• facebook
  • whatsapp
  • telegram

సన్నద్ధత లోపం... వరదల శాపం!

పకడ్బందీ కార్యాచరణే ఉపశమనం

ఇటీవలి భారీ వర్షాలు పలు రాష్ట్రాల్ని అల్లకల్లోలం చేశాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో చేతికొచ్చిన పంట చేజారింది. ప్రాణనష్టమూ సంభవించింది. రైలు, రోడ్డు మార్గాలు, వంతెనలు, జలవనరులు వంటి మౌలిక సదుపాయాలకు తీవ్రనష్టం వాటిల్లింది. అంతకన్నాముందు కురిసిన ఆకస్మిక, భారీ వర్షాలు హైదరాబాద్‌ మహానగరాన్ని, రోడ్లను, కాలనీలను ముంచెత్తాయి. బెంగళూరు, ముంబయి, పట్నా, చెన్నై, వరంగల్‌ వంటి నగరాలూ వరద నీట చిక్కి విలవిల్లా డాయి. కేరళ, హిమాచల్‌, అస్సాం తదితర రాష్ట్రాల్లోనూ ప్రకృతి ఉత్పాతం పెనుప్రభావాన్ని చూపింది. భారీగా వర్షాలు పడటం, వరదలు ముంచెత్తడం ఏటా జరిగేదే. అయితే, విపత్తుల్ని ఎదుర్కొనే విషయంలో అధికార యంత్రాంగాల సన్నద్ధత తగినంత స్థాయిలో ఉందా అనేది అనుమానమే. ఎందుకంటే, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా వాన నీటికి, వరద బీభత్సానికి బెంబేలెత్తిపోవడం, లక్షల కోట్ల ఎకరాల్లో పంటలు, ఆస్తి, ప్రాణ నష్టం సంభవించడం జరుగుతూనే ఉంది. భారీయెత్తున కురిసిన వర్షాలకు తోడు- ఏళ్లుగా సాగుతున్న ఆక్రమణలు, భూకబ్జాసురుల చెరలో చిక్కిన చెరువులు... ఇలాంటి సమస్యలన్నింటికీ కారణమవుతున్నాయి. నగరాలు పట్టణాలు చిన్నవానలకే వణికిపోతూ, వరదల్లో మునిగి పోతుండటానికి కారణం- వరద నీటిని ఒడిసిపట్టే చెరువులు, కుంటల వంటి జలవనరులు మాయం కావడం, వరద నీటిని ఒడుపుగా బయటికి తీసుకెళ్లే కాల్వలు పూడుకుపోవడమే.

అవే కష్టాలు...

విభిన్న వాతావరణ జోన్లు కలిగిన భారత్‌లో కోట్ల హెక్టార్ల మేర వ్యవసాయ యోగ్యమైన భూములకు వరదల ముంపు ప్రమాదాలు పొంచి ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో వరదల బెడదను నివారించేందుకంటూ చాలాఏళ్ల క్రితమే జాతీయ వరదల కమిషన్‌ ఏర్పాటైంది. ప్రకృతి ఉత్పాతాల్లో ప్రాణ ఆస్తి నష్టాల్ని తీవ్రతను తగ్గించేందుకు జాతీయ విపత్తు నిర్వాహక ప్రాధికార సంస్థ సైతం గతంలోనే కొలువుతీరింది. అయినా వరదల సమర్థ నిర్వహణ, నియంత్రణ, విపరీత నష్టాల నివారణలో ఇప్పటికీ గందరగోళ పరిస్థితులే కనిపిస్తున్నాయి. వాతావరణ విపత్తులకు లోనుకాగల జిల్లాల్ని కేంద్రం గుర్తించినా, కార్యాచరణ ప్రణాళికలు ఖరారైనా- పరిష్కారానికి సంబంధించి చెప్పుకోతగ్గ ముందడుగు పడకపోవడం విచారకరం. ముప్పుల్ని ఎదుర్కొనే విషయంలో కేంద్ర, రాష్ట్ర జిల్లా స్థాయుల్లో వ్యవస్థల ఏర్పాటు పూర్తిస్థాయిలో ఆచరణకు నోచుకోని ఫలితంగానే ఆస్తిప్రాణ నష్టాలు ఇంతలంతలవుతున్నాయి. ప్రభుత్వాలు మారినా ఏళ్లుగా ఇస్తున్న హామీలు ఆచరణకు నోచుకోకపోవడంతో ఏటా అవే కష్టాలు పదేపదే కొత్తగా పలకరిస్తున్నాయి.

వెక్కిరిస్తున్న వైఫల్యాలు

సరైన ప్రణాళికల రూపకల్పన లేకపోవడం, తగిన సన్నద్ధత లోపించడం, వరద నీరు వెళ్ళిపోయేలా డ్రైనేజీలతో కూడిన మౌలిక వసతుల కల్పనను విస్మరించడం వంటి సమస్యలు ప్రభుత్వ యంత్రాంగాల వైఫల్యాల్ని వెక్కిరిస్తున్నాయి. వరద నీటిని తీసుకెళ్ళే నాలాలు, నిల్వ చేసుకొనే చెరువుల్ని అడుగడుగునా ఆక్రమించేస్తున్నారు. చెరువులు, కుంటల్లో నిలవాల్సిన నీరు బయటికొచ్చి రహదారులపై పారుతూ, జనావాసాల్లోకి చొరబడుతున్న వైనం సర్వసాధారణమైంది. ఏటా దేశంలో పలు ప్రాంతాలు వరదల బారిన చిక్కుతున్నా... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో తగిన నిపుణ యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోలేని వైఫల్యం వెంటాడుతోంది. ప్రకృతి విపత్తుల వేళ విలవిల్లాడే రాష్ట్రాల యంత్రాంగాలకు పైనుంచి అభయ హస్తం అందించే బాధ్యత కేంద్రమే తీసుకోవాలి. రాజ్యాంగం ప్రకారం వరద నియంత్రణ సంబంధిత రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. అయితే, చాలా నదులు వేర్వేరు రాష్ట్రాలగుండా ప్రవహిస్తుండటం వల్ల వరద నియంత్రణపై ఒక రాష్ట్రం తీసుకొనే చర్యలు ఇతర రాష్ట్రాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకని, రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా ప్రకారం కేంద్ర ప్రభుత్వమే వరదల నియంత్రణ, నిర్వహణపై ఏకాభిప్రాయాన్ని సాధించాలంటూ జల వనరులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫార్సు చేసింది. ఆనకట్టల భద్రత, నదీపరీవాహక ప్రాంతాల నిర్వహణకు సంబంధించిన బిల్లులు తీసుకురావాలని పేర్కొంది. వరదపై పర్యవేక్షణకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ సమీకృత వరద నియంత్రణ బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందులో రాష్ట్రాల నుంచి సంబంధిత మంత్రులకూ సభ్యత్వం కల్పించి, కనీసం ఏడాదికోసారైనా సమావేశం జరపాలని తెలిపింది. వరదల నివారణ, నియంత్రణకు వ్యూహాలు సిద్ధం చేయడం, వరదల నియంత్రణను పర్యవేక్షించడం దీని బాధ్యతగా పేర్కొంది. వరదల నియంత్రణ కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా 75 శాతం నుంచి 50 శాతానికి తగ్గిపోయిందని తెలిపింది. వరద నిర్వహణ కార్యక్రమాలకు కేంద్రం వాటా నిధులు పెరగాలని, బడ్జెటరీ మద్దతూ దక్కాలని స్పష్టం చేసింది. ఇలాంటి సూచనలను కేంద్రరాష్ట్ర్ర ప్రభుత్వ యంత్రాంగాలు నిర్దిష్టంగా క్షేత్రస్థాయి దాకా తీసుకెళ్తే- జనాల్ని వరద నష్టాల నుంచి సులువుగా గట్టెక్కించవచ్చు. వరదల్లో చిక్కిన జనాల్ని, పంట చేజారి బిక్కుబిక్కుమంటున్న కర్షకుల్ని ప్రభుత్వం సత్వరమే ఉదారంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది.

ఆక్రమణలే కారణం

హైదరాబాద్‌, ముంబయి, అహ్మదాబాద్‌, కోల్‌కతా, బెంగళూరు, సూరత్‌, చెన్నై వంటి నగరాలు పదేపదే వరదల ముప్పు బారిన పడటానికి కారణం- కబ్జాదారులు జలవనరుల్ని చెరపట్టడమే. అయిదేళ్లక్రితం చెన్నై నగరం వరదల బారిన పడినప్పుడు వాటిల్లిన నష్టం రూ.20 వేల కోట్లుగా లెక్క తేలింది. వందల మంది అభాగ్యుల ప్రాణాలు కడతేరాయి. చెన్నై నగరంలోని చెరువులు కుంటల్నీ ఇష్టారాజ్యంగా ఆక్రమించిన ఫలితంగానే ఘోరవిపత్తు సంభవించినట్లు నిపుణులు తేల్చిచెప్పారు. అహ్మదాబాద్‌లో కొన్నేళ్లక్రితం 190 చ.కి.మీ. పరిధిలో 603 చెరువులు ఉండగా, 2001 నాటికి ఆ సంఖ్య 137కి పడిపోయింది. 2006లో నగర పరిధి 464 చ.కి.మీ. విస్తరించినా, చెరువులు 122కే పరిమితమయ్యాయి. అందులో 65 ఉనికి కోల్పోయే దశలో ఉన్నవే. గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకప్పుడు చెరువులు, కుంటలు, బావుల వంటి జలవనరులు లక్షదాకా ఉండేవని, వాటి సంఖ్య ఇప్పుడు 185కు తగ్గిపోయినట్లు నీతిఆయోగ్‌ వెల్లడించింది. వాటిలోనూ సగానికి సగం చెరువుల ప్రవాహ మార్గాలు మూసుకుపోయాయి. నాలాలు, చెరువుల ఆక్రమణే హైదరాబాద్‌లో వరదల బీభత్సానికి కారణమని కిర్లోస్కర్‌ కమిటీ స్పష్టంచేసింది. ఒకప్పుడు గొలుసు కట్టులా ఉండే పలు చెరువులు అక్రమార్కుల చేతిలో పడి మాయమయ్యాయని, నాలాల వెంబడి 28 వేలదాకా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించింది. చెరువుల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యాల్ని గుర్తించి, నాలాల వెంబడి బఫర్‌ జోన్లు ఏర్పాటు చేయాలని సూచించింది.

- శ్రీనివాస్‌ దరెగోని
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అన్నదాత బాగుకు ఆధునిక సాగు

‣ ఆర్డినెన్సులు... ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు!

Posted Date: 27-11-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం