• facebook
  • whatsapp
  • telegram

పంటలను ముంచుతున్న విపత్తులు

భారీ నష్టాలతో రైతుల బెంబేలు

రైతులు ఆరుగాలం కష్టపడి పండిస్తున్న పంటలు ప్రకృతి విపత్తుల బారినపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా తుపానులు, వరదల కారణంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. బాధిత రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న బీమా పథకాలు సైతం విపత్తుల నుంచి రైతులకు సాంత్వన చేకూర్చలేకపోతున్నాయి. దేశంలో 2017-2019 మధ్య వరదల వల్ల సుమారు 1.81 కోట్ల హెక్టార్లలో పంటనష్టం సంభవించినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. ఇది దేశంలోని మొత్తం వ్యవసాయ భూమిలో 8.5 శాతానికి సమానం. ఎక్కువగా వరదలు సంభవించే రాష్ట్రాల్లో అస్సాం, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముందువరసలో ఉన్నాయి. ఇక 2019-20లో 1.44 కోట్ల హెక్టార్లలో పంటలపై వరదలు ప్రభావం చూపాయి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో పంటలకు అధికంగా నష్టం వాటిల్లింది. తుపానుల కారణంగా కురిసే భారీ వర్షాలతో పల్లపు ప్రాంతాలు మునగడం, చెరువుల గట్లు, కాలువలు, జలాశయాల ఆనకట్టలు తెగిపోవడం వల్ల రైతులు పంటలను నష్టపోతున్నారు. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధ్యయనం ప్రకారం దేశంలో ఏటా సుమారు 12.5శాతం భూభాగం వరదలకు గురవుతోంది. ఇందులోనూ అత్యధికంగా గంగ, దాని ఉపనదులు, బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి, నర్మద నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి.

గుబులు రేపుతున్న అంచనాలు

వరదల కారణంగా గత అయిదేళ్లలో దేశవ్యాప్తంగా రూ.95 వేలకోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు ఇటీవల కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. 9,886 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఇదే కాలంలో 23.1 కోట్ల మంది ప్రజలు, 3.1 కోట్ల హెక్టార్లలో పంటలు వరద ప్రభావానికి గురైనట్లు వివరించింది. 1,82,635 పశువులు చనిపోయినట్లు పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థపై వరదలు చూపే ప్రభావాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి అయిదు సెకన్లకు ఫుట్‌బాల్‌ మైదానమంత భూమి కోతకు గురవుతోందని అంచనా దీనివల్ల పంటలు పండే నేలలు తగ్గిపోయి, భారీస్థాయిలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ ఇటీవల చేసిన హెచ్చరిక ప్రపంచానికి గుబులు పుట్టించేదే. ఇలాంటి తీవ్రస్థాయి పరిస్థితుల్ని నివారించేందుకు తక్షణం భూసంరక్షణ చర్యలు చేపట్టాలనే సూచనలను ప్రపంచ దేశాలన్నీ ఆచరించాలి.

వాతావరణ మార్పుల వల్ల పంటలకు ఆశించే చీడపీడలు సైతం రైతన్నలకు భారీ నష్టాన్నే మిగిలిస్తున్నాయి. భూతాపం ప్రభావంతో రకరకాల పురుగులు, కొత్త తెగుళ్లు పైర్లను నాశనం చేస్తున్నాయి. క్రిమిసంహారక మందులకు సైతం కొన్ని పురుగులు తలొగ్గడం లేదు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తామర పురుగు, జెమిని తెగులు మిరప పంటను ఆశించి అన్నదాతలను తీవ్రంగా నష్టపరిచాయి. ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా తామర పురుగు నిర్మూలన కాకపోవడంతో పంటలను తొలగిస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే వేల కోట్ల రూపాయలమేర రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరో వాణిజ్య పంట పత్తిది కూడా ఇలాంటి పరిస్థితే. గులాబీ పురుగుతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ ఏడాది పత్తి పంట దెబ్బతింది. ఉద్యాన పంటలపైనా తెగుళ్ల ప్రభావం ఉంటోంది. కూరగాయ పంటలనూ ఇవి దెబ్బ తీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పంట ఉత్పత్తిలో 40శాతందాకా నష్టాలు క్రిమికీటకాలు, తెగుళ్ల వల్ల సంభవిస్తున్నట్లు అంచనా. ఎక్కువగా నష్టపోయే పంటల్లో పత్తి (30శాతం), వరి (25శాతం), చెరకు (20శాతం), మొక్కజొన్న (18శాతం) ముందు వరసలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రైతులు రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల వెలువడే కాలుష్యం, కాలుష్య ఉద్గారాల వల్ల సైతం పంటల ఉత్పాదకత పెరగడం లేదని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. భవిష్యత్తులో వ్యవసాయోత్పత్తుల పెంపు అనేది భూమి, నీరు, భూసార పరిరక్షణపైనే ఆధారపడి ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరించి తగిన చర్యలు తీసుకోకపోతే మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

ఆదుకోవడంలో అలసత్వం...

ఏ రకంగా పంటలకు నష్టం వాటిల్లినా ఆ ప్రభావం పడేది అన్నదాతలపైనే. పంటలు కోల్పోయినప్పుడు వారిని ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న బీమా పథకాలతో వారికి ఒనగూరే ప్రయోజనం స్వల్పమే. రైతుల్లో అవగాహన లేకపోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో చాలామందికి బీమా రక్షణ లభించడంలేదు. నష్టాన్ని లెక్కించడంలో పారదర్శకత లోపించడం, పరిహారం చెల్లింపులో బీమా కంపెనీల ఆలస్యం తదితర కారణాలతో అధిక శాతం రైతులు పంటల బీమాకు ఉత్సాహమూ చూపడం లేదు. ప్రకృతి విపత్తుల వల్ల పంటనష్టం జరిగినప్పుడు పరిహారం వెంటనే చెల్లించేలా బీమా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలి. ఇందుకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఇక కౌలు రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేడు. దేశంలో మొత్తం రైతుల్లో నాలుగోవంతుకు పైగా కౌలు రైతులు ఉన్నారు. పంటలు కోల్పోయినప్పుడు వీరిని ఆదుకునేందుకు చాలా రాష్ట్రాల్లో ఎలాంటి పథకాలూ లేవు. దీంతో వీరికి పరిహారం అందడం లేదు. ఇలా పలు రకాల కారణాలతో కర్షకులు నష్టపోతున్నా వారికి భరోసా దక్కడం లేదు. ప్రకృతి విపత్తులను నియంత్రించలేకపోయినా, వాటి నుంచి ఉత్పన్నమయ్యే నష్టాలను పూడ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అలాకానిపక్షంలో ‘రైతు సాధికారత’పై ప్రభుత్వాల నినాదాలన్నీ కాగితాలకే పరిమితమవుతాయి.

అనావృష్టితోనూ ముప్పే!

దేశంలోని కొన్ని ప్రాంతాలు తరచూ అతివృష్టితో వరదల బారిన పడుతుంటే, మరికొన్నిచోట్ల అనావృష్టి పరిస్థితులు నెలకొంటున్నాయి. దేశవ్యాప్తంగా 21.06శాతం భూమి అనావృష్టి ప్రభావానికి గురవుతున్నట్లు ‘ముందస్తు కరవు హెచ్చరిక వ్యవస్థ (డీఈడబ్ల్యూఎస్‌)’ ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ప్రతి సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు సరిగా పడకపోవడంతో అక్కడ కరవు పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోయి అన్నదాతలు నష్టపోతున్నారు. ఒకవేళ వర్షాలు కురిసినా సమయానుకూలంగా పడకపోవడం కూడా దిగుబడులపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మన దేశ వ్యవసాయ రంగం రుతుపవన వర్షంపై ఆధారపడటంతో వర్షపాతంలోని హెచ్చుతగ్గులు పంటల ఉత్పత్తులను ప్రభావితం చేస్తున్నాయి.

- దేవవరపు సతీష్‌బాబు
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రజలపైనే అప్పుల భారం

‣ మోన్‌ మారణకాండకు బాధ్యులెవరు?

‣ సహజత్వం కోల్పోతున్న వాతావరణం

Posted Date: 17-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం