• facebook
  • whatsapp
  • telegram

జన్యు మార్పిడి పంటలతో మేలెంత?

పంటల సాగు విషయంలో కేంద్రం ఇటీవల రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. జన్యు మార్పిడి (జీఎం) వంగడాలతో ఆవాల సాగుకు అనుమతించడం ఇందులో ప్రధానమైనది. సుప్రీంకోర్టు స్టే విధించడంతో అది వాయిదా పడింది. జీన్‌ ఎడిటింగ్‌ (జన్యు సవరణ) ద్వారా దేశంలో అధిక దిగుబడులనిచ్చే కొత్త వంగడాల పరిశోధనలకు కేంద్రం అనుమతించడం మరో ముఖ్యమైన పరిణామం.

భారత్‌లో జన్యు మార్పిడి (జీఎం) పత్తిలో బీజీ-1, బీజీ-2 అనే రెండు రకాల వంగడాల సాగుకు మాత్రమే కేంద్రం గతంలో అనుమతించింది. కలుపు మొక్కలను నాశనంచేసే విషపూరిత రసాయనాలను చల్లినా తట్టుకుని బతికే ‘హెర్బిసైడ్‌ టాలరెంట్‌’ (హెచ్‌టీ) పత్తి వంగడాలను ఇండియాలో సాగుకు అనుమతించాలని అమెరికాకు చెందిన మోన్‌శాంటో కంపెనీ తొలుత ప్రభుత్వాన్ని కోరింది. ఆ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోకముందే ఆ సంస్థ హఠాత్తుగా దాన్ని ఉపసంహరించుకుంది. ఆ తరవాత అవే హెచ్‌టీ పత్తి విత్తనాలు అక్రమంగా మార్కెట్లోకి వచ్చాయి. దాంతో ఈ వంగడాల విక్రయాలు, సాగును అడ్డుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అయినప్పటికీ ఈ ఏడాది హెచ్‌టీ పత్తి సాగు లక్షల ఎకరాలకు విస్తరించింది. ఈ సాగులో కలుపు మొక్కలను చంపేందుకు ‘గ్లైఫోసెట్‌’ అనే అత్యంత విషపూరిత రసాయన మందులను చల్లుతున్నారు. పర్యావరణానికి, రైతుల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుండటంతో వాటి విక్రయాలను తెలుగు రాష్ట్రాలు నిషేధించాయి. పలు విత్తన సంస్థలు జన్యుమార్పిడి చేసిన హెచ్‌టీ పత్తి విత్తనాలను దేశంలో పెద్దయెత్తున అక్రమంగా సాగుచేయిస్తున్నాయని స్వయంగా కేంద్ర వ్యవసాయశాఖే అంగీకరించింది.

పరిశోధనలు కీలకం

జీఎం పత్తి విత్తనాలను అనుమతిస్తే తెగుళ్ల బెడద ఉండదని, పంట దిగుబడి పెరిగి రైతులకు ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వస్తుందంటూ వాటిని భారత్‌లోకి అనుమతించారు. అదేమీ ఆచరణలో కనిపించడం లేదు. 2007-22 మధ్య దేశీయంగా పత్తి సాగు విస్తీర్ణం 94 లక్షల హెక్టార్ల నుంచి 119 లక్షల హెక్టార్లకు ఎగబాకింది. హెక్టారుకు సగటు ఉత్పాదకత మాత్రం 554 కిలోల నుంచి 445 కిలోలకు దిగజారింది! జీఎం వంగడాలతో అద్భుతమైన పంట పండుతుందనే ప్రచారమే నిజమైతే హెక్టారు ఉత్పాదకత 109 కిలోల మేర ఎందుకు పడిపోయిందనే ప్రశ్నలకు సమాధానం లేదు. మహారాష్ట్ర, తెలంగాణ వంటి చోట్ల అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్లో ఎక్కువ మంది జీఎం పత్తి విత్తనాలను సాగు చేసినవారేనని అనేక అధ్యయనాలు తెలియజెబుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 2019లో జన్యుమార్పిడి పంటల సాగు విస్తీర్ణం 47 కోట్ల ఎకరాలు దాటింది. అందులో అత్యధికంగా 22.66 కోట్ల ఎకరాల్లో (48.20శాతం) సోయాచిక్కుడు, మరో 15 కోట్ల ఎకరాల్లో (32శాతం) మొక్కజొన్న, 6.40 కోట్ల ఎకరాల్లో బీటీ పత్తి సాగవుతున్నాయి. వీటితో పాటు జీఎం వంగడాలతో వంగ, బొప్పాయి, గుమ్మడి, కుసుమలు, చెరకు, కందగడ్డ, యాపిల్‌, పైనాపిల్‌ వంటి పంటలు మొత్తం 29 దేశాల్లో పండుతున్నాయి. జీఎం వంగడాలు సాగవుతున్న మొత్తం 47 కోట్ల ఎకరాల్లో 56శాతం విస్తీర్ణం ఇండియా, పాకిస్థాన్‌ వంటి 24 అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన అమెరికా, కెనడా వంటి దేశాల్లో ఈ సాగు విస్తీర్ణం తక్కువే.

ప్రపంచ జనాభా అంతకంతకూ పెరుగుతుండటంతో ఆహార భద్రత కల్పించడం మున్ముందు అతిపెద్ద సవాలు కానుంది. పట్టణాలు విస్తరించి, గృహ నిర్మాణం శరవేగంగా సాగుతుండటంతో సేద్య విస్తీర్ణం నానాటికీ తగ్గుతోంది. ఉన్న కాస్త భూమిలోనే ఉత్పాదకతను పెంచి మంచి దిగుబడులు రాబట్టకపోతే ఆహారధాన్యాల కొరత, ఆకలి చావులు పెరుగుతాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలు మరిన్ని రావాలి. వీటిపై పరిశోధనలకు ప్రభుత్వాలు ఆర్థిక తోడ్పాటును మరింతగా పెంచాలి. వ్యవసాయ పరిశోధనా సంస్థలను పరిపుష్టం చేయడంతో పాటు- ఏళ్ల తరబడి వందల సంఖ్యలో ఖాళీగా ఉంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తల పోస్టులను భర్తీ చేయాలి. మేటి పరిశోధనలను, పరిశోధకులను ప్రోత్సహించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ పరిశోధనల్లో ప్రైవేటు పెట్టుబడులు అధికం. మనదేశంలోనూ అలా పెంచేందుకు కృషి జరగాలి. అనేక పురాతన వంగడాల జన్యుసంపదను కాపాడుకోవాలి.

దేశీయ విత్తనాల ప్రోత్సాహం

మనదేశ వాతావరణం, ఇక్కడి భూములకు అనువైన కొత్త వంగడాలను సృష్టించుకుంటేనే ఆహార, ఆర్థిక భద్రతకు పూచీకత్తు లభిస్తుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు ఆవిష్కరించే కొత్త వంగడాల సాగుకు ముందుకొచ్చే రైతులను ప్రోత్సహించాలి. వందల సంఖ్యలో కొత్త వంగడాలను విడుదలచేసి చేతులు దులుపుకొంటున్నారు. వాటిని రైతుల వద్దకు చేర్చి సాగును ప్రోత్సహించేందుకు పెద్దపీట వేయాలి. జన్యు సవరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినందువల్ల మరిన్ని కొత్త వంగడాలు మార్కెట్లోకి రానున్నాయి. ఈ విధానంలో ఒక పంట వంగడాల్లోని జన్యువులను మనకు అవసరమైన లక్షణాలుండేలా జీనోమ్‌ ఎడిటింగ్‌ చేసి కొత్త విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల పంటలో తెగుళ్లను, ఇతర సమస్యలను నియంత్రించి అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలను సృష్టిస్తారు. వీటితో పాటు అధిక దిగుబడులను ఇచ్చే దేశీయ వంగడాలను సైతం ప్రోత్సహించడం తప్పనిసరి. అలా కాదని జీఎం వంగడాలే మేలంటూ బహుళజాతి కంపెనీలు చేసే ప్రచారంలో చిక్కుకొంటే చివరికి బలయ్యేది మన అన్నదాతలు, వ్యవసాయ రంగమే!

అనుమతించని ధనిక దేశాలు

యూపీఏ పాలనలో జన్యుమార్పిడి వంకాయ వంగడాలకు అనుమతి ఇచ్చేందుకు ప్రయత్నించగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో నాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పుడు కేంద్రమే జీఎం ఆవాల సాగుకు అనుమతించడం ద్వారా పెద్ద నిర్ణయం తీసుకుంది. వ్యవసాయంలో లోతైన పరిశోధనలతో అత్యంత అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించే బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌, జపాన్‌, దక్షిణ కొరియా తదితర దేశాలు జన్యుమార్పిడి వంగడాల సాగుకు ఏమాత్రం అనుమతించలేదు. బహుళజాతి సంస్థలు పేదదేశాల అవసరాలను ఆసరాగా చేసుకుని జీఎం వంగడాలను వాటికి అంటగట్టి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయి. ఈ వంగడాలతో అధిక దిగుబడులు వస్తాయని, తెగుళ్ల బెడద ఉండదని పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నాయి. అదే నిజమైతే బ్రిటన్‌, జపాన్‌, జర్మనీ తదితర అభివృద్ధి చెందిన దేశాలు వాటి సాగును ఎందుకు అనుమతించడం లేదనే ప్రశ్నకు ఆ సంస్థల నుంచి సమాధానం లేదు!

- మంగమూరి శ్రీనివాస్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జపాన్‌లో జనాభా సంక్షోభం

‣ మితిమీరిన ఎరువులతో నేల నిస్సారం

‣ అటు సవాళ్లు... ఇటు అవకాశాలు!

‣ ఆర్మీనియాతో ఉభయతారక బంధం

‣ న్యాయవ్యవస్థకు డిజిటల్‌ సొబగులు

‣ డిజిటల్‌ ప్రపంచంలో కొత్త వాణిజ్యం

‣ ఉక్రెయిన్‌పై యుద్ధంలో భారత్‌ ఎటు?

Posted Date: 13-01-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం