• facebook
  • whatsapp
  • telegram

భ‌ద్ర‌మైన కెరియ‌ర్‌కు బ్లాక్‌చెయిన్ భ‌రోసా!

ఆధునిక టెక్నాల‌జీ నిపుణుల‌కు పెర‌గ‌నున్న డిమాండ్‌

బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ బ్యాంకింగ్, రియల్‌ ఎస్టేట్, సప్లై చైన్, వైద్య రంగం.. ఇలా ఎన్నో రంగాల్లో ఉపయోగిస్తున్న సాంకేతికత- బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ. దశాబ్ద కాలంగా ఇది వేగంగా అభివృద్ధి చెందుతూవస్తోంది. యు.ఎస్‌. స్కిల్‌ ఇండెక్స్‌లో ఇది అత్యంత త్వరితంగా ఎదుగుతున్న నైపుణ్యం. ఈ టెక్నాలజీని రోజువారీ ప్రక్రియల్లో ఉపయోగించడానికి పెద్దపెద్ద కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో బ్లాక్‌చెయిన్‌ ఇంజినీర్లకూ, డెవలపర్‌లకూ డిమాండ్‌ పెరుగుతోంది! 

ఇటీవలి కాలంలో మనం తరచుగా వింటున్న మాట- బిట్‌ కాయిన్‌. ఇదో క్రిప్టో కరెన్సీ. ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రస్తుతం తొమ్మిది వేలకు పైగా క్రిప్టో కరెన్సీలున్నాయి. వాటిలో బిట్‌ కాయిన్, ఈతిరియం, పోల్కడాట్, కార్దనో లాంటివి ప్రాముఖ్యమైనవి. టెస్లా, మైక్రోసాఫ్ట్, స్టార్‌బక్స్‌ వంటి మరిన్ని కంపెనీలు ఇప్పుడు బిట్‌ కాయిన్‌ పేమెంట్స్‌ని అంగీకరిస్తున్నాయి. ఈ క్రిప్టో కరెన్సీలు అన్నీ బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి . 

ఈ టెక్నాలజీ గురించి తెలుసుకునేముందు కాలంతో పాటు మన వ్యవస్థలు ఎలా మారాయో చూద్దాం!  ఒకప్పుడు, కొన్ని వందల సంవత్సరాల క్రితం, దాదాపు అందరు చిన్న పల్లెటూళ్లలో ఉండేవాళ్ళు. ప్రయాణాలూ తక్కువగా ఉండేవి. పల్లెటూళ్లలో జనాభా చిన్నగా ఉండేది కాబట్టి ఒకరికొకరికి బాగా పరిచయం ఉండేది. ఆ పరిచయాల ఆధారంగానే లావాదేవీలు జరిగేవి. అలాగే ఒకరిపై ఒకరికి నమ్మకం ఎక్కువగా ఉండేది. వస్తువులను ఒకదానితో మరొకటి మారకం చేసుకునే బార్టర్‌ పద్ధతి ఉండేది. ఏదైనా ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా మాటకు కట్టుబడి నమ్మకం మీదనే లావాదేవీలు జరిగేవి. కానీ కాలక్రమేణా జనాభా పెరుగుతూ వచ్చింది. నగరాలూ ఏర్పడ్డాయి. ప్రయాణాలు పెరిగాయి. అసలు ముందు ఎప్పుడూ తెలియని వ్యక్తితో లావాదేవీలు చేయాల్సిన అవసరాలు ఏర్పడ్డాయి. అప్పుడు ఆ నమ్మకాన్ని ఒక వ్యవస్థపై పెట్టడం మొదలయ్యింది. అలా డబ్బు అనేది  మొదలయింది. దాని మీద నమ్మకాన్నీ, అధికారాన్నీ బ్యాంకులపై పెట్టారు. ఇలా చాలా అంశాల్లో నమ్మకాన్ని ఒకచోట కేంద్రీకరించారు.

ఇలా నమ్మకాన్ని కేంద్రీకరించినప్పుడు ఒకవేళ ఆ వ్యవస్థ ఏదైనా పొరపాటు చేస్తే ఆ నమ్మకం దెబ్బతింటుంది. ఉదాహరణకు 2008 ఆర్థిక సంక్షోభంలో కొన్ని బ్యాంకులను మూసివేశారు. అలాంటివి చాలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అలా 2008 ఆర్థిక సంక్షోభం నుంచి పుట్టుకొచ్చిందే ఈ బిట్‌ కాయిన్‌. అంటే ఒక బ్యాంకు కానీ లేదా మరొకరి దగ్గర కానీ నమ్మకాన్ని కేంద్రీకరించకుండా ఉండడం కోసమే బిట్‌ కాయిన్‌ని సతోషి నాకామోటో అనే అజ్ఞాత వ్యక్తి రూపొందించారు. ఈ బిట్‌ కాయినే బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని వెలుగులోకి తీసుకువచ్చింది. 

ఇంతకీ ఏమిటిది? 

బ్లాక్‌ చెయిన్‌  అనేది ఒక లావాదేవీల రికార్డు. ఈ లావాదేవీల్లో డబ్బు, వస్తువులు, డేటా- ఇలా ఏదైనా ఉండవచ్చు. సూపర్‌ మార్కెట్‌ వద్ద వస్తువు కొనుగోలు చేయడం ఒక లావాదేవీ. ప్రభుత్వం మీకు ఒక ఐడీ నంబర్‌ కేటాయించడం లేదా మీ భూమి పట్టా ఇవ్వడం ఒక లావాదేవీ. ఇలా ఏదైనా అవ్వవచ్చు. బ్లాక్‌చెయిన్‌లో ఒక లావాదేవీ నమోదయింది అంటే ఇతర వినియోగదారులకు తెలియకుండా ఆ లావాదేవీలో డేటాను జోడించడం, తొలగించడం లేదా మార్చడం దాదాపు అసాధ్యం!  

ఈ రోజుల్లో ఏదైనా లావాదేవీలు ఒక కేంద్రీకృతమైన వ్యవస్థ (సెంట్రలైజ్డ్‌) మీద ఆధార పడుతున్నాయి. డబ్బు విషయంలో బ్యాంకు అనేది ఒక కేంద్రీకృత వ్యవస్థ. ఈ  బ్లాక్‌ చెయిన్‌లో ఒక వికేంద్రీకృత (డిసెంట్రలైజ్డ్‌) నెట్‌ వర్క్‌ ఉంటుంది. ఇక్కడ ధ్రువీకరణ అనేది వినియోగదారుల ఏకాభిప్రాయం వల్ల జరుగుతుంది. దీనితో నమ్మకం అనేది ఒక కేంద్రీకృత అధికారి లేదా వ్యవస్థ మీద ఉండడం కాకుండా వికేంద్రీకృతమై ఉంటుంది. క్రిప్టోగ్రఫీ, నెట్‌వర్క్స్, డిస్ట్రిబ్యూటెడ్‌ సిస్టమ్స్, గేమ్‌ థియరీ లాంటి వాటి ఆధారంగా బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ నడుస్తుంది.

కేంద్రీకృత, వికేంద్రీకృత నెట్‌వర్క్‌ల మధ్య తేడా 

సెంట్రలైజ్డ్‌ నెట్‌వర్క్‌లో డేటా అనేది ఒక చోట ఉంటుంది.  దీనివల్ల ఏమైనా అప్‌డేట్‌ చేయడం చాలా సులభం అవుతుంది. ఉదాహరణకు ఫేస్‌బుక్‌లో మీరు ఏదైనా అప్‌డేట్‌ చేయాలనుకుంటే కొద్ది సెకన్లలోనే చాలా సులభంగా చేస్తారు కదా! అలాగే దీనిలో మీ డేటా అంతా ఒక సెంట్రల్‌ అథారిటీ నియంత్రణ (కంట్రోల్‌్)లో ఉంటుంది. మొత్తం ఒకరి కంట్రోల్‌లో ఉండడం వల్ల దాన్నెవరైనా హ్యాక్‌ చేస్తే మీ డేటాకి కూడా ముప్పు ఉంటుంది. డిసెంట్రలైజ్డ్‌ నెట్‌వర్క్‌లో సెంట్రల్‌ అథారిటీ లాంటివేమీ ఉండవు. ఇదో డిస్ట్రిబ్యూట్‌ నెట్‌వర్క్‌. అంటే అందరికీ ఇందులో ఒక లావాదేవీని అంగీకరించడానికి వెసులుబాటు ఉంటుంది. మీ డేటా అంతా మీ నియంత్రణలోనే ఉంటుంది. ఇందులో మీ డేటాని హ్యాక్‌ చేయాలంటే డిస్ట్రిబ్యూటెడ్‌ నెట్‌వర్క్‌లో చాలామంది దగ్గర ఉన్న డేటాని మార్చవలసి ఉంటుంది. కానీ అలా చేయడం చాలా కష్టం. దాదాపు అసాధ్యం!   

పెరుగుతున్న డిమాండ్‌   

బ్లాక్‌ చెయిన్‌ ఇంజినీర్లకూ, డెవలపర్‌లకూ డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. బ్లాక్‌ చెయిన్‌ డెవలపర్‌ల జీతాలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. జాబ్‌ సెర్చ్‌ సైట్‌ ‘హైర్డ్‌’ నుంచి వచ్చిన కొత్త నివేదిక ప్రకారం- బ్లాక్‌ చెయిన్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలు ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు  517% డిమాండ్‌ పెరగనుంది.  బ్లాక్‌ చెయిన్‌ నైపుణ్యాలు కలిగిన సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ల జీతాలు యు.ఎస్‌.లో సుమారు కోటి రూపాయలు ఉన్నాయి. ఈ టెక్నాలజీ అనువర్తనమైన క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ విలువ కోటీ నలభై లక్షల కోట్ల పైనే ఉంది. ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫÄబెట్, బ్యాంక్‌ అఫ్‌ అమెరికా లాంటి ఎన్నో కంపెనీలు  బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని రోజువారీ ప్రక్రియల్లో ఉపయోగించడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ టెక్నాలజీలో  బ్లాక్‌ చెయిన్‌ డెవలపర్, బ్లాక్‌ చెయిన్‌ ఆర్కిటెక్ట్‌ లాంటి మరెన్నో ఉద్యోగాలు ఉంటాయి.  

బ్లాక్‌ చెయిన్‌ ప్రపంచ భవిష్యత్‌ అభివృద్ధికి  కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం అవుతుంది. బిట్‌కాయిన్‌ అనేది బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీలో చిన్న అనువర్తనం మాత్రమే. 

- జాక్‌ మా 

(కో ఫౌండర్, అలీబాబా)  

ఈ  బ్లాక్‌ చెయిన్‌ వల్ల ప్రజలు ఒకరిని ఒకరు నమ్ముతున్నారు. వారి మధ్య నమ్మకం అనేది చాలా పెరిగింది 

- డాన్‌ టాప్‌ స్కాట్‌ 

వివిధ రంగాల్లో..   

బ్యాంకింగ్‌ రంగంలోనే కాకుండా మరెన్నో రంగాల్లో దీన్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ఉబర్, అమెజాన్‌ లాంటివి మధ్యవర్తులుగా పని చేస్తున్నాయి. అందులో మీరు ఒక వస్తువు కొనుగోలు చేసినపుడు కట్టిన డబ్బుల్లో కొంత శాతం వాళ్ళకి వెళ్తుంది. అలా కాకుండా ఎటువంటి మధ్యవర్తుల మీదా ఆధారపడకుండా ఈ టెక్నాలజీతో నేరుగా పీర్‌ టు పీర్‌ ట్రాన్సాక్షన్లు చెయ్యవచ్చు. అలా రియల్‌ ఎస్టేట్, సప్లై చైన్, వైద్య రంగాల్లో ఈ బ్లాక్‌చైన్‌ ఉపయోగాలు ఉంటాయి.    

కెరియర్‌గా మలచుకోవాలంటే?  

బ్లాక్‌ చెయిన్‌ డెవలపర్‌గా కెరియర్‌ను మలుచుకోవాలంటే మొదటగా ప్రోగ్రామింగ్‌ ఫౌండేషన్స్‌లో నైపుణ్యం సాధించాలి. అలాగే ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామింగ్‌ బేసిక్స్‌ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే  క్రిప్టోగ్రఫీ, నెట్‌వర్క్స్, డిస్ట్రిబ్యూటెడ్‌ సిస్టమ్స్, గేమ్‌ థియరీ లాంటివి తెలుసుకోవడం కూడా మంచిదే!  లక్షల్లో వేతనాలు వచ్చే ఈ  బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీలో విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా వారి నైపుణ్యాన్ని పెంచుకోవడం చాలా అవసరం. యుడెమి, కోర్సెరా లాంటి వేదికల ద్వారా వాటిని నేర్చుకోవచ్చు. ఇంకా ఎన్నో ఇతర సంస్థలు శిక్షణను అందిస్తున్నాయి. ఐబీ హబ్స్, నెక్స్‌ట్‌ వేవ్‌ కంపెనీ వారు సీసీబీపీ ప్రోగ్రామ్స్‌ ద్వారా  బ్లాక్‌ చెయిన్‌ లాంటి మరెన్నో 4.0 టెక్నాలజీల్లో ప్రాథమిక స్థాయి నుంచి శిక్షణ ఇస్తున్నాయి.

వెబ్‌సైట్‌: www.ccbp.in ఈ నైపుణ్యాలు నేర్చుకుంటే విద్యార్థులు లక్షల వేతనాలు ఇచ్చే ఉద్యోగాలకు సిద్ధమైనట్లే.

Posted Date: 08-04-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌