• facebook
  • whatsapp
  • telegram

సహకార బలిమి... రైతుకు కలిమి!

‘ప్యాక్స్‌’ సేవల విస్తరణతోనే ప్రయోజనం

దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(ప్యాక్స్‌) పాత్ర ఎంతో కీలకం. అవి రైతులకు వివిధ వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు స్వల్పకాలిక, మధ్యకాలిక రుణాలను అందజేస్తాయి. బ్యాంకింగ్‌, ఉత్పత్తుల మార్కెటింగ్‌, వినియోగ వస్తువుల వ్యాపారం వంటి సేవలనూ అందిస్తాయి. ఆహార ధాన్యాలను సంరక్షించడానికి, నిల్వచేయడానికి గిడ్డంగుల సేవలనూ నిర్వహిస్తాయి. దేశంలో కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రుణాలు ఇచ్చిన వారిలో ఒక్క ప్యాక్స్‌ ఖాతాదారులే 41శాతం. వాటి నుంచి 95శాతం రుణాలు చిన్న, సన్నకారు రైతులకే దక్కాయి. ఈ నేపథ్యంలో రాబోయే అయిదేళ్లలో 63,000 సహకార పరపతి సంఘాలను కంప్యూటరీకరించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. దానికయ్యే మొత్తం వ్యయం రూ.2516 కోట్లు. కేంద్రం వాటా రూ.1528 కోట్లు. ప్యాక్స్‌ల సామర్థ్యం పెంచడానికి, సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి, వాటి కార్యకలాపాలను విస్తరించడానికి ఆ చర్య తోడ్పడుతుందని కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా ఏకకాలంలో బహుళ సేవలు అందించడానికి తోడ్పడుతుందని తెలిపింది.

రాష్ట్ర, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను నాబార్డు ఇప్పటికే ఏకీకృత బ్యాంకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆటోమేటిక్‌ విధానంలోకి తీసుకొచ్చింది. ప్యాక్స్‌ అన్నింటినీ కంప్యూటరీకరించి జాతీయ స్థాయిలో ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఉమ్మడి అకౌంటింగ్‌ వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌ షా నిర్ణయించారు. దానివల్ల చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక అవసరాలను వేగంగా తీర్చడంతోపాటు ఎరువులు, విత్తనాలను అందించే నోడల్‌ వ్యవస్థలుగా వాటిని ఉపయోగించాలని భావిస్తున్నారు. అయితే, ప్యాక్స్‌కు బకాయిలు పెద్ద సమస్యగా మారాయి. ఉదాసీన నిర్వహణ, నిధుల దుర్వినియోగం, వాస్తవ అవసరాలకు సంబంధం లేకుండా అప్పులను ఇవ్వడం, ఇతర అవసరాలకు రుణాల మళ్లింపు వంటి అంశాలూ ప్యాక్స్‌ను బలహీన పరుస్తున్నాయి. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడంలోనూ అవి విఫలమవుతున్నాయి. కౌలు రైతులకు రుణాలివ్వడంలోనూ వెనకంజలో ఉన్నాయి. పంటల ధరల్లో అనిశ్చితి ప్యాక్స్‌ రుణాల రికవరీపై ప్రభావం చూపుతోంది. సభ్యులకు స్వల్ప, మధ్యకాలిక రుణాలను అంచించడానికి కేంద్ర ఆర్థిక సంస్థల రుణాలను ప్యాక్స్‌ తీసుకుంటాయి. వాటి నుంచి అధికమొత్తంలో రుణాలు లభ్యం కాకపోవడం, సొంత ఆర్థిక వనరులు తక్కువగా ఉండటం వాటి కార్యకలాపాలపై ప్రభావం చూపుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ప్యాక్స్‌ ద్వారా చాలా సేవలు అందించడానికి అవకాశం ఉంది. పలు రాష్ట్రాల్లో అవి రైతులకు రుణాలు ఇవ్వడం, రసాయన ఎరువులు, పురుగు మందులను విక్రయించడం వంటి సేవలకే పరిమితమవుతున్నాయి. మొత్తం గ్రామీణ కుటుంబాల్లో 50శాతమే వాటిలో సభ్యులుగా ఉన్నారు. వారి సంఖ్యను మరింతగా పెంచాలి. ఈశాన్య రాష్ట్రాలతోపాటు, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లలో వాటి విస్తృతి తక్కువగా ఉంది.

కంప్యూటరీకరణతోనే ప్యాక్స్‌ల సమస్యలన్నీ తీరిపోవు. గ్రామీణ వ్యవస్థలో అత్యంత కీలకమైన వాటి సేవలను విస్తృత పరచాలి. రుణాలను ఇవ్వడమే కాకుండా రైతులకు విత్తునుంచి పంటల మార్కెటింగ్‌ దాకా అన్ని కార్యకలాపాల్లో వాటి భాగస్వామ్యాన్ని పెంచాలి. అవి బహుళ సేవా కేంద్రాలు(ఎంఎస్‌సీ)గా మారాలి. దేశ వ్యాప్తంగా 35,000 ప్యాక్స్‌ను ఎంఎస్‌సీలుగా అభివృద్ధి చేయాలని గతేడాది నాబార్డు నిర్ణయించింది. మరోవైపు గ్రామీణులకు ఇచ్చే రుణంలో సహకార సంఘాల వాటా క్షీణిస్తోంది. 1950వ దశకంలో 60శాతం కంటే ఎక్కువ వాటాతో వ్యవసాయ రుణాలను అందించడంలో ప్యాక్స్‌ ప్రధాన పాత్ర పోషించాయి. కాలక్రమేణా వాణిజ్య, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల వాటా పెరగడంవల్ల అది 14శాతానికి పడిపోయింది. అయితే వాటి ద్వారా పంపిణీ చేసే మొత్తం రుణంలో 69.7శాతం చిన్న, సన్నకారు రైతుల వాటానే. అనేక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు సంస్థాగత, నిర్వహణా పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 95,995 ప్యాక్స్‌ల్లో 2019 మార్చి నాటికి 46 వేలకు పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి. మొత్తం సహకార సంఘాల్లో 53,601 ప్యాక్స్‌లు మాత్రమే సొంత గోదాములను కలిగి ఉన్నాయి. అనేక కమిటీలు సహకార వ్యవస్థను పీడిస్తున్న సమస్యలను పట్టి చూపాయి. ఇప్పటికీ చాలా సంఘాలు నష్టాల్లో నడుస్తున్నాయి. అన్నదాతలకు సమర్థంగా సేవలు అందించలేకపోతున్నాయి. విత్తన ఉత్పత్తి, శుద్ధి, ప్రాసెసింగ్‌, విలువజోడింపు వంటి కార్యకలాపాలను ప్యాక్స్‌ ద్వారా గ్రామాల్లోనే చేపట్టడానికి అవకాశాలు ఉన్నాయి. వాటన్నింటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తే రైతులకే కాకుండా గ్రామీణ ప్రజానీకం మొత్తానికీ ప్రయోజనం కలుగుతుంది.

- డి.సతీష్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పశ్చిమాసియాతో బలపడుతున్న బంధం

‣ గర్భ విచ్ఛిత్తి నిర్ణయాధికారం ఆమెదే!

‣ డ్రాగన్‌తో సఖ్యత సాధ్యమేనా?

‣ పట్టాలు తప్పిన ప్రపంచ ప్రగతి

‣ హక్కుల సాకుతో ‘ఆకస్‌’ అక్కసు!

‣ కొత్తపుంతలు తొక్కుతున్న రోదసి శోధన

Posted Date: 19-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం