• facebook
  • whatsapp
  • telegram

తొలి అడుగులో తడబడొద్దు! 

విదేశీ విద్యాభ్యాసం 

దరఖాస్తు ప్రక్రియలో జాగ్రత్తలు 

ఈ విద్యాసంవత్సరానికి విదేశీవిద్యపై దృష్టి పెడుతున్నవారికి ఇది కీలక సమయం. ఫాల్‌ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సమయంలో చేసే చిన్న పొరబాట్లు ఒక్కోసారి అడ్మిషన్‌ను దూరం చేస్తే.. మరోసారి అనుకున్న లక్ష్యాన్ని దూరం చేస్తాయి. విస్మరించే చిన్న అంశాలూ మంచి అవకాశాలను దూరం చేస్తాయి. అందుకే దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోవడంతోపాటు దృష్టిపెట్టాల్సిన అంశాలనూ గమనించుకోవాలి.

విదేశీవిద్య పరంగా మన విద్యార్థుల్లో ఉన్న క్రేజే వేరు. అందుకే ఒక్కో అడుగూ జాగ్రత్తగా వేసుకుంటూ వస్తారు. పక్కా ప్రణాళికతో టెస్ట్‌లకు సిద్ధమవడం, మంచి స్కోరుకు ప్రయత్నించడం, కావాల్సిన పత్రాలు సిద్ధం చేసుకోవడం.. వగైరా అన్నీ ఇందులో భాగమే. ఈ క్రమంలో కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాక అసలైన అతి ముఖ్యమైన దశ- మంచి విశ్వవిద్యాలయం/ విద్యాసంస్థలో ప్రవేశం సాధించడం. 

కానీ చాలామంది విద్యార్థులు తెలిసో తెలియకో చేసే పొరపాట్లు ఒక్కోసారి సమయాన్ని వృథా చేస్తే.. ఒక్కోసారి ఏకంగా లక్ష్యాన్నే దూరం చేసే వీలుంది. సహజంగా దరఖాస్తు సమయంలో ఏర్పడే ఒత్తిడే ఇందుకు కారణం. కాబట్టి, ఏడాది సమయం, డబ్బూ వృథా కావొద్దన్నా.. విదేశీ కలను కచ్చితంగా సొంతం చేసుకోవాలనుకున్నా.. ఆ పొరపాట్లు జరగకుండా చూసుకోవడం ప్రధానం.

వీటిని గమనించుకున్నారా? 

పరిశోధన

చాలావరకూ మన విద్యార్థుల ఎంపిక తల్లిదండ్రులు, స్నేహితులు, తెలిసినవారి మాటల ద్వారానే ఉంటుంది. విదేశీ విద్యా విషయమూ ఇందుకు మినహాయింపు కాదు. ఎవరో చెప్పారని కాకుండా.. కోరుకున్న అంశాలు/ సదుపాయాలు కళాశాలలో ఉన్నాయా? ఎంచుకున్న కోర్సుకు అది సరైనదేనా అన్న పరిశోధన దరఖాస్తుకు ముందే చేసుకోవాలి. అలాగే విద్యాసంస్థ ఉన్న ప్రదేశం భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, సంస్కృతి, ఆహార అలవాట్లు, ఇతర సదుపాయాలు, ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు.. వీటన్నింటినీ పరిశోధించుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఆపై పొరుగు దేశంలో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

ఆర్థిక ప్రణాళిక

విదేశీ విద్య విజయవంతంగా పూర్తిచేయడంలో అత్యంత కీలకమైనది ఆర్థిక ప్రణాళికే! కాబట్టి దీన్ని పకడ్బందీగా ప్లాన్‌ చేసుకోవాలి. చాలామంది పొరబాటు చేసేదీ ఇక్కడే. ఎక్కువమంది కేవలం ట్యూషన్‌ ఫీజుకే ప్రాధాన్యమిస్తారు. విమాన టికెట్ల నుంచి, ట్యూషన్, హాస్టల్‌ వసతి, ఆహారం, వీసా, పాస్‌పోర్ట్, ఉండే ప్రదేశంలో అయ్యే ఖర్చు మొదలైన విషయాలన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే తక్కువ ట్యూషన్‌ ఫీజు ఉందని ప్రణాళిక వేసుకోవద్దు. ఒక్కోసారి ఫీజు తక్కువ అయినా నివాస ఖర్చులు ఎక్కువ ఉండొచ్చు. రెండింటినీ పరిశీలించుకోవాలి.

సరైన విద్యా సంస్థేనా?

ఒక్కో దేశంలో ఒక్కో ప్రదేశం ఆకర్షిస్తుంది. కొన్నిసార్లు జీవనశైలి అయితే ఇంకొన్నిసార్లు ఉద్యోగావకాశాలు, తెలిసినవారు ఉండటం.. కారణమేదైనా అవ్వొచ్చు. వీటి ఆధారంగా కొందరు దగ్గర్లోని విశ్వవిద్యాలయం/ విద్యాసంస్థకు ప్రాధాన్యమిస్తుంటారు. ఒకసారి ఇలా రాజీపడితే తరువాత ఇబ్బందిపడేది విద్యార్థే! కాబట్టి, విశ్వవిద్యాలయ పేరుప్రఖ్యాతులు, అందించే స్కాలర్‌షిప్‌ సదుపాయాలు, కోర్సు తీరు, ప్లేస్‌మెంట్‌.. వీటి ఆధారంగా నిర్ణయం ఉండేలా చూసుకోవాలి.

మాట్లాడారా?

ఒక వస్తువును కొనడానికి ఒక్కోసారి ఎంతోమంది సలహాలు, అభిప్రాయాలు తీసుకుంటాం. అలాంటిది తెలియని ప్రదేశంలో, పరిచయంలేని మనుషుల మధ్యకు వెళ్లేటపుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? అదీ ఎంతో కీలకమైన కెరియర్‌ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంటర్నెట్‌లో ఎంతో సమాచారం దొరుకుతుంది. దాని ఆధారంగానే కళాశాల నిర్ణయం తీసేసుకుంటుంటారు. కానీ అదొక్కటే సరిపోదు. కేవలం దానిపైనే ఆధారపడి నిర్ణయం తీసేసుకోవద్దు. 

నేరుగా విశ్వవిద్యాలయ సిబ్బందితోనే మాట్లాడండి. అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడండి. సందేహాలను వారి నుంచే నివృత్తి చేసుకోండి. వారూ ఈ విషయంగా సాయం చేయడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారు. అవసరమైతే కౌన్సెలర్ల సాయమూ కోరొచ్చు.

వీటి సంగతేంటి?

విదేశీ విశ్వవిద్యాలయాలు చాలావరకూ తమ విద్యార్థులకు స్కాలర్‌షిప్, చదువుతూ పనిచేసే అవకాశాలను కల్పిస్తాయి. చాలామంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌ అర్హతలకు సరితూగమేమోనన్న మీమాంసతో దరఖాస్తు చేయడం మానేస్తుంటారు. కానీ ప్రయత్నిస్తే, ఎంచుకున్న దేశం, లింగం, ఎంచుకున్న సబ్జెక్టు, మీ ఆదాయం, ఎస్సే రాసిన తీరు.. ఇలా ఏదో ఒకదానిలో మీరు స్కాలర్‌షిప్‌ పొందడానికి అర్హులనిపించొచ్చు. అధికారుల ఆలోచనాతీరును ముందే పసిగట్టేయలేరు కాబట్టి, దరఖాస్తు చేసుకోకుండా వదిలేయొద్దు.

చాలామంది విద్యార్థులు తమ ఆర్థిక అవసరాల దృష్ట్యా చదువుతూ పనిచేయడానికి మొగ్గు చూపుతారు. కానీ వీటి నిబంధనలు దేశం, ఒక్కోసారి విద్యాసంస్థను బట్టి మారుతుంటాయి. వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవడం మేలు.

ఇలా చేయొద్దు!

తప్పుడు వివరాలొద్దు: మార్కులు, పర్సంటేజీలు, సాధించిన విజయాలు.. ప్రవేశం విషయంలో వీటికి ప్రాధాన్యముంటుదన్నది వాస్తవమే. కానీ, ప్రవేశం పొందాలనే ఉద్దేశంతో తప్పుడు సమాచారం ఇస్తే సీటు దక్కకపోగా ఒక్కోసారి విదేశాల్లో చదువుకునే అవకాశమే కోల్పోయే ప్రమాదముంది. దరఖాస్తులో పొందుపరిచే ప్రతి సమాచారానికీ రుజువులు ఉండేలా చూసుకోండి. అలాంటివాటినే దానిలో పొందుపరచండి.

పూర్తిగానే నింపారా?: దాదాపుగా 70% దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యేది ఈ కారణంగానే! దరఖాస్తు ఫారంతో పంపాల్సిన పత్రాలన్నింటినీ తప్పకుండా పంపాలి. వాటిని ముందుగానే జాబితాగా రాసుకుని, సిద్ధం చేసుకోవాలి. అంతా పక్కాగా ఉన్నాయనుకున్నపుడే పంపాలి. కొంత సమయం తీసుకున్నా ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకున్నాకే పంపాలి. అలాగే వారు కోరిన విధంగా ఉదా: రెజ్యూమెను పీడీఎఫ్‌ రూపంలో అడిగితే డాక్‌ రూపంలో పంపడం లాంటివి చేయొద్దు. చిన్న వివరాలే కానీ.. పెద్ద ప్రభావాన్ని చూపుతాయని గుర్తుంచుకోవాలి.

తప్పిదాలు: వ్యక్తులు, కళాశాల, సంస్థలు.. పేర్లు, అక్షర, వ్యాకరణ దోషాలు సరిచూసుకోవాలి. సాధారణంగా హడావుడిలోనో, చూసుకోకపోవడం వల్లో ఇలాంటి పొరబాట్లు సాధారణమే. కానీ ఇవి విద్యార్థి అశ్రద్ధ, నిర్లక్ష్యాలుగా పరిగణించే అవకాశముంది. దరఖాస్తు ప్రక్రియ కొంత సుదీర్ఘమైనదే. కానీ ఈ చిన్న దోషాలు దరఖాస్తును తిరస్కరణకు గురిచేసే అవకాశముంది. వీలైతే మరొకరికి చూపించడం ద్వారా అయినా రూఢి చేసుకోవాలి.

కోర్సు.. సరైనదేనా!: దరఖాస్తు చేసుకుని, ఎంపికై, అంతదూరం ప్రయాణించి.. తీరా చూసుకుంటే మీరు అనుకున్న దానిలో కాకుండా వేరే కోర్సులో చేరాల్సివస్తే..? ఒక్క సెకను కాలంలో చేసిన చిన్న పొరబాటు కోరుకున్న కోర్సుకు దూరం చేయడమే కాకుండా అప్పటిదాకా పడ్డ కష్టాన్నీ వృథా చేస్తుంది. చాలా తేలికగా కనిపించినా ఏటా ఎంతోమంది విద్యార్థులు దీని కారణంగా నష్టపోతున్నారు. కాబట్టి, ముందుగానే కోర్సు గురించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలి. కంటెంట్, మీకు తగినదో లేదో చూసుకోవడం ద్వారా దీని నుంచి తప్పించుకోవచ్చు.

ధ్రువపత్రాలు: మొదటిసారి దరఖాస్తు చేసుకునేవారందరూ సాధారణంగా ధ్రువపత్రాల విషయంలో ఎక్కువ పొరబాట్లు చేస్తుంటారని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. దేశాన్ని బట్టి కోరే అంశాల్లో మార్పులుంటాయి. యూనివర్సిటీ/ వీసా ఆఫీస్‌ ఏవైనా డాక్యుమెంట్లను కోరినపుడు వాటిని తప్పక పంపాల్సి ఉంటుంది. ఇక్కడ పంపడం సమస్య కాదు. కానీ.. చాలావరకూ దేశాలు వాటిని ఇంగ్లిష్‌లో తర్జుమా చేసుండాల్సిందిగా కోరతాయి. గ్రేడ్‌ కన్వర్షన్, నోటరైజేషన్‌ అంశాలను పక్కాగా చూసుకోవాలి. వీటికి సంబంధించి సందేహాలుంటే యూనివర్సిటీ ప్రతినిధులను నేరుగా అడిగి తెలుసుకోవచ్చు. 

Posted Date : 25-02-2021


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం