• facebook
  • whatsapp
  • telegram

అమెరికాలో అడ్వాన్స్‌డ్‌ కోర్సులు ఇవే!

సబ్జెక్టులు, లభించే ఉద్యోగాల వివరాలు

అమెరికాలో లభిస్తున్న ఉన్నత విద్యావకాశాల గురించి.. ఫీజులు, వసతి, ఇతర ఏర్పాట్ల గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. మరి ఇప్పుడు అక్కడ లభించే వివిధ రకాల అడ్వాన్స్‌డ్‌ కోర్సులు, సబ్జెక్టుల తీరుతెన్నులు, లభించే ఉద్యోగాలు - జీతభత్యాలు.. వీటన్నింటి గురించి వివరంగా తెలుసుకుందామా!

ఒక కోర్సు గురించి మనం ఆలోచిస్తున్నాం అంటే.. దాని ద్వారా వెళ్లే కెరియర్‌ మార్గం ఎలా ఉంటుందో కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా పీజీ స్థాయిలో విద్యార్థులు ఎంచుకునే స్పెషలైజేషన్లపైనే వారి ఉద్యోగ జీవితం ఆధారపడి ఉంటుంది. అమెరికా వెళ్లాలని ఆశిస్తున్న విద్యార్థుల్లో అధికశాతం మంది ఎంచుకుంటున్నది.. కంప్యూటర్‌ సైన్స్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్, బిజినెస్‌ అనలిటిక్స్, గేమ్‌ డిజైన్, ఎలక్ట్రికల్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్, ఇతర అన్ని ఇంజినీరింగ్‌ విభాగాలు, హెల్త్‌ ఇన్ఫర్మేటిక్స్, పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫార్మకాలజీ కోర్సులనే! అందుకే దీనికి తగినట్టుగా మనం కూడా వీటిలో ముఖ్యమైన కోర్సుల పూర్తివివరాలను ఇప్పుడు చూద్దాం.

డేటాసైన్స్‌

డొమైన్‌ అనుభవం, ప్రోగామింగ్‌ నైపుణ్యాలు, గణితం, గణాంకాలను ఉపయోగిస్తూ డేటాను అధ్యయనం చేసే విభాగమిది. డేటా సైన్స్‌ నిపుణులు అంకెలు, టెక్స్ట్, చిత్రాలు, వీడియో, ఆడియో.. వంటి వాటి ద్వారా మెషిన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్స్‌ వినియోగించి ఆర్టిఫిషియల్‌ సిస్టమ్స్‌ తయారుచేస్తారు. తద్వారా మనుషులు చేసే పనులను మెషీన్లతో చేయించగలరు. ప్రస్తుతం ఇది మార్కెట్లో చాలా విలువైన వ్యాపారం. 

డేటా నుంచి అవసరమైన సమాధానాలు రాబట్టేందుకు డేటా సైన్స్‌ వివిధ రకాల టూల్స్, పద్ధతులు, టెక్నాలజీని  ఉపయోగిస్తుంది. ప్రస్తుత వ్యాపార రంగాల్లో సమాచారం చాలా ఎక్కువ. ఈ-కామర్స్, మెడిసిన్, ఫైనాన్స్‌ వంటి చాలా రంగాల్లో ఆన్‌లైన్‌ సిస్టమ్స్, పేమెంట్‌ పోర్టల్స్‌ వినియోగదారుడి సమాచారాన్ని టెక్ట్స్, ఆడియో, వీడియో, చిత్రాలుగా సేకరిస్తున్నాయి. ఆ డేటాను తిరిగి లాభదాయకమైన విధానంలో ఉపయోగించాలంటే.. అందుకు డేటా సైన్స్‌ సహాయం కావాలి.

డేటా సైన్స్‌లో భాగంగా కంప్యూటింగ్‌ థియరీ, అడ్వాన్స్‌డ్‌ డేటా సైన్స్, మెషిన్‌ లెర్నింగ్, డేటా విజువలైజేషన్, డేటా  మైనింగ్, స్టాటిస్టిక్స్, ఎస్‌క్యూఎల్, ఎస్‌ఏఎస్, పైతాన్‌ వంటి ప్రోగామింగ్‌ లాంగ్వేజ్‌లు  నేర్చుకుంటారు. 

ఇందులో పట్టా పుచ్చుకున్న అభ్యర్థులు డేటా అనలిస్ట్, బిజినెస్‌ అనలిస్ట్, డేటా అనలిస్ట్‌ మేనేజర్, డేటా ఆర్కిటెక్ట్, డేటా అడ్మినిస్ట్రేటర్, బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ మేనేజర్, డేటా క్వాలిటీ అనలిస్ట్‌ వంటి ఉద్యోగాల్లోకి వెళ్లగలరు. 

‣ డేటా సైన్స్‌లో ఉద్యోగం పొందిన అభ్యర్థి జీతం సగటున రూ.75 లక్షల నుంచి రూ. కోటిన్నర వరకూ ఉంటుంది. డేటా ఇంజినీర్లకు డిమాండ్‌ రానురానూ పెరుగుతోంది.

హెల్త్‌ ఇన్ఫర్మేటిక్స్‌

హెల్త్‌ ఇన్ఫర్మేటిక్స్‌ను హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ అని కూడా అంటారు. ఇది ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఆరోగ్య రికార్డులను భద్రపరచడం ద్వారా మెరుగైన వైద్యసేవలు అందేలా చేయడం దీని ఉద్దేశం. హెల్త్‌కేర్‌ అనలిస్ట్‌ అనేవారు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని రోగులకు మెరుగైన వైద్యం అందేలా సాయపడతారు. కొవిడ్‌ విజృంభించిన సమయంలో దీనికి చాలా ప్రాధాన్యం ఏర్పడింది. 

ఫార్మాస్యూటికల్‌ సైన్స్, మెడిసిన్, ఇతర సైన్స్‌ విభాగాలు చదివిన విద్యార్థులకు ఇది చక్కని కెరియర్‌ మార్గం. ఏదైనా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లో ప్రవేశం ఉండటం మరింత ఉపయోగపడుతుంది.

హెల్త్‌ ఇన్ఫర్మేటిక్స్‌లో హెల్త్‌ డేటా అనలిటిక్స్‌ కాన్సన్‌ట్రేషన్, హెల్త్‌ ఇన్ఫర్మేటిక్స్‌ మేనేజ్‌మెంట్, పాపులేషన్‌ హెల్త్‌ కాన్సన్‌ట్రేషన్, క్లినికల్‌ అండ్‌ బిజినెస్‌ ఇంటెలిజెన్స్, హెల్త్‌ కేర్‌ ఆపరేషన్స్‌ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి. విద్యార్థి ఎంచుకున్న విశ్వవిద్యాలయాన్ని అనుసరించి ఇంకా వేరేవి కూడా ఉండవచ్చు. 

ఈ పట్టా ఉన్నవారు ఇన్ఫర్మేటిక్స్‌ అనలిస్ట్, క్లినికల్‌ ఇన్ఫర్మేటిసిస్ట్, ఎలక్ట్రానిక్‌ మెడికల్‌ రికార్డ్‌ కీపర్, ఇన్ఫర్మేటిక్స్‌ స్పెషలిస్ట్, చీఫ్‌ మెడికల్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్, హెల్త్‌ ఇన్ఫర్మేటిక్స్‌ కన్సల్టెంట్, ఇన్ఫర్మేటిక్స్‌ డైరెక్టర్‌ వంటి పోస్టులు పొందవచ్చు.  

వీరికి సగటున జీతం ఏడాదికి రూ.53 లక్షల నుంచి రూ.కోటి ముప్ఫై లక్షల వరకూ ఉంటుంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌

ఇప్పుడు మనం వాడుతోన్న చాలా సాంకేతిక ఉపకరణాల్లో ఏఐను ఉపయోగిస్తూ ఉండటం వల్ల రానున్న కాలంలో టెక్నాలజీ పరిశ్రమలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రముఖ పాత్ర పోషించనుంది. 

ఇందులో పీజీ చేసిన విద్యార్థులు థియరిటికల్‌ ఫౌండేషన్స్, అల్గారిథమ్‌ డెవలప్‌మెంట్‌ వంటి విషయాలపై బలమైన పట్టు సంపాదిస్తారు. వివిధ రకాలైన ఇంజినీరింగ్‌ అప్లికేషన్లపై లోతుగా అధ్యయనం చేస్తారు. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యాలను కలగలిపి నేర్చుకుంటారు. 

అమెరికాలోని చాలా విశ్వవిద్యాలయాల్లో ఏఐ కోర్సులో మెషిన్‌ లెర్నింగ్, డీప్‌ లెర్నింగ్, అల్గారిథమ్స్, డేటా అనలిటిక్స్, డేటా మైనింగ్, ఇమేజ్‌ ప్రాసెసింగ్, కంప్యూటర్‌ విజన్, ఎంబెడెడ్‌ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్, కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్స్‌ వంటి వివిధ సబ్జెక్టులు నేర్పిస్తారు. 

యూనివర్సిటీని బట్టి ఇందులో చిన్నాచితకా మార్పులు ఉండొచ్చు. కానీ ప్రాథమికంగా నేర్పించే అంశాలు మాత్రం పైన చెప్పిన విధంగానే ఉంటాయి. ఏఐని ఉపయోగించే అప్లికేషన్లను బట్టి స్పెషలైజేషన్లు ఆధారపడి ఉంటాయి. 

ఏఐలో మాస్టర్స్‌ డిగ్రీ ఉన్న విద్యార్థులు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంజినీర్, డేటా ఇంజినీర్, డేటా సైంటిస్ట్, మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్, ఆర్‌అండ్‌డీ ఇంజినీర్, ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్స్‌ అనలిస్ట్‌ వంటి వివిధ ఉద్యోగాలను ఎంచుకోవచ్చు. 

ఈ కోర్సు చేసి ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ఏడాదికి దాదాపు రూ.80 లక్షల వరకూ జీతం లభిస్తుంది. ఇందులో అత్యధికంగా రూ.కోటిన్నర తీసుకునేవారూ ఉన్నారు.

ఇందులో చేరదలిచేవారు విశ్లేషణాత్మక (అనలిటికల్‌), కోడింగ్‌ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించాలి.

బిజినెస్‌ అనలిటిక్స్‌

వ్యాపారాభివృద్ధిలో సమాచారాన్ని విశ్లేషించడం చాలా ముఖ్యం. డేటా, స్టాటిస్టికల్‌ అనాలిసిస్‌ వంటివి వ్యాపారాన్ని అంచనా వేయడానికి, కావాల్సిన సూచనలు ఇవ్వడానికి, అభివృద్ధి బాటలో పయనించేలా తోడ్పాటు అందించడానికి ఉపయోగపడతాయి. బిజినెస్‌ అనలిటిక్స్‌లో డేటా సేకరణ, డేటా మైనింగ్, సీక్వెన్స్‌ గుర్తింపు, టెక్ట్స్‌ మైనింగ్, ఫోర్‌కాస్టింగ్, అంచనాలు, ఆప్టిమైజేషన్, డేటా విజువలైజేషన్‌ వంటివి భాగం.

చాలా కంపెనీలు తమ నిర్ణయాలను తమవద్దనున్న సమాచారం ఆధారంగానే తీసుకుంటాయి. తద్వారా కంపెనీ అభివృద్ధి అంచనాలకు తగినట్టుగా ఉందా లేదా అనేది చూసుకుంటాయి. 

ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఏ స్ట్రీమ్‌ విద్యార్థులైనా సరే బిజినెస్‌ అనలిటిక్స్‌ చదువుకోవచ్చు. ఇందులో సబ్జెక్టు పరిమితులు లేవు. 

అమెరికాలో లభిస్తున్న బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సులో భాగంగా విద్యార్థులు బిజినెస్‌ ఇంటెలిజెన్స్, డేటా మైనింగ్, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ అనలిటిక్స్, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు, బిగ్‌ డేటా -  బిజినెస్, మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి సబ్జెక్టులు చదువుకుంటారు. యూనివర్సిటీని బట్టి ఈ సబ్జెక్టుల్లో మార్పులు ఉండవచ్చు. 

ఈ కోర్సు చదివిన అభ్యర్థి బిజినెస్‌ అనలిస్ట్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, ప్రోగామ్‌ మేనేజర్, మార్కెటింగ్‌ మేనేజర్, మార్కెట్‌ రిసెర్చ్‌ అనలిస్ట్, బిగ్‌ డేటా అనలిస్ట్‌ వంటి వివిధ పోస్టుల్లో కొలువుదీరవచ్చు. 

బిజినెస్‌ అనలిటిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉన్న అభ్యర్థి జీతం ఏడాదికి సగటున రూ.55 లక్షల నుంచి రూ.కోటీ ఇరవై లక్షల వరకూ ఉంటుంది.

బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌

బయోమెడికల్‌ ఇంజినీర్లు టెక్నాలజీ అభివృద్ధి, మెడిసిన్‌లో నూతన విధానాల కోసం, మనుషుల ఆరోగ్య సంరక్షక పరికరాల తయారీకి పాటుపడతారు. హెల్త్‌ కేర్‌ ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారానికి నైపుణ్యాలను వినియోగిస్తారు.

ఈ కోర్సులో భాగంగా విద్యార్థులు బయోమెకానిక్స్, బయోమెటీరియల్‌ అండ్‌ టిష్యూ ఇంజినీరింగ్, బయోమెడికల్‌ ఇమేజింగ్, రోబోటిక్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ బయొలాజికల్‌ సిస్టమ్స్, న్యూరల్‌ ఇంజినీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్, మెషిన్‌ లెర్నింగ్‌ సబ్జెక్టులు నేర్చుకుంటారు.

ఇది స్టెమ్‌ కోర్సుల్లో భాగం కావడంతో విద్యాభ్యాసం తర్వాత అభ్యర్థికి మూడేళ్లు పనిచేసేందుకు అనుమతి లభిస్తుంది.

ఈ కోర్సు పూర్తిచేసిన వారికి బయోమెటీరియల్‌ డెవలపర్, రిహాబిలిటేషన్‌ ఇంజినీర్, మెడికల్‌ టెక్నాలజీ డెవలపర్, అనలిస్ట్, మెడికల్‌ రిసెర్చర్, క్లినికల్‌ ఇంజినీర్‌ వంటి పోస్టులు దక్కుతాయి. ఏడాదికి సగటున రూ.50 లక్షల నుంచి రూ.95 లక్షల వరకూ జీతం లభిస్తుంది.

పబ్లిక్‌ హెల్త్‌

జనాభా, కమ్యూనిటీలు, పర్యావరణ ఆరోగ్యాన్ని కాపాడటం పబ్లిక్‌ హెల్త్‌ ప్రధాన లక్ష్యం. ఈ నిపుణులు పాండమిక్స్, ఎపిడెమిక్స్, వైకల్యాలు, వ్యాధులు, ప్రీమెచ్యూర్‌ జననాలు వంటి వాటిని నిరోధించడానికి పనిచేస్తారు. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచుకోవడం, వ్యాధులు ప్రబలినప్పుడు ఎదుర్కోవడం, వాటి వేగాన్ని అంచనా వేయడం, ఆరోగ్యకరమైన జీవన విధానాలను ప్రచారం చేయడం వంటివి చేస్తారు. దీనికోసం పరిశోధన, పాలసీ, అవగాహన వంటి మార్గాలను ఉపయోగిస్తారు.

ఇందులో బయోస్టాటిస్టిక్స్, కమ్యూనిటీ హెల్త్‌ సైన్సెస్, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ సైన్స్, ఎపిడెమియాలజీ, ఇండస్ట్రీ హెల్త్‌ హైజీన్, ఆక్యుపేషనల్‌ మెడిసిన్, ఆక్యుపేషనల్‌ సేఫ్టీ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి. 

కొన్ని యూనివర్సిటీల్లో స్పెషలైజేషన్‌ను బట్టి ఈ కోర్సులను స్టెమ్‌ కోర్సులుగా గుర్తిస్తారు. ఉదాహరణకు చాలా యూనివర్సిటీల్లో ఎపిడెమియాలజీ స్పెషలైజేషన్‌ను మాస్టర్స్‌ కోసం ఎంచుకుంటే స్టెమ్‌ ప్రోగ్రామ్‌గా గుర్తిస్తారు.

పబ్లిక్‌ హెల్త్‌ చదువుకున్న వారికి హెల్త్‌ కేర్‌ అడ్మినిస్ట్రేటర్స్, ఎపిడెమియాలజిస్ట్, సోషల్‌ అండ్‌ కమ్యూనిటీ సర్వీస్‌ మేనేజర్స్, మెంటల్‌ హెల్త్‌ కౌన్సెలర్స్, మెడికల్‌ రికార్డ్స్‌ అండ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేటిక్స్‌ టెక్నీషియన్‌ వంటి పోస్టులు దొరుకుతాయి. వీరికి ఏడాదికి రూ.45 లక్షల నుంచి రూ.కోటి వరకూ వేతనం లభిస్తుంది.

Posted Date : 14-03-2023


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం