ్ల్యూఎస్‌/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు రూ.800 చెల్లించాలి. ద‌ర‌ఖాస్తుకు చివరి తేదీలూ ఈ ఎనిమిది ఐఐటీల్లో వేర్వేరుగా ఉన్నాయి. చాలా వరకు జనవరి 31, 2021 చివరి తేదీగా ఉంది. పూర్తి వివ‌రాల‌ కోసం ఆయా వెబ్‌సైట్లు చూడవచ్చు

వెబ్ సైట్లు; 

ఐఐటీ, కాన్పూర్ :  https://www.iitk.ac.in/ime/

ఐఐటీ, దిల్లీ: https://home.iitd.ac.in/

ఐఐటీ, ముంబై: https://www.iitb.ac.in/

ఐఐటీ, జోధ్‌పూర్‌: http://www.iitj.ac.in/

ఐఐటీ, ధ‌న్‌బాద్‌: https://www.iitism.ac.in/

ఐఐటీ, ఖ‌ర‌గ్‌పూర్‌: http://www.iitkgp.ac.in/

ఐఐటీ, మ‌ద్రాస్‌: https://www.iitm.ac.in/

ఐఐటీ, రూర్కీ: https://www.iitr.ac.in/

Posted Date: 23-09-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌