• facebook
  • whatsapp
  • telegram

కౌలురైతుకు కవుకు దెబ్బలు

ఆదుకోని చట్టాలతో అగచాట్లు

పోనుపోను పెరుగుతున్న ఖర్చులతో సేద్యంలో మిగులుబాటు గగనమవుతోంది. పెట్టుబడులు పెరుగుతున్న స్థాయిలో మద్దతు ధరలు దక్కక రైతులు తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. ముఖ్యంగా సెంటు భూమి లేని రైతులు పొలాలను కౌలుకు తీసుకుని, తగినంత ఆదాయం రాక అప్పులపాలవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. భూమిపై ఎలాంటి హక్కులూ లేని కౌలుదారులకు ప్రభుత్వపరంగా ఎటువంటి చేయూత అందక ఆర్థికంగా నష్టపోతున్నారు. నేడు 40శాతం మేర సాగు భూమి కౌలుదారుల చేతిలో ఉంది. వారి రక్షణకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో సేద్యం నుంచి వైదొలగుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

నష్టాల సేద్యం

సొంత భూమి కలిగిన కొందరు రైతులు ఇతర వ్యాపకాల కారణంగా- పొలాలను కౌలుకు ఇస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు భూముల్ని కొనుగోలు చేసి వాటిని కౌలుకు ఇచ్చే ధోరణి పెరిగింది. మరోవైపు కూలీలుగా ఉన్నవారు పొలాలు కౌలుకు తీసుకోవడమూ అధికమవుతోంది. కొన్ని దశాబ్దాలుగా పట్టాదారు పాసుపుస్తకాలున్న వారికే పంట రుణాలు, సబ్సిడీలు, పరిహారాలు అందుతున్నాయి. దాంతో కౌలుదారులు భూయజమానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. భూమిని కౌలుకు ఇచ్చినట్లు రైతుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొని సబ్సిడీలు, పంట నష్టపరిహారాలను కొందరు పొందగలుగుతున్నారు. కానీ, సేద్యానికి కీలకమైన పెట్టుబడి విషయంలో ఏ చట్టమూ కౌలుదారులకు ప్రయోజనకరంగా లేదు. మొత్తం ఆదాయంలో కౌలు పోను, మిగులుబాటు లేక రైతులు నష్టపోవలసి వస్తోంది. కౌలుదారులకు రుణాలు అందించేందుకు బ్యాంకులు ముందుకు రావడంలేదు. దాంతో వారంతా ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారులు, ఎరువుల డీలర్ల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని సాగుకు దిగుతున్నారు. పంట చేతికందగానే తమకే అమ్మాలనే షరతులతో ప్రైవేటు వ్యక్తులు అప్పులిస్తున్నారు. మంచి ధర కోసం నిరీక్షించడంలో ఆలస్యమైతే వడ్డీభారం మరింత పెరుగుతుందని భయపడి రుణమిచ్చిన వారికే పంటను అయినకాడికి తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ఫలితంగా లాభసాటి ధరలను కళ్లజూడటం వారికి సాధ్యపడటం లేదు. ప్రకృతి విపత్తులు సంభవిస్తే నామమాత్రపు నష్టపరిహారాలు అందేసరికి మరో సీజన్‌ వస్తుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు రైతుమిత్ర గ్రూపులను తరవాతి కాలంలో సంయుక్త బాధ్యతా బృందాలు (జాయింట్‌ లయబిలిటీ గ్రూపులు)గా మార్చి కౌలుదారులకు రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వాలు సిద్ధపడ్డాయి. అయినా మొత్తం కౌలుదారులలో అవి ఎనిమిది శాతానికీ దక్కకపోవడం గమనార్హం. కౌలుదారుల దుస్థితిని సరిదిద్దేందుకు ఏర్పడిన జయతీఘోష్‌ కమిషన్‌ వాస్తవ సాగుదారులను గుర్తించి పట్టాదారు పాసు పుస్తకాలున్న రైతులతో సమంగా వీరికి అన్ని ప్రయోజనాలను కల్పించాలని సూచించినా- ఉమ్మడి రాష్ట్రంలో అవి అమలు జరగలేదు. తెలంగాణలో కౌలుదారులకు కొన్ని చట్టపరమైన రక్షణలు ఉన్నాయి. తెలంగాణలోని కౌలుదారులు మొత్తం సాగుదారులలో 15 లక్షలకు మించి లేరని అంచనా. రాధాకృష్ణ కమిషన్‌ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 25 లక్షల మంది కౌలుదారులు ఉన్నారని అంచనా. నిజానికి ఈ సంఖ్య 40 లక్షల పైమాటే అని రైతు సంఘాలు చెబుతున్నాయి.

కొరవడిన అవగాహన

ఆంధ్రప్రదేశ్‌లో పంట సాగుదారుల హక్కుల చట్టం (సీసీఆర్‌ఏ-2019) అమలవుతున్న తీరు గురించి తాజాగా ‘రైతు స్వరాజ్య వేదిక’ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ అంచనాలకంటే కౌలుదారుల సంఖ్య భారీగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. కౌలుదారులు అధికంగా ఉన్న ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 55-73 శాతం వరకు భూమిలేనివారేనని స్పష్టమైంది. కేవలం ఒక ఎకరం భూమి కలిగిన వారితో కలిపి చూస్తే ఈ సంఖ్య 90 శాతంగా ఉండటం గమనార్హం. చిత్రం ఏమిటంటే సీసీఆర్‌ఏ చట్టం రాకముందు 17.7శాతం కౌలురైతులు రుణ అర్హత కార్డులు పొందితే- చట్టం వచ్చాక కేవలం 9.4శాతానికే కార్డులు అందాయని సర్వే పేర్కొంది. ఉభయగోదావరి, కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా- కడప, విశాఖ, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో అతి తక్కువగా రుణ అర్హత కార్డులు అందించారు. అవగాహన లేకపోవడం, భూయజమాని ఆమోదించకపోవడం వంటి కారణాలతో అధికశాతం కౌలురైతులకు కార్డులు అందడం లేదని సర్వేలో తేలింది. కౌలుదారులకు రుణ అర్హత కార్డులు ఇచ్చినా యజమానులకు వారి భూమిపై చట్టపరమైన రక్షణలు ఉంటాయనే విషయమై చాలామందికి అవగాహన లేదు. సీసీఆర్‌ఏ చట్టం ద్వారా తమకు ఎలాంటి మేలూ జరగడం లేదని 59శాతం కౌలుదారులు సర్వేలో చెప్పడం గమనార్హం. అసంఖ్యాక కౌలుదారుల ప్రయోజనాలను కాపాడటంపై పాలకులు దృష్టి పెట్టాలి. దేశంలో ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రాల్లో కౌలుసేద్యం చేస్తున్నవారి సంఖ్య ఏటికేడూ పెరుగుతోంది. చట్టాలను మరింత సరళీకరించి సాగు చేసే ప్రతి కౌలురైతుకూ రాయితీలు అందేలా పాలకులు చొరవ చూపాలి. ఇప్పుడున్న కౌలు చట్టాలపై అవగాహన కొరవడటంతో తెలుగు రాష్ట్రాల్లో 82శాతం కౌలు రైతులు- బ్యాంకు రుణాలు సహా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలనూ పొందలేకపోతున్నారు. కౌలుదారులకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలి. రైతుమిత్ర/ జాయింట్‌ లయబిలిటీ గ్రూపుల రూపంలో కౌలు రైతులకు గ్రూపు రుణాలను అందించే విధానాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేయడంపై పాలకులు దృష్టి పెట్టాలి. భూ యజమానులతో సమానంగా రుణాలు, బీమా, విత్తన పర్మిట్లు, ఎరువుల రాయితీలు, పరిహారాలు అందించగలిగితేనే- కౌలుదారులకు రక్షణ లభిస్తుంది.

భూయజమానులకూ భరోసా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011 చట్టం ప్రకారం భూ అధీకృత సాగుదారుల చట్టం కౌలు రైతులను గుర్తించి వారికి రుణ అర్హత కార్డులను (ఎల్‌ఈసీ) జారీ చేయాలని పేర్కొంది. దీని ప్రకారం తాము కౌలుకు తీసుకున్న భూమి వివరాలతో రెవిన్యూ అధికారులకు కౌలుదారులు దరఖాస్తు చేయాలి. దీన్ని అధికారులు ధ్రువీకరిస్తే రుణ అర్హత కార్డులు ఇవ్వడంతో పాటు వారికి సాగురుణాలు, పంటల బీమా పథకాలకు అర్హత లభించేది. 2019లో అధికారం చేపట్టిన జగన్మోహనరెడ్డి ప్రభుత్వం 1956 నాటి ఆంధ్రప్రదేశ్‌ కౌలుదారీ చట్టం సహా, 2011 చట్టాన్ని కూడా రద్దు చేసింది. వీటి స్థానంలో సీసీఆర్‌ఏ తీసుకొచ్చారు. దీనిప్రకారం భూయజమాని, కౌలుదారు 11 నెలల కాలపరిమితితో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఎల్‌ఈసీ కార్డుల కోసం చేసే దరఖాస్తులను వీఆర్‌ఓ, ఎంఆర్‌ఓ ధ్రువీకరించి ఎల్‌ఈసీ కార్డులు జారీ చేస్తారు. ఇలా కార్డులున్న వారికి బ్యాంకులు రుణాలు మంజూరు చేయవచ్చు. అయితే ఒకవేళ కౌలుదారులు ఆ రుణం చెల్లించని పక్షంలో భూమిని జప్తు చేసే అధికారం మాత్రం బ్యాంకుకు ఉండదని ఈ చట్టం చెబుతోంది. కానీ, భూ యజమానుల్లో అనుమానాలు తొలగిపోలేదు.

- అమిర్నేని హరికృష్ణ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మూడో ధ్రువంగా ఆప్‌

‣ వేగంగా విస్తరిస్తున్న డిజిటల్‌ సాంకేతికత

‣ ఎగుమతుల వృద్ధిలో అసమానతలు

‣ డ్రాగన్‌కు యుద్ధపోటు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 16-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం