• facebook
  • whatsapp
  • telegram

కొత్త టెక్నాలజీల్లో ఘన గణాంకం!

కోహ్లీ బ్యాటింగ్‌ సగటు, స్టాక్‌ మార్కెట్ల హెచ్చుతగ్గులు, ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతాలు, జయాపజయాల అంచనాలు ఇవన్నీ సెకన్లలో తెరలపైకి రావడం వెనుక ఎంతో డేటా ఉంటుంది. దాన్ని సేకరించి, సరైన క్రమంలో అమర్చి, వివరించడానికి ఎందరో పనిచేస్తుంటారు. వారిలో ప్రధానమైనవారు స్టాటిస్టిక్స్‌ (గణాంకశాస్త్రం) నిపుణులు. సామాజిక విశ్లేషణలు మొదలు ప్రొగ్రామింగ్‌ల వరకు అన్నింటిలోనూ ఈ విభాగం కీలకంగా మారింది. మెషిన్‌ లర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటాసైన్స్‌, బిగ్‌డేటా, బ్లాక్‌చెయిన్‌ వంటి ఆధునిక టెక్నాలజీల వినియోగంలో స్టాటిస్టీషియన్లు ఉన్నారు. ఇంజినీరింగ్‌లోని ప్రతి బ్రాంచిలోనూ గణాంకశాస్త్రాన్ని అధ్యయనం చేయాల్సిందే. ఈ నేపథ్యంలో స్టాటిస్టిక్స్‌కి సంబంధించిన కోర్సులు, ఉద్యోగాల వివరాలను తెలుసుకుంటే సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

ఒక రోజులో 2.5 క్వింటిలియన్‌ బైట్ల డేటా ఉత్పత్తవుతుందని ఐబీఎం నివేదిక స్పష్టం చేసింది (యూఎస్‌ లెక్కల ప్రకారం క్వింటిలియన్‌ అంటే ఒకటి పక్కన 18 సున్నాలు). ఇంత పెద్ద మొత్తంలో ఉన్న డేటా నుంచి అత్యంత ఉపయోగకరమైన సమాచారాన్ని గుర్తించి, వివరించాలంటే ఎంత కష్టం? నిజమే. కానీ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ టూల్స్‌ను ఉపయోగించి క్షణాల్లో విశ్లేషించేస్తున్నారు స్టాటిస్టీషియన్లు. అందుకే అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేటు రంగం రెండుచోట్లా ఈ సబ్జెక్టుపై పట్టున్నవారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ కోర్సును అందించడానికి ప్రత్యేక సంస్థలూ వెలిశాయి. ఐఐటీల్లో చదువుకోవడం, యూపీఎస్సీతో కేంద్ర సర్వీసుల్లో చేరడం వంటి ఉన్నతమైన అవకాశాలూ స్టాటిస్టిక్స్‌ గ్రాడ్యుయేట్లకు ఉన్నాయి.

స్టాటిస్టిక్స్‌ అంటే!

ఇది మేథమేటిక్స్‌లో ప్రధానమైన విభాగం. అంకెలు, సంఖ్యల్లో అపరిమితంగా ఉన్న డేటాను సేకరించి, నిర్వహించి, విశ్లేషించి కొన్ని గణిత పద్ధతుల ఆధారంగా ప్రామాణికమైన నమూనా అంచనాలను రూపొందించడాన్ని స్టాటిస్టిక్స్‌గా చెప్పవచ్చు. వ్యవసాయం, పర్యావరణం, ఖగోళశాస్త్రం, అకౌటింగ్‌, ఆడిటింగ్‌, బ్యాంకింగ్‌, వైద్యరంగం మొదలైన అన్ని రంగాల్లో గణాంకశాస్త్రం విస్తృత ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. డేటాను సేకరించడం, సమర్థంగా రూపొందించడం, నిర్వహించడం, విశ్లేషణ పద్ధతులను మెరుగుపరచడం గణాంకశాస్త్రవేత్తల ప్రధాన విధులు.

విశ్లేషణలు ఎందుకు?

ఇప్పుడు కార్పొరేట్‌ రిటైల్‌ దుకాణాలతోపాటు చిన్న చిన్న వర్తక సముదాయాలూ బార్‌ కోడ్‌ ఉపయోగించి అమ్మకాలు చేపడుతున్నాయి. బార్‌కోడ్‌పై స్కానర్‌ పెట్టిన వెంటనే బిల్‌ డిస్‌ప్లే టెక్నాలజీలో స్టాటిస్టిక్స్‌ పాత్ర ఉంది. ఇలా చేయడం వల్ల తక్కువ వ్యవధిలో బిల్లింగ్‌ పూర్తవుతుంది. అంతే కాకుండా వినియోగదారుల కొనుగోళ్ల డేటా ఆధారంగా తమ వద్ద ఏ ఉత్పత్తికి ఎక్కువ గిరాకీ ఉంది, అందులోనూ ప్రత్యేకంగా ఏ కంపెనీ ఉత్పత్తిని ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడుతున్నారో తెలుసుకోవచ్చు. ఇదే సమాచారం ఉపయోగించుకుని ఒక కంపెనీ ఉత్పత్తిపై వినియోగదారులు ఎందుకు మొగ్గుచూపుతున్నారో ఇతర కంపెనీలూ తెలుసుకోవచ్చు. డేటాను ఆయా విభాగాలవారీ విశ్లేషించడానికి ప్రోగ్రామర్లతో పాటు స్టాటిస్టిక్స్‌ చదివినవారి సేవలు అవసరం.

అన్ని రంగాల్లోనూ!

వినియోగదారుల అవసరాలు, ప్రాధమ్యాలను గుర్తించడంపైనే కంపెనీల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారాన్ని స్టాటిస్టీషియన్లు విశ్లేషించి పరిష్కారాలకు తగిన డేటాను అందిస్తారు. స్టాటిస్టిక్స్‌ డిగ్రీతో ఐటీ, ఫైనాన్స్‌, రిటైల్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, అగ్రికల్చర్‌ ఇలా అన్ని విభాగాల్లోనూ పనిచేసే అవకాశం లభిస్తుంది. స్టాటిస్టిక్స్‌ అంటే మీన్‌, మీడియన్‌, మోడ్‌ల గురించి తెలుసుకోవడమే కాదు. మెథడాలజీపైనా దృష్టి సారించాలి. దీని ద్వారా ప్యూర్‌ స్టాటిస్టిక్స్‌ అర్థం చేసుకోగలుగుతారు. ఆ పరిజ్ఞానం అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌పై అవగాహనకు ఉపయోగపడుతుంది. స్టాట్‌ గ్రాడ్యుయేట్లు థియరీ, ప్రాథమికాంశాలపై తప్పనిసరిగా పట్టు సాధించాలి.

ఎన్నో అవకాశాలు

ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌: యూపీఎస్సీ ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ (ఐఎస్‌ఎస్‌) ఏటా మార్చిలో ప్రకటన వెలువరిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్షలో 6 పేపర్లు ఉంటాయి. జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ స్టడీస్‌తోపాటు స్టాటిస్టిక్స్‌లో రెండు ఆబ్జెక్టివ్‌, రెండు డిస్క్రిప్టివ్‌ ప్రశ్నపత్రాలు ఉంటాయి. స్టాటిస్టిక్స్‌ /మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌ /అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌ వీటిలో ఎందులోనైనా యూజీ / పీజీ కోర్సులు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 21 - 30 ఏళ్లలోపు ఉండాలి. ఐఎస్‌ఎస్‌కు ఎంపికైనవారు నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఓ), సెంట్రల్‌ స్టాటిస్టికల్‌ ఆర్గనైజేషన్‌ (సీఎస్‌ఓ), నేషనల్‌ శాంపిల్‌ ఆఫీస్‌ల్లో విధులు నిర్వర్తిస్తారు.

రాష్ట్రస్థాయిలో ఏఎస్‌ఓ: స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా డిగ్రీ చదివినవారు అసిస్టెంట్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీసర్‌ (ఏఎస్‌వో) పోస్టులకు అర్హులు. టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీలాంటి రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు ఈ ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల చేస్తాయి. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌ -1 జనరల్‌ స్టడీస్‌ అయితే పేపర్‌ -2 పూర్తిగా స్టాటిస్టిక్స్‌పైనే ఉంటుంది.

ఆర్‌బీఐలో గ్రేడ్‌-బీ ఆఫీసర్ల విభాగంలో డీఎస్‌ఐఎం పోస్టులకు స్టాటిస్టిక్స్‌, మ్యాథ్స్‌ల్లో పీజీ చదివినవాళ్లు అర్హులు. పరీక్షలో స్టాటిస్టిక్స్‌ పై ప్రత్యేక పేపర్లు ఉంటాయి. దాదాపు ఏటా ప్రకటన వెలువడుతుంది.

అగ్రికల్చరల్‌ స్టాటిస్టిక్స్‌ కోర్సు చదివినవారికి అగ్రికల్చరల్‌ సైంటిస్ట్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా అవకాశాలు లభిస్తాయి. యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టులకు స్టాట్‌లో పీజీతోపాటు నెట్‌ లేదా సెట్‌ ఉత్తీర్ణులైన వారు అర్హులు.

ప్రైవేటురంగం: స్టాటిస్టిక్స్‌కు సంబంధించి ఎక్కువ నియామకాలు ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ విభాగాల నుంచి జరుగుతున్నాయి. ప్రఖ్యాత సంస్థల్లో చదువుకున్న వారిని అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, సిబిల్‌, డెలాయిట్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌, సిటీ కార్పొరేషన్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌, హెచ్‌ఎస్‌బీసీ, ఐబీఎం, ఐసీఐసీఐ, జేపీమెర్గాన్‌, కేపీఎంజీ, నీల్సన్‌, మైక్రోసాఫ్ట్‌, రిలయన్స్‌, శాంసంగ్‌, వాల్‌మార్ట్‌, టీసీఎస్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌, బ్లూ ఓషన్‌ మార్కెటింగ్‌, యాక్సెంచర్‌, హెచ్‌పీ, జీఈ క్యాపిటల్‌, కాగ్నిజెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ, జెన్‌పాక్‌, ఇండియన్‌ మార్కెటింగ్‌ రిసెర్చ్‌ బ్యూరో తదితర సంస్థలెన్నో ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు అందిస్తున్నాయి. మోర్గాన్‌ స్టాన్లే, మెకిన్సే, గోల్డ్‌మన్‌ శాక్స్‌, యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు మొదలైనవి ఎనలిటికల్‌ విభాగాల్లోకి స్టాటిస్టిక్స్‌ నిపుణులను తీసుకుంటున్నాయి. ప్రముఖ సంస్థల నుంచి స్టాట్స్‌లో పీజీ పొందిన వారిని ఏడాదికి రూ.18 లక్షల వార్షిక ప్యాకేజీతో నియమించుకుంటున్నాయి. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లోనూ అవకాశాలు ఉంటాయి. అనలిస్ట్‌, బయో స్టాటిస్టీషియన్‌, బిజినెస్‌ స్టాటిస్టీషియన్‌, మార్కెటింగ్‌ అనలిస్ట్‌, డేటా అనలిస్ట్‌, డేటా సైంటిస్ట్‌, క్వాంటిటేటివ్‌ అనలిస్ట్‌, స్టాటిస్టీషియన్‌, కంటెంట్‌ అనలిస్ట్‌ తదితర హోదాల్లో బహుళజాతి కంపెనీల్లో అవకాశాలు లభిస్తున్నాయి.

కావాల్సిన నైపుణ్యాలు

మ్యాథ్స్‌పై ఆసక్తి, అంకెలపై పట్టు, సమాచార సేకరణ, విశ్లేషణ పరిజ్ఞానం, తర్కం, పరిశోధనాత్మక నైపుణ్యం, శోధించాలనే తపన.

వివిధ కోర్సులు

స్టాటిస్టిక్స్‌ కోర్సు యూజీ స్థాయి నుంచి మొదలవుతుంది. ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదివినవారు డిగ్రీలో స్టాట్‌ను ఒక సబ్జెక్టుగా తీసుకోవచ్చు. స్టాటిస్టిక్స్‌పై ప్రత్యేక ఆసక్తి ఉంటే యూజీలో స్టాటిస్టిక్స్‌, మ్యాథ్స్‌లతోపాటు ఎకనామిక్స్‌ లేదా కంప్యూటర్‌ సైన్స్‌ కాంబినేషన్‌ ఎంచుకోవడం మంచిది. డిగ్రీ స్థాయి నుంచే పూర్తిగా స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టునే అందించే సంస్థలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైంది ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ). ఈ సంస్థ ఇంటర్‌ విద్యార్థులకు బ్యాచిలర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (బీస్టాట్‌),. డిగ్రీ చదివినవారికి మాస్టర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ను అందిస్తోంది. బీస్టాట్‌లో చేరినవారికి నెలకు రూ.3000, ఎంస్టాట్‌కు నెలకు రూ.5000 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తుంది. స్టాట్‌ను ముఖ్యంగా రెండు విభాగాలుగా చెప్పుకోవచ్చు.

అవి ప్యూర్‌, అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌. ఎక్కువ కళాశాలలు ప్యూర్‌ స్టాటిస్టిక్స్‌పై కోర్సులు అందిస్తున్నాయి. ఐఎస్‌ఐ, ఐఐటీ (కాన్పూర్‌, ముంబై), సీఆర్‌రావు అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ - హైదరాబాద్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్సడ్‌ స్టడీస్‌, పుణె యూనివర్సిటీ స్టాటిస్టిక్స్‌లో ఉన్నతస్థాయి కోర్సులు అందిస్తున్నాయి. ఐఏఎస్‌ఆర్‌ఐ - దిల్లీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ స్టాటిస్టిక్స్‌, ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ వివిధ విభాగాల్లో స్టాటిస్టిక్స్‌ అనువర్తనాలపై దృష్టి సారిస్తున్నాయి. ఐఏఎస్‌ఆర్‌ఐ న్యూదిల్లీ ఎమ్మెస్సీ అగ్రికల్చరల్‌ స్టాటిస్టిక్స్‌ కోర్సు అందిస్తోంది. సెంట్రల్‌ స్టాటిస్టికల్‌ ఆర్గనైజేషన్‌ (సీఎస్‌ఓ) స్టాటిస్టిక్స్‌ పీజీ విద్యార్థులకు రెండు నెలల సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ అందిస్తోంది. ఇందుకోసం జనవరి - ఫిబ్రవరిల్లో ప్రకటన వెలువడుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున, శ్రీవేంకటేశ్వర తదితర యూనివర్సిటీలు స్టాటిస్టిక్స్‌లో పీజీ కోర్సులు అందిస్తున్నాయి.

ఆధునిక సాంకేతికతల్లోనూ..!

విస్తృతంగా ఉన్న సమాచారాన్ని విశ్లేషించడం, ప్రక్షాళన చేయడం డేటా సైంటిస్టుల ప్రధాన విధి. ఇది ప్రోగ్రామింగ్‌తో ముడిపడి ఉంటుంది. డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బిగ్‌డేటా, డేటా అనలిటిక్స్‌ మొదలైన ఆధునిక టెక్నాలజీలన్నింటికీ స్టాటిస్టిక్స్‌తో సంబంధం ఉంటోంది. సాధారణ గ్రాడ్యుయేట్లతో పోలిస్తే స్టాటిస్టిక్స్‌పై పట్టున్నవారు ఈ కోర్సుల్లో రాణించడం తేలిక. ప్రాబబిలిటీ, పర్ముటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్‌, ఆల్జీబ్రా మొదలైనవాటిపై పట్టు తప్పనిసరి. ఇన్సూరెన్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌లోనూ స్టాటిస్టిక్స్‌ కీలకంగా ఉంది.

Posted Date: 19-03-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌