• facebook
  • whatsapp
  • telegram

ప్రమాదంలో పాల ఉత్పత్తి

పశువుల్లో విస్తరిస్తున్న లంపీ చర్మవ్యాధి

పశువుల్లో లంపీ చర్మవ్యాధి విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఏడు వేలకు పైగా పశువులు ఈ వ్యాధి సోకి మరణించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఇది కొన్ని జాతుల ఈగలు, దోమలు, పేలు వంటి కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ పశ్చిమాసియా, ఐరోపాలో వ్యాప్తి చెందిన తరవాత ఉప ఖండానికి విస్తరించింది. 2019లో బంగ్లాదేశ్‌లో వెలుగు చూసింది. అదే ఏడాది మన దేశంలోని పశ్చిమ్‌ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో గుర్తించారు. ఈ ఏడాది పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాలతో పాటు అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోనూ కేసులు నమోదయ్యాయి. ఇటీవలి కాలంలో గుజరాత్‌లో వెలుగు చూసిన ఈ వ్యాధి వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు 1.85 లక్షల పశువులు దీని బారిన పడినట్లు అధికారిక గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఒక్క పంజాబ్‌లోనే 74,325 పశువులకు సోకగా 3,359 మృత్యువాత పడ్డాయి. గుజరాత్‌లో 58,546 పశువులకు సోకగా 1679 మరణించాయి. రాజస్థాన్‌లో 43,963 పశువులకు సోకగా 2,111 మృతిచెందాయి. జమ్మూకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో కేసులు, మరణాలు చోటుచేసుకున్నాయి. వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా త్వరితగతిన పశువుల్లో టీకాలు వేసే ప్రక్రియను చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన పశువుల్లో మరణాలు ఒకటి నుంచి రెండు శాతమే ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. లంపీ వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం, చర్మంపై బొబ్బలు ఏర్పడి మరణానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది వెలుగుచూసిన రాష్ట్రాల్లో టీకా ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు సుమారు 18 లక్షల పశువులకు టీకాలు వేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిపై పశువుల యజమానులకు అవగాహన కల్పించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్‌రూములను ఏర్పాటు చేశాయి. ఇప్పటి వరకు ఈ వ్యాధి దక్షిణాది రాష్ట్రాలకు వ్యాపించలేదు.

లంపీ చర్మవ్యాధికి ప్రస్తుతానికి టీకాయే అత్యంత ప్రభావశీల మార్గం. స్టెరాయిడ్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఔషధాలు, యాంటీబయాటిక్స్‌ ద్వారా నియంత్రించవచ్చని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధి సోకిన పశువులను కనీసం 15 రోజులు వేరుగా ఉంచాలని సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న పశువులకు టీకాలు వేయించాలని, లక్షణాలను బట్టి చికిత్స అందించాలని చెబుతున్నారు. ఇది మనుషులకు సోకదని, పశువుల పెంపకందారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఇది పశువుల్లో పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని అంటున్నారు. వ్యాధి వ్యాపించిన గంటల వ్యవధిలోనే శరీరం అంతటా బొబ్బలు వస్తాయని వివరిస్తున్నారు. ముక్కు, కళ్ల నుంచి నీటిస్రావం ఉంటుందని, ఇన్ఫెక్షన్‌ ఎక్కువుంటే కాళ్లవాపునకు దారితీయవచ్చని చెబుతున్నారు.

భారత్‌లో 20వ పశు గణన(2019) ప్రకారం 19.25 కోట్ల పశు సంపద ఉంది. గ్రామీణ కుటుంబాలకు, చిన్న రైతులకు గణనీయమైన ఆదాయం పశువుల ద్వారానే సమకూరుతోంది. అన్నదాతలకు స్థిరమైన ఆదాయం అందుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని పేదలకు పశువులు ఒక వరం. దేశ ఆర్థిక వ్యవస్థలోనూ పశు సంపద ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇప్పటికీ అధికశాతం రైతులు వ్యవసాయ పనులకు పశువులపైనే ఆధార పడుతున్నారు. తోళ్ల పరిశ్రమకూ ఇవే ఆధారం. చాలా రాష్ట్రాల్లో పశువుల సంఖ్యకు సరిపడా వైద్యులు అందుబాటులో లేరు. మందులు, సిబ్బంది కొరతతో సరైన వైద్యం అందడంలేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం చేయించడానికి కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఓ వైపు పశుసంపద అభివృద్ధికి పలు పథకాలను కేంద్రం అమలు చేస్తున్నా, వైద్యం విషయంలో లోటు కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో సంచార పశువైద్యశాలలు ప్రవేశపెట్టినా సరిపోవడంలేదు. మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకందారులు సైతం ప్రకృతి విపత్తులు, అంటువ్యాధులు ప్రబలినప్పుడు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవలి కాలంలో వీటికి బీమా సౌకర్యాలు వచ్చినా గ్రామీణులు ఉపయోగించుకోలేకపోతున్నారు. పశువుల పెంపకందారులను బీమా దిశగా ప్రోత్సహించాలి. అవసరమైతే ప్రభుత్వాలే ప్రీమియాన్ని భరించాలి. అంటువ్యాధులు, వైపరీత్యాలతో పశుసంపదను కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాలి. వ్యాధి నిర్ధారణ కేంద్రాలను మరిన్ని నెలకొల్పాలి. పశువుల ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులనూ అందుబాటులో ఉంచాలి.

- డి.సతీష్‌బాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నదుల్లో గరళప్రవాహం

‣ చైనా యుద్ధోన్మాద విన్యాసాలు

‣ సాగు బాగుకు సాంకేతిక సోపానం

‣ ఉగ్రవాదంపై ఉక్కుపాదం

‣ మయన్మార్‌లో అరాచకం

‣ లింగ సమానత్వం... ప్రగతికి మార్గం!

‣ జీవవైవిధ్య నెలవులు

Posted Date: 29-08-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం