• facebook
  • whatsapp
  • telegram

బృంద బోధన

 ఆధునిక బోధనా పద్ధతుల్లో బృంద బోధన ఒకటి. ఇది విద్యాబోధన సమర్థంగా సాగడానికి తోడ్పడుతుంది. విద్యార్థుల్లో విషయ గ్రహణ సామర్థ్యాన్ని పెంచడానికి సెమినార్, గ్రూప్ వర్క్, వర్క్ షాప్ లాంటి పద్ధతులు బోధనా విధానంలో చోటు చేసుకోవాలని అనేక కమిషన్‌లు సిఫారసు చేశాయి. అలాంటి పద్ధతుల్లో భాగంగానే 'బృంద బోధన'ను రూపొందించారు.
 

బృంద బోధన
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 1955లో 'బృంద బోధన' అనే భావన రూపొందింది. ఫ్రాన్సిస్ చేస్, జె.ఎల్. ట్రంప్ అనే విద్యావేత్తలు ఈ భావనను వ్యాప్తి చేశారు.
* 1957లో 'లెగ్జింగ్ టోన్' అనే నగరంలో ఈ భావన అమలైంది.

 

నిర్వచనాలు
* వైవిధ్యమైన బోధనా నైపుణ్యాలతో ఒకరికంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు కలసి, ఆలోచించి, బోధన నిర్వహించి, సత్ఫలితాలు సాధించగల వ్యూహం. - Carlo Obson
* ఇద్దరి కంటే ఎక్కువమంది ఉపాధ్యాయులు ఒక ప్రణాళిక ప్రకారం, పరస్పర సహకారంతో బోధనను, మూల్యాంకనాన్ని నిర్వహించే విధానమే బృందబోధన. - ఎం.బి. నాయక్
* ఒక పాఠశాలలోని ఉపాధ్యాయులు ఒక బృందంగా ఏర్పడి తమకున్న ప్రత్యేక నైపుణ్యాలను, వనరులను, విద్యార్థుల అవసరాలను, వారికున్న ప్రత్యేక నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకుని పాఠ్య ప్రణాళికను చర్చించి, అందులోని వివిధ భాగాలను వేర్వేరు ఉపాధ్యాయులు బోధించే పద్ధతిని 'బృందబోధన' అంటారు.
* సెమినార్లు, గ్రూప్ వర్క్, వర్క్‌షాపు పద్ధతుల్లో భాగమే బృందబోధన అని చెప్పవచ్చు. ఒకే పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయులంతా చర్చించి బోధించడం వల్ల విద్యార్థికి ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. గరిష్ఠ స్థాయిలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు.

 

సూక్ష్మబోధన (Micro Teaching)
పూర్వసేవ (pre-service), సేవాంతర్గత స్థాయి (in-service) ఉపాధ్యాయుల వృత్తి వికాసానికి దోహదపడే శిక్షణ 'సూక్ష్మబోధన'. ఉపాధ్యాయుడు సాధారణ తరగతి గదిలో ఎదుర్కొనే సంక్లిష్టతలను తొలగించి, ఆత్మవిశ్వాసంతో బోధించడానికి ఇది తోడ్పడుతుంది.
1963లో స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కిమ్ రోమ్ని, ఎ.డబ్ల్యూ. డ్వైట్ఎలెన్ అనే వారు సూక్ష్మబోధన అనే పారిభాషిక పదానికి రూపకల్పన చేశారు. సూక్ష్మబోధన ఒక బోధనా పద్ధతి కాదు. ఇది ఒక బోధనా మెళకువ (Technique) మాత్రమే. శిక్షణార్థుల్లో భయాన్ని పోగొట్టి, వారు ఆత్మవిశ్వాసంతో బోధించేలా చేయడం దీని ఉద్దేశం.

 

సూక్ష్మబోధన - విధానం
సూక్ష్మపాఠం:
 అయిదు నిమిషాల్లో పూర్తి చేయడానికి వీలుగా ఉండే అంశాన్ని లేదా ఒక భావనను ఎన్నుకోవాలి.
విద్యార్థుల సంఖ్య: సూక్ష్మ తరగతిలో అయిదుగురు లేదా ఆరుగురు విద్యార్థులుంటే చాలు. లేదా శిక్షణార్థులే అయిదారుగురు కలిసి ఒక బృందంగా ఏర్పడి సూక్ష్మబోధనను నిర్వహించుకోవచ్చు.

 
నైపుణ్యం: ఒకే ఒక నైపుణ్యాన్ని గ్రహించి దాన్ని సాధించేంత వరకు బోధనా కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉండాలి.
పునర్బలనం (లేదా) మూల్యాంకనం: సూక్ష్మబోధనలో వెంటవెంట మూల్యాంకనం చేయడానికి అవకాశం ఉంది.

 

బోధనా నైపుణ్యాలు
బోధనా నైపుణ్యంలో ముఖ్యమైన అంశాలు- ప్రతిస్పందన వ్యత్యాసం, పూర్వబోధన ఉపోద్ఘాతం, సామీప్యం, మౌనం- అశాబ్దిక చర్యలు, పునర్బలన నైపుణ్యం, వేగంగా ప్రశ్నలడగటం, ప్రశ్నలు తయారుచేసే నైపుణ్యం మొదలైన వాటిని సాధించడం ద్వారా బోధనను ఫలప్రదం చేసుకోవచ్చు.
* సూక్ష్మబోధన వల్ల ఉపాధ్యాయుడికి ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. స్నేహపూరిత వాతావరణంలో బోధన జరగడం వల్ల భయం తొలగిపోతుంది. విసుగు ఉండదు.

 

పర్యవేక్షణాత్మక అధ్యయనం
విద్యార్థులు అధ్యాపకుడి పర్యవేక్షణలో అధ్యయనం చేసే విధానాన్ని 'పర్యవేక్షణాత్మక అధ్యయన విధానమ'ని అంటారు. దీనికే 'నియంత్రిత అధ్యయనమ'ని కూడా పేరు.
* విద్యార్థి ఏయే విషయాల్లో సరైన అభివృద్ధిని చూపలేదో కనిపెట్టి ఉపాధ్యాయుడు తన పర్యవేక్షణలో ప్రత్యేక కృషి చేయించడమే పర్యవేక్షణాత్మక అధ్యయన ఉద్దేశం.

* పర్యవేక్షణాధ్యయనానికి దాదాపు పఠనమే శరణ్యం. పాఠం చివర ఇచ్చిన అభ్యాసాలను పూర్తిచేయడం, నిఘంటువులను, పరామర్శ గ్రంథాలను సంప్రదించడం కూడా ఈ పద్ధతిలో భాగమే.
* ఇందులో ఉపాధ్యాయులు కేవలం మార్గదర్శకులై విద్యార్థులకు స్ఫూర్తినిచ్చి, వారి అధ్యయనంలో వేగాన్ని, తీవ్రతను పెంపొందించవచ్చు.
* ఉపాధ్యాయులు 'రొటేషన్' విధానాన్ని అనుసరించడం ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చు.

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌