• facebook
  • whatsapp
  • telegram

పెరగని పంట ఉత్పాదకత

రైతన్నల నష్టాల సేద్యం

ఇండియాలో దాదాపు 55శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. రైతుల ఆదాయాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. దేశీయంగా కమతాల పరిమాణం తక్కువగా ఉంటోంది. కూలి ఖర్చులు, రసాయన, పురుగు మందుల ధరలు ఏటా పెరుగుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మద్దతు ధరలు లభించడంలేదు. వీటికి తోడు పంటల ఉత్పాదకత ఇనుమడించక పోవడంవల్లా రైతులకు నష్టాల సేద్యం తప్పడంలేదు. 1960లో వచ్చిన హరిత విప్లవంతో వివిధ పంటల ఉత్పాదకత పెరిగిన మాట వాస్తవమే అయినా, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అది తక్కువే. అమెరికా తరవాత అధిక వ్యవసాయ భూమి భారత్‌లోనే ఉంది. దిగుబడిలో మాత్రం అగ్రరాజ్యం కన్నా ఇండియా నాలుగు రెట్లు వెనకబడింది. భారత్‌తో పోలిస్తే చైనాలో వ్యవసాయ భూమి తక్కువ. దిగుబడి మాత్రం అధికం.

ఇండియాలో సగటు భూకమత పరిమాణం 1.08 హెక్టార్లు. చైనాలో అది 0.67 హెక్టార్లు. కానీ, డ్రాగన్‌ దేశం వ్యవసాయ ఉత్పత్తి భారత్‌ కన్నా మూడింతలు ఎక్కువ. అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ రంగంలో పరిశోధనలు, అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. నూతన వంగడాలు సహా సాగులో పూర్తిస్థాయి యాంత్రీకరణను అమలు చేస్తున్నాయి. ఆధునిక సాంకేతికత సాయంతో ‘స్మార్ట్‌ వ్యవసాయం’ లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. కృత్రిమ మేధను ఉపయోగించి సేద్యంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నాయి. ఇండియాలోనూ ఇలాంటి ప్రయత్నాలు ఇటీవలి కాలంలో ఊపందుకొన్నాయి. వ్యవసాయ పనుల్లో డ్రోన్ల వినియోగం, యంత్రాల వాడకం పెరుగుతోంది. ఇది మంచి పరిణామమే అయినా పంటల ద్వారా మంచి ఆదాయం పొందినప్పుడే రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అది సాకారం కావాలంటే దేశీయంగా పంటల ఉత్పాదకత పెరగాల్సిందే.

భారత్‌లో వ్యవసాయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. రుతుపవనాలు, భూగర్భ జలాలు నీటి యాజమాన్య నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తాయి. సాగుకు పోషకాలున్న భూమి చాలా కీలకం. ఇండియాలోని వ్యవసాయ యోగ్యమైన భూమిలో ఇప్పటికే 40 శాతం దెబ్బతిన్నట్లు నిపుణులు చెబుతున్నారు. నేల ఆరోగ్యం దెబ్బతినడం వల్ల భూమి నిస్సారంగా మారి పంటల దిగుబడి తగ్గుతుంది. నిస్సారమైన భూమిలో పంటల దిగుబడితోపాటు వాటిలో పోషక విలువలూ తగ్గుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యవంతమైన భూమి ఉన్నప్పుడు తక్కువ విస్తీర్ణంలోనే అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం లభిస్తుంది. దానివల్ల రైతుల ఆదాయం అధికమవుతుంది.

అన్నదాతల ఆదాయాలను ప్రభావితం చేసే మరో అంశం వర్షపాతం. భారతదేశ వ్యవసాయ భూమిలో సగం వర్షాధారం. వాతావరణాన్ని బట్టి అన్నదాతల ఆదాయాల్లో మార్పు ఉంటుంది. దేశంలో గత 60 ఏళ్లలో 2.2 కోట్ల బావులు తవ్వినట్లు ఐక్యరాజ్య సమితి పరిశోధనలో తేలింది. పలు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు నానాటికీ తగ్గిపోతున్నాయి. నీటి వనరుల సద్వినియోగం కోసం శాస్త్రవేత్తలు అనేక విధానాలను రూపొందించారు. అవి సక్రమంగా అమలవుతున్న దాఖలాలు కనిపించడంలేదు. నీటి సద్వినియోగం విషయంలో ఇజ్రాయెల్‌ ఎంతో ముందుంది. అక్కడ 80శాతం భూమి పొడిగా ఉంటుంది. తక్కువ నేలలో ఎక్కువ దిగుబడులను సాధిస్తూ ప్రపంచానికి ఇజ్రాయెల్‌ ఆదర్శంగా నిలుస్తోంది. భారత్‌లో బిందుసేద్యం చాలా ఏళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చినా, ఇప్పటికీ నాలుగు శాతం వ్యవసాయ భూమిలోనే దాన్ని వినియోగిస్తున్నారు. బిందు సేద్యం విధానాన్ని మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉంది.

దేశంలో వరి, గోధుమ, చెరకు, పత్తి, సోయాబీన్‌ వంటి పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. కేవలం అవేకాకుండా ఇతర పంటలపైనా దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. చైనాలో రైతుల ఆదాయం పెరగడానికి పంటల వైవిధ్యమూ కారణమని విశ్లేషిస్తున్నారు. ఆధునిక వ్యవసాయ విధానాలు, సమర్థ భూ వినియోగం, నీటి వనరుల నిర్వహణ పంట దిగుబడులను పెంచడానికి చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూసారాన్ని పెంచడంతోపాటు సాగులో అన్ని స్థాయుల్లోనూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సూచిస్తున్నారు. భూసార స్థితిగతులను ఎప్పటికప్పుడు గుర్తించి మెరుగుపరచాలని సలహా ఇస్తున్నారు. ఈ చర్యలన్నీ పంటల దిగుబడులు పెరిగేందుకు తోడ్పడతాయి. అలాగే, అన్నదాతల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే పెట్టుబడుల వ్యయమూ తగ్గాలి. అందుకోసం సేద్యంలో యాంత్రీకరణను ఇతోధికం చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారత్‌లోనూ పంటల ఉత్పాదకతను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి.

- డి.సతీష్‌బాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇంధన విపణిలో కొత్త భాగస్వామ్యాలు

‣ భారత వాణిజ్య రంగానికి ఆశాకిరణం

‣ పంటకాలువల నిర్వహణలో అశ్రద్ధ

‣ స్వరాజ్యం నుంచి సురాజ్యం వైపు...

‣ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం

‣ కుదరని కూర్పు

‣ పరిశోధనలే దన్నుగా పురోగమనం

Posted Date: 15-08-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని