• facebook
  • whatsapp
  • telegram

మెట్ట సేద్యంలో అంతర్జాతీయ కీర్తి

ఆహార భద్రతకు ‘ఇక్రిశాట్‌’ కృషి

అనుకూల వాతావరణం, సాగునీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో సేద్యం చేయడం ఎవరికైనా సులభమే. ఉన్న కొద్దిపాటి నీటినే నిల్వ చేసి, పొదుపుగా వాడుతూ ఆధునిక విధానాల ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని హైదరాబాద్‌లోని ‘అంతర్జాతీయ సమశీతోష్ణ మండల వ్యవసాయ పరిశోధనా సంస్థ’ (ఇక్రిశాట్‌) ప్రపంచానికి పాఠాలు నేర్పుతోంది. పేదల ఆహార భద్రతకు భరోసా ఇస్తూ- స్వర్ణోత్సవాలను జరుపుకొంటోంది. పేదలు వినియోగించే జొన్నలు, రాగులు, సజ్జలు వంటి తృణధాన్యాలతోపాటు నూనెగింజల పంటలపై ఈ సంస్థ చేస్తున్న మేలిమి పరిశోధనలకు ఎన్నో దేశాలు ప్రాధాన్యమిస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్‌వంటి అభివృద్ధి చెందిన దేశాలే కాకుండా బురుండీ, రువాండావంటి అతి పేదదేశాల ప్రభుత్వాలు, అంతర్జాతీయ స్వచ్ఛంద, పరిశోధనా సంస్థలు ఇక్రిశాట్‌తో కలిసి పనిచేస్తున్నాయి.

వర్షాభావ ప్రాంతాలకు వరం

వర్షాలు కురవని, పెద్దగా వానచినుకులు పడని ప్రాంతాల్లో, అతి తక్కువ నీటితో పంటలు పండే మెట్టభూముల్లో ఆహారం, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల సాగుకు, దిగుబడుల పెంపుదలకు జరిగే పరిశోధనలు ప్రపంచానికి ఇప్పుడు చాలా అవసరం. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని పలు దేశాల్లో సాగునీటి కొరతతో సరిగ్గా పంటలు పండక ఆకలితో అలమటించే నిరుపేదలకు ఆహార భద్రతనిచ్చే దిశగా ఇక్రిశాట్‌లో పరిశోధనలు జరుగుతున్నాయి. పేదలు తీసుకునే సాధారణ ఆహారంలోనే పోషకాలు నేరుగా అందే దిశగా పరిశోధనల్లో సుమారు పాతిక దేశాల శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని 210 కోట్ల మంది ప్రజలకు ఇక్రిశాట్‌ సేవలందిస్తోంది. 50 ఏళ్లక్రితం రెండు ఫౌండేషన్లు భారత ప్రభుత్వ సహకారంతో హైదరాబాదుకు సమీపంలోని పటాన్‌చెరులో ఇక్రిశాట్‌ను ఏర్పాటు చేశాయి. ఇప్పటికీ ఈ సంస్థకు బిల్‌గేట్స్‌లాంటి వారు విరాళాలిచ్చి ఆదుకుంటున్నారంటే ప్రపంచ పేదలకు అది చేస్తున్న గొప్ప సేవ ఏమిటో అర్థమవుతుంది. అధిక దిగుబడినిచ్చే 1,135 రకాల కొత్త వంగడాలను ఇప్పటిదాకా ఇక్రిశాట్‌ 81 దేశాలకు పంపిణీ చేసింది. మొత్తం 149 దేశాల్లో 15 లక్షలకు పైగా విత్తన నమూనాలను రైతులకు అందించింది. ప్రపంచవ్యాప్తంగా 144 దేశాలకు చెందిన వివిధ రకాల పంటలు, వంగడాలకు చెందిన 1.28 లక్షలకు పైగా జన్యువులను భవిష్యత్తు ఆహార భద్రతకోసం ఇక్రిశాట్‌ జన్యు బ్యాంకులో భద్రపరచింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 80 కోట్ల మంది తినడానికి తిండి దొరక్క ఆకలిబాధలతో అలమటిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి అంచనా. నిత్యం అలాంటివారి ఆకలిని తీర్చడమే కాకుండా వారి ఆరోగ్యాన్నీ ఇక్రిశాట్‌ కాపాడుతోంది. ప్రస్తుత కరోనా సంక్షోభంలో ప్రతి మనిషికీ నిత్యం పోషకాహారం అవసరం. తినడానికి అన్నమే దొరకని దుస్థితిలో ఉన్న నిరుపేదలకు రోజూ పోషకాహారం తీసుకోవడం ఎలా సాధ్యం? ఈ సమస్యను అధిగమించడానికే- సాధారణ బియ్యం, పప్పులు, నూనెగింజల్లోనే పోషకాల శాతాన్ని పెంచేలా కొత్త వంగడాలను అభివృద్ధి చేయడంపై ఇక్రిశాట్‌ దృష్టి సారించింది. ఇండియా, బంగ్లాదేశ్‌, కొన్ని ఆఫ్రికా దేశాల్లో 10 లక్షల ఎకరాల్లో అభివృద్ధి చేసిన కొత్త పప్పుధాన్యాల వంగడాలను సాగుచేయిస్తోంది. ఇలా పేదల ఆరోగ్యానికి పూచీకత్తునిస్తోంది.

విలువైన పరిశోధనలు

తెలంగాణలో జొన్నపంట సాగు, విత్తనోత్పత్తిని పెంచడం ద్వారా విదేశాలకు వాటిని ఎగుమతి చేయడానికి ఇక్రిశాట్‌తో గతంలో రాష్ట్ర వ్యవసాయశాఖ ఒప్పందం కుదుర్చుకొంది. జొన్న సాగుద్వారా తెలంగాణ రైతులకు పోషకాహారం అందుతుంది. ఎగుమతులతో వారి ఆదాయమూ అధికమవుతుంది. తెలంగాణ, ఏపీల్లో పలు రకాల మెట్టపంటలను పండించడానికి అనువైన భూములు, వాతావరణం ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని జొన్నలు, రాగులు, సజ్జలు తదితర తృణధాన్యాలను పండించడానికి ఇక్రిశాట్‌ పరిశోధనా సహకారం ఎంతగానో ఉపకరిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇక్రిశాట్‌ సహా సుమారు పది జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు; వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఉభయ రాష్ట్రాల్లోని కోటిమంది పేద రైతులు ఈ సంస్థల విలువైన పరిశోధనల ఫలాలను అందుకొనే అవకాశాలున్నాయి. వాటి ద్వారా నాణ్యమైన విత్తనాలు, అధునాతన పరిజ్ఞానం రైతులకు అందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లోని జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలతో ఇక్రిశాట్‌కు పలు ఒప్పందాలున్నాయి. వాటి ఆధారంగా భారత రైతాంగానికి ఎంతో సాయం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశముంది. రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో మేలైన వేరుసెనగ పంట సాగు, దిగుబడుల పెంపునకు ఇక్రిశాట్‌ విలువైన పరిశోధనలు ఉపకరిస్తాయి. పొరుగునే ఉన్న కర్ణాటకలో రసాయనాల నుంచి భూములను కాపాడి అధిక దిగుబడులు సాధించడానికి, తృణధాన్యాల పంటల సాగుకు ఇక్రిశాట్‌తో కలిసి అమలు చేసిన ‘భూచేతన’ పథకం లక్షల సంఖ్యలో రైతులకు ఉపయోగపడింది. ఒడిశాలో సైతం భూసారాన్ని కాపాడి పంటల దిగుబడి పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇక్రిశాట్‌తో కలిసి పనిచేస్తోంది. పెరుగుతున్న జనాభా ఆహార భద్రతకు భరోసా ఇవ్వాలంటే తీవ్రతరమవుతున్న వాతావరణ మార్పులను తట్టుకొనే కొత్త వంగడాలు అవసరం. కృత్రిమమేధ(ఏఐ), డిజిటల్‌ పరిజ్ఞానంతో పంటల సాగులోనే కాకుండా, రైతులు పంటను గిట్టుబాటు ధరలకు విక్రయించుకొనేందుకు సాయపడితేనే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ఇక్రిశాట్‌ చెబుతోంది. అందుకోసం ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించి అమలుపరిస్తేనే రైతులకు మేలు కలుగుతుంది!

రైతు ఆదాయం పెరిగేలా...

నీటికి నిలకడ నేర్పితే ఆ ప్రాంతంలోని భూగర్భజల మట్టాలు పెరగడమే కాకుండా ఆ చుట్టుపక్కల బీడుభూముల్లో పచ్చని పంటలు పండుతాయి. అందుకే ఇక్రిశాట్‌ అడ్డుకట్ట(చెక్‌డ్యాము)ల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చింది. దీంతో అనేక దేశాల్లో 17.80 కోట్ల ఎకరాలకు ప్రయోజనం కలిగింది. ఆకలి బాధలతో అల్లాడే ఆఫ్రికా దేశాల్లో ఒక పంట సైతం రాని చోట్ల రెండు పంటలు పండి రైతుల ఆదాయం పెరిగింది. మొజాంబిక్‌, టాంజానియా, జింబాబ్వే వంటి పేదదేశాల్లో ఈ సంస్థ శాస్త్రవేత్తలు చేపట్టిన కార్యక్రమాల్లో 28శాతం నుంచి 313శాతం దాకా పంటల దిగుబడి పెరిగింది. పలుదేశాల్లోని రైతులకు ఇచ్చిన శిక్షణలతో పంటలకు వాడే సాగునీటి వినియోగాన్ని 40-85శాతం మేర తగ్గించారు. భారత ప్రభుత్వం, ఇక్కడి జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు అందిస్తున్న సహకారంతో దేశీయ రైతులతో కలిసి ఇక్రిశాట్‌ ప్రయోగాలు చేస్తోంది. ఇక్కడి నాణ్యమైన విత్తనాలను ఆఫ్రికా ఖండంలోని 13 దేశాల్లో అందించి సాగుచేయించి ఎన్నో సత్ఫలితాలు సాధించింది. తద్వారా నిరుడు ఇక్రిశాట్‌కు ‘ఆఫ్రికా ఫుడ్‌’ పురస్కారం లభించింది.

- మంగమూరి శ్రీనివాస్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సంక్లిష్ట రాజకీయ సమరం

‣ పల్లవించని రైతు సంక్షేమం

‣ విచ్చలవిడిగా నీటి తోడివేత

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 05-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం