• facebook
  • whatsapp
  • telegram

గ్రామ పంచాయతీలు

* గ్రామస్థాయిలో చేతిపంపుల మరమ్మతు, మురికి కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాల ఏర్పాటు, రహదారుల నిర్మాణం, నిర్వహణ లాంటి ప్రజా సౌకర్యాలను గ్రామ పంచాయతీలు నిర్వహిస్తాయి.
* ప్రజా పనుల్లో సామాన్యులకు అవకాశం కల్పించడానికి, స్థానికంగా మౌలిక సౌకర్యాల కల్పనకు గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీలను, పట్టణ స్థాయిలో మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తారు.

 

గ్రామసభ: వివరణ
 

* ప్రతి గ్రామ పంచాయతీలో 'గ్రామసభ' ఉంటుంది.
* గ్రామంలో ఓటర్లందరూ గ్రామసభలో సభ్యులుగా ఉంటారు.
* గ్రామసభకు 'సర్పంచ్' అధ్యక్షత వహిస్తారు.
* గ్రామసభ గ్రామపంచాయతీ పనులను పరిశీలించి, పర్యవేక్షిస్తుంది.
* గ్రామసభ పంచాయతీ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది.
* మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లాంటివి సరైన పద్ధతుల్లో అమలవుతున్నాయో లేదో గ్రామసభ పర్యవేక్షణ చేస్తుండాలి.
* పేదలకు అన్యాయం జరగకుండా గ్రామసభ చూడాలి.
* ఆచరణలో గ్రామసభ సమావేశాలు సక్రమంగా జరగడం లేదు. తక్కువ మందే హాజరవుతున్నారు.|

 

గ్రామ పంచాయతీ - నిర్మాణం
 

* గ్రామ పంచాయతీని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు.
* 18 ఏళ్లు నిండిన గ్రామంలోని ప్రతివ్యక్తి ఓటర్ల జాబితాలో తన పేరు నమోదు చేసుకుంటే అతడు ఓటు వేయడానికి అర్హుడు.
* సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలించి ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయడం లేదా తొలగించడం లాంటివి చేస్తాడు.

 

వార్డులు
 

* సాధారణంగా ప్రతి గ్రామాన్ని కొన్ని వార్డులుగా విభజిస్తారు.
* ఈ వార్డుల నుంచి వార్డు సభ్యులను ఓటర్లు ప్రత్యక్షంగా, రహస్య ఓటింగ్ విధానంలో ఎన్నుకుంటారు.
* ప్రతి వార్డు నుంచి ఒక వ్యక్తి గ్రామ పంచాయతీకి ప్రాతినిధ్యం వహిస్తాడు.
* జనాభాను బట్టి ప్రతి గ్రామ పంచాయతీకి 5 నుంచి 21 మంది వరకు వార్డు సభ్యులుంటారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.

 

వార్డుల విభజన
 

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు
 

* జనాభాలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే లక్ష్యంతో కొన్ని వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు నిర్దేశించారు.
పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు స్త్రీలకు స్థానిక సంస్థల్లో 1/3వ వంతు స్థానాలు కేటాయిస్తూ భారత పార్లమెంట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది.
* షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారు.
* వెనుకబడిన వర్గాల వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 1/3వ వంతు రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి.
* స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రం బిహార్.

 

ఎన్నికలు
 

* సాధారణంగా గ్రామ పంచాయతీకి ప్రతి అయిదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.
* ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరు రెండు ఓట్లు వేస్తారు.
* దీనిలో ఒక ఓటును వార్డు సభ్యుడ్ని ఎన్నుకోవడానికి, రెండో ఓటును సర్పంచ్ ఎన్నికకు వినియోగిస్తారు.

 

సర్పంచ్
 

* ఓటర్లు ప్రత్యక్షంగా, రహస్య ఓటింగ్ ద్వారా సర్పంచ్‌ను ఎన్నుకుంటారు.
* గ్రామ పంచాయతీకి సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు.
* గ్రామ పంచాయతీ నిర్ణయాలను సర్పంచ్ అమలు చేస్తారు.
* సర్పంచ్ ఆధ్వర్యంలోనే రోజువారీ కార్యకలాపాలు జరుగుతాయి.
* గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ, వ్యయాలకు సర్పంచ్ బాధ్యత వహిస్తాడు.
* సర్పంచ్ క్రియాశీలకంగా ఉంటే గ్రామం వేగంగా అభివృద్ధి చెందుతుంది.

 

ఉప సర్పంచ్
 

* పరోక్ష పద్ధతిలో ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు.
* ఎన్నికల అనంతరం వార్డు సభ్యుల్లో ఒకరిని 'ఉప సర్పంచ్‌'గా ఎన్నుకుంటారు.
*సర్పంచ్ లేనప్పుడు ఉపసర్పంచ్ ఆ బాధ్యతలను నిర్వహిస్తాడు.

 

కార్యదర్శి, కార్యనిర్వాహక అధికారి
 

* ప్రతి గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యోగిని కార్యదర్శిగా నియమిస్తుంది.
* ఈ కార్యదర్శి గ్రామ పంచాయతీ లెక్కలు, సమావేశాల వివరాలను నమోదు చేస్తారు.
* పెద్ద గ్రామ పంచాయతీ (Major) అయితే ఎక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి ఒక కార్యనిర్వహణ అధికారిని కూడా ప్రభుత్వం నియమిస్తుంది.

 

గ్రామ పంచాయతీలు - విధులు
 

ప్రజలకు సౌకర్యాలను కింది విధంగా కల్పిస్తారు.
* గ్రామీణ రహదారులను నిర్వహించడం.
* మురికి కాలువలను శుభ్రం చేయడం, కొత్తవి నిర్మించడం.
* తాగునీటి సదుపాయం కల్పించడం.
* వీధి దీపాలను ఏర్పాటు చేయడం, వీధులను శుభ్రం చేయడం.
* చౌక ధరల దుకాణాలను నిర్వహింపజేయడం.
* పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించడం.
* స్త్రీ, శిశుసంక్షేమ పథకాలను పర్యవేక్షించడం.
* చిన్ననీటి పారుదల సౌకర్యాలు, వాటర్‌షెడ్ పథకాలను నిర్వహించడం.
* కేరళ, పశ్చిమ బంగ, కర్ణాటక లాంటి రాష్ట్రాలు గ్రామ పంచాయతీలకు ఎక్కువ అధికారాలను ఇచ్చాయి.
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు గ్రామ పంచాయతీలకు పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వలేదు.

 

తెలంగాణలో ఇంతవరకు గ్రామపంచాయతీలకు ఇవ్వని అంశాలు
 

* సంత (మార్కెట్) మీద అధికారం
* భూమి అభివృద్ధి, అటవీ ఉత్పత్తి
* కుటీర పరిశ్రమలు
* పేదలకు గృహ సౌకర్యాలు
* విద్యుత్తు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహణ మొదలైనవి
* గ్రామ పంచాయతీ సమావేశం నెలలో ఒకసారి జరుగుతుంది.
* ప్రతి సమావేశానికీ కనీసం సగం మంది సభ్యులు హాజరుకావాలి. అలా హాజరు కాకపోతే సమావేశాన్ని రద్దు చేస్తారు.
* సాధారణంగా గత సమావేశం నివేదికతో తాజా సమావేశం ప్రారంభమవుతుంది.
* సర్పంచ్ గత నెలలో జరిగిన పనులు, చేపట్టిన కార్యక్రమాల నివేదిక చదువుతారు.

 

గ్రామ పంచాయతీ - బడ్జెట్
 

* ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్‌ను వార్డు సభ్యులతో చర్చించి తయారు చేసుకుంటారు.
* సర్పంచ్, కార్యనిర్వహణ అధికారి బడ్జెట్‌ను రూపొందిస్తారు.
* బడ్జెట్‌ను గ్రామసభలో చర్చించి తుదిరూపం ఇస్తారు.
* బడ్జెట్ ప్రతిపాదనను మండల పరిషత్, జిల్లా పరిషత్తుల ఆమోదం కోసం పంపుతారు. అయితే కొన్ని గ్రామాల్లో అందరితో చర్చించకుండానే సర్పంచ్ ప్రణాళిక రూపొందించి, ఆమోదం కోసం పంపుతారు. ఇలాంటి సందర్భాల్లో వచ్చిన నిధులను వేరొక పనికి వినియోగిస్తారు లేదా నిధుల దుర్వినియోగం జరగుతుంది.

 

గ్రామ పంచాయతీ - నిధులు
 

* గ్రామ పంచాయతీకి కొన్ని రకాల పన్నులు వసూలు చేసే అధికారం ఉంది.
* ఇంటిపన్ను, భూమిశిస్తు మొదలైన పన్నులను వసూలు చేస్తుంది.
* గ్రామ పంచాయతీకి 1/3వ వంతు ఆదాయం ఈ పన్నుల వల్ల సమకూరుతుంది.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులపైనే గ్రామ పంచాయతీలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి.
* గ్రామ పంచాయతీలకు కొన్ని నిధులు 'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం' ద్వారా లభిస్తున్నాయి.
* భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటును సూచిస్తుంది.
* ప్రాచీన భారతదేశంలో చోళులు, పల్లవులు గ్రామీణ పాలనను అభివృద్ధి చేశారు.
* చోళరాజైన మొదటి పరాంతకుడి ఉత్తరమెరూర్ శాసనంలో గ్రామీణ పాలనను వివరించారు.
* గ్రామ సభ సమావేశాలకు ఎంపీటీసీలు శాశ్వత ఆహ్వానితులు

 

మండల పరిషత్, జిల్లా పరిషత్

మండల పరిషత్
 

* ప్రతి మండలంలో దాదాపు 20 గ్రామ పంచాయతీలు ఉంటాయి.
* మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను (MPTC) ప్రజలు ప్రత్యక్షంగా, రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.
* మండల పరిషత్‌కు మైనార్టీ వర్గానికి చెందిన ఒకరిని 'కో-ఆప్టెడ్' సభ్యుడిగా నామినేట్ చేస్తారు.
* మండల పరిషత్‌కు కార్యనిర్వహణాధికారిగా MPDO వ్యవహరిస్తారు.
* మండల పరిషత్‌లో MPTC ల కనిష్ఠ సంఖ్య: 7
* మండల పరిషత్‌లో MPTC ల గరిష్ఠ సంఖ్య: 23
* MPTC లు వారిలో ఒకరిని MPP గా, మరొకరిని Vice MPP గా ఎన్నుకుంటారు.

 

జిల్లా పరిషత్
 

* మండల పరిషత్‌ల‌న్నీ జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి.
* జిల్లాలోని ప్రతి మండలాన్నీ 'ఒక జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం'గా (ZPTC) పరిగణిస్తారు.
* ZPTC సభ్యులు ప్రజల ద్వారా ప్రత్యక్షంగా, రహస్య ఓటింగ్ పద్ధతిలో ఎన్నికవుతారు.
* ఎన్నికైన ZPTC లు వారిలో ఒకరిని జడ్పీ ఛైర్మన్‌గా, మరొకరిని జడ్పీ వైస్ ‌ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు.
* జిల్లా పరిషత్‌కు మైనార్టీ వర్గాలకు చెందిన ఇద్దరిని 'కో-ఆప్టెడ్' సభ్యులుగా నామినేట్ చేస్తారు.
* జిల్లాలో గ్రామ పంచాయతీల పనులను మండల పరిషత్, జిల్లా పరిషత్‌లు నమన్వయపరుస్తాయి.
* జిల్లా పరిషత్‌లో కార్యక్రమాల నిర్వహణ కోసం 7 స్థాయీ సంఘాలను (Standing Committees) ఏర్పాటు చేసుకుంటారు.

 

ఆదర్శగ్రామం - హజిపల్లి
 

* తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో 'హజిపల్లి' ఒక మారుమూల గ్రామం.
* హజిపల్లి గ్రామ సర్పంచ్ జంగమ్మ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు.
* గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మించారు.
* మురికి కాలువలు నిర్మించారు.
*ప్రతి ఇంటిలో మరుగుదొడ్ల నిర్మాణం అయ్యేలా చూశారు.
* పాఠశాల, అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీల్లో కూడా మరుగుదొడ్లు నిర్మించారు.
* గ్రామంలో రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించారు.
* ప్రభుత్వం చేపట్టిన పథకాలను అర్హతలు ఉన్న వారందరికీ అందేలా చేశారు.
* పైన పేర్కొన్న కృషి ఫలితంగా 2008లో హజిపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 'శుభ్రం' (Subram) అవార్డుకు ఎంపికైంది.
* 2008 డిసెంబరులో భారత ప్రభుత్వం హజిపల్లిని 'నిర్మల్ గ్రామ పురస్కారం' కోసం ఎంపిక చేసింది.
* అప్పటి భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా హజిపల్లి గ్రామ సర్పంచ్ 'జంగమ్మ' నిర్మల్ గ్రామ పురస్కారాన్ని అందుకున్నారు.
* గ్రామంలోని ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించి, బహిర్భూమికి వెళ్లని గ్రామాలకు 'నిర్మల్ పురస్కారాలు' ఇస్తారు.

 

గ్రామసభ - సక్రమ నిర్వహణ
 

* తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఉన్న 'గంగదేవి పల్లి', కరీంనగర్ జిల్లాలోని 'రామచంద్రాపురం', నిజామాబాద్ జిల్లాలోని 'అంకాపూర్' గ్రామాలు తమ గ్రామ పంచాయతీలను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి.
* మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న 'హివరెబజార్' గ్రామ పంచాయతీ, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉన్న 'పాండురంగాపురం' గ్రామ పంచాయతీలు కూడా విజయవంతమయ్యాయి.

 

గంగదేవిపల్లి - గ్రామ పంచాయతీ
 

* గంగదేవిపల్లిలో 18 కమిటీలను గ్రామసభ ద్వారా ఏర్పాటు చేశారు.
* వీటిలో మంచినీటి కమిటీ, పారిశుద్ధ్య కమిటీ (Sanitation), ఉత్తర ప్రత్యుత్తరాల కమిటీ (Communication Committee) మొదలైనవి ఉన్నాయి.
* ఈ కమిటీలు ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తున్నాయి.

 

గంగదేవిపల్లి గ్రామ పంచాయతీ సాధించిన విజయాలు
* సంపూర్ణ మద్యపాన నిషేధం
* పాఠశాలలో నూరుశాతం పిల్లల నమోదు
* సంపూర్ణ అక్షరాస్యత సాధన
* పరిశుద్ధమైన తాగునీటి సరఫరా
* కుటుంబ నియంత్రణ
* పిల్లలందరికీ టీకాలు వేయించడం
* అన్ని కుటుంబాలకూ బ్యాంక్ పాస్ పుస్తకాలు ఉండటం
* గ్రామంలో పూర్తి పారిశుద్ధ్య పరిరక్షణ
* ఈ గ్రామపంచాయతీలో ప్రతి గ్రామస్థుడు 18 కమిటీల్లో కచ్చితంగా ఏ ఒక్క కమిటీలోనైనా సభ్యుడిగా ఉండటం గమనార్హం.
* ప్రాతినిధ్య ప్రభుత్వానికి ఇది అభిలషణీయమైన ఉదాహరణ.
* అభివృద్ధి కార్యక్రమం ఏదైనా ముందుగా గ్రామసభలోనే చర్చ జరుగుతుంది.
* గ్రామసభ నిర్ణయాలను అందరూ శిరసావహిస్తారు/పాటిస్తారు.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌