• facebook
  • whatsapp
  • telegram

బాల్యం నుంచే బాధ్యత

పర్యావరణ బోధనతో ఉజ్జ్వల భవిత

మానవ చర్యలు పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. భూమండలంలోని వనరులను  మానవులు విచ్చలవిడిగా వినియోగించుకుంటున్నారు. జీవనశైలి ఇలానే కొనసాగితే 2050 నాటికి జనావళికి మూడు భూమండలాలు అవసరమవుతాయని యునెస్కో తాజాగా వ్యాఖ్యానించింది. జీవనశైలిని పర్యావరణ హితంగా మార్చుకొని, ఉత్పత్తి, వినియోగ పద్ధతుల్లో సమతుల్యతకు ప్రాధాన్యమిచ్చి, ప్రకృతితో స్నేహంగా మెలిగినప్పుడే ధరణిని పదిలంగా భావితరాలకు అందించగలం. ఈ మార్పు విద్య ద్వారానే సాధ్యమని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఆండ్రే అజోలాయ్‌ పేర్కొన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై యునెస్కో గతేడాది నిర్వహించిన సర్వేలో 67శాతం ప్రజలు వాతావరణ మార్పులు, జీవవైవిధ్య నష్టం వంటివి ప్రపంచానికి పెనుశాపంగా మారాయని పేర్కొన్నారు. వాటిని పర్యావరణ విద్య ద్వారానే సమర్థంగా ఎదుర్కోగలం. ప్రపంచ దేశాలు 2025 నాటికి తప్పనిసరిగా పర్యావరణ విద్యను బోధనలో భాగంగా చేయాలని యునెస్కో సూచిస్తోంది.

అవగాహనకు మేలిమి మార్గం

ప్రపంచంలోని దాదాపు 50శాతం దేశాలు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలో వాతావరణ మార్పుల గురించి బోధించడంలేదు. కేవలం 19శాతం దేశాలే విద్యలో జీవవైవిధ్యాన్ని చేర్చాయి. ఉపాధ్యాయ శిక్షణలోసైతం పర్యావరణ అంశాలకు తగిన ప్రాధాన్యం దక్కడంలేదని యునెస్కో ఆవేదన వ్యక్తం చేసింది. పర్యావరణ సమస్యలపై ప్రాంతీయ, అంతర్జాతీయ సమావేశాలు 70వ దశకం నుంచి మొదలయ్యాయి. దాన్ని పరిరక్షించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రపంచ దేశాలకు స్టాక్‌హోమ్‌ పర్యావరణ సదస్సు విన్నవించింది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై మానవ ప్రభావం ఎలా ఉందో తొలిసారిగా ఈ సదస్సు ప్రకటన వివరించింది. పర్యావరణ విద్య ఆవశ్యకత, లక్ష్యాలు, సూచనలను బెల్‌గ్రేడ్‌ ఛార్టర్‌-1975 నిర్దేశించింది. పర్యావరణ సమస్యలపై ప్రపంచ ప్రజలను ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) చైతన్యపరుస్తోంది.

ప్రపంచ దేశాల్లో ఫిన్లాండ్‌ అత్యుత్తమ పర్యావరణ విద్యను అందిస్తోంది. స్వీడన్‌ ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలో పర్యావరణ సమస్యలపై అవగాహన కల్పించడంతోపాటు, పరిష్కార మార్గాలను వివరిస్తోంది. ఇటలీ తొలిసారిగా తన జాతీయ విద్యాప్రణాళికలో వాతావరణ మార్పులు, సుస్థిరాభివృద్ధిని చేర్చింది. అక్కడి పాఠశాలలు వారానికి ఒక గంట సమయాన్ని పర్యావరణ మార్పుల గురించి విద్యార్థులు చర్చించడానికి కేటాయించాలని నిర్ణయించాయి. ఆసియా దేశాలు పర్యావరణ మార్పులు, జీవవైవిధ్య నష్టం, పునరుత్పాదక ఇంధన వనరులు వంటి అంశాల బోధనపై దృష్టిసారించడంలేదు. ఈ దేశాల్లో భూతాపం, వాతావరణ ప్రతికూల ప్రభావం అధికంగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడిస్తోంది. ఫిన్లాండ్‌తో పాటు ఇతర ఐరోపా దేశాలు నాణ్యమైన పర్యావరణ విద్యను అందిస్తున్నాయి. పర్యావరణ సమస్యల పట్ల అవగాహన కల్పించడం, పరిష్కార మార్గాలు సూచించడం, దాని పరిరక్షణలో పౌరుల భాగస్వామ్యం పెంచడం వంటి వాటిని పర్యావరణ విద్య బోధిస్తుంది. ఇందుకోసం కృషిచేసే అంతర్జాతీయ సంస్థలు, ఉద్యమకారులకు సైతం ప్రభుత్వాలు చేయూత అందించవలసిన అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షణను పౌరుల ప్రాథమిక బాధ్యతగా భారత రాజ్యాంగం పేర్కొంది. దానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను విద్యార్థులకు బోధించాలని కొఠారీ కమిషన్‌ సిఫార్సు చేసింది. పర్యావరణ విద్యను అన్ని స్థాయుల్లో ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను జాతీయ విద్యా విధానం-1986 తెలియజేసింది. వాటిని ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు నిర్దేశం మేరకు దేశంలో 2003 నుంచి పర్యావరణ విద్యకు పాఠ్యాంశాల్లో స్థానం దక్కింది. అత్యున్నత న్యాయస్థానం నిర్దేశాలకు అనుగుణంగా జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం-2005ను రూపొందించింది.

నెరవేరని అసలు లక్ష్యం

భారత్‌లోని 13 లక్షల పాఠశాలల్లో పర్యావరణ విద్యను బోధిస్తున్నారని యునెస్కో పేర్కొంది. అయితే ఆ విద్య విద్యార్థులను ప్రకృతి సంరక్షణ నాయకులుగా కాకుండా, యాత్రికులుగా తీర్చిదిద్దుతోందన్న విమర్శ ఉంది. అది వారిలో మానసిక పరివర్తన తేవడంలో విఫలమవుతోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. పాఠశాల స్థాయిలో పర్యావరణ విద్య బోధనకోసం అర్హులైన ఉపాధ్యాయుల కొరత, బోధనలో సృజనాత్మక పద్ధతులు లోపించడం, పాఠ్యాంశాలను మెరుగుపరచక పోవడం వంటివి ప్రధాన సమస్యలుగా నిలుస్తున్నాయి. కార్యశాలలు, పర్యావరణ అభివృద్ధి శిబిరాలు, ప్రకృతిహితకర యాత్రలు, సంచార ప్రదర్శనశాలల ఏర్పాటు వంటి బహుముఖ పద్ధతులతో విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తిని పెంచాలి. పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రభుత్వాలకే వదలకుండా ఉద్యమకారులు వ్యక్తిగతంగా, సంఘటితంగా గళం వినిపిస్తూ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ద్వీప దేశాలు కూటమిగా ఏర్పడి తమ మనుగడకు, భూతాప కట్టడికి అంతర్జాతీయ వేదికలపై పోరాడుతున్నాయి. వాతావరణ మార్పులకు, పర్యావరణ వినాశానికి ప్రపంచ రాజకీయ నాయకుల బాధ్యతారాహిత్యం, చిత్తశుద్ధి లోపమే కారణాలని లక్షల మంది నినదిస్తున్నారు. వారి దృక్పథంలో మార్పు రావాలని కోరుతున్నారు. గ్రెటాథెన్‌బర్గ్‌ వంటి యువ పర్యావరణ కార్యకర్తలు సైతం ప్రపంచ నాయకులను నిలదీస్తున్నారు. పర్యావరణ విద్యను సంస్కరించి బోధిస్తేనే భావితరాలు చైతన్యవంతమై, పర్యావరణహితకరమైన చర్యలు, నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది.

- డాక్టర్‌ సి.హెచ్‌.సి.ప్రసాద్‌

Posted Date: 24-11-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం