• facebook
  • whatsapp
  • telegram

ఇతిహాస కవులు 

అతి ప్రాచీనమైన సాహితీ ప్రక్రియ 'ఇతిహాసం'. ఇతిహాసం - అంటే ఇలా జరిగిందని అర్థం. గతించిన రాజవంశాలు, జాతుల సమాచారం, చారిత్రక సన్నివేశాలను ఇతిహాసం వివరిస్తుంది. ధర్మబోధ, హితోపదేశం, జీవిత లక్ష్యం, వ్యక్తిత్వాలను కథల రూపంలో వివరించేది ఇతిహాసం. సంస్కృత ఇతిహాసాలైన రామాయణ, భారతాలు తెలుగులోకి వచ్చాయి. కొంతమంది భాగవతాన్ని ఇతిహాసంగా అపోహపడతారు. అది పురాణం తప్ప ఇతిహాసం కాదు. 
 

ఇతిహాస కవులు 
తెలుగులో మొదటి ఇతిహాసం ఆంధ్ర మహాభారతం. ఆ తర్వాతది రామాయణం. ఆంధ్ర మహాభారతానికి మూలం సంస్కృత భారతం లేదా వ్యాస భారతం. మహాభారతాన్ని పంచమవేదం అంటారు. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు వినిపించింది భారతం. ''తింటే గారెలు తినాలి వింటే భారతమే వినాలి" అనే సామెత భారతం ఎంత గొప్పదో తెలియజేస్తుంది.
* మహాభారత రచన క్రీ.పూ. 3వ శతాబ్దం నాటిదని కొందరి అభిప్రాయం. మహాభారతంలో 18 పర్వాలున్నాయి. వీటిలో అయిదు పర్వాలు యుద్ధానికి సంబంధించినవే. ప్రధాన కథకి అనుబంధంగా (కథలో కథ) ఉన్నది ఉపాఖ్యానం.
* నన్నయ, తిక్కన, ఎఱ్ఱన అనే కవిత్రయం వల్ల తెలుగువారికి మహాభారతం లభించింది. సంస్కృత భారతం చాలా విస్తృతంగా ఉంటే కవిత్రయ భారతం ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంది. వ్యాసుని దృష్టి పురాణ దృష్టి. కవిత్రయం దృష్టి కావ్యదృష్టి.
* సంస్కృత భారతాన్ని తెలుగులో రాయడాన్ని 'ఆంధ్రీకరణ', 'అనువాదం', 'తెనిగింపు' అన్నారు. నిజానికి కవిత్రయం చేసింది అనువాదం అనడం కంటే 'అనుసృజన' అనడం సమంజసం.
నన్నయ 

* తెలుగులో ఆంధ్ర మహాభారతం రచించిన తొలి కవి నన్నయ. 11వ శతాబ్దికి చెందినవాడు. తూర్పు చాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని ఆస్థాన కవి. ఆదికవి, వాగనుశాసనుడు అనేవి ఇతని బిరుదులు. రాజరాజు నన్నయను 'శబ్దశాసనుడు', 'నిత్య సత్యవచనుడు' అని ప్రశంసించాడు.
* రాజరాజు మొదట బెజవాడ రాజధానిగా పాలించి శత్రుయుద్ధంలో పరాజయం పొంది మళ్లీ యుద్ధం చేసి గెలుపొంది 'వేంగి'ని రాజధానిగా చేసుకున్నాడు. ఆ తర్వాత రాజమహేంద్రవరం రాజధానిగా సుపరిపాలన సాగించాడు. నన్నయతో ఆంధ్ర మహాభారతం రాయించడానికి కారణాలు:
     *  వైదిక మత ఉద్ధరణ కోసం
     *  తన చంద్రవంశపు పాండవోత్తముల చరిత్రను తెలుగులో వినడం కోసం
     *  భారతం వింటే, చదివితే పుణ్యం వస్తుందని.
* భారత రచనకు నన్నయనే ఎంచుకోవడానికి కారణం - శ్రీపతి పండితుడు, అయ్యనభట్టు, చేతనభట్టు లాంటి వాళ్లు శాసనకవులే తప్ప ఇతిహాస, కావ్యకవులు కారు. నన్నయ 'ఆంధ్ర శబ్ద చింతామణి' అనే వ్యాకరణాన్ని తెలుగు భాష కోసం సంస్కృతంలో రాశాడు.
* నన్నయ తన భారతాన్ని 'శ్రీవాణీ గిరిజాశ్చిరాయద ధతోవ క్షోము భాంగేషు...' అనే శ్లోకంతో ప్రారంభించి త్రిమూర్తులను ప్రార్థించాడు. నన్నయ భారతంలో రాసిన తొలి పద్యంగా 'రాజకులైక భూషణుడు...' అనే పద్యాన్ని, చివరి పద్యంగా 'శారద రాత్రులుజ్జ్వల...' అనే పద్యాన్ని పేర్కొంటారు.
* నన్నయ ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వంలో కొంత భాగం రాశాడు. సుమారుగా రెండున్నర పర్వాలు అని చెబుతారు. ఉదంకోపాఖ్యానం, కద్రూ వినతల కథ, యయాతి చరిత్ర, శకుంతలోపాఖ్యానం, కర్ణ జనన వృత్తాంతం లాంటి ఉపాఖ్యానాలు నన్నయ భారతంలో ఉన్నాయి.
* 'సారమతింగవీంద్రులు........' అనే పద్యంలో నన్నయ తన కవిత్వంలో 
 ప్రసన్న కథా కవితార్థయుక్తి, అక్షరరమ్యత, నానారుచిరార్థ సూక్తులు అనే గుణాలు ఉంటాయన్నాడు.
* నన్నయ భారతం రాయడంలో తన సహాధ్యాయుడైన నారాయణభట్టు సహాయం తీసుకున్నాడు. నన్నయ సమకాలీనుడైన మల్లియ రేచన 'కవిజనాశ్రయం' అనే తొలి ఛందోగ్రంథం రాశాడు.
* వేములవాడ భీమ కవి చాటు పద్యాలు కొన్ని దొరికాయి. కానీ రచనలు లభ్యమవలేదు.
 నన్నయ భారతంలో ముఖ్యమైనవి:
         *  'గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్'
         *  'నిండుమనంబు నవ్య నవనీత సమానము...'
         *  'నలదమయంతులిద్దరు మనఃప్రభవానల...'
* నన్నయను విశ్వనాథ సత్యనారాయణ ''ఋషి వంటి రెండవ వాల్మీకి" అన్నారు. నన్నయ తన భారతాన్ని రాజరాజుకి అంకితం ఇచ్చి ఉంటాడని భావిస్తున్నారు.

 

తిక్కన 

13వ శతాబ్దం నాటి కొట్టరువు తిక్కన నెల్లూరు నివాసి. మనుమసిద్ధి మంత్రి. రాజనీతి చతురుడు, రాయబారిగా అనుభవం ఉన్నవాడు. 'ఉభయ కవి మిత్రుడు', 'కవిబ్రహ్మ' అనే బిరుదులు ఉన్నాయి. మహాభారతంలో 15 పర్వాలు రాశాడు. విరాటపర్వం (4వది) నుంచి ప్రారంభించాడు. తన భారతాన్ని హరిహరనాథుడికి అంకితమిచ్చాడు.
* తిక్కన శివకేశవుల అభేదాన్ని ప్రకటించాడు. తన తొలి రచన 'నిర్వచనోత్తర రామాయణం' కావ్యాన్ని మనుమసిద్ధికి అంకితమిచ్చాడు. 
 తిక్కన కవితా రీతులు:
     *  రసాభ్యుచిత బంధం
     *  నాటకీయత
     *  ధ్వని (వ్యంగ్య) వైభవం
     *   రాజనీతి
     *  తెలుగుదనం
* తిక్కన భారతంలోని అతి ముఖ్యమైన ఉపాఖ్యానాలు: సంజయ రాయబారం, శ్రీకృష్ణ రాయబారం, కీచక వధ, అభిమన్యు వధ, యుద్ధపంచకం.
* సంస్కృతంలో భీష్మ పర్వంలోని 700 శ్లోకాల భగవద్గీతను తిక్కన 50 గద్య పద్యాల్లో సంక్షేపించాడు. 'సనత్సుజాతీయం' అనే ఉపాఖ్యానాన్ని పూర్తిగా వదిలేశాడు.
* తిక్కన కంద పద్యాలకు ప్రసిద్ధి. తిక్కన శిష్యుడైన కేతన తన తొలి కథా కావ్యమైన దశకుమార చరిత్రను తిక్కనకు అంకితమిచ్చాడు.
* సుమతీ శతకం రాసిన బద్దెన కవి 13వ శతాబ్దం నాటివాడే.
* ప్రథమాంధ్ర పురాణం 'మార్కండేయ పురాణం' రాసిన మారన కూడా తిక్కన సమకాలీకుడే.
* 'తను కావించిన సృష్టితక్కొరుల చేతంగాదు' అని తిక్కన గురించి ఎఱ్ఱన ప్రశంసించడం విశేషం.
* సంజయ, శ్రీకృష్ణ రాయబారాలను తిక్కన వ్యంగ్య వైభవానికి ఉదాహరణగా పేర్కొంటారు. తిక్కన భారతం నుంచి కొన్ని....
       *  'వచ్చినవాడు ఫల్గుణుడవశ్యము గెల్తుమనంగరాదు...'
       *  'వరమున పుట్టితిన్ భరతవంశముజొచ్చితి...'
       *  'సింగంబాకటితో గుహాంతరమునన్...'
* విశ్వనాథ సత్యనారాయణ తిక్కనను 'తెలుగు శిల్పంపుతోట' అన్నారు. తిక్కనపై శలాక రఘునాథశర్మ, ఎల్లూరి శివారెడ్డి, అప్పజోడు సుబ్బయ్య లాంటి వారు విమర్శ గ్రంథాలు రాశారు. 'ఆంధ్రావళి మోదము కొఱకు' రాస్తానన్నాడు తిక్కన.

 

ఎఱ్ఱన

కవిత్రయంలో మూడోవాడు చదలవాడ ఎఱ్ఱన. 14వ శతాబ్దానికి చెందినవాడు. అద్దంకి ప్రభువు ప్రోలయ వేమారెడ్డి ఆస్థానకవి. 'శంభుదాసుడు', 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదులున్నాయి.
 ఎఱ్ఱన రచనలు:
    * రామాయణం
    *  ఇది అలభ్యం. ప్రోలయ వేమారెడ్డికి అంకితం
    *  నృసింహ పురాణం
    *  అహోబిల నృసింహస్వామికి అంకితం.
    *  ఇది తెలుగులో తొలి క్షేత్రమాహాత్మ్య కావ్యం.
    * అహోబిల క్షేత్ర వైభవాన్ని వర్ణించాడు.
    *  హరివంశం
    * ఇది ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చాడు.
    * ఇందులో మొదటగా గ్రామీణ వర్ణన ఎక్కువగా కనిపిస్తుంది.
    *  ఆంధ్ర మహాభారతం; అరణ్యపర్వశేషం
* ఎఱ్ఱనకు 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదు రావడానికి కారణం నృసింహ పురాణం అని కొందరు, హరివంశం అని మరికొందరు చెబుతారు. వర్ణనా నైపుణ్యం ఎఱ్ఱనలో ఎక్కువ కాబట్టి 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదు వచ్చింది.
* 'స్ఫురదరుణాంశ రాగరుచి...' అనే పద్యంతో ఎఱ్ఱన భారతాన్ని ప్రారంభించాడు అంటారు.
* ఎఱ్ఱన భారతంలో- ధర్మవ్యాధోపాఖ్యానం, కర్ణ జనన వృత్తాంతం, ఘోషయాత్ర, సావిత్రి ఉపాఖ్యానం ముఖ్యమైనవి. శ్రీనాథుడు 'సూక్తి వైచిత్రి'ని ఎఱ్ఱన కవితాగుణంగా పేర్కొన్నాడు.
* నన్నయ అసంపూర్ణంగా వదిలిన అరణ్యపర్వ భాగాన్ని ఎఱ్ఱన 'తద్రచనయకా' పూరించాడు. అంటే నన్నయలా రాశాడు. నన్నయ 'మధ్యాక్కర' పద్యం రాస్తే ఎఱ్ఱన రాశాడు.
* ఎఱ్ఱన సమకాలీకుల్లో నాచన సోమన ముఖ్యుడు, ప్రతిభావంతుడు. నాచన సోమన హరిహర బుక్కరాయల ఆస్థాన కవిగా ఉన్నాడని చెబుతారు. ఈయన కడప జిల్లాకు చెందిన కవి అని చరిత్రకారుల అభిప్రాయం. ఇతనికి  సకలభాషాభూషణ,  సాహిత్యరసపోషణ,
  సంవిధాన చక్రవర్తి,  నవీనగుణ సనాధ అనే నాలుగు బిరుదులున్నాయి. 
* నాచన సోమన 'ఉత్తర హరివంశం' రచించాడు. దీన్ని హరిహరనాథుడికి అంకితమిచ్చాడు. ఆదిపురాణం, హరివిలాసం లాంటివి సోమన రాశాడంటారు కానీ అవి దొరకలేదు.
* విశ్వనాథ 'ఒకడు నాచన సోమన' అనే విమర్శ గ్రంథాన్ని రచించారు.
* త్రిపురాంతకోదాహరణం రాసిన రావిపాటి త్రిపురాంతకుడు, వెన్నెలకంటి జన్నమంత్రి ఎఱ్ఱన యుగంలోని వారే.
* కవిత్రయం ఆంధ్ర మహాభారతాన్ని సంస్కృతంలో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా మూల సంక్షిప్తం, మూల పరిహరణం, మూల విస్తృతి, అన్యథా కల్పన, మూలానుసరణ, అమూలకత అనే పద్ధతిలో రాయడం వల్ల ఆదరణీయమైంది. సార్వకాలికమైంది.

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌