• facebook
  • whatsapp
  • telegram

డొల్ల పథకాలతో ఫలితం సున్న!

రైతుల ఊసుపట్టని బడ్జెట్‌

రైతులు రెండున్నర నెలలుగా రోడ్లపై కూర్చుని ఆందోళనలు చేస్తున్న తరుణంలో వచ్చిన కేంద్ర బడ్జెట్లో అన్నదాతలకు ఊరట కలిగించే నిర్ణయాలేవీ ప్రభుత్వం ప్రకటించలేదు. వ్యవసాయాభివృద్ధి పథకాలకు ఎప్పటిమాదిరిగా తలా కొంచెం కేటాయింపులే తప్ప వినూత్నంగా ఇచ్చినవేమీ కానరాలేదు. కొత్త పథకాల ఊసూ లేదు. ఉన్న పథకాలకు నిధుల పెంపూ ఆశాజనకంగా లేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక పరిజ్ఞానం వినియోగిస్తూ అనేక దేశాల్లో సేద్యం కొంతపుంతలు తొక్కుతుంటే ఇక్కడ దాన్ని రైతులకు చేర్చే కొత్త కార్యక్రమాలైనా ప్రకటించలేదు. కేంద్ర బడ్జెట్‌తో సంబంధం లేకుండా రాష్ట్రాలు వాటి దారి అవి చూసుకుంటున్నాయి. మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి పట్టున్న రాష్ట్రాలు వ్యవసాయంలో ఎక్కువ రాయితీలు పొందుతుంటే- తెలంగాణ, పశ్చిమ్‌ బంగ వంటివి రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో మంజూరయ్యే నిధులతోనే నెట్టుకొస్తున్నాయి. పలు కేంద్ర వ్యవసాయాభివృద్ధి పథకాలు సరిగా అమలు కావడం లేదు. కేంద్రం నిధులు రావాలంటే రాష్ట్రాలు 40శాతం నుంచి 60శాతం వాటా సొమ్ము కలపాల్సి రావడమే ఇందుకు ప్రధాన కారణం. అందుకే కేంద్రం సైతం మొత్తం వ్యవసాయశాఖ పద్దులో 53శాతం సొమ్మును నేరుగా కేంద్ర ప్రభుత్వానికి పేరు తెచ్చే ‘పీఎం కిసాన్‌’ పథకానికే కేటాయించింది. ఇందుకు రాష్ట్రాలు వాటా కలపాల్సిన అవసరం లేకపోవడం, రైతుల బ్యాంకు ఖాతాలో కేంద్రమే నేరుగా డబ్బు వేస్తుండటమే ప్రధాన కారణం. ఇక మిగిలిన ఏ పథకానికీ కనీసం ఇందులో మూడోవంతైనా విదల్చలేదు.

సేద్యానికి నిధుల దెబ్బ

దేశవ్యాప్తంగా రసాయన ఎరువుల వినియోగం పెరుగుతోంది. వీటి ధరలు పెంచితే ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత వస్తుందని, తయారీ కంపెనీలకిచ్చే రాయితీలు పెంచుతూ పోతున్నారు. మూడేళ్ల(2019-22) వ్యవధిలో ఈ కంపెనీలకిచ్చే రాయితీ రూ.3.07 లక్షల కోట్లకు చేరింది. కొద్దికాలంలోనే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎరువుల కంపెనీలకు ధారపోసే బదులు రసాయనాల వినియోగాన్ని తగ్గించడానికి గట్టిగా ఎందుకు కృషి చేయడం లేదన్నది కీలక ప్రశ్న. ప్రతి కమతంలో పంట సాగుకు ముందే మట్టి నమూనాలు పరీక్షించి వాటిలో ఏయే పోషకాలు తక్కువ ఉన్నాయో తెలియ చెప్పి, వాటి భర్తీకే రసాయన ఎరువులు వాడాలి. అలాచేస్తే ఎరువుల రాయితీకిస్తున్న రూ.80వేల కోట్లలో సగానికి సగం మిగులుతాయని వ్యవసాయ నిపుణులు మొత్తుకుంటున్నా ఆలకించేదెవరు? భూసార పరీక్షల పథకానికి ఈ ఏడాది రూ.315 కోట్లు కేటాయిస్తే అందులో రూ.92 కోట్లు ఖర్చేకాలేదని వచ్చే ఏడాదికీ రూ.315 కోట్లే కేటాయించారు. ఇక భూమిని, ప్రజల ఆరోగ్యాన్ని రసాయనాల బారి నుంచి ఏం కాపాడతారు? సమస్యల మూలాలు పరిష్కరించకుండా రసాయన ఎరువుల కోసం రూ.80 వేల కోట్లు గుమ్మరించడం వ్యవసాయాభివృద్ధి ఎలా అవుతుంది? రసాయనాలను పూర్తిగా వదిలేసి పురాతన సంప్రదాయ పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించడానికి ‘పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన’(పీకేవీవై) పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకానికి ఈ ఏడాది రూ.500 కోట్లు ఇస్తే రాష్ట్రాలు తీసుకోలేదని వ్యయం కాకుండా రూ.150 కోట్లు మిగిలిపోయాయని కొత్త బడ్జెట్‌లో మరో రూ.50 కోట్లు కోత పెట్టారు. ఇలాగే సాగునీటి వనరుల కల్పనకు, నీటి ప్రాజెక్టుల కోసం ఏటా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. కానీ సాగునీటిని పొదుపుగా వాడేందుకు ఉద్దేశించిన ‘బిందుసేద్యం’ పథకానికి మాత్రం నిధుల వ్యయం సరిగా లేదు. దీనికి ఈ ఏడాది నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే రాష్ట్రాలు తీసుకోలేదని రూ.2563.20 కోట్లే ఖర్చుపెట్టారు. ఇక వచ్చే ఏడాదికి ఇంతే మొత్తం కేటాయించినా అందులో రాష్ట్రాలు ఎంత తీసుకుంటాయనేది ప్రశ్నార్థకం. ఈ పథకం కింద కేంద్రం రూ.40 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.60 కలిపి వాడాలి. ఈ నిబంధన కారణంగా తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లుగా ఈ పథకాన్ని అమలుచేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్టముంటే ఇలాంటి పథకాలకు నిధులిచ్చి కేంద్రం నుంచి వచ్చే 40శాతం వాటా తీసుకుంటున్నాయి. రాష్ట్రాల వైఖరితో బిందుసేద్యం పథకంలో మాదిరిగానే పలు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ఏటా వందల కోట్ల రూపాయలు మిగిలిపోతున్నాయి. విత్తనం దగ్గరి నుంచి కోతల వరకూ రాయితీలిచ్చి రైతులకు సాయపడేందుకు కేంద్రం అమలుచేస్తున్న ‘రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన’(ఆర్కేవీవై) అమలుతీరూ ఇలాగే ఉంది. నిరుడు రూ.3,085 కోట్లు ఉంటే ఈ ఏడాది రూ.2,563 కోట్లకు దిగజారింది. ఈ పథకానికి ఎన్డీయే అధికారంలోకి రాకముందు 2013-14 బడ్జెట్లో రూ.9,954 కోట్లు ఇస్తే ఈ ఏడాది అందులో 25.74 శాతమే ఖర్చు చేయడం ఏ ప్రగతికి నిదర్శనం? ఈ పథకం నిధులు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం 60శాతం కలపాల్సి రావడంతో కేంద్రం వాటాను తీసుకోకుండా వదిలేస్తున్నారు.

దిగుబడి పెరగాలి

కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు వల్ల ఏ గ్రామంలో ఏ రైతు ఎంత లబ్ధి పొందారనే వివరాలు ఆన్‌లైన్‌లో చూపితే వాటి అమల్లో డొల్లతనం ఎంత ఉందనేది బయటపడుతుంది. కొత్త పరిజ్ఞానాన్ని సేద్యానికి అందించే వ్యవసాయ విద్య, పరిశోధన సంస్థలకు నిధుల కేటాయింపులూ పెంచడం లేదు. ఇప్పటికే ఉన్న జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థల సంఖ్యను విలీనాల విధానంలో తగ్గించి నిధుల భారానికి కోత పెట్టాలనుకోవడమూ సరికాదు. ఆస్ట్రేలియా, ఐరోపాల్లో రైతులకు నేరుగా రాయితీలు ఇవ్వడంకన్నా వ్యవసాయ పరిశోధన సంస్థలపై పెట్టుబడులు, కొత్త పరిజ్ఞానాన్ని, అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఇవ్వడంపై ప్రభుత్వాలు దృష్టిపెడుతున్నాయి. భారతదేశంలో 15.60 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూములు, 14.50 కోట్ల మందికి పైగా రైతులుంటే నెదర్లాండ్‌లో కేవలం 10.60 లక్షల హెక్టార్ల భూమి ఉంది. తెలంగాణ జనాభాతో పోలిస్తే నెదర్లాండ్స్‌లో సగమైనా లేరు. కానీ ప్రపంచ మార్కెట్లో ఆహారోత్పత్తుల ఎగుమతుల ఆదాయంలో రెండో, విత్తన వ్యాపారంలో మూడో; ఆలుగడ్డ, ఉల్లిగడ్డల ఎగుమతుల్లో ఒకటో స్థానం నెదర్లాండ్‌దే! ఇలాంటి అద్భుతాలు జరగాలంటే ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులకు చేర్చే పథకాలు, పరిశోధనలకు నిధులు పెరగాలి. వాటి జోలికి వెళ్లకుండా- పాత పథకాలకే అరకొరగా నిధులు కేటాయించి పంట దిగుబడులు పెంచి, దేశానికి ఆహార భద్రత కల్పిస్తామంటే అది కుదిరేపని కాదని ప్రభుత్వాలు గుర్తించాలి.

కొరవడిన జవాబుదారీతనం

కేంద్రం ఒక పథకానికి నిధులు కేటాయిస్తే అందులో రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీసుకుంది, రైతులకు ఎంత మొత్తం అందజేసింది అనే విషయాల్లో స్పష్టత ఉండాలి. రాష్ట్రాలు గట్టిగా అడిగి తీసుకుంటే కేంద్రానికి సైతం బడ్జెట్లో కేటాయింపులు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ రాష్ట్రాలే డబ్బు నిరాకరించడంతో ఆ సాకుతో కేంద్రం పలు పథకాల నిధులు మిగిలిపోతున్నాయని వ్యయం తగ్గిస్తోంది. దీనివల్ల అంతిమంగా రాయితీలు అందుకోలేక పేదరైతులు నష్టపోతున్నారు.

- మంగమూరి శ్రీనివాస్‌

Posted Date: 16-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం