• facebook
  • whatsapp
  • telegram

సిరిధాన్యాలతో ఆహార భద్రత

ప్రజల ప్రధాన ఆహారమైన వరి, గోధుమలతో పోలిస్తే సిరిధాన్యాలలో అత్యధిక పోషక విలువలు ఉంటాయి. వాటి ద్వారా పౌష్టికాహార లోపాలను అధిగమించవచ్చు. ప్రపంచ ఆహార భద్రత పరంగానూ అవి కీలకంగా నిలుస్తాయి. అందుకే 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.

ఒకప్పుడు పేదవారి ఆహారంగా నిరాదరణకు గురైన సిరిధాన్యాలు కరోనా తరవాత అన్ని వర్గాలకు చేరువయ్యాయి. ఆసియా, ఆఫ్రికాల్లో దాదాపు 60శాతం ప్రజలకు చిరుధాన్యాలే ప్రధాన సంప్రదాయ ఆహారం. ప్రపంచ తృణధాన్యాల ఉత్పత్తిలో భారత్‌ వాటా 20శాతం. రాగి, జొన్న, సజ్జ, సామలు, కొర్రలు, వరిగ తదితర చిరుధాన్యాలను అధిక   విస్తీర్ణంలో భారత్‌ పండిస్తోంది. సిరిధాన్యాల సాగులో కర్ణాటక, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌, హరియాణలు ముందు వరసలో ఉన్నాయి. ప్రపంచ చిరుధాన్యాల ఉత్పత్తిలో భారత్‌, నైజీరియా, చైనాల వాటా 55శాతం కన్నా అధికం. 131 దేశాల్లో తృణధాన్యాలను పండిస్తున్నారు.

ప్రస్తుత అవసరం

ఆకలి సమస్యను 2030 నాటికి ప్రపంచం నుంచి తరిమివేయాలని 2015లో ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే, అన్నార్తుల సంఖ్య ఏటా పెరుగుతోందని ఐరాస ఇటీవల ఆందోళన వెలిబుచ్చింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా 82.8 కోట్ల మంది ఆకలి సమస్యను ఎదుర్కొన్నారు. 2015తో పోలిస్తే క్షుద్బాధతో నకనకలాడేవారు విశ్వవ్యాప్తంగా 18 కోట్ల మంది అధికమయ్యారని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరు, అంటే సుమారు 231 కోట్ల మంది ఓ మోస్తరు లేదా తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. ఎఫ్‌ఏఓ నివేదిక ప్రకారం 2004-06 మధ్య ప్రపంచంలో 12.2శాతం ప్రజలు పోషకాహార లోపంతో బాధపడ్డారు. 2019-21 నాటికి వారు మూడు శాతమే తగ్గి తొమ్మిది శాతానికి చేరారు. భారత్‌లో 2004-06 మధ్య 21.6శాతం ప్రజలు పౌష్టికాహార సమస్యను ఎదుర్కొన్నారు. 2019-21 కాలంలో వారు 16.3శాతానికి తగ్గారు. చైనాలో 2.5శాతం, నేపాల్‌లో 5.5శాతం, పాకిస్థాన్‌లో 16.9శాతం ప్రజలు పోషకాహార లేమిని ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం దక్కని వారి సంఖ్య భారత్‌సహా అనేక దేశాల్లో అధికంగా ఉంది. 2017లో ప్రపంచవ్యాప్తంగా రోజువారీ తలసరి పోషకాహార వ్యయం 3.314 డాలర్లు. 2020 నాటికి అది 3.537 డాలర్లకు చేరింది. అదే కాలానికి భారత్‌లో ఆ వ్యయం 2.824 డాలర్ల నుంచి 2.97 డాలర్లకు (రూ.230) పెరిగింది. అయితే, భారత్‌లో పౌష్టికాహారం కోసం ఆ మాత్రమూ ఖర్చుచేయలేని వారు 2017లో 74.9శాతం ఉన్నారు. 2020 నాటికి వారు 70.5శాతానికి దిగివచ్చారు. ఏతావతా ఇండియాలో 97 కోట్ల మంది ఆరోగ్యకరమైన ఆహారం కోసం రోజుకు రూ.230 సైతం ఖర్చుపెట్టే స్థితిలో లేరన్నది నిష్ఠుర సత్యం.

అధిక జనాభా, పేదరికం, వాతావరణ మార్పులతో పంట నష్టాల వల్ల విశ్వవ్యాప్తంగా ఆకలి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పేదరిక సవాళ్లను ఎదుర్కొంటూ ఆకలి కేకలను తగ్గించడంలో చిరుధాన్యాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఐరాస బలంగా నమ్ముతోంది. సురక్షితమైన వాతావరణంలో ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు అవి తోడ్పడతాయని విశ్వసిస్తోంది. వాతావరణ సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ సిరిధాన్యాలతో ఆహారభద్రత లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నది ఈ ఏడాది లక్ష్యం. పోషకాహారంతో ఆహారభద్రతను సాధించే లక్ష్యంతో 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలన్న భారత్‌ ప్రతిపాదనను ఐరాస ఆమోదించింది. తృణధాన్యాలను పండించడం చాలా సులువు. వాతావరణ మార్పులు ప్రస్తుతం ప్రధాన ఆహార పంటల దిగుబడుల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ తరుణంలో తక్కువ నీటి అవసరం ఉండే, బెట్ట పరిస్థితులను తట్టుకొనే సిరిధాన్యాలను అధికంగా పండించడం ఆహార భద్రత రీత్యా నేడెంతో అవసరం. ఎరువులు, రసాయనాల అవసరం లేకుండానే వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని చిరుధాన్యాలు పెరుగు తాయి. అధిక పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు, ఖనిజ లవణాలు అధికంగా ఉండే తృణధాన్యాలు ఎంతో ఆరోగ్యకరం. అందుకే కొన్నేళ్లుగా భారత్‌ వాటి సాగును ప్రోత్సహిస్తోంది. 2018ను జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. కేంద్రం చర్యలతో 2017-18లో దేశీయంగా 164 లక్షల టన్నులు ఉన్న తృణధాన్యాల ఉత్పత్తి, 2020-21 నాటికి 179.6 లక్షల టన్నులకు పెరిగింది. అదే కాలంలో హెక్టారు సగటు ఉత్పాదకత 1163 కిలోల నుంచి 1239 కిలోలకు చేరింది. 2017లో    2.4 కోట్ల డాలర్ల విలువైన చిరుధాన్యాలు ఎగుమతి అయ్యాయి. 2020 నాటికి ఆ విలువ 2.6 కోట్ల డాలర్లకు పెరిగింది.

వృథాను అరికట్టాలి

విశ్వవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు తెగ్గోసుకుపోవడంతో పాటు ప్రజల సగటు ఆదాయమూ పడిపోయింది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధమూ ప్రతికూలంగా మారింది. వీటన్నింటి ప్రభావం ఆహార భద్రతపై పడింది. కరోనా తరవాత ఆర్థిక అసమానతలు పెరగడం, సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం, ఆహారం, ఎరువులు, ఇంధన ధరలు పెరగడం తదితరాల వల్ల ద్రవ్యోల్బణం అధికమైంది. విశ్వవ్యాప్తంగా ఆకలి కేకలు, పోషకాహార లోపాలను తృణధాన్యాలు పరిష్కరించగలవని ప్రధాని మోదీ ఇటీవలి జీ20 సదస్సులో ఉద్ఘాటించారు. సుస్థిర ఆహార భద్రత కోసం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు అపరాలు వంటి పోషక, సంప్రదాయ ఆహార ధాన్యాలను తిరిగి ప్రాచుర్యంలోకి తేవడంపై దృష్టి పెడతామన్నారు. ఇది ఆహ్వానించదగ్గ విషయం. సిరిధాన్యాల సాగును రెట్టింపు చేయడం ద్వారా వాటి వినియోగాన్ని పెంచి, పోషకాహార సమస్యను నివారించాలనేది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. తృణ, పప్పుధాన్యాల వాడకం పెరిగితే పోషకాహార సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. పంట కోత అనంతరం 4-6శాతం చిరుధాన్యాల ఉత్పత్తి వృథా అవుతున్నట్లు అంచనా. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఆహారశుద్ధిని విస్తృతంగా ప్రోత్సహించాలి. చిరుధాన్యాల ఉత్పత్తులకు విలువ జోడించే ఆహారశుద్ధి యూనిట్లను పెద్దయెత్తున ఏర్పాటు చేయాలి. తద్వారా ప్రజల్లో పోషకాహార లోపాన్ని తగ్గించే అవకాశం లభిస్తుంది.

- అమిర్నేని హరికృష్ణ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డ్రోన్‌ సాంకేతికతతో మార్కెట్‌కు రెక్కలు

‣ అనిశ్చితి నామ సంవత్సరానికి తెర

‣ పాకిస్థాన్‌పై తాలిబన్‌ తిరుగుబావుటా

‣ అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం

‣ జన సంద్రం... వినియోగించుకుంటే వరం!

‣ ఆర్థిక అంధకారంలో భారత్‌ వెలుగు రేఖ

Posted Date: 06-01-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం