• facebook
  • whatsapp
  • telegram

నదుల్ని ముంచెత్తుతున్న వ్యర్థాలు

‣ నిధుల విడుదలలో గోదావరికి మొండిచేయి

దేశంలోని నదులు కాలుష్య కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. 2020-21 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి 122 దేశాల్లో జల నాణ్యతపై నిర్వహించిన అధ్యయనంలో ఇండియాకు 120వ ర్యాంకు దక్కడం దేశంలో జలకాలుష్యం తీవ్రతను స్పష్టం చేస్తోంది. ప్రపంచంలో అత్యంత కలుషిత నదుల్లో రెండో స్థానంలో గంగ నిలిచింది. ఇండొనేసియాలోని చితారుం నది మొదటి స్థానంలో ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశంలోని 323 నదుల్లో కల్మషం అంతకంతకు పెరుగుతోందని వెల్లడించి, వాటి జాబితాను విడుదల చేసింది. 53 నదులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. అస్సాం (44), మధ్యప్రదేశ్‌ (22), కేరళ (21), గుజరాత్‌ (20), ఒడిశా (19), పశ్చిమ్‌బెంగాల్‌ (17), కర్ణాటక (17) తరవాతి స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నదులైన గోదావరి, కృష్ణాతో పాటు ఉపనదులైన తుంగభద్ర, కుందు, నాగావళి, మూసి, మంజీర, నక్కవాగు, కరకవాగు, మానేరు, కిన్నెరసానిలోనూ నీటి నాణ్యత నాసిరకంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. దేశంలో పట్టణ ప్రాంతాల నుంచి రోజుకు 7,236 కోట్ల లీటర్ల మురుగు విడుదలవుతుంటే- కేవలం 3,184 కోట్ల లీటర్లను శుద్ధి చేసే సామర్థ్యమే మన మురుగు శుద్ధి కర్మాగారా(ఎస్‌టీపీ)లకు ఉంది. అవీ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. నదీ పరివాహక ప్రాంతాల్లోని పరిశ్రమలు, గ్రామాలు, సేద్యంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం వల్ల కాలుష్యం ఏ స్థాయిలో నదుల్లో కలుస్తోందన్న దానిపై పూర్తి సమాచారం లేదు.

పక్కా ప్రణాళిక అవసరం

దేశంలో అన్ని నదుల ప్రక్షాళనకూ కట్టుబడి ఉన్నట్లు, గంగ తరవాత గోదావరికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మోదీ పలుమార్లు వెల్లడించారు. నమామి గంగే పేరుతో బృహత్తర ప్రాజెక్టును రూపొందించారు. విస్తృత అధ్యయనం అనంతరం... నదిలో కలిసే మురుగునీటిని శుద్ధిచేసే ప్లాంట్ల ఏర్పాటు, నదీ తీరం అభివృద్ధి, నదుల్లోని ఘన వ్యర్థాల తొలగింపు, యంత్రాల సాయంతో జలశుద్ధి, జీవవైవిధ్యాన్ని కాపాడటం, జలకాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, పారిశ్రామిక వ్యర్థాలు నదుల్లో కలవకుండా పర్యవేక్షించడం వంటి పలు లక్ష్యాలతో రూ.20 వేల కోట్ల అంచనాతో నమామి గంగే ప్రాజెక్టు రూపుదాల్చింది. విడతల వారీగా నిధులూ మంజూరవుతున్నాయి.  

గంగ తరహాలోనే దేశంలో వివిధ నదుల్లో కాలుష్య నివారణకు కేంద్ర ప్రభుత్వం జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక(ఎన్‌ఆర్‌సీపీ)ను ప్రకటించింది. ఇందులో భాగంగా 16 రాష్ట్రాల్లో 34 నదులను ఎంపిక చేశారు. ఈ నదీ పరీవాహక ప్రాంతాల్లో కాలుష్యం అధికంగా ఉన్న 77 పట్టణాలను గుర్తించారు. మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, మురుగు పారుదల వ్యవస్థల ఏర్పాటు తదితర మౌలికవసతుల కల్పనకు కేంద్రం రూ.5,965.90 కోట్లు కేటాయించింది. నిధుల విడుదలలో మాత్రం జాప్యం కొనసాగుతోంది. దేశంలో గంగ తరవాత పెద్దనది గోదావరి. దక్షిణభారత గంగగా దీన్ని పిలుస్తారు. కాలుష్యంలో గోదావరి గంగా నదితో పోటీపడుతోంది. 82శాతం గృహ వ్యర్థాలు, 18శాతం పారిశ్రామిక వ్యర్థాలు గోదావరి కాలుష్యానికి కారణమని నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. నదీ ప్రారంభ స్థానం నాసిక్‌ నుంచే గోదావరిలో కాలుష్య ప్రవాహం మొదలవుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నదీ తీరం వెంబడి ఉన్న వందలాది పరిశ్రమలు, నగరాల నుంచి వచ్చే వ్యర్థ జలం గోదావరిలో కలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రాణహిత, శబరి ఉపనదుల కలయికతో గోదావరి కాలుష్యం తగ్గినా- రాజమహేంద్రవరం నుంచి సాగరసంగమం వరకు ఆందోళనకర రీతిలో కాలుష్యం నెలకొంది.  

నానాటికీ తీవ్రతరం

కేంద్రం గంగ తరహాలోనే గోదావరి ప్రక్షాళనకు నమామి గోదావరి పేరుతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.404.4 కోట్లుగా నిర్ణయించి, మురుగు శుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు రూ.89.10 కోట్లు, నదిలో నీటి శుద్ధీకరణ యంత్ర పరికరాల కొనుగోలుకు రూ.47.38 కోట్లు, కాలువల ఆధునికీకరణ, పంపింగ్‌ స్టేషన్ల నిర్మాణానికి రూ.107.74 కోట్లు, అంతర్గత కాలువల నిర్మాణానికి రూ.160.18 కోట్లు కేటాయించింది. మొదటి విడత రూ.95.94 కోట్ల విడుదలకు ఇప్పటికే ఆమోదం లభించినా- నేటికీ ఒక్క రూపాయైనా విడుదల కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక నేతాగణం వైఫల్యంతో పాటు, జాప్యంతో కూడిన కేంద్రం వైఖరీ ఇందుకు కారణమనే విమర్శలు ఉన్నాయి. ఉత్తరాది నదులతో సమానమైన ప్రాధాన్యం దక్షిణాది నదులకు ఇవ్వడం లేదన్నది బలంగా వినిపిస్తున్న వాదన. నగరీకరణ, పారిశ్రామికీకరణల వల్ల సమస్త వ్యర్థాలూ నదుల్లోకి చేరుతున్నాయి. దీంతో నదీజలాల కాలుష్యం పెనుసవాలుగా మారుతోంది. కాలుష్య నివారణకు ప్రత్యేక వ్యవస్థను, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. వనరులను వినియోగించుకోవడమే తప్ప సంరక్షించడాన్ని విస్మరిస్తే- మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వాలు దేశంలోని అన్ని నదుల రక్షణకూ సత్వరం చర్యలు చేపట్టాలి.

- అమ్ముల మోహిత్‌ నాగప్రసాద్‌
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నిర్లక్ష్యం ప్రాణాంతకం

‣ కుయుక్తులతో కూటమికి విఘాతం

‣ చిరకాల మైత్రికి కొత్త ముడి

‣ సాంకేతికత అండగా విమానయానం

‣ పోషణతోనే బలవర్ధక భారత్‌

Posted Date: 10-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం