• facebook
  • whatsapp
  • telegram

సాగు బాగుకు సేంద్రియ మార్గం

నీతి ఆయోగ్‌ ప్రయత్నాలు

దేశంలో సేంద్రియ సాగు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగా నాలుగు లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఆ సాగును ప్రోత్సహించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. దానికి సంబంధించిన మార్గసూచీని నీతి ఆయోగ్‌ రూపొందించనుంది. ‘పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన’ ఉపపథకంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయాల పాఠ్య ప్రణాళికలోనూ సేంద్రియ సాగు విధానాన్ని చేర్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల దిల్లీలో వ్యవసాయంపై నిర్వహించిన జాతీయస్థాయి కార్యశాలలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఈ విషయాలను వెల్లడించారు. ‘సేంద్రియ వ్యవసాయానికి మారడంద్వారా ఉత్పత్తి తగ్గిపోతుందనే భయం కొందరిలో ఉండవచ్చు. హిమాచల్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా రాష్ట్రాల్లోని చాలా మంది రైతుల విజయగాథలను చూశాక రైతుల్లో మార్పు వస్తుంది. అన్నదాతలు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ వర్సిటీల ఉపకులపతులతో చర్చించిన తరవాత నీతి ఆయోగ్‌ దీనికి సంబంధించిన మార్గసూచీని తయారు చేస్తుంది’ అని తోమర్‌ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 38 లక్షల హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయం సాగుతోందని, దాన్ని మరింత పెంచాలని ఆయన పిలుపిచ్చారు. ‘హరిత విప్లవం సమయంలో ప్రవేశపెట్టిన రసాయన వ్యవసాయం ఆహారలోటు ఉన్న దేశాన్ని మిగులుగా మార్చడంలో సాయపడింది. అయితే అది భూసారాన్ని ప్రభావితం చేసింది’ అన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితిని తెలియజేశాయి. అందువల్లే విస్తృత ప్రయోజనాలున్న ప్రకృతి వ్యవసాయం నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. ఇండియాలో దాదాపు ఆరు శాతం వ్యవసాయ భూమిలో సేంద్రియ పద్ధతిలో పంటలు సాగవుతున్నాయి.

సేంద్రియ వ్యవసాయంలో పర్యావరణ సమతుల్యతను పెంపొందించే పద్ధతులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే లక్ష్యం ఉంటాయి. సేంద్రియ ఆహార ఉత్పత్తుల్లో ఎలాంటి హానికారక రసాయన అవశేషాలూ ఉండవు. ఆహార ధాన్యాలే కాకుండా సేంద్రియ మాంసం, పౌల్ట్రీ, డెయిరీ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, ఆర్గానిక్‌ బ్రెడ్‌, బేకరీ వంటి ఉత్పత్తులకు ఏటా డిమాండు పెరుగుతోంది. ప్రపంచ సేంద్రియ ఆహార విపణి విలువ 2021లో దాదాపు 22,700 కోట్ల డాలర్లు. 2022లో అది 25,900 కోట్ల డాలర్లకు, 2026 నాటికి 43,736 కోట్ల డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. దాన్నిబట్టి ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ ఉత్పత్తులకు భారీగా గిరాకీ పెరుగుతున్నట్లు అవగతమవుతోంది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఆహార ఉత్పత్తుల్లో పురుగు మందుల విషపూరిత ప్రభావాల కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాంతో వినియోగదారులు సేంద్రియ ఉత్పత్తులవైపు మొగ్గు చూపుతున్నారు. కొవిడ్‌ మహమ్మారివల్ల ప్రజల్లో ఆహారంపై అవగాహన పెరిగింది. రసాయన ఎరువులు, పురుగుమందుల అవశేషాలు లేని ఆహార పదార్థాల వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా భారత్‌లోనూ సేంద్రియ ఉత్పత్తులకు డిమాండు అధికమైంది. మరోవైపు ఇండియా నుంచి సేంద్రియ ఆహార పదార్థాలు, వాటి ఉత్పత్తుల ఎగుమతులు ఏటికేడు పెరుగుతున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా సేంద్రియ వ్యవసాయాన్ని దేశంలో మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉంది.

రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించి, రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం వస్తున్న ఆదాయం తగ్గకుండా ఉంటేనే సేంద్రియ సాగువైపు రైతులు మొగ్గు చూపుతారు. ఈ పద్ధతివల్ల మొదట్లో కొంతమేర దిగుబడులు తగ్గవచ్చు. దానివల్ల భారత్‌లో చిన్న, సన్నకారు రైతులు సేంద్రియ విధానాన్ని అవలంబించేందుకు ముందుకు రావడంలేదు. వారంతా ఇటువైపు మొగ్గుచూపాలంటే ప్రభుత్వం రైతుల ఆదాయం తగ్గకుండా చూడాలి. అందుకోసం పలు రాయితీలు అందించడం తప్పనిసరి. సేంద్రియ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్‌ సదుపాయాలను, మద్దతు ధరలను సైతం కల్పించాలి. సేంద్రియ ఎరువుల తయారీ, వాడకంపైనా అన్నదాతలకు శిక్షణ ఇవ్వాలి. అవసరమైతే వాటిని తక్కువ ధరలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో రైతు ఉత్పత్తి సంఘాలు కీలకంగా వ్యవహరించాలి. సేంద్రియ సాగు విధానం కేవలం ప్రజల ఆరోగ్యం, భూసార, ప్రకృతి పరిరక్షణకే కాకుండా రైతుల ఆదాయాలను సైతం పెంచాలి. ఆహారధాన్యాలే కాకుండా అన్ని రకాల పంటలనూ ఈ విధానంలో సాగుచేసే విధంగా అన్నదాతలను ప్రోత్సహించాలి.

- డి.సతీష్‌బాబు

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అలీన పథం... ఆదర్శ మార్గం!

‣ కార్చిచ్చులు... అడవులకు పెనుముప్పు

‣ విచక్షణాధికారం పేరిట ఏకపక్ష నిర్ణయాలా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 17-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం