• facebook
  • whatsapp
  • telegram

నీటి బొట్టు... నేరుగా మొక్కకు

సూక్ష్మ నీటిపారుదలతో రైతుకు మేలు

భూమిపై జీవించే ప్రాణికోటికి నీరు జీవనాధారం. ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం నీటిని వ్యవసాయానికి వాడుతున్నారు. నదులకు ఆనకట్టలు నిర్మించి, చెరువులు తవ్వి కాలువల ద్వారా పొలాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. బావులు, బోర్ల ద్వారా భూగర్భ జలాలను ఉపయోగించుకుంటున్నారు. సంప్రదాయ నీటి పారుదల పద్ధతుల్లో జలాల వృథా అధికంగా ఉంటోంది. మరోవైపు భారత్‌లోని పలు ప్రాంతాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల సాగుకు సమృద్ధిగా నీరు లభ్యం కావడంలేదు. ఈ తరుణంలో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇందుకోసం సాగులో సూక్ష్మ నీటిపారుదల (మైక్రో ఇరిగేషన్‌) విధానాన్ని అనుసరించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రయోజనాలెన్నో...

భారత్‌లో ప్రస్తుతం 90 లక్షల హెక్టార్లలో సూక్ష్మ నీటిపారుదల విధానం అమలులో ఉంది. ఇందులో బిందుసేద్యం ద్వారానే 40 లక్షల హెక్టార్లలో పంటలు పండిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏడు కోట్ల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్‌ను అమలు చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్‌ రుతుపవన ఆధారిత దేశం. ఏటా వర్షపాతంలో అసమానతలు ఉంటున్నాయి. ఒక సంవత్సరం అధికంగా వర్షాలు పడితే మరో ఏడాది లోటు నెలకొంటోంది. మరోవైపు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సరైన వర్షపాతం నమోదవుతుంటే, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షం కురవడంవల్ల కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీన్ని అధిగమించి ఆహార ఉత్పత్తులకు కొరత రాకుండా చూసేందుకు సూక్ష్మ నీటిపారుదల ఉత్తమ విధానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూక్ష్మ నీటిపారుదల విధానంలో స్ప్రింక్లర్లు, బిందుసేద్యం, స్ప్రే (తుంపర), బబ్లర్‌, సబ్‌ సర్ఫేస్‌ నీటి పారుదల వంటి అనేక రకాలు ఉన్నాయి. నేలల స్వభావం, పంటలను బట్టి ఆయా రకాలను ఎంచుకోవాలి. మైక్రో ఇరిగేషన్‌ అనేది నీటిపారుదల విధానంలోని ఆధునిక పద్ధతి. ఇది వ్యవసాయంలో నీటిని ఆదాచేయడానికి, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. దీనివల్ల పంట దిగుబడి పెరుగుతుంది. నీరు, ఎరువులు, కూలీల అవసరాలు తగ్గుతాయి. బిందుసేద్యం ద్వారా ఎడారి దేశమైన ఇజ్రాయెల్‌ నీటి మిగులు దేశంగా మారి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. వివిధ పంటల ఉత్పాదకతలోనూ గొప్ప పురోగతి సాధించింది.

భారత్‌లో సిక్కిం, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు సూక్ష్మ నీటిపారుదల అమలులో ముందున్నాయి. ఈ విధానంలో వివిధ పంటల సాగులో 21శాతం నుంచి 50శాతం దాకా నీరు ఆదా అవుతుంది. మొక్కల వేళ్లకు దగ్గరగా భూమిలోని తేమలో హెచ్చుతగ్గులు లేకుండా నీటిని అందించవచ్చు. రసాయనాలు, కొన్ని రకాల సేంద్రియ ఎరువులను నీటిలో కలిపి అందించడం ద్వారా వాటిని మొక్కలు త్వరగా తీసుకుంటాయి. సూక్ష్మ నీటిపారుదల విధానంలో చీడపీడల బెడదా తగ్గుతుంది. భూమి కోత సమస్యా తొలగిపోతుంది. ప్రధానంగా జలవనరుల సంరక్షణతోపాటు ఆహార భద్రతకూ మైక్రో ఇరిగేషన్‌ తోడ్పడుతుంది. భారత్‌లో రుతుపవనాల ద్వారా మూడు నాలుగు నెలలు మాత్రమే వర్షం కురుస్తుంది. మిగతా కాలం పొడి వాతావరణం ఉంటుంది. జల వనరులు లేనిచోట వానాకాలంలో కురిసిన వర్షపు నీటిని కుంటల్లో, చెరువుల్లో నిల్వచేసి సూక్ష్మ నీటిపారుదల ద్వారా ఏడాదంతా పంటలు పండించవచ్చు. ఇండియాలో 1992లో మైక్రో ఇరిగేషన్‌ ప్రారంభమైంది. దీన్ని ప్రోత్సహించడానికి నేషనల్‌ మిషన్‌ ఆన్‌ మైక్రో ఇరిగేషన్‌, నేషనల్‌ మిషన్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ అగ్రికల్చర్‌ వంటి కార్యక్రమాలను కేంద్రం ప్రవేశపెట్టింది. ‘ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన’ను సైతం నీటి సంరక్షణ, జల వినియోగ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రారంభించారు. సూక్ష్మ నీటిపారుదలకు కేంద్రం సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తుండటంతో ఆ విధానాన్ని ఆచరించడానికి అన్నదాతలు ముందుకొస్తున్నారు.

ఉద్యాన పంటలకే అధికం

భారత్‌లో ఉద్యాన పంటల్లోనే సూక్ష్మ నీటిపారుదలను ఎక్కువగా అమలుచేస్తున్నారు. వివిధ రకాల పండ్ల తోటలను దీర్ఘకాలంపాటు పెంచడం, మొక్కల మధ్య ఎడం ఎక్కువగా ఉండటం, ఏర్పాటు సులభం కావడంతో బిందుసేద్యాన్ని ఎక్కువగా అనుసరిస్తున్నారు. కూరగాయలు, పెసర, మినుము, వేరుసెనగ, పొద్దుతిరుగుడు తదితర పంటలకు స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందించవచ్చు. ప్రస్తుతం సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. పంటల ద్వారా వచ్చే ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటోంది. ఈ తరుణంలో సాగు వ్యయం తగ్గించుకోవడానికి సూక్ష్మ నీటిపారుదల విధానం తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తద్వారా వ్యవసాయ రంగంలో సుస్థిరతకు వీలు కలుగుతుందని విశ్లేషిస్తున్నారు. దేశీయంగా దాదాపు 80శాతం చిన్న సన్నకారు రైతులే. వారికున్న చిన్న కమతాల్లో సూక్ష్మ నీటిపారుదల విధానానికి వారు ముందుకు రావడం లేదు. నీటి వసతి ఉన్న భూముల్లో ఈ పద్ధతికి రైతులు మొగ్గు చూపడంలేదు. మైక్రో ఇరిగేషన్‌ ప్రయోజనాలపై వారికి అవగాహన కల్పించాలి. దేశవ్యాప్తంగా దాదాపు 51శాతం భూముల్లో సాగుకు వర్షపు నీరే ఆధారం. సూక్ష్మ నీటిపారుదల విధానం వాటికి ఎంతో ఉపయుక్తం.

- డి.సతీష్‌బాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ముట్టడి వ్యూహంతో ముందుకు

‣ భూసారం... ఆహార భద్రతకు వరం!

‣ సరిహద్దు వివాదాల పీటముడి

‣ దశాబ్దాల నిర్లిప్తత... కుదేలైన అక్షరాస్యత!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 04-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం