• facebook
  • whatsapp
  • telegram

రైతుకేదీ...‘ఉత్సవం’?

జాతీయ రైతు దినోత్సవం. కానీ... అన్నదాతకు పంట దిగుబడిలో, ఆదాయంలో ఉత్సవం కరవైంది. సాగుపై ఉత్సాహమూ కొరవడింది. కర్షకుల జీవితాల్లో ఆనందోత్సాహాలకు అవకాశమే లేకుండా పోయింది. వ్యవసాయ రంగంలో కొన్నేళ్లుగా పీడిస్తున్న మౌలిక సమస్యలకు సమూల పరిష్కారాలు చూపినప్పుడే అన్నదాత కళ్లలో ఆనందం కనబడుతుంది. దేశానికి ఆహార భద్రత సమకూరుతుంది.

దేశ రాజధానిలో ఇటీవల రైతులు ధర్నా చేపట్టారు. పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని వాపోయారు. వ్యవసాయ సామగ్రిపై జీఎస్టీ రద్దు చేయాలన్నారు. పీఎం కిసాన్‌ పథకం కింద ఇచ్చే ఆర్థిక సహాయం ఆరువేల రూపాయల నుంచి 15 వేల రూపాయలకు పెంచాలని డిమాండు చేశారు. ఇలాంటి అనేక డిమాండ్లతో దిల్లీలోని రాంలీలా మైదానంలో రైతులు ఆందోళన నిర్వహించారు. ఇందులో పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ సహా తెలుగు రాష్ట్రాల రైతులు పాల్గొన్నారు. దేశంలో రైతుల ఆందోళనలు కొత్తేమీ కాదు. కానీ కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భాజపాకు మద్దతిచ్చే ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ ‘భారతీయ కిసాన్‌ సంఘ్‌’(బీకేఎస్‌) ఈ ఆందోళనకు నాయకత్వం వహించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

అందని మద్దతు

దేశంలో రైతులు పండించే 23 రకాల పంటలకు కేంద్రం ఏటా మద్దతు ధరలను ప్రకటిస్తోంది. మద్దతు ధరలు కచ్చితంగా దక్కేలా చట్టం తీసుకురావాలని రైతులు అడుగుతున్నా స్పందన లేదు. మూడోవంతు పంటలకైనా మద్దతు ధర అందడం లేదని వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌ అధ్యయనం చెబుతోంది. కొన్ని రాష్ట్రాల్లో మద్దతు ధరకు కొనే వ్యవస్థలే లేవు. పంటలను మద్దతు ధరకు కొనడం తమ బాధ్యత కాదన్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకొంటున్నాయి. కంది, మినుము మినహా మిగిలిన పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను రాష్ట్ర దిగుబడిలో 25 శాతమే కొంటామని కేంద్రం మెలిక పెట్టింది. అదికూడా పంటలను వ్యాపారులకు అయినకాడికి అమ్మిన తరవాత ఆలస్యంగా కొనడంవల్ల చాలామంది రైతులకు మద్దతు ధర కలగానే మిగులుతోంది. క్వింటాలు దిగుబడికి అయ్యే ఖర్చుకన్నా తక్కువ మొత్తమే మద్దతు ధరగా ప్రకటించడం వల్ల కర్షకులకు ప్రయోజనం ఉండటం లేదు. అప్పులు తెచ్చి, అకాలవర్షాలూ ఇతర విపత్తులతో పంట దెబ్బతిని - అంతంతమాత్రంగా వచ్చే దిగుబడితో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ప్రతి పంట ఉత్పత్తికి అన్నదాతలు పెడుతున్న ఖర్చులకు, ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరలకు మధ్య పొంతనే ఉండటం లేదు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించినా, ఖర్చులే రెట్టింపు అయ్యాయి. ఎరువుల రాయితీ, పీఎం కిసాన్‌ వంటి రెండు పథకాల్లో మాత్రమే కేంద్రం నేరుగా రైతుల కోసం ఎక్కువ నిధులు ఖర్చుచేస్తోంది. నాణ్యమైన విత్తనాలిస్తే మంచి దిగుబడి వస్తుంది. యంత్రాలిస్తే కూలీల కొరత, కూలీ రేట్ల భారం తగ్గుతాయి. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి కేంద్రం ‘ఎలెక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (ఈనామ్‌)’ను ప్రవేశపెట్టింది. దీనిద్వారా దేశంలో అన్ని వ్యవసాయ మార్కెట్లను అనుసంధానించి, ఎక్కడి నుంచి ఏ పంటనైనా కొనే అవకాశం కల్పిస్తామని చెప్పింది. ఏడేళ్లయినా ఇదంతా కలగానే మిగిలిపోయింది. సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యాపారి ఒక వ్యవసాయ మార్కెట్‌కు రైతు తెచ్చిన పంటను కొనడానికి మంచి ధర ఇవ్వాలంటే అది నాణ్యమైన సరకు అని ధ్రువీకరించే ప్రయోగశాలలు ఉండాలి. వీటి ఏర్పాటుకు నిధుల కొరత లేకుండా చూస్తే ఆన్‌లైన్‌లో పంటల కొనుగోళ్లు పెరిగి మార్కెట్లలో వ్యాపారుల సిండికేట్లకు అడ్డుకట్ట వేయవచ్చు. ప్రభుత్వాలు ఒకవైపు భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. మరోవైపు సాగునీటిని పొదుపుగా వాడేందుకు తోడ్పడే బిందు, తుంపర్ల సేద్యం పరికరాలకు రాయితీ ఇవ్వడానికి వెనకాడుతున్నాయి. నిధులు లేవంటూ ఇలాంటి పథకాల అమలు నిలిపివేయడం సరికాదు. పలు దేశాల్లో రైతులకు అవసరమైన విత్తనాలు, యంత్రాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి సాగు పద్ధతులను సమూలంగా మార్చి దిగుబడులు పెంచుతుండటాన్ని విస్మరించకూడదు.

పరిశోధన ఫలాలు

పలుదేశాల్లో వ్యవసాయ పరిశోధనలకు గణనీయంగా నిధులిస్తూ వాటి ఫలాలను రైతులకు చేరవేస్తున్నారు. మన దేశంలోని పరిశోధనా సంస్థల్లో వందల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. నిధుల విడుదల లేదు. ప్రభుత్వాలకు నచ్చిన పథకాలను మాత్రమే అమలుచేస్తూ, నాణ్యమైన విత్తనాలు, పంట సాగు ఖర్చు తగ్గించడానికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం మానేసినంత కాలం పంటల దిగుబడి పెరగదు. వ్యవసాయ మార్కెట్లను ఆధునికీకరించకుండా వ్యాపారులకు వదిలేస్తే పంటకు గిట్టుబాటు ధరలు దక్కవు. పండిన పంటలో 25 శాతమే మద్దతు ధరకు కొంటామనే అడ్డగోలు నిబంధనలతో రైతులకు ఆదాయం పెరగదు. ఇలాంటి మౌలిక సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు జమ చేసినంత మాత్రాన పరిస్థితి మెరుగుపడదు. అన్నదాతల ఆత్మహత్యలూ ఆగవు, దేశానికి ఆహార భద్రతా దఖలుపడదు!

పెట్టుబడి ఖర్చులు

రైతుకు పెట్టుబడి ఖర్చుల్ని సమకూర్చేందుకు కేంద్రం ‘పీఎం-కిసాన్‌’ పథకం అమలు చేస్తోంది. దీనిపేరిట వ్యవసాయానికి సంబంధించిన పలు కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధుల మంజూరులో ప్రభుత్వం కోతలు పెట్టింది. ఉదాహరణకు బిందుసేద్యం పథకం కింద తెలంగాణలో ఈ ఏడాది రూ.100 కోట్లు ఇస్తామన్నా, రైతులకు డబ్బులే విడుదల కాలేదు. ‘రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన’ వంటి కేంద్ర పథకాలకు రాష్ట్రాల వాటా జమకాలేదంటూ కేంద్రం నుంచి రావాల్సిన నిధులూ ఆపేస్తున్నారు. ఇలాంటి అస్తవ్యస్త విధానాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయతీల కారణంగా పలు పథకాల్లో రాయితీలు, ప్రోత్సాహకాల నిధులు రైతులకు అందడం లేదు. మార్కెట్లలో ఇప్పటికే అత్యాధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని రైతులకిస్తే కూలీల అవసరమే లేకుండా సులభంగా పంటలు సాగు చేయవచ్చని కేంద్రానికి చెందిన జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలు, రాష్ట్రానికి చెందిన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సూచిస్తున్నాయి. కానీ యంత్రాలను రైతులకు అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చొరవే లేదు. వ్యవసాయ యంత్రాలపై రాయితీని తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో గత రెండేళ్లుగా పూర్తిగా నిలిపివేశారు. ఈ యంత్రాలను పేద రైతులకు అద్దెకు ఇచ్చేందుకు ప్రతి గ్రామంలో అన్ని యంత్రాలతో ‘సేవా కేంద్రం’ ఏర్పాటు చేయాలని చెప్పడమే తప్ప ఆచరణలో అమలు జరగడం లేదు.

- మంగమూరి శ్రీనివాస్‌
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ టిస్‌ కోర్సుల్లోకి ప్రవేశాలు ప్రారంభం

‣ వావ్‌..! అనిపిస్తారా?

‣ ఏకాగ్రతతో ఎలా చదవాలి?

‣ అందరూ కామర్స్‌ కోర్సుల్లో చేరుతున్నారు!

‣ బొగ్గు గనుల్లో ఉద్యోగాలు

‣ సందేహాలు వదిలేసి పరీక్షలకు సిద్ధంకండి!

Posted Date: 24-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం