• facebook
  • whatsapp
  • telegram

ఎడ్యుకేష‌న్ లోన్‌ ఎలా తీసుకోవాలి?

ఒకేసారి అందుబాటులో అన్ని సంస్థ‌ల స‌మాచారం

విదేశాల్లో చదవాలంటే ఎడ్యుకేషన్‌ లోన్‌ ఎలా తీసుకుంటాం? నచ్చిన కాలేజీకి దరఖాస్తు చేసుకుని, అందుబాటులో ఉన్న బ్యాంకులకు రుణం ఇవ్వాల్సిందిగా వివరాలు అందిస్తాం. అప్పటివరకూ తరగతులకే పరిమితమైన విద్యార్థులకు... ఈ విషయాలపై అంతగా అవగాహన ఉండటం కొంత కష్టమే! పైగా మనకు లభిస్తున్న రుణం అన్నివిధాలా తగినదా కాదా అనేదీ తెలుసుకోవాలి. అందుకే దీన్ని మరింత సులభం చేసేందుకు ‘లోన్‌ బిడ్డింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌’ విద్యార్థుల కోసం అందుబాటులోకి వచ్చాయి.


విదేశీ విద్య ఎంతో మంది విద్యార్థుల కల! ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవారికి... అక్కడికి వెళ్లి చదువుకోవాలని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలనీ ఉంటుంది. అయితే ఇది కాస్త ఖరీదైన వ్యవహారం. మన దేశం నుంచి బయట దేశాలకు చదువుకునేందుకు వెళ్లే విద్యార్థికి... ఎంచుకున్న కోర్సును బట్టి సగటున రూ.35 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకూ ఖర్చవుతుందని ఒక అంచనా. అందుకే ఈ వ్యయాన్ని భరించేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటూ ఉంటారు.


ఫారిన్‌ చదువులతో అవకాశాలు మెరుగవ్వడమే కాదు, జాబ్‌ మార్కెట్‌లో అభ్యర్థికి అధిక ప్రాధాన్యం లభిస్తుంది. గతంలో చాలామంది విద్యార్థులు తమ ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రుల పొదుపులపైన, స్కాలర్‌షిప్స్‌పైనా ఆధారపడేవారు. అయితే ఇవి పూర్తిగా సరిపోవు. ఫీజులు, ఇన్సూరెన్స్, ఉండటానికి, తినడానికి, రవాణా, పుస్తకాలు, ఇతర అవసరాలు.. ఇలా చెబుతూ పోతే ఖర్చుల జాబితా చాలా ఉంటుంది. అందుకే విద్యారుణం తీసుకుని చదివి, ఉద్యోగం వచ్చాక తిరిగి చెల్లించాలనే ఆలోచన, అవగాహన పెరుగుతోంది. ఈ రుణాలకు పన్ను మినహాయింపులు వర్తించడం మరో కారణం. విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల్లో దాదాపు 70 శాతం మంది రుణాలు తీసుకుంటున్నారు.


అయితే ఈ రుణ ప్రక్రియ సంప్రదాయ రీతిలో జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండేవి. విద్యార్థులు బ్యాంకులను, యూనివర్సిటీలను ఎలా సంప్రదించాలి, ఎలా దరఖాస్తు చేయాలనే విషయాల కోసం ఇతరులపై ఆధారపడేవారు. తమ మార్కులు, ప్రొఫైల్‌కు తగినట్టు తక్కువ వడ్డీతో రుణం ఎలా పొందాలో తెలుసుకోవడం కొంత కష్టంగా ఉండేది. చదువు పూర్తయ్యాక ఆ విద్యార్థి తమకు అందుబాటులో ఉంటాడో లేదో, తిరిగి చెల్లిస్తాడో లేదోనన్న ఆందోళనలో బ్యాంకులు ఉండేవి.. ప్రతిభ ఉన్నా ఈ ప్రక్రియలో ఇబ్బందులతో విద్యార్థులు వెళ్లలేక, యూనివర్సిటీలు చక్కటి అభ్యర్థులను కోల్పోయేవి. అందుకే ఈ సమస్యలన్నీ  తీర్చేలా... వీటి మధ్య సంధానకర్తలా పనిచేసేలా లోన్‌ బిడ్డింగ్‌ సంస్థలు అవతరించాయి. బ్యాంకులు, నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల సాయంతో విద్యార్థులకు మెరుగైన లోన్లు అందిస్తున్నాయి. ‘తక్కువ వడ్డీలో అధిక రుణం ఎక్కడ దొరుకుతుంది... బ్యాంకులు - ఇతర ఆర్థిక సంస్థలు... రుణం ఎందులో తీసుకోవాలి, ఏయే డాక్యుమెంట్లు కావాలి...’ ఇలా అన్ని విషయాల్లోనూ ఇవి విద్యార్థులకు తోడ్పాటు అందిస్తున్నాయి. దేశీయంగానే కాక, విదేశాల్లో ఉన్న రుణదాతలనూ ఇవి భాగస్వామ్యం చేస్తున్నాయి.


ఉపయోగించడం ఎలా?


విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకునే విద్యార్థులు ఈ ప్లాట్‌ఫామ్స్‌ యాప్స్‌ లేదా వెబ్‌సైట్లలోకి వెళ్లి తమ పూర్తి వివరాలతో నమోదు చేసుకోవాలి. అప్పుడు వారి మార్కులు, ఇతర వివరాల అధారంగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు తాము ఎంత రుణం, ఏ శాతం వడ్డీకి ఇవ్వగలమనేది ఆ విద్యార్థికి పూర్తి వివరాలు తెలియజేస్తాయి. ఇలా ఒకేసారి అన్ని సంస్థల నుంచి సమాచారం రావడం వల్ల.. విద్యార్థి తనకు ఏది ఉత్తమమైన ఆఫర్‌ అని భావిస్తాడో దాన్ని ఎంచుకుని అంగీకరించవచ్చు.


ఈ ప్లాట్‌ఫామ్స్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి విద్యార్థి ప్రొఫైల్‌కు తగిన లోన్‌ను సూచిస్తాయి. ఇదంతా ఎక్కడికీ వెళ్లకుండా, ఆన్‌లైన్‌లోనే జరిగిపోతుంది. దీనివల్ల విద్యార్థికి, సంస్థలకు బోలెడంత సమయం ఆదా అవుతుంది. 


ఈ ప్లాట్‌ఫామ్స్‌లో విద్యార్థి తన రుణ ప్రక్రియ ఏ స్థాయిలో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంది. దీనివల్ల సమయానికి నచ్చిన విద్యాలయంలో సీటు పొందే వీలుంటుంది. ప్లాట్‌ఫామ్స్‌ను బట్టి... రుణదాతలు తమ బిడ్‌ ఏంటో అరగంట నుంచి 24 గంటల్లో తెలుపుతారు. మొత్తం ప్రక్రియ సగటున 2 రోజుల్లో పూర్తయ్యేలా ఈ ప్లాట్‌ఫామ్స్‌ వేగంగా పనిచేస్తున్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో చూసి, నచ్చిన సంస్థను ఎంపిక చేసుకోవచ్చు.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స‌మూహంలో స‌త్తా చూపించండి! 

‣ ఎన్‌సీఎల్‌  405 ఉద్యోగాలు!

‣ గెలుద్దాం గ్రూప్‌-4!

‣ వాయుసేన‌లో పైలెట్ పోస్టు కావాలా?

‣ నాలుగేళ్ల డిగ్రీతో నేరుగా పీహెచ్‌డీ!

‣ ఊహ‌ల‌కు రూప‌మిస్తూ... ఉత్ప‌త్తులు రూపొందిస్తూ!

‣ పవర్‌ గ్రిడ్‌లో కొలువు కావాలా?

Posted Date : 08-12-2022


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం