• facebook
  • whatsapp
  • telegram

కష్టకాలంలో ఆదుకోని పంటల బీమా

రైతుకు భరోసా ఇవ్వని పథకం

విత్తు విత్తింది మొదలు ఏదో ఒక దశలో వెంటాడుతున్న విపత్తులవల్ల రైతుల ఆర్థిక పరిస్థితి తలకిందులవుతోంది. సగటున దశాబ్ద కాలంలో ఏడు సంవత్సరాల దాకా నష్టపోతుండటంతో అప్పులు తీర్చే దారిలేక కొందరు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆపత్కాలంలో అండగా ఉండాల్సిన బీమా పథకాలను ఎన్నిసార్లు సవరించినా సమగ్రత లోపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడింది. భారత జనాభాలో 54.6శాతం వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు 48 కోట్ల శ్రామికశక్తిలో నాలుగోవంతు రైతులే. వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులవల్ల అన్నదాతల ఆదాయాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. తరచూ విపత్తు నష్టాలను చవిచూస్తున్న రైతుల్ని ఆదుకోవాలంటే సమగ్ర పంటల బీమా పథకాల అమలు ఒక్కటే శరణ్యం.

లోపాలమయం

భారత్‌లో 1985లో తొలిసారిగా పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. 2014 తరవాత కొబ్బరి తోటల బీమా పథకాన్నీ ప్రయోగాత్మకంగా అమలు చేశారు. వాటి అమలు తీరులో లోపాల కారణంగా రైతులకు ఏమాత్రం ప్రయోజనాలు దక్కలేదు. 2016 ఖరీఫ్‌ నుంచి ‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా’ పథకాన్ని (పీఎంఎఫ్‌బీవై) ప్రవేశపెట్టారు. అదే సమయంలో వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంలోనూ పలు మార్పులు చేసి అమలులోకి తెచ్చారు. పంట విత్తే ముందు నుంచి కోత కోసిన రెండు వారాల వరకు వర్తించేలా ఫసల్‌ బీమాను అమలు చేస్తున్నారు. ప్రపంచంలో రైతుల భాగస్వామ్యం ఉన్న అతి పెద్ద పంటల బీమా పథకంగా పీఎంఎఫ్‌బీవై పేరుగాంచింది. ప్రభుత్వ రంగంలోని అయిదు, ప్రైవేటు రంగంలోని 13 బీమా కంపెనీలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. సాధారణ ఖరీఫ్‌ పంటలకు బీమా చేసిన మొత్తంలో రెండు శాతం, రబీ పంటలకు 1.5శాతం, ఉద్యాన, వాణిజ్య పంటలకు అయిదు శాతం చొప్పున గరిష్ఠంగా ప్రీమియాన్ని రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలు మాత్రం కేవలం పది శాతం చెల్లించే వెసులుబాటు కల్పించారు. తాము 30 శాతమే భరిస్తామంటూ బిహార్‌, పశ్చిమ్‌ బెంగాల్‌, గుజరాత్‌, పంజాబ్‌, ఝార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు స్పష్టం చేశాయి. కేంద్రం అందుకు సమ్మతించకపోవడంతో ఈ రాష్ట్రాలు పథకాన్ని అమలు చేయడంలేదు. పశ్చిమ్‌ బెంగాల్‌ తమ రైతుల కోసం ప్రత్యేకంగా ‘బంగ్లా సస్య బీమా యోజన’ను అమలు చేస్తోంది. నూనెగింజలు సహా సాధారణ పంటలకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. పశ్చిమ్‌ బెంగాల్‌ తరహాలో తామూ బీమా పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యవసాయశాఖ నుంచి ఒక అధ్యయన బృందాన్ని అక్కడికి పంపించనుంది.

ఫసల్‌ బీమా పథకాన్ని 2018లో దాదాపు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేస్తే గతేడాది 17 రాష్ట్రాల్లోనే అమలైంది. స్వచ్ఛందంగా రైతులు ఎవరైనా పంటల బీమా చేయించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆశించిన రీతిలో పథకం విస్తరించకపోవడానికి పలు రాష్ట్రాల నిరాసక్తతే కారణం. కౌలుదారులు భూమికి సంబంధించిన సమాచారం, ఆధార్‌ వివరాలు నమోదు చేయాలనే నిబంధనలు; రుణమాఫీవల్ల పంట రుణాల రీషెడ్యూలు సమస్యలు; పథకం నుంచి పలు రాష్ట్రాలు వైదొలగడం వంటి కారణాల వల్ల ఫసల్‌ బీమా ఆశించిన లక్ష్యాలను అందుకోలేకపోయిందని దానిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం పేర్కొంది. పరిహారం చెల్లించే విషయంలో నిబంధనలు పాటించని కంపెనీలు- ప్రీమియం గడువు తేదీ విషయంలో నిక్కచ్చిగా ఉండటం పెద్దలోపం. ఈ కారణాలతో దేశవ్యాప్తంగా పంటల విస్తీర్ణంలో 25 శాతాన్ని కూడా ఫసల్‌ బీమా ఆక్రమించలేదు.

ప్రభుత్వాల వైఫల్యమే

భారత్‌లో పథకం అమలులోకి వచ్చి అయిదేళ్లు దాటినా నేటికీ 15శాతం రైతుల్నీ దాని పరిధిలోకి తీసుకురాలేకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే. నష్టాన్ని లెక్కించేటప్పుడు పంట పొలాన్ని యూనిట్‌గా తీసుకోకపోవడంవల్ల అధిక శాతం రైతులకు పరిహారం దక్కడం లేదు. సంస్థాగత పంట రుణాలు దేశంలో 30 శాతం రైతులకైనా అందడంలేదు. దాంతో స్వచ్ఛందంగా బీమా చేయించుకునే రైతుల సంఖ్య పెరగడం లేదు. పలు రాష్ట్రాల మధ్య సీజన్‌ వ్యత్యాసాలున్నాయి. బ్యాంకు రుణాల పంపిణీ పూర్తికాకపోయినా పంటల బీమా చేయించేందుకు ఖరీఫ్‌లో జులై 31, రబీలో డిసెంబరు 31లను గడువు తేదీలుగా నిర్ణయించడం కూడా లోపమే. ఏటా జులై తొలివారాన్ని పంటల బీమా వారోత్సవంగా అమలు చేస్తున్నా- రైతుల్లో ఆశించిన మేర అవగాహన తేలేకపోతున్నారు. రైతుల సౌలభ్యం కోసం బీమా కంపెనీలు మండలాల స్థాయిలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసి అన్నదాతలకు మరింత అవగాహన కల్పించాలి. గతంలో అమలైన పథకాలతో పోల్చి చూస్తే ప్రస్తుత బీమా పథకం కొంత మెరుగైనదే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివాదాలు పక్కన పెట్టి- ప్రతి రైతుకూ మేలు చేసేలా ఫసల్‌ బీమాకు అవసరమైన మార్పు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది!

నిబంధనల బేఖాతరు

కొన్ని రాష్ట్రాలు తమ వాటా మొత్తాన్ని గడువులోగా చెల్లించడంలేదు. పంట కోత ప్రయోగాల డేటాను బీమా కంపెనీలకు సకాలంలో అందించడం లేదు. కొన్ని కంపెనీలు సైతం సత్వరం స్పందించడంలేదు.  క్లెయిమ్‌ పరిష్కారం అయ్యాక నిర్దేశిత గడువులోగా బీమా కంపెనీలు రైతులకు పరిహారం అందించని పక్షంలో చెల్లించాల్సిన మొత్తంపై 12 శాతం వడ్డీ కట్టాలన్న నిబంధన ఉంది. ప్రీమియం సబ్సిడీని గడువులోగా విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం 12 శాతం వడ్డీ చెల్లించాలన్న నిబంధన ఉంది. నిబంధనలను ఎవరూ ఖాతరు చేయకపోవడంతో రైతులకు పరిహారం అందించడంలో జాప్యం చోటుచేసుకొంటోంది. పెనుగాలులు, వడగండ్ల కారణంగా పంట నష్టపోతే తక్షణమే 25శాతం పరిహారంగా చెల్లించాలన్న నిబంధనను ప్రైవేటు బీమా కంపెనీలు అమలు చేయడం లేదు. పలు రాష్ట్రాల నిరాసక్తత కారణంగా, తగిన ప్రచారం లేకపోవడం వల్ల కూడా ఫసల్‌ బీమా ఆశించిన లక్ష్యాలను అందుకోలేకపోతోంది.

- అమిర్నేని హరికృష్ణ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సోనియా కుటుంబానికే పాదాక్రాంతం

‣ వసుధైక కుటుంబానికి అసలైన ఆలంబన

‣ కశ్మీర్‌పై అల్‌ఖైదా దుష్టనేత్రం

‣ ఆర్థిక పురోగమనానికి బ్రిక్స్‌ భరోసా

‣ వరదల బీభత్సం... జనజీవనం అస్తవ్యస్తం!

‣ అఫ్గాన్‌కు భారత్‌ ఆపన్నహస్తం

‣ 5జీ రాకకు వేళాయె...

Posted Date: 08-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం