• facebook
  • whatsapp
  • telegram

పంటలకు భానుడి సెగ

‣ దేశవ్యాప్తంగా తగ్గిన దిగుబడులు

రైతులు ఆరుగాలం కష్టపడి సాగుచేసే పంటలపై ప్రతికూల వాతావరణ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు దేశంలో నమోదైన అధిక ఉష్ణోగ్రతలతో పలు రకాల పంటలు దెబ్బతిని దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో అన్నదాతలు నష్టాలబారిన పడుతుండగా- వినియోగదారులు ఆహారోత్పత్తులను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వేసవిలో గత వందేళ్లలో ఎప్పుడూ లేనంతస్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని, వృద్ధికి ఎదురయ్యే సవాళ్లను తీవ్రతరం చేస్తుందని ‘మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్‌’ తాజా నివేదిక హెచ్చరించింది. ఏప్రిల్‌లో ఎక్కువ రోజులు పశ్చిమ రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌, దక్షిణ హరియాణా, దిల్లీ, మధ్యప్రదేశ్‌, పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌లలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వాయవ్య, మధ్య భారతంలో గత 122 ఏళ్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం వాయవ్య ప్రాంతంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 36.32 డిగ్రీలకు, మధ్య భారతంలో 38.04 డిగ్రీలకు పెరిగింది. ఏప్రిల్‌లో దేశంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 35.30 డిగ్రీలుగా ఉందని పేర్కొంది.

ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు భారత దేశంలో నమోదైన అధిక ఉష్ణోగ్రతలు అన్ని రకాల పంటలపై ప్రభావం చూపినట్లు ‘క్రిసిల్‌’ అంచనా వేసింది. గోధుమ, మామిడి, ఆవాలు, జొన్న, జీలకర్ర, టమాటా, బెండ పంటలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. మార్చి నెలలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేరుసెనగ, జొన్న వంటి వేసవి పంటలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది మే 19న వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రచురించిన 2021-22 మూడో ముందస్తు అంచనాల ప్రకారం, గోధుమ ఉత్పత్తి 10.60 కోట్ల టన్నులు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రచురించిన రెండో ముందస్తు అంచనాల కంటే ఇది 4.6శాతం తక్కువ. మొత్తం గోధుమ ఉత్పత్తిలో 15శాతం వాటా కలిగిన పంజాబ్‌లో క్రిసిల్‌ అంచనా ప్రకారం ఈ ఏడాది దిగుబడి 5-6శాతం తగ్గింది. హరియాణాలో 4.5శాతం తగ్గింది. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో మామిడి పంట బాగా ప్రభావితమైంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి మొత్తం మామిడి దిగుబడి 2022లో 15-20శాతం తగ్గుతుందని క్రిసిల్‌ అంచనా. సుగంధ ద్రవ్యాలు, పండ్లు, పూలు, ఔషధమొక్కలు వంటి అనేక ఉద్యానపంటల ఉత్పత్తి ప్రస్తుత సంవత్సరంలో తగ్గిందని అగ్రిటెక్‌ ఇండియా వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల కారణంగా దేశంలోని ఉద్యాన పంటల ఉత్పత్తి ఈ ఏడాది 2-3 శాతం తగ్గుతుందని అంచనా. వాతావరణ మార్పుల కారణంగా భారతదేశం వంటి ఉష్ణమండల దేశాల్లో సంవత్సరాల తరబడి వ్యవసాయ దిగుబడులు పడిపోతాయని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ పేర్కొంది. ప్రభుత్వం నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం దేశంలో వర్షాధార వరి దిగుబడి 2050 నాటికి 2.5శాతం మేర తగ్గుతుందని, వరి దిగుబడి 2050 కల్లా ఏడు శాతం,  2080 నాటికి పది శాతం తగ్గవచ్చని అంచనా. 2100 నాటికి గోధుమ దిగుబడి 6-25శాతం, మొక్కజొన్న దిగుబడి 18-23శాతం మేర పడిపోతుందని అభిప్రాయపడింది. పంటలపై అధిక ఉష్ణోగ్రతల ప్రభావం అన్ని ప్రాంతాల్లోనూ ఒకే విధంగా ఉండదు. దేశంలోని 573 గ్రామీణ జిలాల్లో 109 జిల్లాలను ‘వెరీ హై రిస్క్‌’ కింద వర్గీకరించారు.

పోనుపోను ఉష్ణోగ్రతలు పెరుగుతాయనే శాస్త్రవేత్తల అంచనాలను దృష్టిలో ఉంచుకొని, పంటల దిగుబడులు తగ్గకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పంటల దిగుబడి తగ్గితే పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే వంగడాలను రూపొందించాలి. వేడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే గోధుమ రకాలను భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఇప్పటికే విడుదల చేసింది. ఇదే క్రమంలో అన్నిరకాల పంటల వంగడాలనూ రూపొందించి రైతులకు అందించాలి. కృత్రిమ వాతావరణ పరిస్థితులను సృష్టించి- పంటలు పండించేందుకు పాలీహౌస్‌లు నెలకొల్పాలి. వీటిని ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు విరివిగా రాయితీలు ఇవ్వాలి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి దీర్ఘకాలిక ప్రణాళిక ద్వారా చర్యలు తీసుకోవాలి. లేకుంటే పంటల దిగుబడి తగ్గడంవల్ల కలిగే దుష్ఫలితాలను ఎదుర్కోవడం; రైతులు, వినియోగదారుల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వాలకు తలకు మించిన భారమవుతుంది.  

- డి.సతీష్‌బాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కల్తీని పారదోలితేనే ఆరోగ్య భారతం

‣ సవాళ్లు అధిగమిస్తేనే సమ్మిళిత అభివృద్ధి

‣ బొగ్గు కొరతతో విద్యుత్‌ సంక్షోభం

‣ ఖలిస్థానీ ముఠాలకు ఐఎస్‌ఐ దన్ను

‣ రైతుకు ద్రవ్యోల్బణం సెగ

‣ కడలిపై పెత్తనానికి డ్రాగన్‌ కుయుక్తులు

‣ పట్టాలకెక్కాల్సిన పన్నుల వ్యవస్థ

‣ నేపాల్‌తో బలపడుతున్న బంధం

Posted Date: 07-06-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం