• facebook
  • whatsapp
  • telegram

విపత్తుల ముట్టడిలో కన్నీళ్ల సాగు

పంట నష్టాలకు పరిహారం కరవు

దేశంలో విపత్తుల కారణంగా నష్టపోయే రైతులకు ఆసరా కొరవడింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా పాలనా విధానాలు అమలవుతుండటమే దానికి కారణం. గత అయిదేళ్లలో దేశంలో వివిధ సీజన్లలో 4.72 కోట్ల ఎకరాల్లో పంటలు వరదలకు దెబ్బతిన్నట్లు కేంద్రం తాజాగా పార్లమెంటు సమావేశాల్లో ప్రకటించింది. విపత్తుల వేళ ఆదుకోవడానికి ప్రధాని మోదీ ప్రారంభించిన ‘ప్రధానమంత్రి పంటల బీమా యోజన’ (పీఎంఎఫ్‌బీవై) అరడజను రాష్ట్రాల్లో అమలులోనే లేదు. వాటిలో తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. తెలంగాణలో ఎలాంటి పంటల బీమా పథకమూ అమలులో లేకపోవడంతో విపత్తులు సంభవిస్తే- రైతులకు పరిహారం అందడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో పంటల బీమాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేయడం లేదా విపత్తులకు పరిహారం ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపని చోట్ల రైతులకు రిక్తహస్తమే ఎదురవుతోంది.

రాష్ట్రాల్లో వ్యత్యాసాలు

జూన్‌ ఒకటిన ప్రారంభమైన వానాకాలం సీజన్‌లో జులై 26 నాటికి 272 జిల్లాల్లో సాధారణంకన్నా చాలా ఎక్కువ వర్షాలు కురిశాయి. 198 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మరో 233 జిల్లాల్లో వానలే లేక పంటల సాగు అంతంతమాత్రంగా ఉంది. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో సాధారణంకన్నా 109శాతం అధిక వర్షపాతం నమోదై వరదలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, బిహార్‌లలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పర్యావరణ మార్పుల కారణంగా దేశంలో వడగండ్లు, పెనుగాలులు, వడగాలులు, కుంభవృష్టి వర్షాలతో రైతన్నలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. పంట నష్టాలు అంచనా వేయడం, సహాయం అందించడం వంటివి కేంద్రంలో అధికారం చలాయిస్తున్న పార్టీల మద్దతు ఉన్న రాష్ట్రాల్లో ఒకరకంగా, తక్కిన చోట్ల మరోరకంగా ఉంటున్నాయి. గత నెల రోజుల్లో కురిసిన వర్షాలకు మహారాష్ట్రలో 12 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగినట్లు ఆ రాష్ట్ర వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. గుజరాత్‌లోనూ లక్షన్నర ఎకరాల్లో పంట నీటిపాలైంది. ఆ నష్టాలను అంచనా వేసి పరిహారం చెల్లింపునకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో పంటనష్టాల వివరాల సేకరణ సైతం లేదు. తెలంగాణలో వర్షాలకు 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా, రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు దాచి రైతులను గాలికి వదిలేసిందని కిసాన్‌ కాంగ్రెస్‌, రైతు స్వరాజ్య వేదిక వంటి సంస్థలు ఆరోపిస్తున్నాయి. భారీ వర్షాలతో వచ్చిన వరదలకు పంట భూముల్లో బురద, ఇసుక మేటలు వేశాయి. ఇసుక మేట వేస్తే రైతుకు ఎకరానికి అయిదు వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని జాతీయ విపత్తు నిర్వహణ నిబంధనలు చెబుతున్నాయి. ఇతరత్రా ఏ పరిహారమూ ఇవ్వకపోతేనే అయిదు వేల రూపాయలు అందించాలన్నది షరతు. ఎకరా భూమిని కప్పేసిన ఇసుక మేటలను పూర్తిగా తొలగించి మళ్ళీ సాగుకు అనుకూలంగా సిద్ధం చేయడానికి ప్రాంతాల వారీగా రూ.50 వేలకు పైగా ఖర్చవుతుంది. అందులో పదోవంతు మాత్రమే అందితే రైతులకు ఏమాత్రం న్యాయం జరగదు.

తక్షణ సాయమే ఆసరా

పీఎంఎఫ్‌బీవై వల్ల ఎక్కువ మంది రైతులకు పరిహారం అందడం లేదని దాని అమలును కొన్ని రాష్ట్రాలు నిలిపివేశాయి. దానికి ప్రత్యామ్నాయంగా మరో పథకం ద్వారానైనా రైతులకు భరోసా కల్పించాలి. వరికి బదులు పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, నూనెగింజలు లేదా పత్తి వంటి పంటలు వేయాలంటూ కేంద్రం పలు రాష్ట్రాల్లో రైతులను ప్రోత్సహిస్తోంది. ఇలాంటి పంటలు వేసినా విపత్తుల వేళ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే కోటిన్నర ఎకరాలకు పైగా పత్తి పంటను సాగుచేశారు. నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ పంట వరదల్లో మునిగి చాలావరకూ దెబ్బతింది. నీటిలో మునిగిన పత్తి మొక్కలు కుళ్ళిపోతున్నాయి. పత్తి, మిరప, పసుపు వంటి వాణిజ్య పంటలు సాగు చేయాలంటే పెట్టుబడి భారీగా ఉంటోంది. విపత్తులు దాపురించి అవి కొట్టుకుపోతే కనీసం పెట్టుబడిలో నాలుగోవంతు సొమ్మునైనా సాయంగా అందించే ఏర్పాటు ఉండాలి. అందుకోసం విపత్తు సాయం నిధి పేరుతో బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు జరగాలి. వరదల్లో వందల సంఖ్యలో పశువులు, గొర్రెలు, మేకలు చనిపోయి వాటి పెంపకందారులు జీవనోపాధి కోల్పోతున్నా- ఆదుకొనేవారే కరవవుతున్నారు. పాడి పశువులను రైతు కుటుంబాలకు రాయితీపై ఇస్తే కుటుంబ పోషణకు ఉపయోగపడతాయి. విపత్తుల వేళ అన్నదాతలకు ఆసరా ఇవ్వకుండా ఆలస్యం చేస్తే రైతు కుటుంబాలకు, చివరికి దేశ ఆహార భద్రతకూ తీవ్ర నష్టం తప్పదు.

ప్రత్యేక నిధి అవసరం

పంటలకు మద్దతు ధర కల్పించేందుకు, విపత్తులు వస్తే ఆదుకొనేందుకు బడ్జెట్లలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. దానివల్ల రైతులకు భరోసా లభిస్తుంది. వాతావరణ మార్పులను తట్టుకొనే కొత్త వంగడాలను సాగు ప్రారంభ సమయంలోనే రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై అందజేయాలి. దానివల్ల విపత్తులు వచ్చినా రైతులకు నష్టం తగ్గుతుంది. వరదలకు పంటలు దెబ్బతింటే మళ్ళీ వెంటనే మరో స్వల్పకాలిక పంట సాగుకు అవసరమైన వంగడాలు, ఎరువులు రాయితీపై ఇచ్చే ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి.

తీవ్ర జాప్యం

పంట నష్టపోయిన రైతుకు తక్షణం ఎంతో కొంత సహాయం అందిస్తే ఆ కుటుంబానికి ఆసరా దొరికి, బలవన్మరణాలకు ఆస్కారం ఉండదు. రాష్ట్రాల్లో విపత్తులతో పంటలు నాశనమైతే తొలుత కేంద్రం వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో బృందాన్ని పంపుతుంది. పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను ఆ బృందాలు ప్రత్యక్షంగా పరిశీలించి నష్టాలను ‘జాతీయ కార్యనిర్వాహక కమిటీ’ (ఎన్‌ఈసీ)లోని ఉపసంఘానికి నివేదిస్తాయి. వాటిని పరిశీలించి అత్యున్నత కమిటీ ఎంత పరిహారం ఇవ్వాలో నిర్ణయిస్తుంది. ఇవన్నీ తేలేసరికి ఏడాది సమయం పట్టినా ఆశ్చర్యం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా స్పందించే చోట్ల రైతులకు సత్వరమే ఎంతోకొంత పరిహారం అందుతోంది. లేనిచోట ఏ సాయమూ లేక రైతులు పంటలు కోల్పోయి అప్పుల పాలై దీనావస్థలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తెలంగాణలో రైతుల బలవన్మరణాలకు పంట నష్టాలే ప్రధాన కారణమని తమ అధ్యయనంలో తేలిందని రైతు స్వరాజ్య వేదిక ప్రకటించింది.

- మంగమూరి శ్రీనివాస్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కష్టాల కడలిలో లంక ఎదురీత

‣ రూపాయి అంతర్జాతీయ కరెన్సీ కాగలదా?

‣ సంక్షోభంలో చైనా బ్యాంకులు

‣ తీర ప్రాంతానికి ప్రకృతి కాపలా!

‣ అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ

Posted Date: 02-08-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం