• facebook
  • whatsapp
  • telegram

రైతు ఆదాయం రెట్టింపయ్యేదెన్నడు?

అమలుకు నోచని వ్యూహాలు

కేంద్రంలో ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం తన విజయాలను ఏకరువు పెట్టింది. రైతులకు ఇచ్చిన ఒక కీలక హామీ మాత్రం ఇప్పటికీ సాకారం కాకపోవడం కంట్లో నలుసులాఇబ్బంది పెడుతోంది. 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతుందని, అప్పటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ 2016 ఫిబ్రవరి 28న ప్రకటించారు. ఆరేళ్లు గడిచిపోయినా ఆయన హామీ ఇంతవరకు నెరవేరనే లేదు! భారతీయ జనతా పార్టీకే చెందిన లోక్‌సభ సభ్యుడు పి.సి.గద్దిగౌడర్‌ ఆధ్వర్యంలోని పార్లమెంటరీ స్థాయీసంఘ నివేదిక సైతం రైతుల ఆదాయాలు పెరగలేదని నిర్ధారించింది. ఈ నివేదికను గత బడ్జెట్‌ సమావేశాల్లో పార్లమెంటుకు సమర్పించారు. నిజానికి కేంద్రం హామీ ఇచ్చిన తరవాత ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, నాగాలాండ్‌, ఒడిశాలలో రైతుల ఆదాయం తగ్గిందని కమిటీ వెల్లడించింది. 2015-16 నుంచి 2018-19 వరకు కొన్ని రాష్ట్రాల్లో నెలవారీ కుటుంబ ఆదాయం తగ్గి, మరి కొన్ని రాష్ట్రాల్లో కాస్త పెరిగిందని, ఆదాయంలో ఎదుగూబొదుగూ లేనివి కూడా ఉన్నాయని గౌడర్‌ సంఘం నివేదిక వెల్లడించింది. ‘ఆ కాలంలో కేంద్ర వ్యవసాయ శాఖ చేతులు ముడుచుకుని కూర్చుందా’ అనీ ప్రశ్నించింది. రైతు ఆదాయం రెండింతలయ్యేందుకు తీసుకోవలసిన చర్యలను సూచించడానికి ప్రత్యేక బృందాన్ని నియమించాలని ఆ సంఘం సిఫార్సు చేసింది.

కారణాలెన్నో...

ఆహార ధరలు పెరిగినా అన్నదాతకు ఒరిగింది సున్న. వాస్తవంలో భారతదేశం గణనీయ ఆర్థికాభివృద్ధి రేటు సాధిస్తున్నా ఆహార ధరలు పెరిగినందువల్ల, సామాన్య ప్రజలకు అభివృద్ధి ఫలాలు అనుభవంలోకి రాలేదు. జీడీపీ వృద్ధిరేటు పెరిగినా వ్యవసాయం రంగంలో మాత్రం వృద్ధి మందగించింది. 2022 మార్చిలో వార్షిక ద్రవ్యోల్బణం రేటు 6.95 శాతానికి చేరినట్లు అధికార గణాంకాలే చెబుతున్నాయి. 2020 అక్టోబరు తరవాత ఇంత అధిక రేటు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఆహార ధరలు పెరగడమే ద్రవ్యోల్బణం విజృంభించడానికి మూల కారణం. ఈ ఏడాది మే నెలాఖరుకు టోకు ధరల సూచీ 15.9శాతానికి ఎగబాకింది.   వ్యవసాయ ఉత్పత్తి సాధనాలైన ఎరువులు, విత్తనాలు తదితరాల ధరలు నిరంతరం పెరిగిపోతున్నాయి. దీనివల్ల ఆహార ద్రవ్యోల్బణం మరింత విజృంభించనుంది. కొన్నేళ్లుగా ఆహార ధాన్యాల సాగు వ్యయం బాగా పెరిగిపోయింది. కొవిడ్‌ మహమ్మారి వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసులు విచ్ఛిన్నం కావడం వ్యవసాయోత్పత్తి సాధనాల లభ్యతను దెబ్బతీసింది. చమురు ధరలు, వాటితోపాటు ఎరువుల ధరలు పెరిగాయి. ఉక్రెయిన్‌ యుద్ధం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఎరువుల సరఫరా పడిపోయి ధరలు చుక్కలనంటాయి. ట్రాక్టర్లు, పంట కోత, నూర్పిడి యంత్రాలను నడపడానికి కావలసిన ఇంధన ధరలు పెరిగిపోయాయి. ఆహార ధరలు పెరుగుతున్నా- రైతుల ఆదాయాల పెంపుదల అలా ఉంచి, వచ్చే ఆదాయమూ తెగ్గోసుకుపోతోంది.

రైతుల ఆదాయాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను చేపట్టాలి. వ్యవసాయానికి హెచ్చు నిధులు కేటాయించాలి. 2022 ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి 2022ను గడువుగా నిర్దేశించినా, తాజా బడ్జెట్‌ దాన్ని పట్టించుకోకపోవడం విచిత్రం. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక సంఘం 2015-16లో వ్యవసాయ కుటుంబాల ఆదాయం నెలకు రూ.8,059 అని, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2022కల్లా ఇది రూ.21,146కు పెరగాలని గణించింది. అప్పుడది వాస్తవ విలువలో రైతు ఆదాయం రెట్టింపైనట్లు లెక్కకు వస్తుంది. కానీ, 2022 వచ్చేసినా రెట్టింపు ఆదాయం ఇప్పటికీ సుదూర స్వప్నంగానే మిగిలింది. రైతుల ఆదాయం పెరగాలంటే వ్యవసాయంలో ఉత్పాదకత ఊపందుకోవాలి. భూ సంబంధ విధానాలు మారాలి. పంటలకు గిట్టుబాటు ధరలు లభించాలి. ఇవన్నీ సాధ్యపడాలంటే వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడులు భారీగా పెరగాలి.

ఉత్పాదకతలో వెనకబాటు

సంపన్న పారిశ్రామిక దేశాలతో పోలిస్తే భారతదేశంలో వ్యవసాయ దిగుబడి 30శాతం నుంచి 50శాతం తక్కువ. దీనికి కారణాలు అనేకం. చిన్న కమతాలు, అధునాతన వ్యవసాయ సాంకేతికతల వినియోగం తక్కువగా ఉండటం, అతిగా ఎరువులు-క్రిమినాశనుల వాడకం వంటివి ఉత్పాదకతను దెబ్బతీస్తున్నాయి. ఇజ్రాయెల్‌ తరహా సాంకేతికతలను విస్తృతంగా చేపడితే ఉత్పాదకత పెరుగుతుంది. దాంతోపాటు రైతుల ఆదాయాలూ పెరుగుతాయి. ఒక యూనిట్‌ భూమి నుంచి ఎక్కువ ఉత్పత్తి సాధించడం, సమ్మిళిత వ్యూహంతో గ్రామీణ పేదరికాన్ని తగ్గించడం, దేశ ప్రజలకు ఆహార భద్రత సాధించడానికి వ్యవసాయ ఉత్పత్తి పెంచడం అనే త్రిముఖ వ్యూహాన్ని పాటిస్తే రైతుల ఆదాయాలు పెరుగుతాయని ప్రపంచ బ్యాంకు సూచించింది. అందుకు అనువైన ప్రణాళికను అనుసరించాలని సిఫార్సు చేసింది. మన రైతులు పూర్తిగా వరి, గోధుమ పంటల మీదే ఆధారపడకుండా అధిక విలువను ఇచ్చే ఇతర పంటలనూ చేపట్టాలి. వాతావరణ శాఖ నుంచి కచ్చితమైన సమాచారం రైతులకు అందాలి. వాతావరణ వైపరీత్యాల నుంచి రైతులకు భరోసాగా నిలిచే పంట బీమా పథకాలను అమలు చేయాలి. నిర్దుష్టమైన మార్కెట్‌ సమాచారాన్ని అందించాలి. శీతల గిడ్డంగులను పెంచి పంట నష్టాలను నివారించాలి. ఆహార ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు ఊతమివ్వాలి. రైతుకూ మార్కెట్‌కూ మధ్య ప్రభుత్వమే సంధానకర్తగా నిలవాలి.

పెద్దయెత్తున పంట నష్టాలు

పంట కోత తరవాత జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. రైతు ఆదాయం రెట్టింపు కాకపోవడానికి ఇదీ ఒక కారణమేనని నీతి ఆయోగ్‌ సభ్యుడు ప్రొఫెసర్‌ రమేశ్‌చంద్‌ అంగీకరించారు. భారతదేశం ఆహారోత్పత్తిలో అగ్రశ్రేణిలో ఉంది. కేలరీల లెక్క ప్రకారం చూస్తే, రెండో అతిపెద్ద ఉత్పత్తిదారు. పంట కోతల తరవాత జరిగే నష్టాన్ని నివారిస్తే- ఏటా ఎనిమిది కోట్లమందికి సరిపడా ఆహారం ఆదా అవుతుంది. ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార ధాన్యాల్లో పది శాతం నష్టపోతుండగా- పాలు, మాంసం, గుడ్లు, చేపలు, కూరగాయల నష్టం 10-20శాతం వరకు ఉంటోంది. ఉద్యాన పంటల నష్టం 16శాతం మేర ఉంది. భారతదేశ మొత్తం ఆహార మార్కెట్‌లో ఆహార శుద్ధి (ఫుడ్‌ ప్రాసెసింగ్‌) పరిశ్రమ వాటా 32శాతం. రైతుల నుంచి ఆహార ధాన్యాలు, పాడి ఉత్పత్తులు ఈ పరిశ్రమకు వస్తాయి. ఈ రంగంలో ఆహార నష్టాలను నివారిస్తే రైతుల చేతిలో ఎక్కువ డబ్బు మిగులుతుందని ప్రొఫెసర్‌ రమేశ్‌ చంద్‌ సూచించినా ప్రభుత్వంలో కదలిక లేదు.

- ఎస్‌.నీరజ్‌కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పర్యావరణ సూచీలో అట్టడుగున భారత్‌

‣ రాజ్యాంగ బద్ధతే ప్రామాణికం

‣ సహ్యాద్రి... జీవవైవిధ్యానికి పెన్నిధి!

‣ సముద్రాలకు ప్లాస్టిక్‌ గండం

‣ అంతరిక్షంలో ఆధిపత్య పోరు

‣ పంటలకు భానుడి సెగ

Posted Date: 17-06-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం