• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక బోధనాపద్ధతులు

   విద్య వికాసానికి చిహ్నం. ఆడుతూ పాడుతూ నేర్చుకునే విద్య పిల్లల మనోవికాసానికి దోహదపడుతుందని విద్యావేత్తల అభిప్రాయం. అందుకే వారు తమ పరిశీలనానుభవాలను పోతపోసి చిన్నారుల కోసం ఆధునిక బోధనా పద్ధతులను రూపొందించారు. ఉపాధ్యాయులు ఏయే పద్ధతులు అనుసరిస్తే పిల్లల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయగలరో సూచించారు.                                                          
                  ప్రాచీన విద్యాపద్ధతి శాస్త్రీయంగా నిర్ణయించిన విద్యాబోధనా సూత్రాల ప్రాతిపదికతో ఏర్పడింది కాదు. వివిధ దేశాల్లోని విద్యావేత్తలు అనేక ప్రయోగాలు చేసి, అపారమైన విద్యాబోధనానుభవాన్ని గడించి, దాని సాయంతో ఎన్నో 'నూతన విధానాలు' కనిపెట్టారు. ఈ ఆధునిక బోధనా పద్ధతులన్నింటికి ఆధార భూమిక మనస్తత్వశాస్త్రం.

 

 క్రీడాపద్ధతి
విద్యావిధానాలన్నిటిలో క్రీడాపద్ధతి ఉత్తమమైంది. ఆచార్య ఆనందమయుడు దీన్ని 'విద్యాశాల వినోదారామం అనే భావనను విద్యార్థులకు కలిగించే విధానం'గా పేర్కొన్నాడు. ఇందులో విద్యార్థి విద్యను ఒక క్రీడగా భావించి నేర్చుకుంటాడు.
* క్రీడాపద్ధతి విద్యారంభకులకు చాలా ఉపయోగకారి. ప్రారంభదశలోని విద్యార్థులకు జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ శిక్షణ క్రీడాపద్ధతి ద్వారా అందించవచ్చు.
* మాధ్యమిక దశలో సంభాషణా వ్యాసంగాలు, నాటకీకరణ పాఠాలు, తప్పొప్పులను కనుక్కునే సాధనాభ్యాసాలు, రిక్తపూరణ అభ్యాసాలు, సమస్యాపూరణం మొదలైనవి క్రీడాపద్ధతి ద్వారా చేయించదగిన అభ్యాసాలు.
* ఉన్నత పాఠశాల దశలో నాటక ప్రదర్శనలు, నాటకానికి కావాల్సిన ఆహార్యాల తయారీ, కవి సమ్మేళనాలు, దర్బారులు మొదలైనవి క్రీడాపద్ధతికి అనుకూలించిన విషయాలు.

 

మాంటిస్సోరి పద్ధతి
మేరియా మాంటిస్సోరి అనే ఇటలీ దేశస్థురాలు ప్రవేశపెట్టిన విధానం కావడం వల్ల దీనికి మాంటిస్సోరి పద్ధతి అనే పేరు వచ్చింది. ఇది శిశువుల మనస్తత్వంపై ఆధారపడిన పద్ధతి.
* స్వయం వికాసం, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, జ్ఞానేంద్రియ ప్రబోధం ఈ విద్యలోని ప్రధాన ఆశయాలు. ఈ పద్ధతిలో విద్యకు అతి తక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
* మాంటిస్సోరి విద్యావిధానంలో వస్తువులు, పనిముట్లు, వాటిని ఉపయోగించే పద్ధతులు, దేహ పరిశుభ్రత, ఇంద్రియ శిక్షణ, సామాన్య లోకజ్ఞానానికి సంబంధించిన అంశాలు నేర్పిస్తారు. మాంటిస్సోరి విద్యావిధానం శాస్త్రీయ భావన కలిగి ఉంది.

 

కిండర్‌గార్టెన్ పద్ధతి
కిండర్ - గార్టెన్ అనే జర్మన్ పదాలు కలిసి 'కిండర్ గార్టెన్' అనే పదం ఏర్పడింది. అంటే 'శిశువుల తోట' అని అర్థం. దీన్ని 'ఫ్రోబెల్' అనే విద్యావేత్త ప్రతిపాదించారు.

 

మాంటిస్సోరి, కిండర్ గార్టెన్ మధ్య భేదాలు

 
 

* స్వేచ్ఛాయుత వాతావరణంలో, ఆటపాటలు, కృత్యాల ద్వారా విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను వికసిత పుష్పాలుగా తీర్చిదిద్దడమే ఈ పద్ధతి ముఖ్య ఉద్దేశం - పరమ లక్ష్యం.
* కిండర్‌గార్టెన్ పద్ధతిలో గురువు కేంద్రంగా ఉండి, తీర్పరిగా వ్యవహరిస్తాడు. శిశువర్గమంతటిపై దృష్టి కేంద్రీకరిస్తారు.
* శిశువులకు స్వేచ్ఛ తక్కువ. కాలవ్యయం, ధనవ్యయం తక్కువ. అయినప్పటికీ క్రీడా సూత్రాల ప్రాతిపదికగా రూపకల్పన చేసిన మాంటిస్సోరి, కిండర్‌గార్టెన్ పద్ధతులను సమన్వయించి ప్రాథమిక దశలో బోధిస్తే సత్ఫలితాలు సాధించవచ్చు.  

 

ప్రాజెక్టు పద్ధతి
ఇది జాన్ డ్యూయి ప్రతిపాదించిన విద్యాతత్వ మూలసూత్రాలపై ఆధారపడిన పద్ధతి. విద్యకు, జీవన రంగానికీ సమన్వయం కలిగించేదే ప్రాజెక్టు పద్ధతి. దీన్ని ఉద్యమ పద్ధతి అని కూడా పిలుస్తారు.
* ఇది విభజన నుంచి సమన్వయానికి, తెలిసిన దానినుంచి తెలియనిదానికి, సామర్థ్యం నుంచి విశేష జ్ఞానానికి, అస్పష్టత నుంచి స్పష్టతకు అనే అతి ప్రధానమైన 8 విద్యాసూత్రాలపై ఆధారపడి ఉంది.
* విద్యార్థుల అంతర్గత శక్తిని వెలికితీసి, వారికి అనుభవపూర్వకమైన విద్యను అందించి సంఘజీవితానికి, భవిష్య జీవనానికి వారిని తయారు చేయడం, శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించి, తార్కికశక్తిని పెంచడం, ఆలోచనాశక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి తోడ్పడటమే ఉద్యమ పద్ధతి ముఖ్యోద్దేశాలు.
ఉద్యమాలు - రకాలు: ఈ పద్ధతిలో నిర్వహించే ఉద్యమాలను రెండు రకాలుగా విభజించవచ్చు.
అవి 1. సంకీర్ణ ఉద్యమాలు, 2. సామాన్య ఉద్యమాలు.
 సంకీర్ణ ఉద్యమాలు: 1. సంవత్సరమంతా నిర్వహించేవి. 2. భాషా నైపుణ్యాలు పెంపొందుతాయి.
ఉదా: తోటలు, ఇళ్లు నిర్మించడం, అంగడి నడపటం, పాఠశాల బ్యాంకు నడపటం.
సామాన్య ఉద్యమాలు: 1. వారం నుంచి రెండు మూడు నెలల్లో పూర్తయ్యేవి. 2. ఆనందానుభూతి, ఆసక్తులు, వైఖరులు పెంపొందుతాయి.
ఉదా: పాఠశాలను అలంకరించడం, పాఠశాలలో రకరకాల ఉత్సవాలు నిర్వహించడం, పంటలు పండించడం.

 

డాల్టన్ పద్ధతి
అమెరికా దేశీయురాలైన 'మిస్ హెలెన్ పార్క్ హర్ట్స్' ఈ పద్ధతిని డాల్టన్ నగరంలోని ఒక ఉన్నత పాఠశాలలో ప్రయోగించి, విజయం సాధించారు. ఇందులో ఉపాధ్యాయుడు కుశాగ్రబుద్ధులను, సామాన్యులను, మందబుద్ధులను దృష్టిలో ఉంచుకుని వేర్వేరు నియోజనాలను తయారు చేసుకుని, వాటి ద్వారా కృషి జరిపించి అభివృద్ధి సాధించాలి. దీనిలో విద్యార్థుల వైయక్తిక భేదాలు, ఆసక్తులు, అనురక్తులు, వంశపారంపర్య విషయాలను దృష్టిలో పెట్టుకుని బోధిస్తారు. కాబట్టి దీన్ని 'వ్యష్టి పద్ధతి' అన్నారు.
* ఈ పద్ధతిలో బోధించడానికి గరిష్ఠ - కనిష్ఠ ప్రణాళికలను తయారు చేసుకోవాలి. తరగతి పాఠ్యాంశాలను ప్రధాన, అప్రధాన వర్గంగా వర్గీకరించుకోవాలి.
* ప్రతి విషయానికి ఒక ప్రత్యేక గది - ఉపకరణాలు, గ్రంథాలయం ఉండటం చాలా అవసరం. విద్యార్థులు కనీసం మూడు గంటలు గ్రంథాలయంలో కృషి చేయాలి.
* డాల్టన్ పద్ధతి బోధన ద్వారా విద్యార్థుల్లో స్వయంకృషి పెరుగుతుంది. స్వేచ్ఛగా, ఉల్లాసంగా చదువు కొనసాగిస్తారు. భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఆరోగ్యవంతమైన పోటీతత్వం, మూర్తిమత్వం పెరుగుతాయి.

 

కృత్యాధార పద్ధతి
విద్యాబోధనలో గుణాత్మకతను పెంపొందించడానికి ప్రతిపాదించిందే కృత్యాధార పద్ధతి. ఇది బ్లూమ్ 'శిశుకేంద్ర విద్య' సిద్ధాంతంపై ఆధారపడింది.
* కృత్యాల ప్రాతిపదికన బోధన నిర్వహించడమే కృత్యాధార బోధన. ఈ భావనలో 6 సూత్రాలు ఇమిడి ఉన్నాయి. అవి:

1. ఉపాధ్యాయులే స్వయంగా అభ్యసన కృత్యాలు రూపొందించడం.
2. క్రియలు, అన్వేషణ, ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించడం.
3. వ్యక్తిగత, జట్టు, పూర్తి తరగతి పనిని అభివృద్ధి చేయడం.
4. వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకుని తగిన అభ్యసన కృత్యాలు సూచించడం.
5. కృత్య నిర్వహణ కోసం స్థానిక పరిసరాలను వినియోగించుకోవడం.
6. విద్యార్థుల కృత్యాలను చక్కగా ప్రదర్శించడం ద్వారా ఆసక్తికరమైన తరగతిని రూపొందించడం.

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌