• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక సాహిత్యం - ధోరణులు - ఉద్యమాలు - జానపద సాహిత్యం 

భావ కవిత్వం     
ఆంగ్ల సాహిత్యంలో వెలువడిన 'రొమాంటి'క్ పొయట్రీ'ని తెలుగులో కాల్పనిక కవిత్వంగా, ఆ తర్వాత భావకవిత్వంగా పిలిచారు. ఆంగ్లంలో దీన్ని 'లిరికల్ పొయట్రీ' అని కూడా పిలిచారు. 1910 నుంచి 1935 వరకు భావ కవిత్వం ఒక ఉద్యమంలా కొనసాగింది. భావ కవుల తోటకు తొలి తోటమాలి రాయప్రోలు సుబ్బారావు. ఈయన తాను రచించిన తృణకంకణంలో అమలిన ప్రేమతత్వాన్ని ప్రతిపాదించాడు. ఇతడు ప్రారంభించిన కవిత్వాన్ని భావకవిత్వం అన్నారు. తెలుగు నాట పల్లెసీమలను, ప్రకృతి చిత్రాలను తన ఖండ కావ్యాల్లో ప్రవేశపెట్టి, స్త్రీని భోగ్య వస్తువుగా కాకుండా పూజనీయమైన వస్తువుగా భావించి ఆమెకు ఉన్నత స్థానాన్ని కల్పించారు. రాయప్రోలు రాసిన రమ్యాలోకం, మాధురీ దర్శనం విలక్షణమైన రచనలు. భావ కవిత ప్రధాన లక్షణం ప్రకృతిని ఆరాధించడం, ఉపాసించడం, దాన్ని మానవ జీవనానికి అన్వయించుకుని అనుభవించడం.
               ఈ యుగంలోనే మరో గొప్పకవి విశ్వనాథ సత్యనారాయణ. ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో విశ్వనాథ చేపట్టనిది లేదు. భావకవిత్వపరంగా ఈయన రచించిన రచనలు గిరి కుమారుని ప్రేమగీతాలు, కిన్నెరసాని, శశిదూతం, శృంగార వీధి. స్మృతికావ్యంగా పేరు గడించిన వరలక్ష్మీ త్రిశతి.

* భావకవికి పర్యాయపదం అని దేవులపల్లి కృష్ణశాస్త్రిని అంటారు. ఈయనిది ఆత్మాశ్రయరీతి. కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి, పల్లకి మొదలైనవి ఈయన ఖండ కావ్యాలు. 

''నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు 

నా ఇచ్ఛయేగాక నాకేటి వెరపు"  అని కృష్ణపక్షంలోని స్వేచ్ఛాగానం కృష్ణశాస్త్రి స్వేచ్ఛా కాంక్షను తెలుపుతుంది. గుర్రం జాషువా భావ కవిత్వపు పరిస్థితులకు దూరంగా ఉండి అభ్యుదయ భావనలు చేశారు. కానీ గబ్బిలం, స్వప్నకథ, భావకవిత్వ శాఖలోని ''సంఘ సంస్కరణ కవిత్వం" అనే శాఖకు చెందినవిగా విమర్శకుల అభిప్రాయం.

    భావకవిత్వం అనే పదాన్ని మొదట గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఇది 'కవి యొక్క ఒక అవిస్పష్ట వాంఛాంకురము, ఒక అంతర్నిగూఢ తాపము" అన్న విశ్వనాథ నిర్వచనాన్ని బట్టి అస్పష్టత కావ్యగుణంగా గలది భావకవిత్వం. భావకవిత్వంలో కొంత అయోమయం, అర్థంకాని తత్వం ఉండటం వల్ల అది ప్రజలకు చేరువ కాలేకపోయింది.
 

భావకవిత్వం లక్షణాలు:
* ఆత్మాశ్రయత్వం/ అంతర్ముఖత్వం
* ప్రకృతి ప్రీతి
* స్వేచ్ఛా ప్రియత్వం
* ప్రణయ తత్వం
* మానవతా వాదం

 

ముఖ్యమైన భావకవులు - రచనలు
* రాయప్రోలు సుబ్బారావు - లలిత, తృణకంకణం, స్నేహలతాదేవి
* దేవులపల్లి కృష్ణశాస్త్రి - కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం, కన్నీరు
* విశ్వనాథ సత్యనారాయణ - కిన్నెరసాని పాటలు, వరలక్ష్మీ త్రిశతి, గిరి కుమారుని ప్రేమగీతాలు
* నాయని సుబ్బారావు - సౌభద్రుని ప్రణయ యాత్ర, వేదనా వాసుదేవం, మాతృగీతాలు
* నండూరి సుబ్బారావు - ఎంకి పాటలు
* వేంకట పార్వతీశం కవులు - ఏకాంత సేవ
* దువ్వూరి రామిరెడ్డి - కృషీవలుడు, భగ్నహృదయం, గులాబి తోట, జలదాంగన
* అబ్బూరి రామకృష్ణారావు - నదీసుందరి, కాపుపాట, మల్లికాంబ

 

అభ్యుదయ కవిత్వం
భావకవిత్వంపై తిరుగుబాటుగా వచ్చిన కవిత్వం అభ్యుదయ కవిత్వం. 1935 నుంచి 1945 వరకు ఈ కవితా ఉద్యమం కొనసాగింది. చైతన్యమే పర్యవసానంగా గలది అభ్యుదయ కవిత్వం. ధనిక సమాజం పోవాలనుకోవడమే అభ్యుదయం. ఇది మనసులో పెట్టుకుని రాసేదే అభ్యుదయ కవిత్వం. అభ్యుదయ కవిత్వానికి తాత్విక భూమిక 'మార్క్సిజం'. మార్క్సిస్టు సిద్ధాంతం ప్రకారం సమాజంలో దోపిడీ చేసే వర్గం, దోపిడీకి గురయ్యే వర్గం అని రెండు వర్గాలు ఉన్నాయి. దోపిడీ అంటే శ్రమ దోపిడీయే. శ్రామికులు తిరుగుబాటు చేసినప్పుడు వర్గరహిత సమాజం ఏర్పడుతుంది. అభ్యుదయ కవిత్వం మొదటి లక్షణం 'వర్గ సంఘర్షణ'. శ్రీశ్రీ అభ్యుదయ యుగకర్తగా కీర్తిగాంచారు. 1934లో వెలువడిన 'మహాప్రస్థానం' గేయంతో అభ్యుదయ ఉద్యమం మొదలైందని చెప్పవచ్చు.
లక్షణాలు:
* వర్గ సంఘర్షణ 
* విప్లవ ప్రబోధం
* వీరగాధా కథనం
* యుద్ధ విముఖత
* సమసమాజ నిర్మాణం
* శాంతి కాముకత్వం
* తెలంగాణ విముక్తి
అభ్యుదయ కవులు - రచనలు
* శిష్ట్ల్లా ఉమామహేశ్వరరావు - విష్ణుధనువు
* పఠాభి - ఫిడేలు రాగాల డజను
* శ్రీరంగం నారాయణబాబు - రుధిర జ్యోతి, మౌనశంఖం
* దాశరథి - అగ్నిధార
* సోమసుందర్ - వజ్రాయుధం
* ఆరుద్ర - త్వమేవాహం, సినీవాలి
* కాళోజీ - నా గొడవ
* కుందుర్తి ఆంజనేయులు - తెలంగాణ
* సి.నారాయణ రెడ్డి - మంటలూ మానవుడు
* అనిశెట్టి సుబ్బారావు - అగ్నివీణ
* తాపీ ధర్మారావు - ఆల్ ఇండియా అడుక్కుతినే వాళ్ల మహాసభ
* గజ్జెల మల్లారెడ్డి - శంఖారావం
* విజయలక్ష్మి - విశాల భారతం, కారుచీకటిలో కాంతిరేఖ

 

దిగంబర కవిత్వం
సామాజిక, సాహిత్య రంగాల్లో ఏర్పడిన స్తబ్ధతను తొలగించడానికి 'షాక్ ట్రీట్‌మెంట్' పద్ధతిలో కవితలు రాసింది దిగంబర కవులు. ఆరుగురు రచయితలు కలిసి విచిత్రమైన కలం పేర్లతో కవిత్వాన్ని వెలువరించారు. వీరు రాసిన కవితలను 'దిక్‌'లు అని పిలిచారు.
దిగంబర కవులు - అసలు పేర్లు
* నగ్నముని - కేశవరావు
* నిఖిలేశ్వర్ - యాదవరెడ్డి
* చెరబండరాజు - బద్దం భాస్కరరెడ్డి
* మహాస్వప్న - కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు
* జ్వాలాముఖి - వీరరాఘవాచార్యులు
* భైరవయ్య - మన్‌మోహన్ సహాయ్

 

విప్లవ కవిత్వం:
సాయుధ పోరాటం లక్ష్యంగా వచ్చిన కవిత్వం విప్లవ కవిత్వం. 'మావోయిజం' భూమికగా వచ్చిందే ఈ కవిత్వం. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం చేపట్టాలనీ, బూటకపు ఎన్నికలను తిరస్కరించాలని ఈ కవిత్వం భావిస్తుంది. 1970లో విరసం ఆవిర్భవించింది. మరో ప్రస్థానం కావ్యంతో శ్రీశ్రీ విప్లవ కవి అయ్యాడు. విరసం కార్యకలాపాలకు 'సృజన' లాంటి పత్రికలు దోహదపడ్డాయి. విరసం నుంచి ఝంఝ, మార్చ్, లే అనే కవితా సంకలనాలు వెలువడ్డాయి.
విరసం కవులు - రచనలు
* సుబ్బారావు పాణిగ్రాహి - తూర్పు జెండా
* కె.జి.సత్యమూర్తి - నా చెల్లీ చంద్రమ్మా, నరుడో భాస్కరుడో, ఉద్యమం నెలబాలుడు * కె.శివారెడ్డి - రక్తం సూర్యుడు
* వంగపండు ప్రసాదరావు - ఏంపిల్లో ఎల్దమొత్తవా
* గద్దర్ - రాజకీయ వీధి బాగోతం
* కె.వి.ఆర్. - అడవి, అంగారవల్లరి
* జయధీర్ తిరుమలరావు - అరణ్య నేత్రం
* విమల - అడవి పొంగిన రాత్రి
* సి.విజయలక్ష్మి - ఆహ్వానిస్తున్నాను విప్లవాన్ని

స్త్రీవాద కవిత్వం
పురుషాధిక్యత నశించాలని, లైంగిక వివక్ష ఉండకూడదని, స్త్రీకి అన్ని రంగాల్లో సమానమైన స్వేచ్ఛ ఉండాలని కోరుతూ వచ్చిన కవిత్వమే స్త్రీవాద కవిత్వం. సార్వజని, స్త్రీ స్వేచ్ఛ, భూమిక లాంటి పత్రికలు స్త్రీవాద కవిత్వాన్ని ప్రచారం చేశాయి. మొదట స్త్రీల చైతన్యానికి తమ రచనల ద్వారా కృషి చేసిన రచయితలు - చలం, కుటుంబరావు, రంగనాయకమ్మ, లత, తమ కవితా సంకలనాల ద్వారా స్త్రీవాద సాహిత్యాన్ని సృష్టించినవారు - రేవతీదేవి, సావిత్రి, విమల, జయప్రభ, మహెజబీన్, కొండేపూడి నిర్మల, రజని, నవలలు, కథల ద్వారా స్త్రీ చైతన్యానికి కృషిచేసిన రచయిత్రులు - పి.సత్యవతి, కుప్పిలి పద్మ, సి.సుజాత. స్త్రీవాద కవిత్వంలో ఎక్కువగా వచ్చినవి కవితలేనని చెప్పవచ్చు.

దళితవాద కవిత్వం
'అంబేద్కరిజమ్' పునాదిగా ఉన్న కవిత్వం దళితవాద కవిత్వం. దళితుల సమస్యలను చిత్రించిన సాహిత్యం దళిత సాహిత్యం. దళితుల సమస్యలను చిత్రించిన తొలి భారతీయ నవల 'అన్‌టచబుల్'. 1969 నుంచి దళిత సాహిత్యం అనే పదం విస్తృత వ్యవహారంలోకి వచ్చిందని చెప్పవచ్చు. దళితుల సమస్యలను కవిత్వంలో ప్రతిబింబింపజేసిన తొలి తెలుగు దళిత కవి గుర్రం జాషువా. గబ్బిలం, అనాథ లాంటి పద్య కావ్యాల ద్వారా అస్పృశ్యత సమస్యను చక్కగా చిత్రించారు. తెలుగులో మొదటి దళిత కవితా సంకలనంగా వి.సిమ్మన్న, కొండపల్లి సుదర్శనరాజుల సారధ్యంలో వెలువడిన 'దళిత కవిత' ను చెప్పవచ్చు.
దళిత కవులు - రచనలు
* ఎండ్లూరి సుధాకర్ - పంచమ వేదం
* జి.విజయలక్ష్మి - పనిపిల్ల
* బొజ్జా తారకం - నది పుట్టిన గొంతుక
* శిఖామణి - కిర్రు చెప్పుల భాష, మువ్వల చేతికర్ర
* పిల్లి శ్యాంసన్ - దళిత సాహిత్య చరిత్ర
* స్పార్టకస్ - ఖాకీ బతుకులు
* చిలుకూరి దేవపుత్ర - పంచమం
* బోయ జంగయ్య - ఎచ్చరిక
* సదానంద శారద - మంచినీళ్ల బావి
* సవేర - దళితుల ధర్మ యుద్ధం

 

అనుభూతి వాద కవిత్వం
అనుభూతి ప్రధానమైంది అనుభూతి వాద కవిత్వం. 'నువ్వు చెప్పేది ఏదైనా నీ అనుభవం నుంచి పలకాలి' అని చెప్పే ప్రాథమిక సూత్రం ఉన్న కవితాధోరణి అనుభూతివాద కవిత్వం. ఈ కవిత్వం మొదట భావ కవిత్వంలో భాగంగా ఉండేది. దేవరకొండ బాలగంగాధర తిలక్ మొదటి అనుభూతివాద కవి. చలం, శేషేంద్ర, ఆర్.ఎస్.సుదర్శనం, ఇస్మాయిల్, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ అనుభూతివాద కవులుగా పేరుగాంచారు.
అనుభూతివాద కవులు - రచనలు
* దేవరకొండ బాలగంగాధర తిలక్ - అమృతం కురిసిన రాత్రి
* వై.శ్రీరాములు - రంగుల పక్షి
* శేషేంద్ర శర్మ - శేష, జ్యోత్స్న
* ఇస్మాయిల్ - చిలుకలు వాలిన చెట్టు
* కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ - వెలుతురు పిట్టలు
* వేగుంట మోహన ప్రసాద్ - చితీ చింత

మైనారిటీ వాద కవిత్వం
సంఘంలో నివసిస్తున్నవారి కంటే భిన్నంగా ఉండి మతం, భాష, జాతుల్లో ఇతరుల కంటే భిన్నంగా పరిగణించే ప్రజాసమూహాన్ని మైనారిటీ అంటారు. మొదట మైనారిటీ కవిత్వం దళిత కవిత్వంలో భాగంగా ఉండేది. తెలుగు సాహిత్యంలో 'పుట్టుమచ్చ' కవితతో ముస్లింవాద కవిత్వం మొదలైందని చెప్పవచ్చు.
మైనారిటీవాద కవులు - రచనలు
* ఖాదర్ మొహియుద్దీన్ - పుట్టుమచ్చ 
* స్కై బాబా - జల్ జలా
* కరీముల్లా - నా రక్తం కారుచౌక
* ఇక్బాల్ చంద్ - ఆరో వర్ణం
* జావీద్ - ఎందుకు పుట్టాను ఇక్కడ
* షాజహానా - పర్దా హఠాకే దేఖో (ముసుగుతీసి చూడు)

 

జానపద సాహిత్యం
జానపద కవిత్వం దేశీ కవితా శాఖకు చెందుతుంది. జానపద గేయాలు, గేయ కథలను కలిపి జానపద కవిత్వం అంటారు. జానపదుల ప్రస్తావన మహాభారతంలోని అరణ్య పర్వంలో కనిపిస్తుంది. జానపద గేయాలను మొదటగా ప్రచురించినవారు జె.ఎ.బోయల్. తెలుగు జానపద వాజ్ఞయంపై విశ్వవిద్యాలయాల్లో కృషి చేసినవారిలో మొదటివారు బిరుదురాజు రామరాజు. ఈయన జానపద గేయాలకు 9 లక్షణాలను ప్రతిపాదించాడు. అవి:-
1. ఆశురచన
2. అజ్ఞాత కర్తృత్వం
3. నియమిత స్వరూప రాహిత్యం
4. అనిర్ణీత రచనాకాలం
5. మౌఖిక ప్రచారం
6. అకృతక శైలి
7. గాన యోగ్యత
8. పునరావృత్తి
9. జనసామాన్య పరిచిత వస్తువులు
జానపద గేయాలు - విభజన
1. పౌరాణిక గేయాలు (రామాయణ, భారత, భాగవత కథా సంబంధ గేయాలు)
2. చారిత్రక గేయాలు - పల్నాటి వీరుల కథలు, కాటమరాజు కథ
3. పారమార్థిక గేయాలు - వ్రతాలు, నోములు
4. స్త్రీల పాటలు - పెళ్లి పాటలు, గంధం పాటలు, అలుక పాటలు, అప్పగింతల పాటలు
5. శ్రామిక పాటలు - ఏరువాక పాటలు, కలుపు పాటలు, కపిల పాటలు
6. శృంగార గేయాలు - ఛల్ మోహనరంగ, చంద్రమ్మ పాట
7. అద్భుతరస గేయాలు - బాలనాగమ్మ కథ, గాంధారి కథ, ధర్మాంగద పాము పాట
8. బాలగేయాలు - చెమ్మచెక్క

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌