• facebook
  • whatsapp
  • telegram

ఎంబీఏ కళాశాల.. ఎంచుకునేదెలా?

పరిశీలించాల్సిన ప్రధాన అంశాలు

మేనేజ్‌మెంట్‌ పట్టాకూ, నైపుణ్యాలకూ పెరుగుతున్న ప్రాముఖ్యం దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో ఎంబీఏ ప్రవేశాలకు పోటీ ఎక్కువగానే ఉంటుంది. నాణ్యమైన విద్యను పొందితేనే మేటి భవిత సాధ్యం. అందుకే మంచి కళాశాలను గుర్తించి ఎంచుకునేందుకు కొన్ని ప్రధానమైన అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి వుంటుంది. అవేమిటో చూద్దామా? 

ప్రపంచవ్యాప్తంగా ఉండే వివిధ రకాల సంస్థల్లో ఫైనాన్స్‌/మార్కెటింగ్‌/హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజర్‌ మొదలైన హోదాల్లో నియమితులు కావడానికి ప్రధాన వృత్తిపరమైన కోర్సు.. మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ). దీనిలో చేరటం వల్ల ముఖ్యంగా మూడు అంశాల పట్ల అవగాహన కలుగుతుంది. వీటినే ఎంబీఏ కోర్సు ధ్యేయాలుగా చెప్పవచ్చు. 

1. మేనేజ్‌మెంట్‌ సూత్రాలపై అవగాహన 

2. ఉద్యోగార్హతకు అవసరమైన నిర్వహణ నైపుణ్యాల మెరుగుదల 

3. వ్యాపార నిర్వహణలో నైతిక విలువలు పెంపొందించుకోవటం. 

ఎంబీఏ చేసినవారికి ఉద్యోగ అవకాశాలు బాగానే ఉంటాయని చెప్పవచ్చు. మిగతా పీజీ కోర్సులతో పోల్చుకుంటే ఎంబీఏ చేసినవారికి ప్రాథమికంగానే మంచి జీతంతో కొలువు దొరుకుతుంది. అదేవిధంగా ఉన్నత స్థానాలకు చేరుకోవడం కూడా సులభం అవుతుంది. ఎంబీఏ పూర్తిచేసినవారికి.. తాము చేరిన సంస్థలో పనిచేసే ఇతర సిబ్బందితో, సంస్థకు సంబంధించిన వెలుపలి వ్యక్తులతో/సంస్థలతో మంచి సంబంధాలు పెంపొందించుకొనగలిగే నైపుణ్యాలు పెరుగుతాయి.   

ఇంతటి ప్రాముఖ్యం కల్గిన ఎంబీఏలో ప్రవేశం పొందగోరే అభ్యర్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి కళాశాలను ఎంచుకోవాలి. మెరుగ్గా చదువుకొనే వాతావరణం, వైవిధ్యమైన సంస్కృతులు, సామాజిక పరిస్థితులపై అవగాహన కలిగే వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కళాశాలలో విద్యాసంబంధ విషయాలతో పాటుగా సామాజికపరమైన అంశాలు నేర్చుకొనే అవకాశం ఉండాలి. అపుడే విద్యార్థులు అన్ని అంశాలపైనా సమగ్రమైన అవగాహన పొందుతారు. ఉత్తమ కళాశాలను ఎంచుకున్నపుడే కోర్సు ద్వారా అందే ప్రయోజనాలను సంపూర్తిగా పొందగలుగుతారని గ్రహించాలి.

ఇంటర్న్‌షిప్స్, ఉద్యోగాలు

మంచి ఎంబీఏ కళాశాలను ఎంచుకోడానికి దోహదపడే మరొక అంశం- కళాశాల విద్యార్థులకు అందించే ఇంటర్న్‌షిప్‌. సరైన ఇంటర్న్‌షిప్‌ ఎంబీఏ విద్యార్దులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండడమే కాక కార్పొరేట్‌ సంస్థల పని సంస్కృతినీ, వాస్తవ పని తీరునూ అర్థం చేసుకొనే అవకాశం అందిస్తుంది. ఇంకా సామర్థ్యాలూ, విలువలను పెంపొందించుకొనే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యాంశం- కళాశాల ప్లేస్‌మెంట్‌ రికార్డ్‌. కళాశాల ప్రాంగణంలో నిర్వహించే నియామకాలు విద్యార్థులకు ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో అవకాశాన్నీ, మంచి ఆరంభాన్నీ ఇస్తాయి.  

పరిశ్రమలతో సంబంధం

ప్రముఖ విద్యా సంస్థలు ఎల్లప్పుడూ పరిశ్రమలతో మంచి సంబంధాలను కొనసాగిస్తాయి. పేరుగాంచిన పారిశ్రామిక సంస్థలతో కుదుర్చునే ఒప్పందాల వల్ల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్స్‌ లభిస్తాయి. వీటివల్ల విద్యార్థులు కార్పొరేట్‌ సంస్థల్లోని పని సంస్కృతిని అవగాహన చేసుకోగలుగుతారు. వాస్తవ పని తీరును గ్రహించి నైపుణ్యాలు మెరుగుపరచుకోగలుగుతారు. మరో ముఖ్యమైన విషయం- కళాశాలలు కోర్సులో భాగంగా తమ విద్యార్థులను ఇండస్ట్రియల్‌ టూర్‌లకు తీసుకొనివెళ్లటం. వీటన్నిటి ఫలితంగా ఒప్పందాలు కుదుర్చుకున్న పారిశ్రామిక సంస్థలు విద్యార్థులను మంచి జీతంతో ఉద్యోగాల్లో నియమించుకుంటాయి. వీటి వల్ల కళాశాలల పేరు ప్రతిష్ఠలూ పెరుగుతాయి.

కళాశాలల ప్రాధాన్య క్రమం

మంచి కళాశాలలో చేరితేనే ఎంబీఏ కోర్సు ప్రయోజనాలు పొందగలుగుతామనేది నిజమే. అయితే ఏ అంశాలు ఒక కళాశాలను మొదటి స్థానంలో నిలుపుతాయో గమనించాలి. ఆయా అంశాల ఆధారంగా కళాశాలల మొత్తం పనితీరును మూల్యాంకనం చేసుకోవాలి. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలకనుగుణంగా ఏ కళాశాలలో వసతులు ఉన్నాయో ముందుగానే తెలుసుకొని ఆయా కళాశాలల ప్రాధాన్య క్రమం జాబితా రూపొందించుకోవాలి.

కళాశాల గుర్తింపు, ర్యాంకింగ్‌

ఎంచుకుంటున్న కళాశాలకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఉన్నదీ లేనిదీ చూసుకోవాలి. అన్ని యూనివర్శిటీలకూ యూజీసీ/ ఏఐసీటీఈ గుర్తింపు ఉండాలి. ఒకవేళ ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని ఎంచుకుంటున్నట్లయితే అది యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) గుర్తింపుతో అనుమతి పొందినదై ఉండాలి. ఎందుకంటే యూజీసీ నుంచి అనుమతి లేని కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలు చలామణిలో ఉన్నాయి. అలాంటివాటి జాబితాను యూజీసీ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. అందుకని ఈ జాగ్రత్త అవసరం. కళాశాలకు ఎన్‌ఏఏసీ/ ఎన్‌బీఏ లాంటి సంస్థల గుర్తింపు ఉంటే విశ్వసనీయత పెరుగుతుంది. కొన్ని ప్రముఖ సంస్థలు ప్రామాణిక సర్వేలు నిర్వహించి కళాశాలలకు ర్యాంకింగులను ఇస్తుంటాయి. ఈ ర్యాంకింగ్‌ వల్ల కూడా కళాశాల స్థాయినీ, దాని పనితీరునూ తెలుసుకోవచ్చు. ఎన్‌ఏఏసీ/ ఎన్‌బీఏ లాంటి సంస్థలు ఇచ్చే గుర్తింపు, కళాశాలల ర్యాంకింగ్‌ మంచి కళాశాలను ఎంచుకొనేందుకు సహాయపడతాయి.

పూర్వ విద్యార్థులు (అలమ్నై నెట్‌వర్క్‌)

కళాశాలను స్థాపించి చాలాకాలం అయినట్లయితే పూర్వ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ విద్యార్థులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ ఉద్యోగ స్థానాల్లో స్థిరపడి ఉంటారు. ఇది కళాశాల ప్రతిష్ఠను పెంచడమే కాక దాని స్థిరత్వాన్నీ, ప్రతి సంవత్సరం వృద్ధి చెందుతున్న తీరునూ తెలుపుతుంది. అంతేకాక అందులోని అధ్యాపక బృందం ఎప్పటికప్పుడు మార్కెట్లో వస్తున్న నూతన మార్పులను తెలుసుకుంటూ బోధన చేస్తున్నారనీ రుజువుపరుస్తుంది.

అధ్యాపక బృందం

మేటి ఎంబీఏ కళాశాల ఎల్లప్పుడూ బోధన కేంద్రీకరణతో కాకుండా పరిశోధన కేంద్రీకరణతో ఉంటుంది. విద్యార్థుల బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించి విజయాన్ని సాధించేందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తుంది. కళాశాల అధ్యాపకులు సాధారణ టీచర్‌గా కాకుండా అంతకు మించిన స్థాయిలో ఉంటేనే విద్యార్థులు తమ భవిష్యత్తులో విజయాన్ని సాధించేలా ప్రేరేపించగలుగుతారు. అందుచేత కళాశాలలోని అధ్యాపకులకు తగిన విద్యార్హతలు, అనుభవం ఉంటే ప్రస్తుతం పరిశ్రమల్లో వస్తున్న మార్కెటింగ్, ఫైనాన్స్, ఆర్థిక, సాంకేతిక పరమైన మార్పులను అలవర్చుకుంటూ పోటీ తత్వాన్ని పెంపొందించేలా బోధనను చేపట్టగలుగుతారు. కళాశాలలో ఇలాంటి అధ్యాపకులు ఉంటేనే విద్యార్థులకు అవసరమైన ప్రేరణ లభిస్తుంది.

లక్ష్య నిర్దేశనం

ఎంబీఏలో ప్రవేశం పొందగోరే ప్రతి అభ్యర్థీ ముందుగా తాను ఎందుకు ఎంబీఏ చేయాలనుకుంటున్నారో... ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. సాధారణంగా ఫైనాన్స్‌/మార్కెటింగ్‌/ హ్యూమన్‌ రిసోర్స్‌ రంగంలో ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించుకొని ఉన్నత స్థానంలో ఎదగాలని అనుకుంటారు. ఎంబీఏ చదివినవారికి స్వల్ప కాలంలో, దీర్ఘకాలంలో ఉద్యోగ అవకాశాలు ఉండటమే కాకుండా వేగంగా ఎదగటానికి కూడా ఆవకాశాలుంటాయి. అదేవిధంగా ఎంబీఏ పూర్తిచేసి కొలువులోకి ప్రవేశించినవారు సంస్థల్లో  వైవిధ్యమైన స్థానాల్లో బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుంది.  

సిలబస్, స్పెషలైజేషన్‌

విద్యార్థులు ముందుగా యూనివర్శిటీ అందిస్తున్న ఎంబీఏ సిలబస్‌ను పరిశీలించాలి. సిలబస్‌ ప్రకారం విద్యార్థులు ఏ విధంగా తమ నైపుణ్యాలూ, సామర్ధ్యాలను పెంచుకోగలరో తెలుసుకోవచ్చు. యూనివర్శిటీ తన సిలబస్‌లో మొత్తం కోర్స్‌ కాలంలో చేయవలసిన ఎంబీఏ ప్రాజెక్టులు, వర్క్‌షాప్స్, ఇతర నైపుణ్యాలను పెంచే కార్యక్రమాల వివరాలు పొందుపరుస్తుంది. ప్రముఖ విద్యాసంస్థలు జనరల్‌ ఎంబీఏ, కొన్ని స్పెషలైజేషన్లతో (ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్‌ఆర్‌) పాటుగా ప్రత్యేకమైన కాలానుగుణంగా ఉండే స్పెషలైజేషన్లను (ఉదా: రూరల్‌ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌..) అందిస్తున్నాయి. ఈ సమాచార ఆధారంగా కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు.

మౌలిక సదుపాయాలు

ఉత్తమమైన ఎంబీఏ కళాశాలను ఎన్నుకోవాలంటే ఆ కళాశాలలోని మౌలిక సదుపాయాలను కూడా పరిశీలించాలి. మంచి కళాశాలలో తరగతి గదులు అధునాతన సదుపాయాలతో ఉంటాయి. స్వచ్ఛమైన వాతావరణం, ఇంటర్‌నెట్‌తో కూడిన కంప్యూటర్లు అమర్చి ఉంటాయి. కొన్ని కళాశాలలు డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లను ఏర్పరుస్తున్నాయి. సమకాలీన పుస్తకాలు, జర్నల్స్‌తో కూడిన లైబ్రరీ సదుపాయం, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, ఆడిటోరియం, హాస్టల్‌ వసతి, ప్లే గ్రౌండ్‌ మొదలైనవి ఉండాలి.

గెస్ట్‌ ఫ్యాకల్టీ/లెక్చర్‌

కళాశాలను సందర్శించే అతిథి అధ్యాపకులు.. మరో కీలక అంశం. గెస్ట్‌ లెక్చరర్లు అంటే వివిధ పరిశ్రమల్లో పేరుప్రఖ్యాతులు ఉండి, మంచి అనుభవం, ఉన్నతస్థానాల్లో ఉన్న నిష్ణాతులు. వీరిని కళాశాల వారుగానీ, ఎంబీఏ విభాగం వారు గానీ ఆహ్వానించి వారితో విద్యార్థుకలు బోధన చేయిస్తారు. ఈ రకమైన అతిథి ప్రసంగాల వల్ల విద్యార్థులకు సంబంధిత అంశంపై వాస్తవికతతో కూడిన పరిజ్ఞానం రావడమే కాక పరిశ్రమ అవసరాలనూ తెలుసుకోవచ్చు. అంతేకాక పరిశ్రమలతో మంచి సంబంధాలు మెరుగుపడతాయి. 


 


మరింత సమాచారం ... మీ కోసం!

‣ దళాల్లో దూసుకుపోవచ్చు!

‣ వరుస విజయాలే నిరంతర ప్రేరణ

Posted Date: 11-11-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌