• facebook
  • whatsapp
  • telegram

టెట్‌ జీవశాస్త్రంలో మెరిసేదెలా?

టెట్‌ అభ్యర్థుల్లో మొదటిసారి రాస్తున్నవారూ, గతంలో రాసి గరిష్ఠ స్కోరు కోసం ప్రయత్నిస్తున్నవారూ ఉన్నారు. ఇలాంటివారు జీవశాస్త్రంలో అత్యధిక మార్కులను పొందటానికి ఏ మెలకువలు పాటించాలి? 

టెట్‌-2 జీవశాస్త్ర సిలబస్‌లో 7 యూనిట్లున్నాయి. అవి:
నిత్య జీవితంలో జీవశాస్త్ర పాత్ర, జీవశాస్త్రవేత్తల కృషి, విభిన్న శాఖలు 
సజీవ ప్రపంచం - జీవ లక్షణాలు- కణం భావన - కణజాలాలు 
వృక్ష ప్రపంచం 
జంతు ప్రపంచం 
సూక్ష్మజీవులు 
మన పర్యావరణం 
జీవశాస్త్రంలో ఆధునిక ధోరణులు

ఈ సిలబస్‌ను 6, 7, 8 తరగతుల్లో పూర్తిగా, అవసరమైన కొన్ని అంశాలను 9, 10 తరగతుల స్థాయిలో చదవాలి.
వీటిలో మొదటి యూనిట్‌ నుంచి ఒక ప్రశ్న తప్పనిసరిగా శాస్త్రవేత్తల సేవలపై అడుగుతున్నారు. అభ్యర్థులు 8వ తరగతిలో ఉన్నవారినే కాకుండా పాత 7వ తరగతిలో మొదటి పాఠంలో ఉన్నవారి గురించి కూడా చదవాలి. మొదటి యూనిట్‌ నుంచి ఒక ప్రశ్నకు తగ్గకుండా 2 ప్రశ్నలకు మించకుండా అడుగుతున్నారు. రెండో యూనిట్‌ నుంచి ప్రతీసారి 2 ప్రశ్నలకు తగ్గకుండా అడుగుతున్నారు. ఇవి కూడా 'జీవలక్షణాలు, కణం నిర్మాణం- భావన, కణజాలాల' నుంచి. జీవలక్షణాల గురించి పాత ఆరో తరగతిలోని, కణం- కణజాలాలు అంశాల్ని పాత తొమ్మిదో తరగతిలో చదవాలి. ఈ యూనిట్‌లో జీవుల వర్గీకరణపై ప్రతిసారీ ప్రశ్న అడుగుతున్నారు. ఈ సమాచారం కోసం ఎనిమిదో తరగతి జీవశాస్త్రంలోని వర్గీకరణ అంశాన్ని క్షుణ్ణంగా అభ్యసించాలి. ఈ యూనిట్‌లోని 'కణం భావన, కణజాలాలు' అంశం గణితం అభ్యర్థులకు కాస్త ఇబ్బంది. అయినా వివేచనతో చదివితే ప్రశ్నకు తప్పు సమాధానం గుర్తించే ఆస్కారం ఉండదు. గత అనుభవాల ఆధారంగా ఈ అంశంపై కొంత లోతైన విశ్లేషణ అవసరం.మూడో యూనిట్‌ అయిన వృక్షప్రపంచం సిలబస్‌ నుంచి గతంలో 2- 3 ప్రశ్నలడిగారు. ప్రతిసారీ మొక్కల శాఖీయ, లైంగిక ప్రత్యుత్పత్తులపై ప్రాథమిక అవగాహన ప్రశ్నలను అడిగారు. మరోమారు కిరణజన్య సంయోగక్రియ అంశం నుంచి కూడా అలాంటి ప్రశ్ననే అడిగారు. ఈ యూనిట్‌లో సిలబస్‌పై లోతుగా అధ్యయనం కంటే ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. ఇప్పటివరకు మొక్కల శ్వాసక్రియ, విసర్జన, ఆర్థిక ప్రాముఖ్యం, వ్యవసాయం, వృక్ష వ్యాధులపై ఎలాంటి ప్రశ్నలు గత టెట్‌లలో అడగలేదు. కాబట్టి వీటిపై దృష్టి సారించి ఆతర్వాత మొక్కల రకాలు, ప్రత్యుత్పత్తి, కిరణజన్య సంయోగ క్రియలపై పునరభ్యాసం చేయాలి.ముఖ్యంగా అభ్యర్థులు గత అనుభవాల ఆధారంగా ద్విలింగ, ఏకలింగ పుష్పాలు, వాటిలో పరాగ సంపర్కం, ఫలదీకరణ అంశాలపై పట్టు సాధించాలి.

   'జంతుప్రపంచం' యూనిట్‌ నుంచి ప్రతిసారీ 3 ప్రశ్నలను అడుగుతున్నారు. సిలబస్‌లో అతి పెద్ద యూనిట్‌. దీనిలో అవయవ వ్యవస్థలు, జ్ఞానేంద్రియాలు, పోషణ, ప్రథమ చికిత్స, జంతువుల ఆర్థిక ప్రాముఖ్యం వంటి అంశాలున్నాయి.గతంలో జీర్ణ, రక్తప్రసరణ, నాడీవ్యవస్థలు, పోషణ, మానవ జ్ఞానేంద్రియాలలో కన్ను, పట్టు పరిశ్రమ, ప్రథమ చికిత్సలపై ప్రశ్నలు అడిగారు. విసర్జన, ప్రత్యుత్పత్తి వ్యవస్థలపై ఏడో తరగతి స్థాయిలో, పశుసంవర్థనం, మత్య సంవర్థనంపై ఎనిమిదో తరగతి స్థాయిలో క్షుణ్ణంగా చదవాలి. వీటిపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ యూనిట్‌లోని పోషణ- న్యూనత వ్యాధులు వంటి అంశాలను కొంతవరకు పదో తరగతి స్థాయిలో చదవాలి. ఈ యూనిట్‌లోని వ్యవస్థలపై కావాల్సిన సమాచారం కోసం తప్పనిసరిగా పాత ఏడోతరగతి పాఠ్యపుస్తకాన్ని చదవాలి.తర్వాతి యూనిట్‌ అయిన 'సూక్ష్మజీవ ప్రపంచం' నుంచి ప్రశ్నను అడుగుతున్నారు. ఈ ప్రశ్నను సూక్ష్మజీవుల ఉపయోగాలైన పెరుగు, జున్ను, ఆల్కహాల్‌, నత్రజని స్థాపన, యాంటి బయాటిక్స్‌, జీవ ఎరువుల తయారీ వంటి అంశాలపై, అపాయకరమైన సూక్ష్మజీవుల అంశాలైన వైరస్‌, బాక్టీరియా వ్యాధులపైనా అడుగుతున్నారు.ఇక్కడ వైరస్‌, బాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులను నిర్దిష్టంగా గుర్తుంచుకోవడమే కాకుండా వ్యాధుల లక్షణాలను, నివారణోపాలయాలపై, అన్వయంతో అడిగే ప్రశ్నలపైనా దృష్టిసారించాలి.
 

ఉదాహరణకు
ఏ వ్యాధులు సకశేరుక అతిథేయుల ద్వారా వ్యాప్తి చెందుతాయి? 
ఏ వ్యాధులను దోమతెరల వాడకంతో అరికట్టవచ్చు? 
వ్యాక్సినేషన్‌తో అరికట్టలేని వ్యాధులేవి? 
ఈగలను అదుపులో ఉంచడం ద్వారా అరికట్టగలిగే వ్యాధులేవి? 
రక్షిత మంచినీటిని తాగడం ద్వారా నివారించగలిగే వ్యాధులేవి?
ఇలాంటి కోణంలో కూడా అభ్యర్థులు సన్నద్ధమయితే ఉపయోగకరం. సిలబస్‌లో ఆరో యూనిట్‌ 'మన పర్యావరణం' నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇందులో 'పర్యావరణం- రకాలు, అందులోని జీవ, నిర్జీవ అంశాలు, వాటి మధ్య పరస్పర సంబంధాలు, సహజ వనరులు' వంటి అంశాలున్నాయి. కానీ యూనిట్‌కు సంబంధించిన సమాచారం అభ్యర్థులకు తక్కువగా అందుబాటులో ఉంటుంది. పాత ఆరో తరగతి సిలబస్‌లో ఈ యూనిట్‌ను చదవాలి. ఈ పాఠ్యాంశంలో వ్యర్థాల నిర్వహణ, ఆహారపు గొలుసులు, జీవాంశాలు, నిర్జీవాంశాలను ప్రముఖంగా చదవాలి. మరింత స్థూల అవగాహన కోసం తొమ్మిదో తరగతిలోని 'సహజ వనరులు' పాఠాన్ని చదవాలి. ఈ పాఠ్యాంశాన్ని తిరిగి వాడుకోదగిన, వాడుకోలేని వ్యర్థాలు ఏవి?, వర్మీ కంపోస్టు అనగా? సరైన ఆహారపు గొలుసు ఏది? గాలి, నీరు స్థితులు, జంతువులు, మొక్కలు, కాంతి, ఉష్ణోగ్రత వంటి అంశాల కోసం చూపే అనుకూలనాలు ఏవి? వంటి ప్రశ్నల కోణంలో చదవాలి.

ఆధునిక ధోరణులు
చివరి యూనిట్‌ 'జీవశాస్త్రంలో ఆధునిక ధోరణులు' నుంచి ప్రతిసారీ ఒక ప్రశ్న అడుగుతున్నారు.జవాబు గుర్తించడంలో చాలామంది తప్పు చేస్తున్నారు. ఎందుకంటే ఈ అంశాల సమాచారం చాలా తక్కువగా, కొంత క్లిష్టతతో కూడుకున్నది. కానీ గత పేపర్ల దృష్ట్యా గమనిస్తే అన్ని యూనిట్ల కంటే దీనినుంచే సులభంగా జవాబు గుర్తించవచ్చు.
ఈ యూనిట్‌లో గతంలో రెండుసార్లు జెనిటిక్‌ ఇంజినీరింగ్‌ నుంచి, మరోసారి కణజాల వర్దనం నుంచి ప్రశ్నలు అడిగారు. ఇవికాకుండా సంకరణం (హైబ్రిడైజేషన్‌), జన్యు బ్యాంకులు, జన్యు చికిత్స (జీన్‌ థెరపి) అంశాలున్నాయి. వీటి సమాచారం పదో తరగతిలోపు అతి తక్కువగా ఉంది. జన్యుచికిత్స, సంకరణాల గురించి ఎనిమిదో తరగతిలో కొంత, జీన్‌బ్యాంక్‌ గురించి తొమ్మిదో తరగతి వన్యప్రాణులు పాఠ్యాంశంలో ఉంది.
ఈ పాఠ్యాంశంలో అడిగే ప్రశ్నలు కూడా పదోతరగతిలోపు ఉన్న సిలబస్‌లో ఆధునిక ధోరణుల అనువర్తనాలపై అడుగుతున్నట్లు గత పేపర్ల ద్వారా తెలుస్తోంది.
ఉదాహరణకు 'చమురు తెట్టును తొలగించే ఒక రకమైన బాక్టీరియాను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్న విధానమేది?'
'ఆలస్యంగా పండే టమాటాలు, సహజమైన వర్ణాలకు భిన్నమైన వర్ణాలు కలిగిన పుష్పాలనిచ్చే పంటల సాగుకు సహాయపడే సాంకేతిక విజ్ఞానం ఏది?'
ఈ రెండు ప్రశ్నలకు జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ సమాధానం. మరి ఈ అనువర్తనాలు తొమ్మిదో తరగతి పుస్తకంలో ఉన్నాయి. అభ్యర్థులు జీన్‌ బ్యాంక్‌, సంకరణం, జీన్‌ థెరపీ అనువర్తనాల దృష్ట్యా చదవాలి.

కలిపి చదివితే మంచిది
గతంలో ఎంపికైనవారు మరింత మంచి స్కోరు సాధించడానికి కావాల్సిన సమయం ఉంది. కాబట్టి టెట్‌ + డీఎస్సీలకు కలిపి చదవడం లాభిస్తుంది.
ప్రస్తుతం టెట్‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయినందున రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలించిన వెంటనే టెట్‌ నిర్వహించే అవకాశం ఉంది. అలసత్వం ప్రదర్శించకుండా సన్నద్ధత సాగించాలి.
గణిత అభ్యర్థులు తమ కంటెంట్‌ను లోతుగా, క్షుణ్ణంగా డీఎస్‌సీ రీతిలో అధ్యయనం చేయాలి. జీవశాస్త్రం, ఫిజిక్స్‌ వారు తమ సబ్జెక్టును క్షుణ్ణంగా చదవాలి.
పునశ్చరణపై శ్రద్ధ తీసుకోవాలి. వీలైనన్ని నమూనా టెస్టులు, మాదిరి పరీక్షలు రాయాలి.

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌