• facebook
  • whatsapp
  • telegram

ఎస్‌ఓపీ ఎలా రాయాలి?

విదేశీ వర్సిటీల్లో ప్రవేశాలపై నిపుణుల సూచనలు

ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రవేశం కోరుతూ విదేశీ విశ్వ విద్యాలయాలకు పంపే దరఖాస్తుతో పాటు స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ (SOP) ను జోడించాలి. కెరియర్‌ మార్గాన్నీ, భవిష్యత్తు లక్ష్యాలనూ పొందికగా స్పష్టం చేస్తూ దీన్ని రాయాల్సివుంటుంది. హడావుడిగా, అశ్రద్ధగా రాస్తే అడ్మిషన్‌ అవకాశం చేజారిపోతుందని గ్రహించి దీన్ని మెరుగ్గా రాయటంపై విద్యార్థులు తగిన కసరత్తు చేయాలి!  

అడ్మిషన్‌ దరఖాస్తుకు సంబంధించి రాసే స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ (SOP) కేవలం లాంఛనప్రాయమైనదనుకుంటే పొరబడినట్టే. ఎంతో ప్రాముఖ్యం ఉన్న పత్రం ఈ ‘ఉద్దేశ ప్రకటన’. ఇది మీ గురించి విద్యాసంస్థ  బాధ్యులకు మీరెవరు, మీ విద్యాపరమైన, వృత్తిపరమైన ఆసక్తులు ఏమిటి, మీరు నిర్దిష్ట మేజర్‌ను ఎంచుకోవడానికి ఎలా ఆసక్తిని పెంచుకున్నారు,  ప్రోగ్రామ్‌కూ, దరఖాస్తు చేస్తున్న సంస్థకూ మీరు ఏమైనా ప్రాముఖ్యం జోడించగలరా.. అనేవి వివరిస్తుంది. ఇంకా.. మీరు తరగతికి అదనపు విలువ ఎలా అవుతారో సూచిస్తూ మీకెందుకు సీటు ఇవ్వాలో స్పష్టం చేస్తుంది. 

కెనడా లాంటి దేశాల్లో SOP విద్యాసంస్థకు సమర్పించే పత్రం మాత్రమే కాదు. విద్యార్థి సమర్పించే వీసా డాక్యుమెంట్లలోనూ ఇదో భాగం. అందువల్ల SOP ని మెరుగ్గా రూపొందిస్తే అది  మీ కలల విద్యాసంస్థలో చేరే అవకాశాన్ని అందివ్వడమే కాకుండా వీసా అవకాశాలను కూడా పెంచుతుంది. మీరు చదివే డిగ్రీపై మీకున్న ఆసక్తినీ, విజయం సాధించడంలో మీ తపననూ, ప్రోగ్రాం లక్ష్యాలతో మీ అమరికనూ గురించి వీసా అధికారిని ఒప్పించేలా..స్టేట్‌ మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ను తయారుచేయాలి.

చేయవలసినవి

పరిశోధనపై ఉన్న ఆసక్తిని స్పష్టం చేయాలి. మీ గురించి సరిగా తెలుసుకోవడంలో విద్యాసంస్థ బాధ్యులకు సహాయపడేలా ఉండాలి. 

మీ ఆసక్తి గురించి వాస్తవికమైన, సంక్షిప్త వివరణను అందించండి. అది పకడ్బందీగా ఉండాలి. 

వివరాలను చెప్పేటపుడు నిడివి నియంత్రణ అవసరం. విభిన్నంగా, సృజనాత్మకంగా ఉండాలి. దేనికీ నకలుగా ఉండకూడదు. 

స్పెల్లింగ్, వ్యాకరణ దోషాలు లేకుండా సరిచూసుకోవాలి. రాసే పత్రంలో పరిణతి, సానుకూల స్వరం ధ్వనించేలా రాయటం ప్రధానం. 

మీ సీనియర్లు/ అనుభవజ్ఞులకు చూపించి వారి అభిప్రాయాన్ని తెలుసుకోండి….

జాగ్రత్తలు

హడావుడిగా ఎస్‌ఓపీ రాసి పంపకూడదు. 

అనాసక్తికరమైన ఆరంభం, నిస్సారమైన ముగింపు ఉండకూడదు. 

అతిశయోక్తులు దొర్లకుండా శ్రద్ధ తీసుకోవాలి.

అనవసరమైన సమాచారం అసలుండకుండా జాగ్రత్తపడాలి.  

మీ గ్రేడ్‌లు, ఇంటర్న్‌షిప్‌ల అనుభవం గురించి వాస్తవాలను మాత్రమే రాయాలి. 

మూసలో కాకుండా భిన్నంగా ఉండేలా ప్రయత్నించాలి. చురుకుదనమే కానీ నిష్క్రియ ధ్వనించకూడదు. 

వైఫల్యాలను దాచిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ వాటి నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు, అక్కడ నుంచి మీరెలా పుంజుకున్నారు అనేవి రాయటం మర్చిపోవద్దు. 

ఆకర్షణీయమైన డిజైనింగ్‌ అవసరం లేదు. ఇతరుల నుంచి ఎన్నడూ కాపీ చేయకూడదు. 

ప్రామాణిక అకడమిక్‌ ఫార్మాటింగ్‌ (12 పాయింట్‌ ఫాంట్, 1 అంగుళం మార్జిన్‌) ఉపయోగించండి.

ఈ ముఖ్యాంశాలు తప్పనిసరి 

1. వ్యక్తిగత నేపథ్యం: మీ ఆసక్తులూ, ప్రేరణల గురించి పేర్కొంటూ మిమ్మల్ని పరిచయం చేసుకోండి. ఏ అంశాలు మీ అధ్యయన అభిలాషను రేకెత్తించాయో.. ప్రస్తావించవచ్చు. 

2. విద్యా నేపథ్యం, అనుభవం: మీ పూర్వ అర్హతను సూచించాలి. వృత్తి అనుభవం, ఇంటర్న్‌షిప్‌ వివరాలను క్లుప్తంగా జోడించాలి. 

3. ఎంచుకున్న కారణం: మీరు ఆ దేశాన్నీ, విశ్వవిద్యాలయాన్నీ, కోర్సునూ ఎందుకు ఎంచుకున్నారో స్పష్టం చేయాలి. నిర్దిష్ట మేజర్‌ని అధ్యయనం చేయాలని ఏ కారణంతో నిర్ణయించుకున్నారో పేర్కొనాలి. మీకు ఆసక్తి ఉన్న డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. గత విద్యా నేపథ్యం, అనుభవం, ఇంటర్న్‌షిప్‌లతో అనుసంధానం చేయడం ద్వారా మీ ఉత్సుకతనూ, సవాళ్లకు సంసిద్ధతనూ సూచించాలి..  

4. ప్రీ రిక్విజిట్‌ పరీక్షలు: ఆ దేశంలో, విద్యాసంస్థలో ప్రవేశం పొందడానికి రాసిన ప్రీ రిక్విజిట్‌ టెస్టులైన IELTS/ PTE/ TOEFL/, GRE, GMAT, SATగి మొదలైన వాటిని ప్రస్తావించండి. మీరు స్కోర్లను ఎలా సాధించారో, అవి ఎంత మెరుగ్గా ఉన్నాయో పేర్కొనవచ్చు. 

5. ఆ కోర్సే ఎందుకు: మీరు ఆ కోర్సునే ఎందుకు చదవాలనుకుంటున్నారు, మీ ప్రణాళికలేమిటన్నది ప్రస్తావించాలి. ప్రోగ్రాం, దాని అధ్యాపకులు ఈ లక్ష్యాలను చేరుకోవడంలో మీకెలా సహాయం చేయగలరో రాయాలి. మీరు తరగతి, ప్రోగ్రామ్‌లకు తిరిగి ఎలా సహకరిస్తారనేది చెప్పటమూ ముఖ్యమే. విద్యాసంస్థ, కోర్సు పూర్వ విద్యార్థుల గురించీ, వారెలా రాణించారనేదీ చెప్పవచ్చు. 

6. భవిష్యత్‌ ప్రణాళికలకు కోర్సు సహకారం: మీ డిగ్రీతో మీరు ఏమి చేయాలని భావిస్తున్నారు? ఉద్యోగాలు పొందడంలో/ వ్యాపారాన్ని ప్రారంభించడంలో ఈ కోర్సు మీకెలా సహాయం చేస్తుంది?.. వీటి ప్రస్తావన. 

7. స్వదేశానికి తిరిగి వచ్చే ఉద్దేశం: చదవాలనుకున్న కోర్సు పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చే ప్రణాళిక గురించీ ప్రస్తావించాలి. మాతృదేశంతో మీ వ్యక్తిగత అనుబంధాల గురించి రాయవచ్చు. 

SOP స్వరూపం ప్రామాణికమైన ఎస్‌ఓపీ స్వరూపం ఇలా ఉండవచ్చు.

మొదటి పేరా: ఆసక్తికరమైన  పరిచయం

రెండు, మూడు పేరాలు: విద్యానేపథ్యం,  సాధించిన  విజయాలు

నాలుగో  పేరా: ఆ కోర్సును ఎంచుకోవడానికి కారణం

ఐదో పేరా: చక్కని ముగింపు 

న‌మూనా SOP కోసం క్లిక్‌ చేయండి...
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఐటీ సంస్థల్లో ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాల జోరు!

‣ క్యాంపస్‌ కొలువు కొట్టాలంటే?

‣ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లకు సిద్ధమేనా?

‣ నిరుద్యోగులకు రైల్వే ఉచిత శిక్షణ

‣ మర్యాదలకూ మేనేజర్లు!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-02-2022


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం